Previous Page Next Page 
సాహసి పేజి 11


    విశ్వరూపశర్మ చెబుతుంది శ్రద్ధగా వింటున్నది ఇందుమతి.

    "దేవులపల్లి కోట సంగతి చెప్పారు కాదు-" గుర్తుచేసాడు ముత్యాలనాయుడు.

    "ఈ ఉపోద్ఘాతం అంతా దానికోసమే.

    నిధి అంటే సంపద- సంపద అంటే ఒక రాచరిక వ్యవస్థకు చిహ్నం- ప్రతాపానికీ, పౌరుషానికీ గుర్తు. కొంతమంది తమ వారసుల కోసం ముందు జాగ్రత్త చర్యగా భద్రపరిస్తే- మరికొంతమంది మానవజాతి మేలుకోసం దాస్తారు. సాలార్ జంగ్ మ్యూజియం అలా ఏర్పడిందే..." ఊపిరి పీల్చుకుని మళ్ళీ చెప్పసాగాడు విశ్వరూపశర్మ. అ శ్రమని ఆయన శరీరం తట్టుకోలేక పోతోంది.

    "దేవులపల్లికోటకు సంబంధించి చూస్తే... దాదాపు మూడువందల యాభై ఏళ్ళక్రితం ధగ్గుల దండయాత్ర జరిగింది- ఆ సమయాల్లో చిన్న చిన్న సామంతరాజులు ఆ దాడుల్లో చాలా కోల్పోయారు- అప్పుడే దేవులపల్లి కోట మహారాజు... అంటే మీ తాతగారి ముత్తాతగారు ధగ్గుల చేతికి దొరకకుండా ఒక గొప్ప నిధిని నిక్షిప్తం చేసారట. ఆ నిధి గురించి నేను స్టడీ చేయాలంటే కొంతకాలం పడుతుంది. అప్పుడు మాత్రమే మరిన్ని వివరాలు చెప్పగలను... నాకు కొంత టైము ఇవ్వు" అన్నాడాయన.

    "ఎన్నాళ్ళు పడుతుంది..." ఇందుమతి గుండెల్లో రాయి పడింది.

    "చెప్పలేను" అన్నాడాయన ఆయాసాన్ని అణచుకుంటూ.

    ముత్యాలనాయుడి మొఖం పాలిపోయింది.

    "పడుకోండి. మేడమీద గదిలో మీ విశ్రాంతికి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఉదయం మాట్లాడుకుందాం" అన్నాడాయన మంచంమీద వాలిపోతూ.

    నిద్ర రాకపోయినా విధిలేక మేడ మెట్లెక్కి గెస్ట్ రూమ్ లో కెళ్ళి మంచం మీద వాలిపోయింది ఇందుమతి.

    ముత్యాలనాయుడు క్రింద మెట్ల పక్కనున్న చిన్నరూమ్ లో పడుకున్నాడు. అయినా ఇద్దరికీ నిద్రలేదు. అన్యమనస్కమైన ఆందోళనతో తెల్లవారుఝాము వరకు పక్కలమీద దొర్లుతూనే ఉన్నారు.


                  *    *    *    *


    ఒక అర్ధరాత్రివేళ మనస్సుండబట్టలేక ముత్యాలనాయుడు పక్కమీంచి లేచి ఇందుమతి గదికి వెళ్ళాడు. "ఏమిటి ముత్యాలూ నీకూ నాలాగే నిద్ర పట్టనట్లుందే" అంది.

    "అవునమ్మా... అందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి నిధి దారి తెలిసేవరకు విశ్వరూపశర్మ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని- రెండు" అని కొద్దిక్షణాలాగిపోయాడు.

    "చెప్పు... రెండో కారణం ఏమిటి?" ఇందుమతి మృదువుగా కనురెప్పల్ని రుద్దుకుంటూ అడిగింది.

    "విశ్వరూపశర్మకి వృద్ధాప్యం బాగా పైబడింది గదా- దాంతో అనవసర విషయాలు కూడా మాట్లాడాడు- అదే. ఆయన కుటుంబం గురించి- ఆ విషయాలు మిమ్మల్నేమన్నా బాధ పెట్టాయా తల్లి"

    "అర్ధం కాలేదు" అంది ఇందుమతి.

