న్యాయానికి అటూ-ఇటూ
--కొమ్మూరి వేణుగోపాలరావు
లాయర్ ప్రదీప్.
బార్ రూంలోనుండి యివతలికి వచ్చి చెట్టుక్రింద పార్క్ చేసివున్న తన కారువైపు నడుస్తున్నాడు.
"ప్రదీప్!" వెనుకనుండి ఓ కంఠం వినిపించింది.
ఆగి తలత్రిప్పి చూశాడు సీనియర్ లాయర్ ప్రతాపరావుగారు దగ్గరకు వచ్చి అభినందనగా భుజంమీద తట్టి అన్నాడు.
"కంగ్రాట్యులేషన్స్! ఆర్గ్యుమెంట్ చాలా బాగా చేశావు."
ప్రదీప్ కొద్దిగా సిగ్గుపడుతూ వినయంగా అన్నాడు. "నామీద అభిమానం తోనే అలా అంటున్నారు. మీముందు నేనెక్కడ నిలబడగలను సార్?"
"నోనో! ఈ కేసులో నాకంటే నువ్వే బాగా చేశావు. కీప్ యిట్ అప్!"
"థాంక్యూ సర్!"
బార్ లో ప్రతాపరావుగారు బాగా పేరున్న సీనియర్ లాయర్లలో ఒకరు. కేవలం సీనియర్ లాయర్ అవటమే కాకుండా నిజాయితీకీ, నైతిక ప్రవర్తనకూ కూడా ఆయనకు మంచి పేరున్నది. నలభై అయిదూ యాభయ్యేళ్ళ మధ్య వుండే ప్రతాపరావుగారు ఎప్పుడూ బిజీగా, నవ్వుముఖంతో చలాకీగా కనబడుతూ తిరుగుతారు.
ప్రదీప్ కు ఆయనంటే గౌరవమే కాకుండా, యిన్స్ఫిరేషన్ కూడా ప్రదీప్ లాయర్ ప్రొఫెషన్ లో యిప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న యువకుడు.
ప్రతాపరావుగారి దగ్గర సెలవు తీసుకుని ప్రదీప్ డిజర్ట్ మిస్ట్ కలర్ ఫియట్ కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు.
* * *
ఇంటికిపోయేముందు ఒకసారి డాక్టర్ మాలతిని కలసి పోవాలనిపించింది. ఎందుకంటే బిందును ఆమెదగ్గరకు వెళ్ళి ఎగ్జామిన్ చేయించుకోమని యీరోజు ఉదయమే చెప్పాడు. అంతేకాకుండా యీ రాత్రి ఆమెను పుట్టింటికి పంపించాల్సి వుంది. ఆమెఉ తీసుకెళ్ళటానికి మామగారు ఊరునించి వచ్చారు. డాక్టరు మాలతితో టెస్ట్ లన్నీ చేయించి కాని ఆమెను పంపించకూడదనుకున్నాడు. ఆరోగ్యం విషయంలో బిందు నిర్లక్ష్యవిషయం తెలుసుకాబట్టి కోర్టుకు వెళ్ళేముందు హాస్పిటల్ కు వెళ్ళమని మరీ మరీ హెచ్చరించి వెళ్ళాడు.
కారు డాక్టరు మాలతి నర్సింగ్ హోం ముందాగింది.
చాలా అందంగా, అధునాతనంగా కట్టబడిన నర్సింగ్ హోం గేటుదాటగానే అటూ యిటూ రకరకాల పూలమొక్కలతో కళకళలాడుతున్న చిన్నతోట. నర్సింగ్ హోం గోడమీద చాలా అందంగా పెయింటింగ్ చెయ్యబడిన తల్లి పాపకు పాలిస్తున్న రంగురంగుల చిత్రం.
బయట వరండాలోనూ, లోపల హాల్లోనూ చాలామంది స్త్రీలు కుర్చీల లోనూ, స్టీల్ బెంచీలమీదా కూర్చుని వెయిట్ చేస్తూ కనిపించారు. డాక్టర్ మాలతి బహుశా కన్సల్టేషన్ రూంలో వుండి వుంటుంది.
సిటీలో చాలా బిజీగా వుండే డాక్టర్లలో మాలతి ఒకరు.
ఆమెను డిస్టర్బ్ చెయ్యడం యిష్టంలేక ఖాళీగా వున్న ఓ కుర్చీ చూసి కూర్చున్నాడు.
సిస్టర్ నంబరువారీగా పేషెంట్లను లోపలకు పిలుస్తూ ప్రదీప్ ను చూసి నాలిక కొరుక్కుని "సారీ! ఎంతసేపయింది వొచ్చి" అని పలకరించింది.
ప్రదీప్, డాక్టరుగారు ఫామిలీ ఫ్రెండ్సని ఆమెకు తెలుసు.
"ఇంతకు ముందే తొందరేం లేదు, ఆమెను యిబ్బంది పెట్టకండి."
అతను మొహమాటానికన్నా, చెప్పకపోతే డాక్టరుగారు కోప్పడతారని తెలుసు కాబట్టి సిస్టర్ వెళ్ళి ఈ వార్త తెలియచేసింది.
రెండునిముషాల్లో లోపలనుంచి కబురొచ్చింది.
