కొడుకు అంత టెక్కుగానూ, నిర్లక్ష్యంగానూ ఎన్నడూ జవాబు చెప్పలేదు బాలయ్యకు పైగా, ఇంటి పరిస్థితి ఇలా ఉంటె సినీమాకు వెళ్ళడమూ, వెళ్ళిందేకాక సిగ్గులేక సినీమాకు వెళ్ళానని చెప్పడమూ అగ్గి రగిల్చాయి.
"ఓరి గాడ్దికొడక ఇంట్ల పోరలు చస్తాంటే సిల్మలు చూస్తావుర! అందర్ని గుడిసెలపెట్టి తగలపెట్టరాదురా, నీ పీడ వదల్తది"
రామారావుకు తల కొట్టినంత పనైంది తండ్రి తనను తిట్టేస్తున్నాడు సూరి చూస్తున్నాడో ఏమో? ఏదో వెర్రి ధైర్యం వచ్చేసింది కోపంతో వణికిపోయాడు ఏమనాలో తోచలేదు అయినా అనేశాడు, "నువ్వు డబ్బిచ్చావా?" అని.
"పైసల్నేనియాల్ర! సిగ్గు, శరమ్ లేదేమిర! గాడిదంతైనవు ఇంక నన్ను పైసలియ్యమంటావుర! ఎవర్ర నిన్ను పెంచి పెద్దచేసింది? నీ సంపాదనంత నీ బొంద కొమ్మున కొట్టుకుంటే ఇల్లెట్లెల్లుతదిర? లగ్గం కాకుంటేనే ఇట్లున్నవు లగ్గమైతే అందరి బొండిగ పిసికె టట్లున్నావు"
రామారావుకు దుఃఖమూ కోపమూ పొంగాయి సూరి అలా ఉండగా శారద వింటూందేమో ఇదంతా తన పౌరుషం చూపాలనుకున్నాడు ఏమిటీ ముసలాడు ఒంటికాలిమీద లేస్తున్నాడివ్వాళ!
"ఇంట్లో ఉండమంటావా? వెళ్ళిపొమ్మంటావా?" అని వెనక్కు తిరిగాడు బాలయ్య రక్తంలో అగ్గి రగిలింది ఆ మాట అతడు సహించలేకపోయాడు వెనక్కు తిరిగినవాని చేయి పట్టుకొని లాగి, "ఎళ్ళిపోతావు! యాడకి పోతవు? చంపి ఈడనే పూడ్చిపెడ్త" అని లాగి కొట్టాడు చెంపమీద రామారావు తూలాడు నిలదొక్కుకున్నాడు బాలయ్య ఫెడీ ఫెడీ అని బాదేశాడు.
రాజమ్మ పెద్దగా ఏడ్చేసింది.
పిచ్చయ్య పరిగెత్తుకొనివచ్చి రామారావును బాలయ్య చేతుల్లోంచి లాగి, "ఏందే బాలయ్యన్న! నీ అంతైన కొడుకును కొడ్తావే" అని వెనక్కు నెట్టాడు.
అప్పుడు అర్ధం అయింది బాలయ్యకు, చెట్టంతైన కొడుకును బాదేస్తున్నానని దుఃఖం పొంగివచ్చింది "రాముడూ!" అని కొడుకును కావలించుకొని ఏడ్చేశాడు.
'తంతారేమో వెధవలు ఇలాంటప్పుడు కాలికి బుద్ధిచెప్పమన్నాడు గురు' అనుకోని రోడ్డుదాకా పారిపోయి నయాగరాకు పోనిమ్మని చెప్పి టాక్సీలో కూర్చున్నాకగాని ఊపిరి పీల్చలేదు సూరి.
