Previous Page Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 11


    "శుభం! ఆమె తప్పకుండా అంగీకరిస్తుంది" అన్నాడు చలమయ్య.
    సెలవు తీసుకొని వచ్చి విషయమంతా చెప్పాడు రమణ.
    "రమణా! పొలం మంచిచెడ్డలు నాకు తెలియవు. అదిమంచి పొలమే అనుకుంటే వెళ్ళి ఖాయం చెయ్యి. నావద్ద ఉన్న డబ్బుతో వ్యవసాయం చేయించవచ్చు" అందామె తనవద్ద ఎంత ఉన్నదీ చెప్పకుండానే.
    తల్లి మాటలు వినగానే రమణ మనస్సు ఉరకలు వేసింది.
    వెళ్ళి అగ్రిమెంటు వ్రాయించాడు. కరణం గారితో ముప్పైవేలు లెక్క పెట్టి ఇచ్చి ఖరారునామా అందుకుని కళ్ళ కద్దుకున్నాడు రమణ. అతని మనస్సు ఆనంద తరంగితమైంది.
    అగ్రిమెంటు చేతికి ఇచ్చి "మనఃపూర్తిగా ఆశీర్వదిస్తున్నానురా అబ్బాయ్. నీవు ఇందులో బాగా వృద్ధికి వస్తావు. సాటివాళ్ళలో వేళ్ళపై లెక్క పెట్టతగిన వాడివిగా అవుతావు. ఇప్పుడు నీకేంరా? అరలక్ష పొలానికి అధికారివి. ఎవడైనా కళ్ళకద్దుకుని పిల్లనిస్తాడు. బంగారం లాంటి పిల్లవాడివి చేజారిపోయినందుకు విచారించే వాళ్ళూ ఉంటారు" అన్నాడు చలమయ్య.
    రమణ కళ్ళు చెమ్మగిల్లాయి. భారమైంది మనస్సు. "వస్తానండీ" అని చెప్పి, వాళ్ళనుంచి సెలవు తీసుకుని, ఇంటికి వెళ్ళి తల్లి చేతులలో అగ్రిమెంటు ఉంచి ఆమె పాదాలకి నమస్కరించాడు.


                                              *    *    *


    మంచిరోజు చూసి వ్యవసాయం ప్రారంభించాడు రమణ.
    తనే స్వయంగా అరక కట్టుకుని బయలుదేరాడు.
    సరిగ్గా పొలం వద్దకు వచ్చేసరికి అప్పటికే వచ్చి అక్కడ ఉంది విశాల. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు రమణ.
    "రమణా! నీవు వ్యవసాయంలో అభివృద్ధికి రావాలని శుభం కొరి వచ్చాను. అలాగే నించో. నీ నుదుట కుంకుమ దిద్ది అరకకి కొబ్బరికాయ కొడతాను. తర్వాత ప్రారంభించు" అంది.
    ఆమె మనసులోని అభిమానానికీ, ఆదరణకీ రమణ కళ్ళు చెమ్మగిల్లాయి.
    విశాల, రమణ నుదుట కుంకుమబొట్టు దిద్దింది.
    ఎడ్ల ముఖాన, మూపురాన కుంకుమబొట్టు పెట్టింది. మనసారా భగవంతుని ప్రార్ధించి కొబ్బరికాయ కొట్టి, రెండు చిప్పల్ని వ్యతిరేక దిశల్లో అటూ ఇటూ విసిరేసి, తను ప్రక్కకి తొలగింది.
    ఎడ్లని అదిలించాడు రమణ.
    ఱంకె వేసి కదిలాయి ఎడ్లు.
    రమణ తన పనిలో నిమగ్నుడయ్యాడు. విశాల ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన అయిదు నిమిషాలకి పొలానికి నీరుకట్టే రంగన్నా, శీనూ వచ్చారు. రమణ అరక దున్నుతూ ఉంటే వాళ్ళు గట్టు చెక్కుతూ' నీరు వారిస్తూ ఉన్నారు. రమణ ఉత్సాహానికి దీటుగా దున్నుతున్నాయి ఎడ్లు.


