Read more!
Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 1

                                 


                              సంపూర్ణ ప్రేమాయణం

                                                             __ యండమూరి వీరేంద్రనాథ్

 




                                               ఎపిలోగ్

    వేసవికాలం అవటంవల్ల రాత్రి ఏడయినా ఇంకా చీకటి పడలేదు.

    అయినా స్టేషన్ లో లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. రైలు బయల్దేరటానికి సిద్ధంగా వుంది.

    ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ దగ్గిర నిలబడి కూతురితో "అమ్మా ఆ ప్లాస్టిక్ బాస్కెట్ లో యాపిల్స్ వున్నాయి. గ్రీన్ స్ట్రిప్ లో స్వీట్స్ వున్నాయి" అన్నాడు.


    "అబ్బా! ఇది ఇరవయ్యోసారి నాన్నా ఆ విషయం చెప్పటం!" గారాబం, విసుగూ మిళితమైన స్వరంతో అంది ప్రేమ.

    ఆయన వినిపించుకోలేదు. పక్కనున్న నౌకరువైపు తిరిగి "ఒరేయ్ ఇంట్రారా!" అన్నాడు. సత్యం దగ్గిరకొచ్చి చేతులు కట్టుకొని నిలుచున్నాడు. కూతురువైపు తిరిగి, "అమ్మా! వీడు పక్క జనరల్ కంపార్ట్ మెంటులో వుంటాడు. బండి స్టేషన్ లో ఆగ్గానే వచ్చి ఈ కిటికీ దగ్గర నిలబడమని చెప్పాను, ఏం కావాల్సొచ్చిన అడుగు" అని వాడివైపు తిరిగి, "ఒరేయ్! ప్రతి స్టేషన్ లోనూ బండి ఆగగానే నువ్వు వచ్చి ఇక్కడ నిలబడు. ఇదిగో ఈ కిటికీ జ్ఞాపకం వుంచుకో!" అన్నాడు.

    సత్యం భక్తిగా తలూపాడు.

    "అదేమిటి నాన్నా! రాత్రంతా వాడిని నిద్ర పోనివ్వరా?"

    "నిద్రపోనివ్వటానికా అమ్మా, వాడిని నీతో పంపిస్తున్నది?" అన్నాడు సర్ జగపతిరావు బహద్దూర్. సర్ అన్న బిరుదు ఆయనకి బ్రిటీష్ వాళ్ళు ఇచ్చారని చెప్పుకుంటూ వుంటాడు. మరి బహద్దూర్ అన్న బిరుదు ఎవరిచ్చారో తెలీదు.

    "స్టేషన్ కి కారు పంపమని శిల్పా ఏజన్సీస్ కి, నా స్నేహితుడు రంగారావుకి, సుషైన్ మానేజింగ్ డైరెక్టర్ కీ ట్రంక్ కాల్ చేసి చెప్పాను. నువ్వు క్షేమంగా చేరుకున్నట్టు రంగారావుని ట్రంక్ కాల్ చేసి చెప్పమను. పెళ్ళవగానే వెంటనే బయల్దేరి వచ్చేయ్. టిక్కెట్టు రిజర్వ్ చెయ్యమని రంగారావుకీ, శిల్పా ఏజన్సీస్ కీ...."

    రైలు పెద్దగా కూత పెట్టింది.

    "రాత్రి తొమ్మిదింటికి భోజనం తీసుకొచ్చి ఇస్తారు. దాంతోపాటూ విటమిన్స్ టాబ్లెట్ గురించి జ్ఞాపకం చెయ్యమని ట్రైన్ అటెండర్ కి చెప్పాను. సూత కేస్ లో ఉన్నాయి టాబ్లెట్స్."

    "ఊరుకో నాన్నా! ఎవరైనా చూస్తే నేనేదో పేషెంట్ ని అనుకుంటారు." ఇబ్బందిగా కంపార్ట్ మెంట్ లోకి చూస్తూ అన్నది ప్రేమ. ఆ కంపార్ట్ మెంట్ లో ప్రేమేకాక ఇంకో ఇద్దరున్నారు. ఒకరు ముసలాయన- రిటైర్డ్ ఆఫీసర్ లా వున్నాడు. ఇంకొకరు ఎవరో అరవాయిన, పుస్తకం చదువుకుంటున్నాడు.