    "విశ్వరూపశర్మ తన పిల్లలకు ఏమీ మిగల్చలేదని బాధపడుతున్నాడు. వాళ్ళ పిల్లలు ఆయన్ని అసహ్యించుకొని వెళ్ళిపోయారు గదా... అలాగే మీకేమీ మిగల్చనందుకు మీ తండ్రిగారు కూడా బాధ పడుతున్నారు. వాళ్ళ పిల్లల్లాగే మీరేమన్నా బాధపడుతున్నారేమోనని"

    కొద్ది క్షణాలాగి-

    "మీ తండ్రిగారు దుర్య్వాసనాలతో పోగొట్టుకోలేదు తల్లి- శాసనం మూలంగా కొంత- కొడుకుల మూలంగా అంతా పోగొట్టుకున్నారని తమరు అర్ధం చేసుకోరేమోనని" గొంతుకేదో అడ్డుపడ్డట్లయి ఆగిపోయాడు ముత్యాలు.

    తన తండ్రిపై, తనపై ముత్యాలుకున్న ప్రేమకు, మమకారానికి తడిదేరిన కళ్ళతో విభ్రాంతిగా చూసింది ఇందుమతి.

    "నీ రాజభక్తి వెలకట్టలేనిది ముత్యాలు- నాన్నగారి గురించి ఎవరూ చెడుగా అనుకోవటం భరించలేకే ఇలా వచ్చావ్ గదూ. లేదు ముత్యాలు లేదు మా నాన్నగారు నన్నెంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు. విధి చేతిలో చిక్కి నిస్సహాయులయ్యారు తప్ప స్వయంకృతం కాదు. కోటలో ఉన్న బర్మా టేకుని, ఫూల్ బాగ్ ముందు అద్భుత కళానైపుణ్యంలో నిలిచిన ఫౌంటెన్ ని, ఇంకా మరెన్నో వస్తువుల్ని అమ్మి నన్ను పై చదువులకు పంపించాలని ఎంతగానో తపన పడ్డారు నేనే కాదన్నాను- అలా చేస్తే చచ్చిపోతానని బెదిరించి, నాన్నగారికి మా వంశానికే ప్రతిష్టని తెచ్చిన కోటని కాపాడుకున్నాను. నేనంత అల్పురాల్ని కాదు ముత్యాలు. ఏ ఆస్తీ లేకపోయినా నా కాళ్ళమీద నేను నిలబడగల ఆత్మస్థయిర్యం నాకుంది ముత్యాలు" అంది ఇందుమతి ఆత్మవిశ్వాసం తొణికిసలాడే కంఠంతో.

    ముత్యాలనాయుడు ముఖం తేటబడింది.

    "అసలీ నిధి గురించి కూడా నాకంత ఆసక్తి లేదు. బ్రతగ్గలనన్న ధైర్యం లేకపోతే గదా... మీ ఇద్దరి కోసమే" అంది ఇందుమతి.

    "అలా అనకమ్మా... విధి చేసిన మోసానికి, తోడబుట్టినవాళ్ళ స్వార్ధానికి నువ్వు బలయ్యావు. అలా జరగటానికి వీలులేదు. నువ్వు విధిని వెక్కిరించాలి- తోడబుట్టిన వాళ్ళకు బుద్ధి వచ్చేలా చేయాలి. అప్పుడే నాన్నగారికి, నాకు మనశ్శాంతి.