                                *    *    *


    హైస్కూల్స్ తెరిచారు. గోపీ వెళ్ళి చేరవలసిన సమయం వచ్చింది. రామలక్ష్మి "ఇక చదువు అక్కర్లేదు. వాడూ నీకు తోడుగా నీడగా ఉంటాడు" అంది.
    కానీ, రమణ అంగీకరించలేదు.
    తీసుకెళ్ళి పట్నంలో టెన్త్ క్లాసులో చేర్పించాడు. హెడ్ మాస్టర్ గారితో చెప్పి హోటల్లో చేర్పించాడు. పుస్తకాలు కొని ఇచ్చాడు. కొత్తగుడ్డలు కుట్టించాడు. అడపా తడపా అవసరానికి హెడ్ మాష్టరి గారి చేతికే కొంతడబ్బు ఇచ్చాడు. లెక్కల మాస్టరుగారితో చెప్పి అవసరమైతే ట్యూషన్ చెప్పవలసిందిగా కోరాడు.
    ఇరవై సంవత్సరాల వయస్సుకే ఆరితేరినవాడిలా అన్ని వ్యవహారాలూ పకడ్భందీగా నిర్వహించి వెళుతూన్న అతనిని చూసి ఆశ్చర్యపోయారంతా.
    కొడుకు విషయాలన్నీ చెపితే రమణ చాకచక్యానికి సంతోషించింది రామలక్ష్మి.
    ఆ మూడు నాలుగు రోజులూ తప్ప మిగతా రోజులన్నీ రేయింబవళ్ళనక శ్రమించాడు రమణ. మంచి విత్తనాలు కొనడంలోనూ, మంచి స్థలం చూసి నారుకి చల్లటంలోనూ, దున్నుతూ దున్నించటంలోనూ అతను వయస్సు మళ్ళి అనుభవం పండిన వ్యక్తిలా చేయించాడు. ఎక్కడెక్కడి ఎరువోకొని ఎకరానికి ఇరవై బస్తాలకి పైగానే ఎరువు తోలాడు. కూలీలను పంపి పచ్చి ఆకు కోయించి తెప్పించి పొలంలో బాగా తొక్కించాడు.
    నాటువేళకి పొలం అద్దంలా తయారయింది.
    దగ్గర ఉండి నాటు వేయించాడు రమణ.
    ఆరోజు భూషయ్య ఇంటినుంచి వచ్చాక రమణ మళ్ళీ ఆ ఇంటికి వెళ్లే అవసరం రాలేదు. వాళ్ళూ వచ్చిన వాళ్ళు కాదు. చివరికి గృహప్రవేశం నాడూ వాళ్ళు రాలేదు. జయంతి, చంద్రం రామాపురం వెళ్ళారప్పుడు. మాణిక్యమ్మ ఆరోగ్యం సరిగా లేదని రాలేదు. విశాల తల్లి వద్ద ఉండిపోవలసి వచ్చింది.
    తర్వాత ఈ మూడునెలలూ రమణకి మరోలోకం తెలియదు. పొలం, ఇల్లు, నిద్ర - అంతే! ఆ పొలంలో బంగారాన్ని పండించాలి. నలువురూ నవ్విన నాపచేనే పండిందని అనిపించాలి. అందరితో శభాష్ అనిపించుకోవాలి- అనేదే అతని ప్రధాన ధ్యేయమై పోయింది.
    కూలీ వాళ్ళతో మొత్తం పండ్రెండెకరాలు నాటించాక కానీ, అతనికి బరువు తీరినట్టుగా అనిపించలేదు. చివరిరోజు నాటుపని ముగించుకొని వచ్చాక విశ్రాంతిగా ఇంటిముందు మంచం వాల్చుకుని పడుకున్నాడు రమణ. రామలక్ష్మి ఇంట్లో పని చేసుకుంటూ ఉంది.
    సుడిగాలిలా వచ్చింది విశాల.
    వేళకానివేళలో వచ్చిన విశాలని చూసి కనుబొమలు ముడివేశాడు రమణ. అతని కామె రాకలో ఏదో విపరీత గోచరించింది.
    రివ్వునవచ్చి అతనివద్ద నిలుచుని "రమణా!" అంది ఉద్వేగంగా.
    పడుకున్నవాడల్లా లేచికూర్చుని. "కూర్చో విశాలా! బాగున్నావా? అమ్మా, అన్నయ్యా బాగున్నారా?" అని అడిగాడు శాంతంగా.
    "నేనిప్పుడు ఒకరి క్షేమ సమాచారాలు చెప్పటానికీ, శాంతంగా కూర్చుని కబుర్లు చెప్పటానికీ రాలేదు. నా జీవన్మరణ సమస్య తేల్చుకోవటానికి వచ్చాను" అంది దూకుడుగా విశాల.
    నవ్వాడు రమణ.
    "అంత ఎగిరెగిరి పడకు. ఎగిరిన ఎద్దు గంత మోయక తప్పదని సామెత వినలేదా?
    "నవ్వు నవ్వు....నీకేం? హాయిగా ఉన్నావు. నీకు పొలం తప్ప మరొకటి పట్టటంలేదు."
    "సరే, నీ దెప్పులకేం కానీ, అసలు విషయం చెప్పు."
    "నాకు నిన్నటితో మైనారిటీ తీరింది. నీవు సాహసం చేయ గలిగితే మనం ఇద్దరం వెళ్ళి పెళ్ళి చేసుకుందాం."
    అతను ఆలోచనలో పడ్డాడు క్షణం సేపు.  
    అంతలో మాణిక్యమ్మ వచ్చింది. వచ్చీ రావటంతోటే నేరుగా విశాల వద్దకువెళ్ళి, ఆమె రెక్కపుచ్చుకుని, "నీకు బుద్ధిలేదే గాడిదా? పెళ్ళి కెదిగి కూర్చున్నావ్. ఇలా పరాయివాళ్ళ ఇళ్ళవెంట పడవచ్చా? పద, పద. నలుగురి నోళ్ళలో నాని మానం పోగొట్టుకునే దానికంటే ముందుగా నిన్ను ఎవరిచేతిలోనో ఒక అయ్యచేతిలో పెట్టెయ్యాలి. మీ అన్న చెపితే వినలేదు నేను, ఏమో అనుకున్నాను. ఇంతకు తెగిస్తావనుకోలేదు" అని రమణ ఏదో చెప్పబోతూ ఉన్నా వినిపించుకోకుండా సరసరా వెళ్ళిపోయింది విశాలని లాక్కుంటూ.
    అరవటానికి కానీ, అల్లరి చేయటానికి కాని వీల్లేని విశాల, తల్లి వెంట వెళ్ళిపోయింది మౌనంగా.
    నిర్ఘాంత పోయిన రమణ నోటివెంట మాటరాక నిశ్చేష్టుడై ఉండిపోయాడు.    


