వాసంతి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నది,
"ఎంతిస్తారుట?" శ్యాంసుందర్ అడిగాడు.
"దేనికి?" వాసంతికర్ధంగాక అడిగింది.
"గిట్టుబాటు అయితే నేనుకూడా చేద్దామని!"
"ఏమిటి?"
"గడ్డిపీకటం."
పక్కున నవ్వింది వాసంతి.
"సరీగ గుప్పెడు గడ్డిపీకారు."
"నేను నమ్మను."
"కళ్ళముందు సాక్ష్యం కనపడుతున్నాకూడానా?"
"ఆఫ్ కోర్సు! ఇంకోరు ఈపని చేసి మొత్తం నేరం నామీద నెడుతున్నారేమో!"
"ఆఫ్ కోర్సు! కొండొకచో అలాగూ జరగవచ్చు. కాదనను. కాని..."
"ఊఁ, కానీండి."
"ఆ యింకొకరు నేనేకాబట్టి వక్క పోచ గడ్డికూడా నేను తుంచటం జరగలేదు కాబట్టి..."
"బస్ బస్ ,అర్ధమైంది. వెధవ గడ్డిగోల ఆపేద్దాం. మనం ఏదో మాట్లాడుకుందామని వచ్చి ఏదేదో మాట్లాడుకుంటున్నాము" అంది వాసంతి.
"అయితే ఆ ఏదేదో ఏం మాట్లాడుకుందాం?" శ్యాంసుందర్ అడిగాడు.
ఏం మాట్లాడాలో వాసంతికి తెలియలేదు. చటుక్కున నోటికొచ్చింది అంది. "మీ అభిమానం హీరో ఎవరు?"
"కృష్ణ, మరి మీకో?"
"కమల్ హాసన్."
"కమల్ యాక్షన్ బాగాచేస్తాడు. కాని హీరో అనంగానె నాకెందుకో కృష్ణ గుర్తుకువస్తాడు."
"అభిమానసంఘం సభ్యులులా ఈమాట లేమిటి? ఇంకేమయినా కబుర్లు చెప్పుకుందాం. తెలుగు నవలలు చదువుతుంటారా?"
"ఆఁ, అప్పుడప్పుడు.
వాసంతి ప్రముఖ రైటర్సు పేర్లు చెప్పి వాళ్ళమీద మీ అభిప్రాయం ఏమిటి? అని అడిగింది.
"ఇంగ్లీషునవలలని మక్కీకిమక్కీ కాపీకొట్టి కాపీ రాతలు రాస్తూ నా అంత గొప్పరైటరు పుట్టబోడని విర్రవీగేవీళ్లో ప్రముఖులా? అప్రయోజక దామోదర అకటావికట నిష్ప్రయోజ నికృష్ట..."
"బాబోయ్! చాలుచాలు" అంది వాసంతి.
శ్యాంసుందరం నోరు మూసుకున్నాడు.
"మీకు వాళ్ళంటే కోపమా?"
"బోలెడు .సొంతరాతలు రాయలేనివాళ్ళు రైటర్సు ఎలా అవుతారు, కాపీగాళ్ళు తప్ప? ఇంగ్లీషు నవలలు చదివేవాళ్ళు ఎవరూ వీళ్ళముఖం చూడరు. అలా నవల నవలంతా దించేస్తుంటే కోపంరాక ఏమొస్తుంది?"
"ఇంగ్లీషు నవలలు బాగా చదివేవాళ్ళు ఎలాగూ తెలుగు నవలల జోలికి పోరు. ఎటొచ్చీ అవి చదవనివాళ్ళు యివి చదివి ఆనందిస్తున్నారు కదా!"
"ఆనందంతో ఆగటంలేదు. అందలం ఎక్కిస్తున్నారు. మంచి ఇంగ్లీషు నవల తీసుకుని అనువాదం చేయవచ్చుకదా! నా తాతగాడే రాశాడన్నట్లు అలా దింపేస్తే ఎలా? నా చిన్నప్పుడు టాంసాయరు, హకిల్ బేరీఫిన్ విచిత్రవ్యక్తి నవలలు నండూరి రామమోహనరావుగారు అనువాదం చేసినవి చదివాను. ఇప్పటికీ వారిపేరు నాకు ఎంత గుర్తువుందో, పొద్దస్తమాను ఇంగ్లీషు నవలలు చదవటం మొదలుపెట్టాను. మధ్యలో పేరొచ్చిన ఓ తెలుగునవల చదవటం, అదేమో కాపీనవల కావటం, మండిందంటే మండదామరి! పబ్లిక్ గా కాపీకొట్టిన వీళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే! అంతకుమించి వీళ్ళ గురించి వక్కమాట మాట్లాడినా వేష్టు."