    "వెళ్ళగానే ఫోన్ చెయ్యటం మర్చిపోకమ్మా!"

    "అలాగే నాన్నా! అయినా ఇదే మొదటిసారి నేను ఈ ఊరు వదిలి వెళుతున్నట్టు చెప్తావేమిటి?"

    "నీకూ ఒక్కతే కూతురుంటే తెలిసేది."

    ఆయన ఈ మాటలంటున్న సమయానికి ఒక వ్యక్తి ఖాకీబట్టల్లో ఉన్నతను, ఆయన్ని దాదాపు తోసుకుంటూ కంపార్ట్ మెంట్ ఎక్కాడు. సర్ జగపతిరావు బహద్దూర్ వాడు తనని తోసినందుకు బాధపడలేదు గానీ కూతురు కూర్చున్న కేబిన్ లోకి ప్రవేశించేసరికి నుదురు చిట్లించాడు.

    వాడి జుట్టు నుదుటిమీదకీ, కొస ముక్కు నీడ పై పెదవిమీదకీ పడుతూంది. ఒక యాంగిల్ నుంచి చూస్తే తన ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడి లాగానూ, ఇంకో కోణంలో నుంచి చూస్తే తన జేబులు కొట్టే వాడిగానూ కనిపిస్తున్న ఆ వ్యక్తి, ఆ కంపార్ట్ మెంట్ లో ఎవరికోసం వచ్చాడో ఆయనకి అర్ధంకాలేదు. అయినా వాడు తన కూతురివైపు ఒకసారన్నా దృష్టి సారించకపోవటం కొంత సంతృప్తి నిచ్చింది.

    ఇంతలో రైలు మరోసారి కూతపెట్టి కదిలింది. ఆయన మరోసారి అప్పగింతలు పెట్టి ఆగిపోతూ వుండగా ఇంకో విషయం స్పురించింది. దాంతో తన స్థూలకాయాన్ని కూడా లెక్కచెయ్యకుండా పరుగెత్తుతూ, "అమ్మా! మన సత్యం ప్రతీస్టేషన్ లో వస్తాడు కదా అని కిత్కీ తలుపుతీసి పడుకోక, రాత్రిపూట చలిగాలి వస్తుంది" అన్నాడు రొప్పుతూ.

    ప్రేమకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. రెండు వేలమందిని చూపుడు వేలుతో శాసించగల ఇండస్ట్రియలిస్టు ఇలా కంపార్ట్ మెంట్ తోపాటు పరుగెత్తటం.... 'ఏ తండ్రీ తన కూతుర్ని ఇంత ప్రేమగా చూసుకోడనుకుంటాను' అనుకుంది.

    "అలాగే నాన్నా! నువ్వింక ఆగు" అంది ఆప్యాయంగా తండ్రిని చూస్తూ. ఆయన ఆగిపోయాడు. లైట్లు వెలుతురు వేలి ఉంగరాలమీదపడి తళుక్కుమంది. రైలు ఇంకా వేగం పుంజుకుని ఫ్లాట్ ఫారం దాటలేదు. ప్రేమ చెయ్యి వూపింది.

    తండ్రీ, ఆయన వెనుకే నమ్రతగా నిలబడ్డ పరివారమూ, కారు డ్రైవరూ క్రమక్రమంగా చిన్నవారుగా గోచరమవసాగేరు.

    ఇంతలో టిక్కెట్ కలెక్టర్ లోపలికి వచ్చాడు.

    ప్రేమ కళ్ళెత్తి చూసింది.

    ఆమె తల తిప్పకుండా కళ్ళుమాత్రమే అలా ఎత్తి చూస్తూంటే, ఆ భంగిమ ఎంతో అందంగా- అపురూపంగా వుంది. లేత పసుపురంగు వాయిల్ చీరకి సన్నటి నీలపు బోర్డరు ఎంతో అందాన్నిచ్చింది. మెడలో రెండు వరసల ముత్యాలదండ వుంది. కిటికీలోంచి తెరలు తెరలుగా వస్తూన్న గాలికి, తలారా స్నానం చేసి వదులుగా వేసుకున్న జడ ముంగురులు నుదుటి మీద నాట్యం చేస్తున్నాయి. అలక్ నందా నీటిస్వచ్చతకి తళతళని ఆపాదించుకున్న పాలరాయిలా వుందామె ఒక్కమాటలో చెప్పాలంటే.