    కనీసం మా కోసమైనా - నిధి మీద ఆసక్తిలేదని అనకమ్మ. అర్హత ఉన్నప్పుడు దానికోసం పోరాడి గెలుచుకోవటంలో తప్పులేదు పైగా అది మీ బాధ్యత కూడా. మీ పూర్వీకులు ఆ నిధిని ఎందుకు నిక్షిప్తం చేసారు? ఎవరి కోసం నిక్షిప్తం చేసారు? మీకోసమే గదా? మరి మీరే దాన్ని దక్కించుకోనప్పుడు మీ పూర్వీకుల్ని, వారి ఆశల్ని, ఆశయాల్ని గౌరవించినట్లే గదా? అలా చేసి వారి ఆత్మల్ని క్షోభ పెట్టవద్దు. ధైర్యసాహసాలకు, శౌర్యప్రతాపాలకు మీ కుటుంబం పెట్టింది పేరు. మొక్కవోని పట్టుదలతో శ్రమించి, సాహసించి దాన్ని మీ స్వంతం చేసుకోవాలి. మీ కుటుంబ చరిత్రలో గొప్ప సాహసిగా మీరు మిగిలిపోవాలి. నా ప్రాణం పోయే చివరిక్షణం వరకు నేను మీ వెంట ఉంటాను. ఓటమి మీ చరిత్రలో లేదు- ఒకవేళ అది ఎదురయితే దానికి నా ప్రాణాల్ని అడ్డువేస్తాను. నేనసలు బ్రతికున్నదే దీనికోసం. అర్ధం చేసుకోమ్మా" అన్నాడు ముత్యాలు దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో. 

    ఇందుమతి ముత్యాలనాయుడి ఆవేదన చూసి కదిలిపోయింది.

    చటుక్కున లేచి అతని దగ్గరకు వెళ్ళి అనునయంగా వణుకుతున్న ముత్యాలు వృద్ధ శరీరాన్ని తట్టి ఓదార్చింది.

    "అసలు ముత్యాలు... న్నాగారి కోరిక, నీ కోరిక తీర్చడం కోసం ఎంత సాహసానికైనా తెగిస్తాను... నిధిని సాధించే తీరుతాను. ప్రాణాల్ని ఒడ్డయినా నా నిధిని నేను స్వంతం చేసుకుంటాను. వెళ్ళి పడుకో- శర్మగారితో రేపు మనకు చాలా పనుంది" ధైర్యం చెబుతున్నట్లుగా. సరిగ్గా ఇదే సమయంలో, క్రింద ఇందుమతికి, ముత్యాలనాయుడికి వినిపించకుండా విశ్వరూప శర్మతో, పరంజ్యోతి చాలాసేపు మాట్లాడింది-

    భార్య చెబుతున్న విషయాలను చాలా జాగ్రత్తగా విన్నాడాయన.

    "బాగోదు... కానీ తప్పదు... రేపు మాట్లాడదాంలే" పడుకునే ముందు భార్యతో అన్నాడాయన.


                  *    *    *    *


    ఉదయం కాఫీ టిఫిన్లూ అయ్యాక-

    "ఒకప్పుడు ఉపకారాలు బాంధవ్యాల పరంగా జరిగేవి. ప్రస్తుతం అవి పూర్తిగా వ్యాపార ప్రబంధాలైపోయాయి. నేడు ఫలానాది చేస్తే నువ్వు నాకు ఏమిస్తావు. అన్న తంతులో అన్నీ జరుగుతున్నాయి. కాలమహిమ తప్పదు- దేవులపల్లి కోట గురించే నువ్వు అడిగావు చెప్తాను... నిధి లక్ష్యానికి చేరువయ్యేందుకు నీకే సహాయం కావాలన్నా చేస్తాను. నాకు ఏమి ఇస్తావ్?" నెమ్మదిగా అడిగాడు విశ్వరూపశర్మ.

    "ఆయన అలా అడిగారని మీరేమీ అనుకోవద్దు. మా ఆర్థిక పరిస్థితి అలా వుంది. పెళ్ళికి ఎదిగిన మనుమరాలు వుంది- మొన్ననే మా పెద్దాడు వ్యాపారం కోసం డబ్బు సర్దమని ఉత్తరం వ్రాసాడు. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో మీరు వచ్చారు బైటకు ప్యాలెస్ లో బిల్డింగ్ కన్పించినా లోన మా బతుకులు ఎలా వున్నాయో మీకు తెలీదు-" చెప్పింది పరంజ్యోతి చిన్నగా.

    వాళ్ళ దగ్గరినుంచి అలాంటి 'ప్రపోజల్' వస్తుందని ఊహించలేదు ఇందుమతి- వెలవెలబోతూ ముత్యాలనాయుడివైపు చూసింది. అతని పరిస్థితి కూడా అలాగే వుంది.

