"బాచ్ లర్ గాడికి ఇంతకంటె ఏం కావాలి?" అన్నాడు తేలిగ్గా,
జ్యోతి మూతి తిప్పింది.
గత వారంరోజులుగా, పెళ్ళయిన దగ్గిరనించి ప్రతి నిమిషం, ప్రతి సంఘటనా జ్యోతి మనసునిండా అసంతృప్తి నింపింది. అత్తవారింట గృహ ప్రవేశానికి వెళ్ళింది.
వారూ సామాన్య సంసారులే. మామగారు మేష్టరుగిరీ చేసి రిటైర్ అయ్యారు.
ఎలాగో చిన్నయిల్లు కట్టుకుని, ఫించనుతో, ముందు గది అద్దెకిచ్చి ఆ ఏభైతో, కొడుకు అప్పుడప్పుడు పంపే డబ్బుతో ముసలిదంపతులు కాలం వెళ్ళబుచ్చుతున్నారు.
పెద్దకొడుకు విశాఖపట్నం పోర్టులో గుమస్తా.
కూతుళ్ళిద్దరూ ఒకరు రాజమండ్రిలో, మరొకరు నెల్లూరులో వున్నారు, ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకుంటూ.
జ్యోతికి ఆ ఇల్లు, ఆ వాతావరణం అసలు నచ్చలేదు. ఉన్నమూడు రోజులు ముభావంగా, అంటీముట్టనట్టే తన గదిలో ముడుచుకు కూర్చుంది. ఆడపడుచులు కల్పించుకుని మాట్లాడితే ముభావంగా వినేది. హాస్యాలు ఆడబోతే మొహం చిట్లించేది.
జ్యోతి మడ్ బాగుచేయడానికి. ఆమెని సంతోషంగా వుంచడానికి పాపం సుబ్బారావు నానా తంటాలుపడ్డాడు. ఏదో సరదాగా జోక్స్ వేస్తూ, హాస్యంగా మాట్లాడుతూ వుండేవాడు.
సుబ్బారావు వేసే జోక్స్ చీఫ్ జోక్స్ లాగ, అతని హాస్యం వెకిలి తనంగానూ కనపడేది జ్యోతికి.
అదే ఆమె హీరోలాంటివాడి నోటవస్తే ఆ చిలిపితనానికి, కొంటెతనానికి మురిసిపోయేది.
కాని సుబ్బారావులాంటి వాడినోట అవి వింటూంటే వెకిలిచేష్టల్లా అసహ్యించుకుంది.
అతని ప్రతిపనిలో, మాటలో ఏదో వంకే కన్పించేది. అతని స్పర్శకి జగుప్స కలిగినా కాదనే వీలులేక, అంటే ఏం గొడవ అవుతుందోనని భయపడి ముక్కు మూసుకు ఆముదం తాగినట్లు బలవంతాన కళ్ళు మూసుకుని పెదాలు బిగపట్టేది.
జ్యోతిలోని విముఖతని అతను అంతగా గుర్తించలేదు. ఆమె స్వభావంగా సరిపెట్టుకున్నాడు.
"మాట్లాడవోయ్- మాట్లాడితే ముత్యాలు రాలవులే!"
జ్యోతికి ఎంత చెప్పినా ఎంతకీ మాట్లాడకపోతే అలిగినట్లు గారాలు గునిసేవాడు. చిన్నపిల్లాడిలా గారాలు పోతున్న అతన్ని చూసి-
'ఏమిటది అసహ్యంగా?" అనేసింది ఒకసారి విసుగ్గా.
"ఎందుకలా వాగుతారు...." సుబ్బారావు మొహం చూసి సర్దుకుని వేళాకోళంగా అన్నట్లు నవ్వింది.
"మరేం చేయను, నీవంతు నావంతు నేనే మాట్లాడాల్సి వస్తుంది" పాపం సుబ్బారావుకి చాలా కోరికలే వున్నాయి.