* * *
5
సుమారు ప్రతి రాత్రి డెయిజీ రాజారావుతోనే గడుపుతూంది కాని, ఆశించింది లభించలేదని విచారం పట్టుకుంది సూరికి, మైకేలుకూ ప్రతిరోజు బోధిస్తున్నారు-ఎలాగోలా సినీమా తీయడానికి డబ్బు పుట్టించమని ఆ డబ్బే చేతికందితే హైద్రాబాదునుంచి ఉడాయించి బొంబాయిలోనో, గోవాలోనో మకాం పెట్టాలని ఉద్దేశం అయితే, ఎంతచెప్పినా, బెదిరించినా డెయిజీ అదోలా ముఖం పెడ్తుంది కాని అడగదు రాజారావు దగ్గర రాల్చిన డబ్బుకూడా సూరి రాల్చిందేకాని డెయిజీ కాదు గుర్రాప్పందాలూ, పేకాట అలవాటు చేసినవాడు సూరే అయినా సంపద వాటికి హరించిపోయి తన చేతికేమీ దక్కదేమోనని తహతహ లాడిపోతున్నాడు మైకేలు ఆ సాయంకాలం మైకేలు దగ్గరికి వెళ్లి డెయిజీమీద చాడీలు చెప్పాడు సూరి రాజును లొంగతీసుకునే బదులు ఆవిడే లొంగిపోతూందనీ, ఏదో ప్రేమా, విరహం లాంటివి మాట్లాడుతూందని, చేయి జారిపోయేట్టు కనిపిస్తూందని చెప్పి వెళ్లిపోయాడు.
మైకేలు గుండె జల్లుమంది కేకులు వేడివేడిగా వున్నప్పుడే అమ్ముకోవాలనేది అతని నీతి కేకు ఆరిపోవడమే కాక జారిపోతున్నట్లు కనిపించింది ఆ సాయంకాలం ఇంటికి వచ్చినపుడు బెదిరించాడు డెయిజీని, "ఈ రాత్రి సాధించ;లేకపోయావో రేపక్కడికి వెళ్ళడానికి వీల్లేదు" - కీలెరిగి వాతపెట్టాడు మైకేలు.
డెయిజీ గుండె లిప్తపాటు నిలిచిపోయింది దుఃఖం పొంగింది కళ్ళు చెమ్మగిల్లాయి తాను కష్టపడి ఆర్జించుకున్నది ఎవరో దొంగిలిస్తున్నట్లనిపించింది వెంటనే అక్కణ్ణింఛి తన గదిలోకి పోయి ఏడ్చింది మైకేలు వచ్చి "డ్రెస్ చేసుకొని, బైల్దేరు" అనేవరకూ ఆమెకు లైట్లు వెలిగాయని తెలియదు "డాడీ! ఒక్క వారం టైమివ్వు" అంది వారమంటే జీవితమంత పొడుగుంటుందనుకొని, "వీల్లేదు ఇవ్వాళ రాత్రి జరిగిపోవాలి" అని గర్జించి, "నడువ్" అన్నాడు యంత్రంలా వెళ్లి టాయిలెట్ అయి వచ్చి టాక్సీ ఎక్కింది టాక్సీ దిగి లిఫ్టులో గదికివెళ్లి కూర్చుంది.
గది మౌనంగా వుంది డెయిజీ మౌనంగా వుంది కాని, ఆమె మనసు ఒకచోట నిలవడం లేదు ఏం చేయాలి తాను? సాధించగలదా రాజాను? అతడు తననే కాదంటే? తానిప్పుడు వట్టి మనిషి కూడా కాదు గుండె జల్లుమంది మనసు మరొకవైపు మళ్ళించడానికి ప్రయత్నించింది సోఫా మీద తల ఆన్చి ఫ్యానువైపు చూడసాగింది ఫ్యాను గిరగిరా తిరుగుతూంది దానికి ఎవరితోనూ నిమిత్తం లేదు అది కాలచక్రం లాంటింది.
అలా చూస్తుంటే డెయిజీకి పూర్వస్మృతులు మనసులో మసిలాయి మొట్ట మొదటసారి మైకేలు కారులో తననీ హోటలుకు తెచ్చాడు ఇక్కడే ఒక యువకుణ్ణి చూపించాడు అతడు ఆష్రఫ్! ముగ్గురూ కలిసి త్రాగారు తరువాత మైకేలు వెళ్లిపోయాడు, "విష్ యూ హేపీ లైఫ్" అంటూ ఆనాటి రాత్రి ఆష్రఫ్, తానూ ఒక మనిషినేననీ, అందమైనవాన్నేననీ గ్రహించాడు తెలియకుండానే పెదవులు ఈల వేశాయి ఆశ్చర్యపోయాడు చిరునవ్వు నవ్వుకున్నాడు బైల్దేరాడు బస్ స్టాండ్ చేరాడు వీధి రోజులాగే సమ్మర్ధంగా ఉంది కాని, ఎన్నడూ అంత అందంగా కనిపించలేదు లోకం జార్జికి.
