అప్పటికింకా భోజనం టైమ్ కాలేదు కాబట్టి జనం పెద్దగా లేరు.
సర్వర్ వచ్చి ఏం కావాలన్నట్టు ఓ లుక్ విసిరాడు.
"భోజనం" ఉత్సాహంగా చెప్పాడు అతడు.
"ఫుల్లా, ఆఫా?"
"ఫుల్లే"
సర్వర్ అతన్ని పరిశీలించి చూసి కిచెన్ లోకి వెళ్ళాడు.
మరోక్షణంలో లేత అరిటాకును తీసుకొచ్చి అతడి ముందు పరిచాడు.
కూరలు వడ్డించి, రైస్ కోసం వెళ్లాడు.
కూరలు రుచి ఎలా ఉందో చూడాలనిపించి మొదట పెరుగుపచ్చడిని కొద్దిగా తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు నరేష్. పచ్చడి బావుందనిపించి మరోసారి వేలుకు చప్పరించాడు.
అయిదునిముషాలకు రైస్ ప్లేట్ తో వచ్చిన సర్వర్ అరిటాకు కడిగేసినంత శుభ్రంగా వుంటే ఆశ్చర్యపోయాడు.
"మీకు కూరలు వడ్డించానుగా" అడిగాడతను.
"ఆఁ రుచి ఎలా వుందోనని చూడబోయాను. ఆ తరువాత తినకుండా కంట్రోల్ చేసుకోలేకపోయాను" క్షమించమన్నట్టు చూశాడు నరేష్.
రైస్ ప్లేట్ ను టేబుల్ మీద దబీమని వేసి కూరలకోసం వెళ్ళాడు నరేష్.
నరేష్ మరో పావుగంటకు భోజనం ముగించాడు.
పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టనిపించింది. నిస్సత్తువ మంత్రించి తీసివేసినట్టు మాయమైంది. కళ్ళల్లోకి కళ వచ్చింది. అదుపు తప్పిన శరీరం తేరుకుంది.
"బిల్లు ఇస్తావా?" అడిగాడు నరేష్ సర్వర్ని.
"మీరు వద్దన్నా ఇస్తాను సార్" అని జోక్ కట్ చేసి బిల్లుచేతికిచ్చాడు.
ఆ బిల్లును చూస్తూనే ఖంగుతిన్నాడు అతడు. అయిదూ ముప్ఫై అయిదు పైసలు ఉంది బిల్లులో. ధరల పట్టిక కంటే ముప్ఫై అయిదు పైసలెక్కువ. అది ఎందుకు వేశారో అతనికి అర్థం కాలేదు. తన జేబులో ఉన్నది అయిదు రూపాయలే, మరి ముప్ఫై అయిదు పైసలు ఎలా ఇవ్వాలి? తిన్న అన్నం అంతా అరిగిపోయి ఆకలివేయడం ప్రారంభించింది. కామేశ్వరి మెస్ లో ప్లేట్ భోజనం సరిపెట్టుకోనందుకు తనను తనే తిట్టుకున్నాడు. ఇంకెప్పుడూ జీవితంలో ఈ హోటల్ కు రాకూడదని ఒట్టు పెట్టుకున్నాడు. అయినా ఇప్పుడు ఈ గండం గడిచేదెలా? ముప్పై అయిదుపైసలు తక్కువున్నాయంటే క్యాష్ లో కూర్చున్నవాడు ఒప్పుకుంటాడా?
అతనికి ఒళ్ళంతా చెమట పట్టింది. కాళ్లీడ్చుకుంటూ కౌంటర్ దగ్గరకు వచ్చాడు.
కౌంటర్ లో వున్న అతను బాదుషాకు విభూదిరేఖలు పెట్టినట్లు గుండ్రంగా కుర్చీలో ఉన్నాడు. అతన్ని చూస్తూనే దురభిప్రాయం కలిగింది నరేష్ కు. ముప్పై అయిదుపైసలు తక్కువగా ఇచ్చినందుకు తన దగ్గర ముప్ఫై గంటలు పని చేయించుకుంటాడనిపించింది.
బిల్లూ, అయిదు రూపాయల్నీ తీసి అతని ముందు పెట్టాడు అతను.
ఆయన అయిదు రూపాయల్ని తీసుకుని, బిల్లును చూసి "ముప్ఫై అయిదు పైసలివ్వండి" అని అడిగాడు.