ఆ ఇంట్లో అందరికంటే జ్యోతి ఎక్కువ చదివింది. ఆ ఇంట్లో వాళ్ళముందు జ్యోతి చాలా అందగత్తె. చదువుకున్న అందాల భార్య. అందరిముందు గొప్పగా షికార్లు తిరగాలని, గర్వంగా నలుగురికీ చూపించాలనీ తాపత్రయపడేవాడు.
సినిమా మోజుకొద్ది సినిమాకిమాత్రం సంబరంగా తయారయ్యేదికాని, షికారు అంటే రాననేది.
ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళదాం అంటే ఆ స్నేహితులెవరో అడిగి, వాళ్ళు ఏదో చిన్న ఉద్యోగస్తులు అని వినగానే ఆ.... ఇంతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళడం దండుగ అన్పించి- 'రాను' అనేది మొండిగా.
అత్తవారింట ఉన్న మూడు రోజులు ముళ్ళమీద ఉన్నట్టే గడిపింది.
చదువుకున్న వదినగారితో సరదాగా వుందామనుకున్న ఆడపడుచులు జ్యోతి ముభావన చూచి చిన్నపోయారు.
"మీ ఆవిడకి ఎలాగైనా గర్వంగా వుందిరా, పలకరించినా మాట్లాడదు" అనేసింది సీత ఆఖరికి ఓ రోజు.
సుబ్బారావు తడబడి-
"అదేంలేదే! తన స్వభావం అంతే అనుకుంటాను. నాతోటీ అట్టే మాట్లాడదు" అన్నాడు సర్దేస్తూ.
అప్పుడప్పుడు జ్యోతి వరస చూసి అతనికి అనుమానం వచ్చేది. కాని, వారంరోజులకు అలా అనుకోవడం ఎందుకని సరిపుచ్చుకున్నాడు.
ఇల్లు సర్దాక తర్వాత వద్దువుగాని అంటే జ్యోతి ససేమిరా వుండనంది.
అత్తగారు కొత్తకోడలిని నాలుగు రోజులుంచుకోవాలని సరదాపడి "పదిరోజులుంచరా నాయనా! తర్వాత వస్తుంది" అంది.
"ఊఁహుఁ.... నా కిక్కడ ఏం బాగులేదు. నేను మీతో వస్తాను" అంది జ్యోతి చిన్నపిల్లలా మొండిపట్టుపట్టి.
సుబ్బారావు ఎటూ చెప్పలేక అవస్థపడ్డాడు. ఆఖరికి కొత్త భార్యని విడిచి ఉండటం ఇష్టంలేనట్టు-
"మరోసారి వస్తాంలే అమ్మా! ఇప్పుడు వెళ్ళనీ" అన్నాడు సిగ్గుపడుతూ.
తల్లి కొడుకు మొహం చూసి కొత్త పెళ్ళాం మోజు, వద్దనడం ఎందుకులే అని నవ్వుకుంది.
కాని చిన్నాడపడుచు మాత్రం.
"అదేం కాదమ్మా! వదిన ఉండనని అంటుంది. పాపం చిన్నన్నయ్య ఆ మాట చెప్పలేక విడిచి వుండలేనట్టు పోజులు పెడుతున్నాడు" అంది నిజాన్ని వేళాకోళంగా మార్చి.
సుబ్బారావు ఒక్కక్షణం తత్తరపడి-
"ఆ.... నువ్వూ ఓ ఇంటి కోడలివిగా, అదేదో నీకూ తెలిసే వుంటుంది. అందుకే అంత కరక్టుగా ఊహించినట్టు చెప్పావ్!" అన్నాడు అతనూ నవ్వి.
"అబ్బో.... అబ్బో! మరిదిగారు అప్పుడే పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నారు. చూడండి, మీ తమ్ముడిని చూసి నేర్చుకోండి. మీరెన్నడన్నా ఇలా నన్ను వెనకేసుకు వచ్చారా?" అంది వదినగారు మరిదిని హాస్యంపట్టిస్తూ.
వాళ్ళందరి మాటలు, హాస్యాలు వింటూంటే అవన్నీ మోటు హాస్యాలుగా వాళ్ళంతా అనాగరికులుగా కన్పించారు జ్యోతికి.