"నాన్నగారితో మాట్లాడతాను..." అని థాంక్స్ చెప్పి బయటకు వచ్చింది ఇందుమతి. ఆ వెనుకే ముత్యాలనాయుడు- రాబోతూ ఒక్కక్షణం ఆగి "తమరి ఆరోగ్యం జాగ్రత్త బాబు" అన్నాడు తనలో రేగే ఆందోళనను కప్పిపుచ్చుకుంటూ.
"నిధికి దారి చూపకుండానే పోతానని భయం కదూ?" నవ్వుతూ అన్నాడు విశ్వరూపశర్మ.
ముత్యాలు సిగ్గుతో తలవంచుకొని వెనుదిరిగి ఇందుమతిని అనుసరించాడు.
ఇద్దరూ బస్ స్టాండ్ వేపు నడుస్తున్నారు.
"అవునమ్మా... పాయింట్ ఐదులక్షలు అంటే ఎంత అమ్మా?" ముత్యాలనాయుడు తికమక పడిపోతూ అడిగాడు.
"వందకోట్లు..." అంది ఇందుమతి కూడా లోలోన ఆశ్చర్యపోతూ, ఆనందోద్వేగానికి లోనవుతూ.
"ఎంత? వందకోట్లా...?!" షాకింగ్ గా అన్నాడు ముత్యాలనాయుడు.
"ఇంకా పైనే- ఉంటుందట" తిరిగి అంది ఇందుమతి.
అతనికి కొద్ది క్షణాలు ఏమీ అర్ధం కాలేదు.
ఆ ఎక్సైట్ మెంట్ ని ముత్యాలనాయుడు కొద్దిక్షణాలపాటు తట్టుకోలేకపోయాడు.
"అందుకే ఐదులక్షలు అడిగాడు తల్లీ. ఆయన అంత అడగటం ఇప్పుడు నాకు తప్పుగా అన్పించడం లేదు. ఆ నిధి ఎంత విలువ చేస్తుందనే ఖచ్చితమయిన అవగాహన ఆయనకున్నప్పుడు అది వుందన్న విషయం ఖచ్చితం అని తెలిసిపోయింది కదా?" ఆనందోద్వేగాలను అణుచుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తూ అన్నాడు ముత్యాలనాయుడు.
"అప్పుడే మనకు కష్టాలు ప్రారంభం అయినట్లుగా ఉంది" లేని నవ్వును పెదవుల మీదకు తెచ్చుకుంటూ అంది ఇందుమతి.
"గొప్ప ప్రయత్నాలు ఎప్పుడూ కష్టాలతోనే మొదలవుతాయి. ముఖ్యంగా నిధుల వేట... దానికి దిగులుపడకూడదు" అన్నాడు ముత్యాలనాయుడు హుషారుగా.
"అపారమయిన నిధి ముందు... ఐదులక్షలంటే సముద్రంలో కాకిరెట్ట లాంటిది... కానీ మన పరిస్థితి వల్ల మనకు అలా అనిపించింది. ముసలాయనకు బాగా జ్ఞాపకశక్తి వుంది. ఆయన చెప్పింది నిజమే. మన దగ్గర పాతకాలం కారు ఒకటి వుండాలి" అన్నాడు ముత్యాలు చరుగ్గా ఆలోచిస్తూ.
"ఇప్పుడది వున్నా... ఎందుకూ పనికిరాదు" నిస్పృహగా తల విదిలిస్తూ అంది ఇందుమతి.
* * * *
"అవును నిజమే 1931 లో అనుకుంటా. విజయనగరం మహారాజా వారు ఆ కారు మా నాన్నగారికి బహుమానంగా ఇచ్చారు. లేత పసుపును రంగులో నిగనిగలాడేది ఆ కారు. శాటిన్ పరుపులు వేసిన సీట్లు, సిల్కు పరదాలు వేళ్ళాడే కిటికీలు, అద్భుతమైన నగిషీలు... దివ్యభవనంలా వుండేదా కారు.
నాకు ఇంకా బాగా గుర్తు.
బ్రిటీష్ వారు రైళ్ళను మనదేశంలో ప్రవేశపెట్టిన రోజులవి. మద్రాసుకు రైలు పట్టాలను వేశారు. మొట్టమొదటిసారిగా రైలు దక్షిణ భారత ప్రాంతానికి రావడం అదే మొదలు. ఆ రైలును చూడటానికి రమ్మనమని మహారాజుకూ, సంస్థానాధీశులకూ వర్తమానాలు అందాయి. ఆ వర్తమానాన్ని అందుకున్న మనదేశ పాలకులు- తెల్లదొరలు తమకు ఆ రకమయిన గుర్తింపు నిచ్చినందుకు ఆనందపడిపోవడం నాకు బాగా గుర్తు.
అపుడు ఆ కారుమీద మద్రాసు వెళ్ళాం.
అప్పుడు నేను చాలా చిన్నవాడిని- పొగలు చిమ్ముకుంటూ వచ్చిన రైలుబండి అప్పట్లో అదొక అద్భుతం.
