Previous Page Next Page 
జన్మభూమి పేజి 11

    "ఒక్క డబ్బే కాదు రంగా. కోరిక, పట్టుదల కూడా వుంటే సాధించవచ్చని మీ మామయ్య నిరూపించారు. ఇది చూస్తే ఈ పల్లెటూరిలో ఆయన ఏం అనుకున్నారో అది సాధిస్తారన్న నమ్మకం కలుగుతుంది నాకు" రాజేశ్వరి అంది.
    "రంగా! మీ యింటి సంగతి ఏమయింది. బాగుచేయిస్తానన్నారు. ఆ పని అయిందా. మీరక్కడే వుంటున్నారా" రాజేశ్వరి వివరాలు అడిగింది.
    "అత్తయ్యా, మామయ్య అన్నారంటే పని అయిందన్నమాటే. ఈ పాత యిల్లు పడగొట్టించి రెండు గదులు, వంటగది, వరండా అన్నీ మేస్త్రీలున్నప్పుడే పని చేయించేశారు" కృతజ్ఞతతో అన్నాడు.
    "పోనీలే యిన్నాళ్ళు నీవు మా ఇల్లు, వాదిలి కనిపెట్టుకున్నావుగా మరి" రాజేశ్వరి మనస్పూర్తిగా అంది.
    కేశవరావు యింట్లో సామాను సర్దుకుని, మెడ్రాసు నుంచి షిప్పులోంచి లారీలో వేసిన సామానులు వచ్చాక అవన్నీ సర్ధుకుని, రాజేశ్వరి వంటపని మొదలుపెట్టేసరికి రొటీన్ లో పడేసరికి పదిహేనురోజులు పట్టింది.
    "అమ్మయ్య. యింటిపని అయింది. యింక నా దృష్టి వూరిమీద పెట్టొచ్చు. రంగా మనం ఈరోజు బయలుదేరి వూరంతా తిరిగి పెద్దలందరిని కలిసివద్దాం" తాతగారి వాలు కుర్చీలో సావకాశంగా వాలి కూర్చుని అన్నారు కేశవరావుగారు.
    "మీరెందుకు మామయ్యా. కబురుపెట్టి అందరినీ పిలిపిద్దాం."
    "వద్దు. అలా అంటే నేనేదో అధికారం చెలాయిస్తున్నానన్నభావం వాళ్లకి రావచ్చు. వాళ్ళల్లో నేను ఒకడిని అన్న భావం వారికి కలగాలంటే మనం వూరందరిని కూడగట్టుకోవాలంటే మనం వాళ్ళతో కల్సిపోయినట్టు కన్పించాలి. వారి సహకారం మనం అర్ధించబోతున్నప్పుడు మనమే వెళ్ళడం సరి అయింది" మామయ్య వివరణకి, ముందుచూపుకి మనసులో అభినందించాడు రంగా.  
    "మామయ్యా... వూరికి ఉత్తరాన  శివాలయం, దక్షిణాన లక్ష్మినరసింహాలయం ఉన్నాయి మన వూరికి" ఊరి పరిచయంలో ముందుగా శుభంగా ఆలయంతో ప్రారంభించాడు రంగా.
    "మామయ్యా. ఈయన మన శివాలయం పూజారి గౌరీనాథంగారు" పండు ముసలాయన శాస్త్రిగారు.
    "నమస్కారం సామీ. మీ గురించి అంతా చెప్పుకుంటుంటే విన్నాను. సంతోషం బాబూ. మీరీ వూరికోసం యింత మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఈశ్వరుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ వుంటాయి." కేశవరావుగారికి తీర్ధం ఇచ్చి, కొబ్బరిచిప్ప చేతిలో పెట్టి చెయ్యెత్తి ఆశీర్వదించారు గౌరీనాథశాస్త్రి. "అయ్యా, మీకు కాస్త తీరిక అయ్యాక ఈ ఆలయంవైపు దృష్టి సారించండి. ఆలయానికి చాలా మరమత్తులు చేయించాలి. ఎప్పుడో తమ ముత్తాతలగారు పూనుకుని చందాలు వసూలుచేసి, దేముడికి ఎకరం పొలం రాసిచ్చి ఆలయం కట్టించి లింగప్రతిష్ఠ చేయించారుట. అని మా తండ్రిగారు చెప్పేవారు. గోడలు బీటలు వారాయి. సున్నానిని నోచుకోక కొన్ని ఏళ్ళు అయ్యింది. గుడిలో దేముడి వైభవం తగ్గింది. మీలాంటివారు పూనుకోవాలి సామీ" చేతులు జోడించి అన్నారు శాస్త్రి. కేశవరావు చుట్టూ చూశాడు. నిజమే ఆలయం గోడలు బీటలు తీసి పిచ్చిమొక్కలు మొలిశాయి. నేలంతా పెచ్చూడింది. తలుపులు వెలవెల బోతున్నాయి.
    "మామయ్యా - అవతలపక్క లక్ష్మీనరసింహ ఆలయానికి కమ్మవారి అండదండలున్నాయి. ఆ దేముడికి రాబడి, వైభవం వున్నాయి. ఆలయమూ, గుడిలో సామికి పూజా పునస్కారాలు వైభవంగానే జరుగుతాయి. మన బోళాశంకరుడి ఆలయమే యిలా వుంది" రంగా అన్నాడు. గౌరీనాథశాస్త్రి నవ్వారు.