బస్సు కోసం ఎదురు చూస్తూ నుంచున్నాడు అతని స్మృతి పధంలో డెయిజీ రిసెప్షన్ కౌంటర్ ఆమె చిరునవ్వు తాను వెళ్ళగానే కనిపిస్తుంది గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాడు ఆమె చిరునవ్వు నవ్వుతుంది తరువాత తరువాత ఏదో మాట్లాడాలి మాట్లాడాలి .. ఆమెతో మాట్లాడితే ఎంత హాయిగా ఉంటుంది! ఏముంది ఆ అమ్మాయి దగ్గర? ఏదో తనకు ఆనందం కలిగించేది ఉంది ఇవే ఊహలు అతని మెదడులో సుళ్ళు తిరిగాయి.
బస్సెక్కాడు మళ్ళీ అవే ఊహలు అవే ఆలోచనలు ఆఫీసులో ప్రవేశించాడు కౌంటర్ వద్ద డెయిజీ లేదు పచ్చనిచెట్టు బాంబుపడి కాలి కూలినట్లయింది అతణ్ణిచూచి ఆఫీసులో వారంతా ఆశ్చర్యపడ్డారు ఆఫీసులో గుసగుసలు బైల్దేరాయి జార్జిలోని మార్పుకు డెయిజీయే కారణం అని కొందరు, కాదని మరికొందరు అదే ఆనాటి టాపిక్ అయింది డెయిజీ వెంట్రుకలు సవరించుకొంటూ ప్రొప్రయిటర్ గదిలోంచి వచ్చేసింది టైపు చేస్తూ కూర్చున్న జార్జి గమనించాడుకాడు కాస్సేపటికి తలెత్తి చూస్తే కనిపించింది డెయిజీ తాను పూర్వం అనుకున్నవన్నీ తలలో మసిలాయి కాని ఆ ఉత్సాహం లేదు విధులూ నియమాలూ ఆ ఉత్సాహాన్ని తగ్గించాయి అయిన "గుడ్ మార్నింగ్" అన్నాడు జార్జి పేలవంగా డెయిజీ చూచి చూడనట్లు "గుడ్ మార్నింగ్" అనేసింది.
ప్రొప్రయిటర్ పిలిచి టైపులో తప్పులున్నాయని చివాట్లు పెట్టాడు జార్జిని.
ధ్యానంగా టైపు చేయడం ప్ర్రారంభించాడు జార్జి ఆ రోజు గడిచిపోయింది. అలా కొన్ని రోజులు దొర్లిపోయాయి ప్రతిరోజూ డెయిజీని పలకరించాలనీ, తాను పులకరించాలనీ అనుకుంటున్నాడు కాని, రోజూ ఏదో బలవత్తరమైన శక్తి అడ్డు తగులుతూంది.
ఒకనాడు ధైర్యం చేశాడు కొన్ని గులాబీలు తీసికెళ్ళాడు డెయిజీ ముందుంచాడు-భగవంతుని ముందుంచినట్లు డెయిజీ పూలను చూచింది జార్జిని చూచింది ఆవిడ చెక్కిళ్ళు చెవురించాయి క్షణంలో ఆ ఎరుపురంగు మాయం అయింది థాంక్సు అని పూలు తీసుకుంది మళ్ళీ చూచాడు జార్జి ఆమెను ఆమె అతనిని అలా చూళ్లేకపోయింది.
పూలు అంత శ్రద్దగా, భక్తితో తనకు తెచ్చివ్వడం డెయిజీకి కొత్తగా కనిపించింది ఆమె హృదయం ఆర్ధ్రితమైంది ఏదో పచ్చని మొక్క ఆమె హృదయంలో మొలిచినట్లనిపించింది తాను ఎందరితోనో తిరిగింది అనేక విధాలుగా మసలింది కాని, ఇంత ఇదిగా ఇదిగా అంటే, ప్రేమతో తనకు ఎవరూ పూలు అందించలేదు ఈ పూలల్లో ఏదో ప్రత్యేకత ఉంది అనుకుంది ఏదో కొత్తదనం ఏదో ఆహ్లాదం ఏదో ఆనందం ఏదో సొగసు ఆమెకు కనిపించాయి.