జైలర్ తలెత్తి ఎదురుగా నిలబడ్డ స్త్రీ వైపు చూశాడు. జీవితం పండించిన అనుభవాల్తో కాంతి ఇంకిపోయిన శరీరం ....బహిర్గతం కాని మొఖం.
అతనికి జాలి కలిగింది. అంతకు అరగంట క్రితమే ఆమె తాలూకు ఫైలు పూర్తిగా చదివేడు. పన్నెండు సంవత్సరాల శిక్ష తరువాత ఆరోజే విడుదల అవుతూంది ఆమె. ఇలాంటి స్త్రీ హత్య చేసిందంటే అతడికి నమ్మశక్యం కలగలేదు. కానీ నమ్మక తప్పదు. ఇంతకంటే అమాయకంగా, సాధువుగా కనిపించే స్త్రీలు రకరకాల నేరాలకి తన కళ్ళెదురుగ్గానే జైలు శిక్షలనుభవించటం తను చూశాడు.
"శారదమ్మా !"
ఆమె అతని కళ్ళల్లోకి చూసింది.
"తెలిసో, తెలియకో - క్షణికావేశంలో నువ్ చేసిన పనికి ఎంత పెద్ద శిక్ష అనుభవించావో చూశావా ? నేననేది జైలుశిక్ష విషయం కాదు! జైల్లో ఉన్న కాలంలో కోల్పోయిన జీవితం గురించి ..."
ఆమె చూపులు మరల్చుకుని నేల మీదకు చూడసాగింది. తన మాటలు ఆమెకు బాధ కలిగిస్తున్నాయేమో అనిపించిందతనికి. జైలు నుండి ప్రతి ఖైదీ బైటికి వెళుతున్నప్పుడల్లా ఈ మాటల్నే చెవుతూ వచ్చాడు. కొంత మంది వినేవారు కాదు - చాలా మంది వినేవారు.
"సరే! జరిగిందేదో జరిగిపోయింది ! ఇక నుంచయినా జాగ్రత్తగా జీవితం గడుపు ! సరేనా ?"
శారదమ్మకు కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినయ్. పెదాలు వణికినయ్. ఏదో చెప్పాలని విశ్వ ప్రయత్నం చేసింది కానీ మాట పెగల్లేదు. పన్నెండు సంవత్సరాలు పెదవి విప్పలేదు. విప్పి వుంటే శిక్ష ఎందుకు పడేది ? అప్పుడు బయటపడని రహస్యం ఇప్పుడు అంతా అయిపోయాక తన నోటి నుంచి ఎందుకు బయటకొస్తుంది ? గతం తాలూకు స్మృతుల్లో ఎప్పుడో సమాధి కాబడింది.
"వెళ్ళిరా !" అన్నాడు జైలర్." ఈ క్షణం నుంచీ నువ్వు స్వేచ్చాప్రాణివి."
తన తాలూకు బట్టలమూట, మిగతా వస్తువులు తీసుకుని ఆమె జైలు గేటు దగ్గర కొచ్చింది. సెంట్రీ తలుపు తెరిచాడు. బయటికొచ్చి నాలుగడుగులు వేసి ఓ సారి వెనక్కు తిరిగి జైలు బిల్డింగ్ వంక చూసింది.
పెద్ద ప్రహరీ ఆ బిల్డింగ్ ని కనబడనీకుండా అడ్డుగా ఉంది. పధ్నాలుగేళ్ళ జీవితానికి సమాధిలా కనబడుతోందా ప్రహరీ. వెనక్కు తిరిగి రోడ్డువైపు కొద్ది అడుగులు వేసింది. ఒక్కసారిగా చెవులు గింగుర్లెత్తేలా, మళ్ళీ వెనక్కు తిరిగి జైల్లోకి పారిపోవాలనిపించేలాంటి శబ్దాలతో మెయిన్ రోడ్ కనిపించింది. కార్లూ, బస్ లూ, ఆటోలూ, స్కూటర్లూ, రిక్షాలూ, ప్రవాహంలా నడుస్తోన్న జనం.
కొద్ది క్షణాలు అలానే నిలబడిపోయి చూస్తూండిపోయిందామె.
పధ్నాలుగేళ్ళ ఒంటరితనం తాలూకు ప్రశాంతత తర్వాత హఠాత్తుగా ఇలా మళ్ళీ ప్రవాహంలో కలవాలంటే ఏదో కొత్తగా, బెరుగ్గా ఉంది. కానీ కలిసిపోక తప్పదు. ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా తన కొడుకు ...
ముందుకి నడవబోయి చప్పున నిలబడిపోయిందామె. ఎదురుగ్గా తన వేపే చూస్తూ, చిరునవ్వుతో, కళ్ళనిండా నిరీక్షణతో ఒక యువకుడు నిలబడి వున్నాడు.
శారదమ్మ అనుమానంగా, పరీక్షగా, జ్ఞాపకాల్ని తవ్వుకుంటూ చూస్తోంది. అతడు దగ్గర కొచ్చేస్తున్నాడు. నెమ్మదిగా, ఒక్కొక్క అడుగే వేస్తూ ... వాడే ! తన కొంగు పట్టుకుని, తిరుగుతూ హఠాత్తుగా మాయమైనవాడు ... ఇంత పెద్దవాడై ... ఇప్పుడు ... ముఖ్యంగా ఈ క్షణంలో ఇలా ...
శారదమ్మ పరవశించి పోయింది ! తన వెనుక నిలబడ్డ దుర్గంలాంటి జైలుని కూడా మర్చిపోయి "కృష్ణా !" అంటూ గొణిగింది. ఆనందంతో ఆమె గొంతు పూడుకుపోయింది. అతడి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని కన్నీళ్ళతో, ప్రేమతో వాత్సల్యంతో తడమసాగిందామె.
"ఎన్నాళ్ళకి చూశాన్రా నిన్ను ... ఇక్కడ ... ఇక్కడ ఎదురు చూస్తూంది నా కోసమేనట్రా ?" నమ్మలేనట్లు అడిగింది.
అవును మరి ! హత్య జరిగినరోజు మాయమై ఇన్నాళ్ళూ ఒక్కసారి కూడా జైలుకి రాని కొడుకు సరిగ్గా తను జైలునుంచి విడుదల అయ్యే సమయానికి గేటు దగ్గిర వేచి ఉండటం ... ఆశ్చర్యం కాక మరేమిటి ?
ఆ యువకుడు నవ్వి "నేనెవరిని అనుకుంటున్నావమ్మా నువ్వు ?" అని అడిగాడు.