    "మీరు అన్నది నిజమే అడగండి... ఫలం వుంటే ప్రతిఫలం ఆశించటం సహజం" తనే ముందు తేరుకుని అన్నాడు ముత్యాలనాయుడు. ఇకప్పుడు క్షణం ఆలస్యం కూడా నిధికి చేరువయ్యే దారిని మూసేస్తుందనే అలా అన్నాడు.

    "ఐదు లక్షలు ఇవ్వండి... చాలు..." నిర్ద్వంద్వంగా అంది పరంజ్యోతి.

    అయిదు లక్షలా?! షాక్ తిన్నది ఇందుమతి- ఐదు నిమిషాలసేపు వరకూ ఎవ్వరూ అక్కడ మాట్లాడలేదు.

    "మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు?" అడిగాడు ముత్యాలు.

    ముత్యాలు ధైర్యమేమిటో అర్ధం కాక ఇందుమతి విస్తుపోయింది.

    "మీ ఇష్టం ఇవాళ నుంచీ నా పనిలో నేను వుంటాను" చెప్పాడాయన.

    ఒకటికాదు, రెండు కాదు, ఐదు లక్షల రూపాయలు.

    "మీరడిగింది మేము చేస్తాం బాబూ... మీ పనిమీద మీరు వుండండి. లేచాడు ముత్యాలనాయుడు.

    కేవలం నిధికి దారి చెప్పినందుకే అయిదు లక్షలు అడిగారంటే, నిధి ఎంత విలువైనదయి వుండాలి?

    భార్యా భర్తలు ఇద్దరూ ఎంతో అవసరం ఉండి, మరెంతో సీరియస్ నెస్ తో అడిగారు. అందులో సందేహం లేదు. అంటే తమ పూర్వీకులు నిక్షిప్తం చేసిన నిధి విలువ కొన్ని కోట్లలోనే ఖచ్చితంగా వుంటుంది. నిధి వున్న మాటా నిజమే. అది ఎంతో విలువైదన్న విషయమూ నిజమే. నిస్సందేహంగా అన్వేషణ ఆరంభించవచ్చు. విశ్వరూపశర్మకు నమస్కరించి వెనుదిరిగింది ఇందుమతి.

    అయిదు లక్షలు... తమకు అసాధ్యమే అయినా అవి ఇస్తే తప్ప- నిధి వివరాలు బయటకు వచ్చే అవకాశం లేదు.

    నిధి ప్రపోజల్ ఆపేసుకుంటే? ఎక్కడ నుంచి తెస్తుంది తను?!

    ఏదో పిలుపు వినపడినట్లయి తల త్రిప్పి చూసింది ఇందుమతి.

    విశ్వరూపశర్మ...

    చేతితో సంజ్ఞ చేసాడు రమ్మన్నట్టుగా.

    డబ్బు... వద్దులే... అంటాడనుకుని గబగబా మళ్ళీ వెళ్ళింది ఇందుమతి.

    "నన్ను క్షమించమ్మా... విధి లేకే అలా అడగవలసి వచ్చింది. గుప్తనిధికి వారసురాలయిన నీకు, అది ఖచ్చితంగా దొరుకుతుందనే అలా అడిగాను. అది దొరకనప్పుడు నువ్వు ఇచ్చే ఐదులక్షలు నాకు విషంతో సమానం... తిరిగి ఇచ్చేస్తాను. అంత అడిగాననుకోవద్దు. నేను అడిగింది నిధిలో 0.5 శాతం కూడా ఉండదేమో.

    డబ్బు మీ దగ్గర లేదని కూడా నాకు అర్ధం అయింది. కానీ పాతకాలం నాటి వస్తువులేవీ ఇప్పుడు కోటలో లేవా? ఆ ఏంటిక్స్ కి ఇప్పుడు మంచి రేటు పలుకుతుంది. చాలామంది బొంబాయి మార్వాడీలు వాటిని కొనడానికి ఎగబడతారు. ఎలాంటిదైనా ఫర్వాలేదు. పాతకాలపు వజ్రాల మంచం వుండాలి- వజ్రాలు లేకపోయినా ఉత్త మంచం అయినా ఫర్వాలేదు... అలాగే... 1928లో వచ్చిన కారొకటి వుండాలి మీ దగ్గర... అదే జ్ఞాపకం వచ్చి చెబుదామని..."

 Previous Page Next Page