Previous Page Next Page 
ఒక జంట కలిసిన తరుణాన పేజి 11

    కొద్దిసేపటికి వాసంతి పెదవి కదిపింది "చూడండి...!" అంటూ.
    ఆతృతగా వాసంతివైపు చూశాడు శ్యాంసుందర్.
    "మనం యిప్పటికిప్పుడే ఓ నిర్ణయానికొచ్చి పెద్దలకి తెలియజేయడమనేది తర్వాత తొందరపాటుకి కారణం కావచ్చు..."
    శ్యాంసుందర్ వాసంతి మాటలకు అడ్డుతగిలి "కాకపోవచ్చునేమోకదా!" అన్నాడు.
    "ఆఫ్ కోర్స్, అదీనిజమే. కాని...మనం కొద్దిస్నేహం తర్వాత వివాహందాకా వెళితే బాగుంటుందని నా అభిప్రాయం. మరి మీ..."
    వాసంతి నోట్లోంచి వచ్చిన ఆ ఒక్కమాటకే ఆనందంతో తబ్బిబ్బియిపోయాడు శ్యాంసుందర్." ఓ.కే. ఓ.కే. నా అభిప్రాయం కూడా అదే. కని వాసంతీ మిమ్మల్ని చూడంగానే నేనో అభిప్రాయానికి వచ్చేశాను. అంటే నా నిర్ణయం మీలాంటి అమ్మాయిని...నో...నో... మిమ్ముల్నే పెళ్లాడాలని.
    సరే, కొన్ని ఆదివారాలు మనం కల్సుకుందాము." అప్పుడు మనం ఓ నిర్ణయానికొచ్చి పెద్దవాళ్ళకి చెబుదాము."
    "అలాగే." అంది వాసంతి.
    "మనం ప్రతాదివారం ఎక్కడ కల్సుకుందాము!"
    ఎక్కడ కల్సుకోవాల్సింది చెప్పింది వాసంతి.
    తల తాటించాడు శ్యాంసుందర్.
    "ఈ విషయం రహస్యంగానే వుంచుదాము." అంది వాసంతి.
    "అలాగే." మరోసారి బుద్ధిమంతుడిలా తల తాటించాడు శ్యాంసుందర్.
    పదిహేను నిమిషాలన్న రాధాకృష్ణ ఇరవై నిమిషాల తర్వాత డాబామెట్లమీదకొచ్చి పిలిచాడు.
    శ్యాంసుందర్ వాసంతి కిందకి దిగి వచ్చారు.
    "ఒక నెలటైం యివ్వండి. ఆ తర్వాత ఏ విషయము మీకు తెలియజేస్తాను. దయచేసి యిప్పుడు నన్ను ఏమీ అడగవద్దు." అన్నాడు శ్యాంసుందర్. ఆ తర్వాత అందరివద్ద శలవు తీసుకుని వాసంతి కయితే చూపులతోనే మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళాడు.
    "అతనదేంటి నెలరోజుల తర్వాత తెలియజేస్తానన్నాడు! నువ్వేం అన్నావే వాసంతీ, ఇష్టంలేక అతనలా చెప్పాడా ఏమిటి? ఈ ఆడా మగా కాని అవతారం చూసి..." ఆదిలక్ష్మమ్మ ఎప్పటిలా నెత్తీనోరు కొట్టుకుని వాపోతూ పంచాంగం విప్పింది.
    "అబ్బ నువ్వు కాసేపు వూరుకో అసలు విషయం నేకనుక్కుంటాగా?" అని..."ఏంటిరా వాసూ? ఏం జరిగింది? ఓ నెలరోజు లాగవయ్యా శ్యామమందరా! అన్నావా?" అంటూ వాసంతిని అడిగాడు రాధాకృష్ణ.
    "నేనేం అనలేదు ,ఓనెల రోజులాగమన్నాడుగా ఆగి చూడండి" అంది వాసంతి.
    డాబామీద శ్యాంసుందర్ వాసంతి ఏమి చర్చించుకుని ఏ నిర్ణయానికొచ్చారో ఎవరూ ఊహా మాత్రమయినా తెల్సుకోలేకపోయారు.
    నెలరోజుల తర్వాత ఏ సంగతి చెపుతాననే పెళ్ళికొడుకు కథ ఆ యింట్లో ఎవరూ వినివుండలేదు. వేమనే అంగీకారం తెలిపే పెళ్ళివారు వెళ్ళంగానే ఉత్తరం రాస్తామనే పెళ్ళివారు లోకంలో వుండడం సహజం. ఇదేంటి మరి నెలరోజులు గడువు?
    అందరికీ ఈ విషయం చర్చనీయాంశం అయింది.
    ఈ విషయంలో సంబంధం లేనట్లు వున్నది ఒక్క వాసంతి మాత్రమే.
                                         9
    ఆదివారం వచ్చింది.
    శ్యామ్ సుందర్ వాసంతి పార్క్ లో కల్సుకున్నారు.