                                                  *    *    *    


    మునసబుగారి మూడో అబ్బాయికి నిశ్చయం చేయాలని ప్రయత్నించాడు చంద్రం.
    "ఛీ! ఆ త్రాగుబోతునీ, తిరుగుబోతునీ, జూదరినీ పెళ్ళి చేసుకునే కంటే ఏదయినా బావిలో దూకి చావటం మేలు అన్నయ్యా! నీకు ఆలోచన నశించిందా ఏం?
    "అప్పుడు రమణని చేసుకుంటానంటే అతను మనపాలేరని, మనకు అతనికి సంబంధం తగదని నా నోరు మూయించారు.
    "ఈ రోజు అతనూ తగినంత రైతు అయ్యాడు. స్వంత ఇల్లు వుంది. పొలం వుంది. మనకతనితో సబంధం పరువు హీనం కాదు. మర్యాద నష్టం కాదు. మనంత షావుకారు కాదంటావా? పుచ్చిపోయేంత అప్పులుండి బోలెడంత ఆస్తివున్న మునసబు కంటే తీసిపోయాడా?
    "పైగా నా భాగం ఆస్తి అతనికి కలిస్తే మేం నీకంటే ఒక మెట్టు పైనే ఉంటాం. ఇపుడు నిన్నెవరూ తప్పుపట్టలేరు. మనసులు కలిసి మా సంబంధాన్ని తధాస్తని దీవించండి" అంది విశాల.

 Previous Page Next Page