    టిక్కెట్ కలెక్టర్ ఆమె దగ్గిర టిక్కెట్టు తీసుకొని, పెద్దగా పరిశీలించకుండానే అడ్డంగా రెండు గీతలు గీకేసి ఇచ్చేసి, కూలీలా కనబడుతున్న ఆ యువకుడివైపు తిరిగాడు.

    ఆ యువకుడు కూడా టిక్కెట్టు అందించాడు.

    ప్రేమకి కొద్దిగా ఆశ్చర్యం కలిగింది- అతడి వేషానికి ఫస్ట్ క్లాస్ టిక్కెట్టు కొన్నందుకు. అయినా దాని గురించి పట్టించుకోకుండా తనతోపాటు తెచ్చుకున్న పుస్తకం విప్పింది.

    ట్రైన్ అవుటర్ సిగ్నలు దాటుతూంది.

    అంతలో, "ఇది సెకండ్ క్లాస్ టిక్కెట్టు" అన్న మాటలు వినిపించటంతో ఆమె తలెత్తి చూసింది. ఆ యువకుడు నిర్లక్ష్యంగా, "అవును" అంటున్నాడు.

    "ఎక్సెస్ కట్టాలి, కడతావా?" ఏకవచనంలో అడిగాడు టిక్కెట్ కలెక్టరు.

    "డబ్బుల్లేవు."

    "మరి ఇందులో ఎలా ఎక్కావు?"

    "అక్కడ నా సీట్లో ఇంకెవరో కూర్చున్నారు" చిన్నపిల్లాడిలా అన్నాడు.

    టిక్కెట్ కలెక్టరు తన చేతిలో టిక్కెట్ వైపు పరీక్షగా చూసి, "ఇది రిజర్వేషనుదే! టూటైరు" అన్నాడు.

    "అవును. అక్కడ నా బెర్తు ఇంకెవరికో ఇచ్చెయ్యబడింది. ఒకటే నంబరున్న బెర్తు ఇద్దరికెలా ఇస్తారని అడిగితే, తనకు తెలీదన్నాడు అక్కడి టికెట్ ఎగ్జామినరు. దాంతో వచ్చి ఇక్కడ కూర్చున్నాను" అమాయకత్వం ధ్వనించింది అతడి కంఠంలో.

    టిక్కెట్ కలెక్టరు అతడివైపు విసుగ్గా చూసి-

    "అది నువ్వూ- అతనూ చూసుకోవలసిన విషయం. అక్కడ సీటు లేదని చెప్పి ఇక్కడొచ్చి కూర్చోటానికి ఇది పెళ్ళిపందిరి కాదు" అన్నాడు. వింటూన్న ముసలాయన నవ్వేడు.

    "నేను పదిహేనురోజుల క్రితం నా టిక్కెట్టు రిజర్వు చేయించాను. ఇప్పుడు వచ్చి చూస్తే నాకు బెర్తులేదు. ఇది మీ డిపార్టుమెంట్ చేతకానితనం కాదా?"

    టిక్కెట్ కలెక్టరు కోపంగా, "అలాంటిదేదైనా జరిగితే వెళ్ళి స్టేషన్ లో మాస్టరికి కంప్లెయింట్ చేసుకోవల్సింది" అన్నాడు.

    "టూటైర్ కండక్టరూ అదే అన్నాడు."

    మరి నే చెప్పలేదా అన్నట్టు చూసేడు.

    "కాని నేను దిగి స్టేషన్ మాస్టరుతో గొడవ పెట్టుకుంటే ఇక్కడ రైలు కదిలిపోతుంది కదా?"

    ఈ లాజిక్ కి మతిపోయింది. విసుగ్గా, "అవన్నీ నాకు తెలీదు. ఎక్సెస్ అన్నా కట్టు- లేకపోతే వచ్చే స్టేషన్ లో అన్నా దిగిపో" అన్నాడు.

