అందమైన ఆడపిల్ల ఎక్కడ వున్నా అందరి కళ్ళూ ఆమె మీదనే వుంటాయి. చాలామంది అంతకు క్రితం అవంతిని దొంగ చూపులతో చూస్తున్నారు. ఒకతను పిల్లిలా నడిచివచ్చి గబుక్కున ఆమె చేయి పుచ్చుకోవటం ఆపై ఇరువురూ గింజుకోవటం అందరినీ ఆకర్షించింది. ఈ విచిత్రం చూద్దామన్నట్లు చాలామంది దగ్గరకొచ్చారు.
"ఎవరు నీవు ఏమిటి నీ వుద్దేశ్యం?" అవంతి గట్టిగా అడిగింది.
"ఎందుకు అవంతీ! భయపడతావ్! ఆ రౌడీలలాంటి వాడిని నేను కాదు. ఆ రోజు నన్ను అపార్ధం చేసుకునే కదూ నాతో చెప్పకుండా ఆటోలో పారిపోయావ్. మొగవాళ్ళంతా మోసగాళ్ళు కాదు నన్ను నమ్ము...."
"ముందు చెయ్యి వదిలి మాట్లాడు."
"అమ్మా-దొంగ, వదిలితే పారిపోదామనా, నీవు నా మాటవిని నాతో వస్తే సరే కాదంటే ఈ చేయి వదిలేది లేదు."
చంద్ర మాటలు కొత్తవాళ్ళు వింటే అపార్ధం చేసుకునేలా వున్నాయి. పైగా చుట్టూ వున్నవాళ్ళు కళ్ళూ చెవులూ అప్పగించి ఇంతకు మించిన వింత లేనట్లు చూస్తున్నారు.
"పిలువు నాకేమన్నా భయమా! రౌడీల బారి నుంచి ఈ పిల్లని రక్షించాను. నా యింటికి రా అంటే నన్నే రౌడీ అనుకుంటున్నది అని చెపుతాను" చంద్ర అన్నాడు.
"పట్టపగలు పదిమంది ఎదుట ఒక ఆడపిల్ల చెయ్యి ఒక రౌడీ పట్టుకుని వాడింటికి రమ్మని బలవంతం చేస్తుంటే ఈ రౌడీ చేతి నుంచి నన్ను రక్షించే వీరుడు, సాహసవంతుడు మీలో ఒక్కరైనా లేరా" అవంతి దీనంగా అడిగింది.
అందమైన ఆడపిల్ల రక్షించమని నోరుతెరిచి అడగాలేగాని మేకలాంటి మగవాడు పులిలా మారిపోక చస్తాడా! ఆడదాని కోరికకోసం ఆడదాని మెప్పుకోసం ఆడదాని మాటకోసం జన నాశనానికి ప్రపంచం యుద్ధానికి కాలుదువ్విన పురుషపుంగవులు ఎందరో! అవంతి అడిగిందే తడవుగా ఒకళ్ళుకాదు నలుగురు మగవాళ్ళు ముందుకు వచ్చారు.
"ముందు సిష్టర్ చెయ్యివదులు" ఒకతను అన్నాడు.
"ఏం బ్రదర్ వళ్ళు ఎలా వుంది!" మరొకడు తమాషాగా కళ్ళు ఎగరేస్తూ అడిగాడు.
చంద్ర నవ్వాడు.
"మీ యిరువురూ తెలుగు సినిమాలు బాగా చూస్తారనుకుంటాను. విషయం తెలియకుండా యుద్ధానికి వస్తే ఎలా! ఈ అమ్మాయి పేరు అవంతి. నాటకాల్లో వేషాలు వేస్తుంది. ఓ రోజు పార్క్ లో కూర్చుని నేను కవితలు రాస్తుండగా....
ప్యాంటులోంచి చీర తీయటం....అవంతి అమ్మాయిలా మారిపోవటం....రౌడీల బారినుంచి తను రక్షించటం....చాలా చక్కగా కథలా వాళ్ళకి చెప్పాడు చంద్ర."
"బుర్ర వున్నవాడు ఎవరూ ఈ కథ నమ్మరు" విన్న వాడు అన్నాడు.
"విన్నారుగా కట్టుకథ, వీడు రౌడీ. నన్ను తనింటికి తీసుకువెళ్ళి వీడి గురువుకిచ్చి బలవంతాన పెళ్ళి చేస్తాడు. అందుకే నోటికి వచ్చిన కథ చెపుతున్నాడు. ముందు వీడి చేతిలోంచి నా చేయి విడిపించండి. మీలో వీరులుంటే మీరే రక్షించండి లేకపోతే పోలీసులని పిలవండి" లబ్బున గోల పెడుతూ అంది అవంతి.
అవంతి అర్జంటుగా అవతలికి వెళ్ళాలి. అవంతికి కావాల్సిన మెయిల్ వచ్చి నాలుగో నెంబరు ప్లాట్ ఫామ్ మీద ఆగినట్లు ఎనౌన్సర్ చెప్పాడు. అవంతి అది వింది.
అవంతి లబలబలాడటం చంద్ర చెప్పిన కథ ఏదో అభూత కల్పనగా వుండటంతో నలుగురూ కలిసి చంద్రని యివతలికి లాగారు. అంతే కాదు. చంద్రని తమాషా మాటలతో ఎక్కిరిస్తూ వుతికే కార్యక్రమంలో పడ్డారు.
"మెయిల్ వచ్చేసింది. మెయిల్ దగ్గరకు వెళ్ళాలి" అని స్వీట్స్ ప్యాకెట్ ఒక చేతిలో, మరో చేతిలో టిఫెన్ బాక్స్ తీసుకుని అవంతి పరుగుతీసింది.
వేగంగా మెట్లు ఎక్కి పరుగుతీయటంతో ఎదురుగా వచ్చే మనుషులని తప్పించుకొని పక్కకు పరుగు తీయటంతో ఒకతన్ని ఢీ కొంది. అవంతి చేతిలోని బాక్స్, ప్యాకెట్ కిందపడ్డాయి.
ఇతను ఇన్ స్పెక్టర్ లాగున్నాడు. ఆ దుస్తుల్లో వున్నాడు.
నేత్తిన్ హ్యాటు వుంది. కళ్ళని కప్పేస్తూ నల్లద్దాల కళ్ళజోడు వుంది. చేతిలో చిన్న లాఠీకర్ర వుంది. అవంతి ఇన్ స్పెక్టర్ ని గుద్దుకోవటంతో లూజుగా వున్న నల్లద్దాల కళ్ళజోడు కింద పడబోయింది. లాఠీకర్ర, చేతిలో వున్న ఫైలు మాత్రం కింద పడ్డాయి.
అరక్షణం ఇద్దరూ కంగారుపడ్డారు.
అవంతి టిఫిన్ బాక్స్ వూడి బాక్స్ లో వున్న బర్ఫీలు పక్కకు దొర్లాయి.
ఇన్ స్పెక్టర్ కళ్ళకి తనకాలి పక్కనే వున్న బర్ఫీ కనపడింది. దాన్ని చేతిలోకి తీసుకుని అటు తిరిగేసరికి అవంతి కనిపించలేదు. ఇన్ స్పెక్టర్ ఒక్కసారి గూడలెగరేసి బర్ఫీని జేబులో వేసుకొని వేగంగా ముందుకు సాగాడు.