    "రారేమో అనుకున్నాను." పార్క్ లోవున్న రాతి బెంచీమీద కూర్చుంటూ అన్నాడు శ్యామ్ సుందర్.
    చాలా జాగ్రత్తగా ఎంతో ముందాలోచనతో వచ్చిన వాసంతి,
    "అలా పక్కగా వున్నారు చెట్టుకింద కూర్చుందాం." అంది.... 
    "ఓకె" అంటూ శ్యామ్ సుందర్ బెంచీమీద నుంచి లేచాడు.
    "తను చెప్పినట్లువింటాడు" అనుకుంది. మళ్ళీ ఆ క్షణంలోనె మనసు మార్చుకుని "ఈ మగవాళ్ళని నమ్మలేము. కొత్తకదా, మొదటి వందమాటల వరకు వింటాడు ఆతర్వాత వాళ్ళ సహజలక్షణం చూపిస్తారు. రాదేనమ్మ చెలీ అదేనమ్మా ఈ మగవారిమాటలు నమ్మరాదే చెలీ," అనుకుంది వాసంతి.
    పున్నాగచెట్టుకింద తివాసీలాగా పరుచుకున్న పచ్చిక మీద శ్యామ్ సుందర్ వాసంతి తాపీగ కూర్చున్నారు.
    వాసంతి చుడీదారు వేసుకుని వచ్చింది. చెవులకి పెద్దపెద్ద రింగులు, చేతికి వాచీ తప్ప మరేం ధరించలేదు.
    "ఏమిటి చూస్తున్నారు?" కొద్ది దబాయింపుతో అడిగింది వాసంతి.
    "మీ డ్రస్ ని..."
    "నా డ్రస్ కేమొచ్చింది?"
    "ఏమీరాలేదు, ఈ డ్రస్ లో మీరు అనార్కలీ లాగున్నారు..."
    కించిత్ గర్వంకల్గింది వాసంతికి. "అనార్కలీ మీకిష్టమా?" అంది...
    "నాకుకాదు సలీమ్ కి యిష్టం" కొంటెగా అన్నాడు శ్యాంసుందర్.
    "ఊ...మాటకారే." అనుకుంది వాసంతి.
    చేతికి, కాళ్ళకి, గుండెమీద రోమాలుంటేనే మగవాళ్ళు, లేకపోతే కారని ఎక్కడాలేదు. ఆఖరికి రామాయణ, భారతాల్లో కూడా ఈ కూత లేదు. అలా మగవాళ్ళకి వుంటే కొందరాడవాళ్ళకి యిష్టం. ఈడు, జోడు చూస్తారు పెద్దవాళ్లు. ఈ కాలం చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు యింకా చాలాచాలా చూసుకుంటారు. మగాళ్ళ కాళ్ళకి, చేతులకి ఛాతీమీద జుట్టు వుండటమే గాక మీసాలు వుండటంకూడా వాసంతికి చాలా యిష్టం. వాసంతి యిష్టానికి తగినట్లుగానే శ్యామ్ సుందర్ కి వున్నాయి. 'మీసాలే యింకా కొద్ది వత్తుగా పెద్దవి వుంటే బాగుంటాయి' అనుకుంది.
    ఆలీవ్ గ్రీన్ పాంటుమీద గ్రీన్ చెక్స్ వున్న వైట్ షర్టు వేశాడు శ్యామ్ సుందర్. ఆ డ్రస్ అతనికి నప్పినట్లు చక్కగా వుంది. సికోవాచీ. పొగడం ఉంగరం. అన్నీ ఓరకంటితో చక్కగా గమనించింది వాసంతి.
    "ఏమిటి చూస్తున్నారు?" ఈతఫా శ్యామ్ సుందర్ అడిగాడు.
    "సస్పెన్స్! చెప్పకూడదు" అంది వాసంతి.
    "ఆ సస్పెన్స్ ఏదో నాకూ తెలుసు. అయినా అదేమిటో చెప్పను. ఎందుకంటే, సస్పెన్స్ కదా!" అన్నాడు శ్యాంసుందర్.
    వాసంతికి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఒక్కో గడ్డిపరక పీకుతూ కూర్చుంది. తన్ని అతను ఎలా పరిశీలనగా చూశాడో తను అతన్ని అలాగే పరిశీలనగా చూసింది. అది గ్రహించాడు అతను. గ్రహిస్తే గ్రహించనీయి తప్పేముంది. అసలు యిలా చాటుగా కల్సుకోటం మంచిపనేనా? ఈ నెలరోజులూ స్నేహంచేసి మాయమాటలతో మోసపుచ్చి ఆ తర్వాత ఇలాంటి పిల్లని పెళ్లాడను పొమ్మనే రకమేమో! మనిషి చూస్తే అలాలేడు. ఏమో, చెప్పలేము. ఈ పురుష పుంగవులు దశావతారాలు ఎత్తటంలో ఘనులు. 

 Previous Page Next Page