    అతడి మాటలింకా పూర్తికాలేదు. ఆ యువకుడు చటుక్కున లేచి నిలబడి చైను లాగేడు. ఈ హఠాత్పరిణామానికి కంపార్ట్ మెంట్ లో అందరూ ఆశ్చర్యపోయారు.

    "నీకేమైనా మతిపోయిందా?" కళ్ళు పెద్దవి చేశాడు.

    ఈ లోపులో వేగం తగ్గి - రైలు ఆగసాగింది.

    "వచ్చే స్టేషన్ లో దిగితే నేను తిరిగి వెనక్కి ఎలా వెళ్తాను? ఇదేదో ఇక్కడే తేలనివ్వండి. లేకపోతే బయలుదేరిన స్టేషన్ కి వెనక్కి తీసుకెళ్తే అక్కడ రికార్డులు పరిశీలించుకోవచ్చు!" తాపీగా అన్నాడు యువకుడు.

    ప్రేమ అతడిని మొదటిసారిగా పరీక్షగా చూసింది.

    చాలా మామూలుగానే కనబడుతూ ఒక పెద్ద గొడవకి దారి తియ్యటానికి సిద్ధపడే వచ్చిన వాడిలా తాపీగా అతడు కూర్చొని వున్నాడు. ఇదేదో చిలికి చిలికి గాలివాన అయ్యేటట్టూ కనబడింది.

    ఈ లోపులో రైలు పూర్తిగా ఆగిపోయింది. మరో అయిదు నిముషాల్లో గార్డు లోపలికి వచ్చాడు. ఆయనో ముసలివాడు. రిటైరవటానికి సిద్ధంగా వున్నాడు. ముక్కుమీద కళ్ళజోడు సర్దుకుంటూ, "అబ్బాయ్! రెండొందలూ యాభై ఫైను కట్టాలి నువ్వు" అన్నాడు. 

    "ఆయనే వుంటే మంగలెందుకు తాతగారూ?" సీట్లోంచి లేవకుండా అన్నాడు ఆ యువకుడు. అప్పటికే అక్కడికి చేరుకున్న జనం నవ్వేరు.

    "ఇదిగో మిస్టర్! పోలీసుల్ని పిలిచి నిన్ను అరెస్టు చేయించాల్సి వస్తుంది!" టికెట్ కలెక్టర్ అన్నాడు.

    "నాకభ్యంతరం లేదు. కానీ అది ముందు స్టేషన్ లో జరక్కుండా ట్రైన్ వెనక్కి వెళ్ళటానికయితేనే నేనొప్పుకుంటాను."

    "లేకపోతే ఏం చేస్తావ్?"

    "చైన్ లాగుతూనే వుంటాను."

    "చేతులు వెనక్కి కట్టేస్తాం."

    "అప్పుడు పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేస్తారు."

    టికెట్ కలెక్టరు బిక్కమొహం వేశాడు. తనకా అధికారం లేనిమాట నిజమే!

    ఈ లోపులో పక్క కంపార్టుమెంట్ లోంచి కూడా జనం వచ్చి చేరుకున్నారు. అక్కడో పెద్ద గుంపు తయారైంది. రైలు పావుగంట ఆలస్యం అయింది.

    "అసలీ తప్పంతా నాది కాదు, అదుగో- అతనిది."

    కళ్ళన్నీ అటు తిరిగాయి. సెకెండ్ క్లాస్ టూ టైర్ ఎగ్జామినర్ అక్కడున్నాడు. చుట్టూ పోగయిన జనంలోంచి.

    "ఏమిటండీ గొడవంతా? ఎవడో టిక్కెట్టు లేకుండా కూర్చొంటే బైటికి ఈడ్చి పడెయ్యక" అన్నారెవరో. ఈ లోపులో టూటైర్ కండక్టర్ ని అసలేం జరిగిందని అడిగాడు గార్డు.

    "ఇతని టిక్కెట్టు మీద రిజర్వేషన్ అయినట్టూ వుంది. కానీ ఛార్టులో పేరూ, టిక్కెట్టు నెంబరూ వేరే వున్నాయి. ఆ పాసింజరుకి బెర్త్ ఎలాట్ చేశాను. అందులో తప్పేముంది?" అన్నాడు కండక్టరు.