"ఏమిటి ప్రదీప్?" అంది మాలతి. వాళ్ళిద్దరికీ మధ్య "నువ్వు" అని పిలుచుకునేంతటి చనువు, సాన్నిహిత్యం వున్నాయి. ఇంటర్మీడియట్ వరకూ యిద్దరూ క్లాస్ మేట్స్ అప్పటిదాకా ప్రదీప్ ది సైన్సుగ్రూపే. మాలతికి ఎం.బి.బి.ఎస్. సీటు వచ్చింది. అతనికి రాలేదు. మొదట్నుంచీ అతని అభిలాషంతా ఉద్యోగం చేయటంపట్ల కాకుండా, ప్రొఫెషన్ మీద వుండేది. ప్రొఫెషనల్ లో వుంటే స్వంతంత్ర ఆలోచనలకూ, వాటి ఆచరణలకూ అవకాశం, ఒక సిద్దాంతం కోసం పోరాటం వుంటాయని నమ్మకం. చిన్నతనం నుంచీ డాక్టర్లన్నా, లాయర్లన్నా అతనికి చాలా గౌరవం. మెడికల్ లో సీటు రాకపోయేసరికి దారిమార్చుకుని, బి.ఏ. చదివి తర్వాత లా కి వెళ్ళాడు. డిగ్రీ వచ్చాక లాయరుగా స్థిరపడ్డాడు.
చిత్తశుద్దితో చేస్తే ఏ ప్రొఫెషన్ కయినా అనంతమైన విలువలు తీసుకురావచ్చని అతని విశ్వాసం.
"బిందు వచ్చిందా?"
"వచ్చింది."
"ఎగ్జామిన్ చేశావా?"
చేశానన్నట్టు మాలతి తలవూపింది.
"ఎలావుంది?"
"షీ యీజ్ ఆల్ రైట్! కాకపోతే కొంచెం వీక్ గా వుంది."
"ఊరికి పంపించవచ్చా?"
"వెళ్ళవచ్చు. కాని ఎందుకైనా మంచిది, త్వరగా వచ్చేయమను. యిక్కడ వుంటే వారానికోసారి చెకప్ చేస్తూ వుండవచ్చు."
"పోనీ నువ్వు పంపించడానికి వీల్లేదంటే మానేస్తాను."
మాలతి నవ్వింది. "ఆమెను తీసుకెళ్ళటానికి వాళ్ళ నాన్నగారు వచ్చారన్నావు. వాళ్ళ అమ్మగారికి సుస్తీగా వుంది కాబట్టి కూతుర్ని చూడాలనిపించి వారం పదిరోజులు అట్టేపెట్టుకుని పంపించేస్తారన్నావు ఇప్పుడు...."
"అవసరమయితే అన్నీ మానిపించేస్తాను. వాళ్ళది చాలా చిన్నవూరు. వైద్యసౌకర్యం సరిగ్గా జరగదు."
"ఫర్వాలేదు. పంపించు, యిప్పుడు అయిదో నెలేగా."
"మాలతీ! బిందును చాలా శ్రద్దగా చూడాలి నువ్వు ఎందుకంటే..." ఎంత నిగ్రహించుకుందామన్నా గొంతులోని గాద్గదికత బయటకు తెలీకుండా వుండటం చేతకాలేదు.
మాలతి అతనివంక అనునయంగా చూసింది. ఆమె తరళనయనాలు అతని బాధనర్ధం చేసుకున్నట్లు ఆర్ద్రమైనాయి.
"పెళ్ళయ్యాక అయిదు సంవత్సరాలదాకా ప్రెగ్నెన్సీ రాలేదనీ, ఆమె ప్రైమీ అనీ ఎప్పటికీ మరచిపోను ప్రదీప్."
"నీ గురించి నాకు తెలుసు మాలతీ! నా ఆదుర్దాకొద్దీ అడిగాను."
మాలతి నవ్వింది. "నువ్వు చాలా ధైర్యవంతుడివనుకున్నాను. కోర్టులో అనర్గళంగా వాదించిపారేస్తావుగా" అని ఏదో గుర్తువచ్చినట్లు "అన్నట్లు అన్నయ్యకూ నీకూ మధ్య నడిచిన కేసు ఏమయింది" అనడిగింది.
మాలతి ప్రతాపరావుగారి చెల్లెలు.
"ఇవాళే ఆర్గ్యుమెంట్స్ పూర్తయినాయి. ఇహ జడ్జిమెంట్ రావాలి."
"మీ కోర్టులంటే నాకు భయంబాబూ! ఒక్కొక్కకేసూ నెలలు, సంవత్సరాల తరబడి నడుస్తుంది. మీ లాయర్లు కూడా క్లయింట్స్ ని యిబ్బంది పెట్టేస్తూ వుంటారు. వున్నవీ లేనివీ కల్పించి...."
"మీ డాక్టర్లుమాత్రం తక్కువ తిన్నారా? పేషెంటు జబ్బుగురించి కంటే డబ్బుగురించి ఎక్కువ ఆలోచించటం లేదా? అసలీమధ్య పేపర్సులో ఎన్ని వార్తలొచ్చాయి? ఆపరేషన్ చేసినప్పుడు పేషెంట్స్ కడుపులో కత్తెరపెట్టి కుట్టేశారనీ, రోగి ఇంకా కొనవూపిరితో వుండగానే చనిపోయాడని మార్చురీలో పడేశారనీ, బ్లడ్ ఎక్కించే అవసరమున్నా పట్టించుకోకుండా చివరికి ముంచుకువచ్చి రోగిప్రాణాన్నే కాపాడలేకపోయారనీ...."
మాలతి నవ్వింది. "ప్రదీప్! కేవలం యీ పేపర్లో వచ్చే వార్తలూ, ప్రజలు అనుకోవడమే నీకు తెలుసు. ప్రతి డాక్టరులో ఎంత సంఘర్షణ వుంటుందో ఎన్నివేల ప్రాణాలు కాపాడుతూ వుంటారో మీకు తెలీదు."