స్టేషన్ కు అటూ, ఇటూ బంగారు పరదాలు, విందులు, వినోదాలు తెల్లదొరల విందులు ఎలా ఉంటాయో ఆంధ్రదేశంలోని రాజులకు మొదటిసారిగా తెలిసింది అప్పుడే. మా నాన్నగారికి ఆ కారులో వెళుతున్నప్పుడే గుండెపోటు వచ్చింది. మంచాన పడ్డారు అప్పటి నుంచీ ఆ కారుని వాడటము మానేసాం. తర్వాత దాన్నెవ్వరూ పట్టించుకోలేదు" అన్నాడు రాజా కౌశికభూపతి పాత జ్ఞాపకాల్ని తిరగదోడుతూ-
అసలు విషయం ముత్యాలనాయుడు చెప్పాడు.
ఆశ్చర్యపోయాడు కౌశికభూపతి.
"కోటానుకోట్ల విలువచేసే కోటకే విలువలేదు. కారు కొచ్చిందా విలువ? కాలం అలా తగలబడింది. అయితే విశ్వరూపశర్మ బ్రతికే వున్నాడన్న మాట. పోయే ముందు డబ్బు మనిషై పోయాడా-" ఒకింత బాధగా అన్నారాయన.
"డబ్బు మనిషి కాదు రాజావారూ... అవసరం... అంతే" సర్ది చెప్పాడు ముత్యాలనాయుడు. విశ్వరూపశర్మ ఐదులక్షలు అడిగాడు అనగానే కౌశిక భూపతిలో ఉత్సాహమంతా నీరుకారిపోయింది. నిధి అన్వేషణ గురించి మరి చర్చించలేకపోయారాయన. కానీ ముత్యాలనాయుడు మాత్రం పట్టుదలగా ఉన్నాడు.
ఆరోజు రాత్రి చాలాసేపు నిద్రపోలేదు ఇందుమతి. ఒక నిశ్చయానికి రావటానికి ముందు ఏర్పడే అంతర్మధనం అది- లక్ష్యాన్ని సాధించే ముందు ఏర్పడే సందిగ్ధ పరిస్థితి అది.
* * * *
హవామహల్ ఒకప్పటి మహారాజుల ప్యాలెస్. పూర్తిగా శిధిలమై పోయింది. దానికి ఒకింత దూరంలో పరిచారికల నివాసభవనాలు... వాటి పక్కన కారు కోసం ఒక హాలు ఉండేది. ఆ కారుని పరిరక్షించడానికి ఒక సేవక కుటుంబం.
ఆ ప్రాంతమంతా ప్రస్తుతం అడవిలా తయారయ్యింది.
"ఒకప్పటి కారు షెడ్ అదేనమ్మా..." దూరంనుంచే చూపెడుతూ అన్నాడు ముత్యాలనాయుడు.
దూరంగా చెట్టు క్రింద నిలబడి వున్న ఇందుమతి అటుకేసి చూసింది.
"ఒరే సూరప్పడూ... జాగ్రత్తగా అక్కడకు వెళ్ళు. పాములవీ వుంటాయి" హెచ్చరిస్తూ ప్రక్కనే వున్న ఇంకో పనివాడితో చెప్పాడు ముత్యాలనాయుడు.
సూరప్పడి చేతిలో పెద్ద కత్తి వుంది. దాంతో తుప్పల్నీ, తీగల్నీ నరుకుతూ ముందుకు కదిలాడు.
లోన పెద్ద హాలు... చీకటి గుహలా వుంది.
తలుపుల్ని ప్రక్కకు తోసి, లోనకు అడుగుపెట్టాడు సూరప్పడు.
కీచుమంటూ అరుస్తున్న గుడ్లగూబలను అడ్డుకుంటూ ముందుకు వెళ్ళిన సూరప్పడు కొన్ని క్షణాల తర్వాత-
"కారు బండి... కారుబండీ" అని అరిచాడు. వెంటనే లోపలకు పరిగెత్తాడు ముత్యాలనాయుడు. చెట్టునీడన నిలబడిన ఇందుమతి గబుక్కున ముందుకడుగు వేసింది ఆనందోద్వేగంతో.
ఒక గంటకి...
అతికష్టం మీద సూరప్పడు... ముత్యాలనాయుడు కారును తోసుకుంటూ తీసుకొచ్చి హవామహల్ ముందుపెట్టారు.
కారుకు టైర్లు లేవు. గుడ్డి కళ్ళలా వున్నాయి లైట్లు... సొట్టలు పడిపోయిన బాడీ... వ్రేలాడుతున్న మొండెంలా స్టీరింగ్... బెత్తెడు మందం, దుమ్మూ, ధూళీ పేరుకుపోయి వున్నాయి. సీట్లు చినిగిపోయి వాటిల్లో వున్న దూది బయటికి వచ్చింది. పక్షుల రెక్కలు- రస్ట్ పట్టిన బాడీ... అది వింటెంజ్ కారు అనీ లక్షలు ఖరీదు చేస్తుందని వారికి ఆ క్షణాన తెలీదు.
"దీన్నెవడు కొంటాడు?" కారుని చూడగానే ఇందుమతి తలప్రక్కకు తిప్పుకుంది.