    "తప్పేంలేదు" అని గార్డు యువకుడివేపు తిరిగి, "మిస్టర్! దిగి జనరల్ కంపార్టుమెంటులోకి వెళ్ళి కూర్చో! గొడవచేస్తే జైల్లో కూర్చోవలసి వస్తుంది. ఈ తప్పెలా జరిగిందో స్టేషన్ లో అడగాల్సింది. లేకపోతే కంప్లయింటు వ్రాసి ఇవ్వాల్సింది" అన్నాడు. 

    "ట్రైను వెనక్కి తీసుకెళ్ళండి. అలాగే వ్రాసిస్తాను. నా బెర్త్ ఎలాట్ అయిన తర్వాతే ప్రయాణం కొనసాగిద్దాం" తాపీగా అన్నాడు ఆ యువకుడు.

    "ఫస్ట్ క్లాస్ కంపార్టుమెంటు ఈజ్ నాట్ యువర్ ఫాదరిన్ లాస్ ప్రాపర్టీ టు సీట్!" కోపంగా అన్నాడు టిక్కెట్ కలెక్టరు వళ్ళు మండిపోయి.

    "ఐ యామ్ నాట్ యువర్ సనిన్ లా టు నెక్ మీ అవుట్ ఫ్రం హియర్" అన్నాడు అదే స్వరంతో. అతడంత స్వచ్చమైన ఇంగ్లీషులో మాట్లాడేసరికి ఆ రైల్వే అధికారులకి మతిపోయింది. ఈ లోపులో ఆ యువకుడు కంఠం సర్దుకున్నాడు. తనవైపే కుతూహలంతో చూస్తున్న జనంతో అన్నాడు__

    "నిజమే! నేను స్టేషన్ లోనే కంప్లయింటు ఇవ్వొచ్చు. కానీ వాళ్ళేమంటారు? 'వ్రాసి ఇవ్వండి చూద్దాం' అంటారు. ఈ లోపులో ట్రైను వెళ్ళిపోతోంది. దానివల్ల నాకు ఏమిటి లాభం? ఈ రాత్రి సుఖంగా ప్రయాణం చెయ్యటం కోసం పదిహేను రోజుల క్రితం రిజర్వేషను చేయించుకున్నాను. నన్నక్కణ్ణించి పొమ్మన్నారు. ఇప్పుడేమో వచ్చే స్టేషనులో దిగిపొమ్మంటున్నారు. ఇదే ఫస్టుక్లాస్ వాడయితే అలా చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే ఈ తరగతిలో ప్రయాణం చేసేవాళ్ళు-డబ్బున్న వాళ్ళూ- హోదా వున్నవాళ్ళూ అయివుంటారు కాబట్టి దీన్ని ఈరోజే తేల్చేయదల్చుకున్నాను. నన్ను అరెస్టు చేసుకోమనండి. మెడ పట్టుకొని గెంటమనండి. కానీ నేనిక్కణ్ణుంచి కదల్ను! ట్రైన్ కదిలినప్పుడు చైను మాత్రం లాగుతూ వుంటాను" అని బాసింపట్లు వేసుకుని కూర్చున్నాడు అతడు.

    జనంలో కలకలం రేగింది.

    "అవునితను చెప్పిందీ నిజమే!" అన్నారెవరో "ఒకరి బెర్తు ఇంకొకరికి ఎలా ఇచ్చాడు?"

    "అయినా డిపార్ట్ మెంటులో మరీ లంచగొండితనం ఎక్కువై పోతోంది. వీళ్ళకిలా బుద్ధి చెప్పాల్సిందే!"

    "రైలు వెనక్కు వెళ్ళటానికి వీలులేదు. ముందు కెళ్ళాల్సిందే!"

    గాలి ఒక్కసారిగా తమమీదికి మళ్ళేసరికి అధికారులు కంగారు పడ్డారు. గార్డు టూటైరు కండక్టర్ వైపు చూసి, "ఒకటే బెర్తు ఇద్దరికెలా ఇచ్చావయ్యా" అన్నాడు విసుగ్గా.

Next Page