    "అవును నాయనా. శివుడెప్పుడూ భోరికాడు నారాయణుడిలాగ. శివాలయంలో వైభవం కనపడదు. అల్పసంతోషి. కొబ్బరికాయకొట్టి, నెత్తిన యింత నీరు పోస్తే చాలు. బోళా శంకరుడు అంటారు అందుకే. ఏదో బాబు మీ దయ. తరతరాలనుండి యీ గుడినే నమ్ముకుని బతుకీడుస్తున్నాం. ఇప్పుడు మా అబ్బాయీ దీన్నే నమ్ముకున్నాడు. మీ ముత్తాతల పేరు నిలపడాని కన్నా ఈ ఆలయం బాగుచేయించండి బాబూ" గుమ్మందాకా వచ్చి నమస్కారం చేస్తూ అన్నారు.
    "తప్పకుండా చేయిస్తాను శాస్త్రిగారు. ముందు నన్ను ఊరంతా చూడనీయండి. ముందు శుభసూచకంగా ఆలయం పనితోనే ఆరంభిస్తాను. రంగా గుర్తుంచుకో, మనం చెయ్యాల్సిన మొదటిపని ఇది."
    "ఊరికి అటువైపు లక్ష్మినరసింహాలయం వుంది. ముందు అటు వెడదామా. లేక ఇటు వెడదామా..."
    "ఓ గుడి అయింది, బడి చూద్దాం పద. మళ్ళీ ముందుకి వెనక్కి ఎందుకు - ఇంతకీ స్కూలు మిడిల్ స్కూలా, హైస్కూలా..."
    "ఎక్కడ మామయ్యా- ఎలిమెంటరీ స్కూల్ యింకా యిక్కడ - తగినంతమంది పిల్లలులేరు అని కాబోలు ఇంకా మిడిల్ స్కూల్ చేయలేదు."
    "మరి పై చదువులు చదవాలంటే అంతా ఏం చేస్తున్నారు?" ఆశ్చర్యంగా అడిగాడు కేశవరావు.
    "పక్క వూరిలో మిడిల్ స్కూల్ వుంది. ఇటుపక్క తాలూకా హెడ్ క్వార్టర్స్ లో హైస్కూల్ వుంది. కావాల్సినవారు అక్కడికి వెళతారు."
    "పక్క వూరంటే ఎంత దూరంలో ఉన్నాయి? ఎలా వెళతారు పిల్లలు?"
    "ఇటు మిడిల్ స్కూలు రెండు మైళ్ళు - అటు హైస్కూలు మూడు మైళ్ళ దూరంలో ఉన్నాయి."
    "చిన్నపిల్లలు మూడు మైళ్ళ దూరం వెళ్ళి చదువుకోవాలా?"
    "ఏం చేస్తారు. కొందరు సైకిళ్లపై వెళతారు. కొందరు బస్సులో వెళతారు. ఈ వూర్లో ప్రెసిడెంటు, మునసబు వగైరా పెద్ద మనుష్యుల తగాదాల్లో మన వూరుకి రావాల్సిన స్కూలు, ఆస్పత్రి పక్కవూర్లకి వెళ్ళిపోయాయి."
    "అదేమిటి..." ఆశ్చర్యంగా అడిగాడు కేశవరావు.
    "ప్రభుత్వం మిడిల్ స్కూల్ పెడతాం, ప్రైమరీ హెల్త్ సెంటర్ పెడతాం అని రాసినప్పుడు ఇద్దరికిద్దరూ పట్టనట్టు వూరుకున్నారు. అదను చూసి మనకి రావాల్సినవి పక్కవూరు వాళ్ళు తన్నుకుపోయారు పోటీపడి. చేజారాక అప్పుడు మెలకువ వచ్చింది మునసబుకి, ప్రెసిడెంటుకి. రెండు మూడు గ్రామాలకి కలిపి ఒక మిడిల్ స్కూల్, ఒక వెటర్నిటీ ఆస్పత్రి, ప్రైమరీ హెల్త్ సెంటర్ లాంటివి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సరిగ్గా వూరి పెద్దలు స్పందించి వేళకి దరఖాస్తులు పెట్టి అధికారులని కలిస్తే పని జరిగేది. ఎవరూ సరిగా పట్టించుకోకపోవడంతో పక్క వూరికి పోయాయి అవి."
    "బాగుంది గొడవ. అనవసరంగా నష్టపోయింది పిల్లలు. పాపం వాళ్ళు యింతంత దూరం వెళ్ళి చదువుకోవాలంటే ఎంత కష్టం! ఏమాత్రం మంది వుంటారు మొత్తం పై వూర్లకి పోయి చదివేవారు."
    "సరిగా తెలియదు కాని మిడిల్ స్కూలుకి ఓ పదిమంది- హై స్కూలుకి ఐదుగురుకన్నా ఉండరనుకుంటాను. కాస్త వున్నవాళ్ళెవరూ ఈ స్కూలుకి పంపరు. పక్క టౌనుకి పంపుతారు. పిల్లల చదువు కోసం పట్టణాలలోనే కాపురాలు పెడుతున్నారు యిక్కడ పొలాలు కౌలుకిచ్చి. అందుకే పల్లెలన్నీ ఖాళీ అవుతున్నాయి. ఏదో అతీగతీ లేనివాళ్ళు మాత్రం ఇక్కడ స్కూల్స్ లో చదివిస్తారు నాలుగు అక్షరం ముక్కలు వస్తే చాలని."

 Previous Page Next Page