దాన్ని శుభ్రంచేసే కార్యక్రమంలో పడ్డాడు ముత్యాలనాయుడు.
కౌశిక భూపతికి కూడా వచ్చి కారుని చూసి పెదవి విరిచేసారు.
ఆశ చావంది ముత్యాల నాయుడికి మాత్రమే.
ముత్యాలనాయుడు, ఆ రోజు సాయంత్రమే విశాఖపట్టణానికి బయలుదేరాడు.
రెండోరోజు ముత్యాలనాయుడు తమ్ముడు కొడుకు రాంబాబు, అతనితోపాటు ఓ ఫోటోగ్రాఫర్ వచ్చారు.
వస్తూనే కారుని చూసి ఒక విచిత్రమైన ఉద్వేగానికి లోనయ్యాడు ఆ ఫోటోగ్రాఫర్. చాలాసేపటికిగాని తేరుకోలేక పోయాడు.
"మెర్సిడెస్... బెంజ్, టైప్-600, 1926లో తయారయిన 624 సిసి ఇంజన్ కారు. జర్మనీకి చెందిన డైమలర్ కార్ల కంపెనీ, బెంజ్ కార్ల కంపెనీ- రెండూ కలిపి ఒకే కంపెనీగా తయారయి తదుపరి తయారయిన మొదటి మోడల్ కారు ఇది... 1926లో తయారయి 1927లో విడుదలయిన మోర్ పవర్ ఫుల్ 'ఎస్' మోడల్ కారు.
మెర్సిడెస్- బెంజ్ మిట్ కోమ్ ప్రెజర్ కారిది. కొన్ని లక్షల ఖరీదు చేయగల ఈ వింటేజ్ కారుని వాడటాన్ని బట్టే గతంలో వీళ్ళెంత గొప్పగా బ్రతికారో ఊహించవచ్చు."
ఫోటోగ్రాఫర్, మెకానిక్ రాంబాబుకి చెప్పాడు, తనలో రేగుతున్నఉద్వేగాన్ని అణుచుకుంటూ, ఈసారి ఉద్వేగానికి గురికావడం మెకానిక్ రాంబాబు వంతయ్యింది.
తనకు ఫోటోగ్రాఫర్ చెప్పిన విషయాలను మిగతా వాళ్ళకు చెప్పాడు మెకానిక్ రాంబాబు.
అప్పుడు ఇక షాక్ తినడం అందరి వంతయింది.
"తరాలు గడిచేకొద్దీ పాత వస్తువులు కళాఖండాలుగా (ఏంటిక్స్) గుర్తింపు పొందుతాయనేది కార్ల విషయంలో కూడా జరగడం మన అదృష్టం" అన్నారు కౌశికభూపతి ఆనందంతో.
ఇందుమతి, ముత్యాలనాయుడు ఆనందానికి అంతేలేదు.
"మీ నిధి మీకు దొరకాలని రాసిపెట్టి వుండబట్టే చెత్త క్రింద తీసేసిన కారు విలువైనది అయ్యింది" అన్నాడు ముత్యాలనాయుడు మెరిసే కళ్ళతో.
ఫోటోగ్రాఫర్ కారుని వివిధ కోణాల్లో ఎక్స్ పోజ్ చేసుకున్నాడు. రాంబాబు కారుని పూర్తిగా టెస్ట్ చేశాడు.
"కారు మళ్ళీ నడవాలంటే ఎంత లేదన్నా కనీసం యాభై వేలన్నా కావాలి బాగుచేసి మార్కెట్లో పెడితే లక్షలొస్తాయి. రాజుల కాలంనాటి కారు కదా... ఈ ఫోటోగ్రాఫర్, పాతకార్ల బ్రోకరు- డబ్బు రెడీచేసి నాకు కబురు చెయ్యండి... వారంరోజుల్లో దీన్ని తళతళ లాడించేసి రోడ్డుమీద పరుగులు తీయించేస్తాను" చెప్పేసి వెళ్ళిపోయాడు రాంబాబు ఫోటోగ్రాఫర్ తో సహా.
"అయిదు వందలకు ఠికాణా లేదు. యాభైవేలు ఎక్కడనుంచి వస్తాయి" కౌశికభూపతి అన్నాడు నిరాశగా.
"అదృష్టం కలిసివస్తే... యాభైవేలు కాదు... యాభై కోట్లయినా వస్తాయి" ముత్యాలనాయుడు స్థిరంగా అన్నాడు.
"నీ అంత ఆశావాదిని నేను ఎక్కడా చూడలేదు ముత్యాలూ... నిధి అనుకున్న దగ్గరనుంచీ జరుగుతున్న సంఘటనలు అన్నీ చిత్రమైన మలుపులు జరుగుతున్నాయి. అంతలోనే ఆనందం... అంతలోనే సమస్యలు, మనతో దోబూచులాడుతున్నాయి... చివరకు ఇది ఎక్కడికి దారి తీస్తుందో వయో వృద్ధుడివి- ఇంత శ్రమని నీ శరీరం తట్టుకోలేదేమో ముత్యాలు."