"అవునవును వేష్టున్నర. మరేం మాట్లాడుకుందాం!"
"మీరే చెప్పండి."
"ఏది అయిష్టమో ఏది యిష్టమో పరస్పర అభిప్రాయాలు చెప్పుకుందాం" అంది వాసంతి.
"సినిమాలు అయిపోయాయి, రచనలు అయిపోయాయి. ఇంకేమున్నాయి?"
"జీవితం అంటే చాలా వుంటాయి. సినిమాలు, రచనలు మాత్రమే కాదు. అభిప్రాయాలు, యిష్టాలు అబ్బో చాలా వున్నాయి. మీకు ఏ స్వీటిష్టం. ఏ హాటిష్టం?"
"పులిహోర, కోవాకజ్జికాయలు. మరి మీకో?"
"మసాలా పకోడీలు ,గోధుం హల్వా. అన్నట్లు అరిశెలు కూడా చాలా యిష్టం."
"మరీ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నాము సిగ్గుగా లేదూ?"
"అవును అలాగే వుంది" అంది వాసంతి.
ఆ తర్వాత కొద్దిసేపు ఇరువురూ మవునం వహించారు. అసలు విషయం వాళ్ళు వకరినొకరు చూసుకోవటంతో ఆలోచన మరో దోవన పయనిస్తుంటే మాటలు మరో దోవన సాగుతున్నాయి. పెళ్ళిచూపుల తర్వాత మొదటిసారిగా కల్సుకోటం, ఒకరిపై నొకరు యిష్టపడటంతో మాటలు పెడదోవన సాగుతున్నాయి.
"భార్య మీ దృష్టిలో ఎలా వుండాలి? ఎలా మెలిగితే సంసారం స్వర్గతుల్యం అవుతుంది?" లాంటి ప్రశ్నలు అడగాలనుకుని ముందే ఆలోచించుకుని వచ్చిన వాసంతి ఆ ప్రశ్నలన్నీ మరిచిపోయింది.
దాదాపు ఇలాంటి ప్రశ్నలే అడిగి నా గుణగణాలు ఇవి అని చెపుదామని వచ్చిన శ్యామ్ సుందర్ అవన్నీ మరిచిపోయాడు.
మరో గంటసేపు ఏవేవో మాట్లాడుకుని పైవారం ఇక్కడే కల్సుకుందాం అనుకుని లేచారు.
"పై వారం వచ్చినప్పుడు అసలు విషయాలు మాట్లాడుకోవాలి" అనుకుంది వాసంతి.
సరిగ్గా యిదే మాట అనుకున్నాడు శ్యామ్ సుందర్.
పార్కునుంచి బైటకి రాగానే చెరోవేపు సాగారు.
10
"ఈ పిక్చర్ పేరేమిటి?" వాసంతి అడిగింది.
"పిల్లదాని పెళ్ళి చూపులు" రాధామనోహరి చెప్పింది.
"ఇదేం పేరే! పెళ్ళిచూపులు అంటే పోలా?"
"పోతుంది అనుకో. పెళ్ళిచూపులు అని యిదివరకే ఓ సినిమా వచ్చింది. పైగా పేరునిబట్టి జనం వస్తారని ఇలా పెట్టి వుంటారు."
"ఫలానా తారీఖున పిల్లదాని పెళ్ళిచూపులంటే ఇంకా బాగుండేది" వ్యంగ్యంగా అంది వాసంతి.
"నీకంతా వ్యంగ్యము వేలాకోళము. "వంటరి గదిలో ఒక తియ్యని రాత్రి' అని పేరుపెట్టి ఒకడాదాని తొడలు వాల్ పోస్టరుమీద బొమ్మ వేశారనుకో మగ కామపిశాచాలన్నీ మూడాటలూ చూస్తాయి..."