"లేవు సార్" ఆయనకే వినిపించేంత చిన్నగా చెప్పాడు.
"లేవా?" అంటూ నరేష్ ను ఎగాదిగా చూశాడు ఆయన.
టేబుల్ మీదున్న అగరొత్తుల పొగవల్లో, బాధవల్లో అతడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
"జేబులో డబ్బు లేకుండా దొంగగొడ్డు చేలోపడ్డట్టు హోటల్లో దూరి తినెయ్యడమేనా? చూస్తుంటే చదువుకున్న వాడిలా వున్నావ్. బుద్ధిలేదూ" పురుగును చూసినంత అసహ్యంగా చూశాడాయన.
"భోజనం అయిదురూపాయలేననుకున్నా సార్ బోర్డులో కూడా అంతే ఉంది కదా" గొణుగుతూ చెప్పాడు అతడు.
"భోజనం అయిదు రూపాయలే. ఈ ముప్ఫై అయిదుపైసలు టాక్స్."
"టాక్సా! తినే భోజనం మీద టాక్సా!"
"ఆఁ భోజనం మీద పన్ను వేసినందుకు మాజీ ముఖ్యమంత్రిని అభినందించండి. ఏకంగా భోజనం తినడాన్నే రద్దు చేయకుండా వదిలినందుకు."
"పన్ను విషయం తెలియకుండా తిన్నాను. ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను."
"అదేం కుదరదు. ముందు అక్కడ ముప్ఫై అయిదు పైసలుంచి అడుగు ముందుకేయండి. లేకపోతే మీదగ్గర ఈరోజంతా సర్వింగ్ చేయిస్తాను" ఖచ్చితంగా చెప్పాడు క్యాషియర్.
ఏం చేయాలో ఠక్కున తోచలేదు అతడికి. తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారేమోనని హోటలంతా కలయజూశాడు. ఎవరూ లేరు.
"సార్! సార్!" క్యాషియర్ ను బ్రతిమలాడుకోవడం మొదలుపెట్టాడు.
అప్పుడు ఫ్యామిలీ రూమ్ గదినుంచి అమ్మాయిల గుంపు బయటపడింది. ఆడపిల్లల అవయవాలకు అలవాటు పడిన అతని కళ్ళు అటు తిరిగాయి.
నలుగురు అమ్మాయిలు పక్కన వస్తుండగా రజని అచ్చు రాణిలా ఠీవిగా వస్తోంది.
ఆమెను చూడగానే అతడి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఏ అమ్మాయిని చూసినా అంత మధుర స్పందన కలగదని, ఆమెను చూస్తున్నప్పుడే మనసు అదుపు తప్పుతూ ఉందని గ్రహించాడు అతను. అంతలో ప్రస్తుతం తను ఉన్న పరిస్థితి గుర్తొచ్చి తల వాల్చేశాడు.
కౌంటర్ దగ్గరకు వచ్చి బిల్లు ఇస్తూ అతన్ని చూసింది రజని.
"మీరు నా కారులో ఇంటర్వ్యూకి వచ్చారు కదూ" గుర్తుకు తెచ్చుకుంటూ అడిగింది ఆమె.
తనను గుర్తుపట్టినందుకు అతనికి ఆనందం కలిగింది.
"అవునండీ" అన్నాడు.
"చిల్లర తక్కువైందని బస్సులోంచి దించేస్తే, మా రజని కారులో ఇంటర్వ్యూకి వచ్చారు కదా. సెలక్ట్ అయ్యారా?" సరూ అనబడే సరళ అడిగింది.
"సెలక్ట్ కాలేదండి... ఇప్పుడూ చిల్లర ప్రాబ్లమే."
"చిల్లర ప్రాబ్లమా!" రజనికి అర్థం కాలేదు.
"అవునండీ రజనీగారూ. భోజనం అయిదురూపాయలని తిన్నాను. తీరా భోంచేశాక టాక్స్ తో కలిపి అయిదూ ముప్ఫై అయిదుపైసలు బిల్లు వేశారు. అయిదు రూపాయలున్నాయి. మిగిలిన చిల్లర లేదు. మళ్ళీ ఇస్తానంటే ఈ విభూదిపండు ఒప్పుకోవడం లేదు." తన పరిస్థితి అంతా వివరించాడు అతను.