ఏడవ అనువాకము
1. వషట్కారము గాయత్రి శిరమును ఛేదించినది. గాయత్రి శిరస్సు నందలి రసము రాలినది. రాలిన రసము భూమియందు ప్రవేశించినది. ప్రవేశించిన చోట ఖదిర - చండ్ర చెట్టు - ఏర్పడినది. చండ్రతో చేసిన స్రువమును ఉపయోగించినవాడు ఛందస్సుల రసముచేతనే అవదానము చేసినట్లు అగును. అతని ఆహుతులు రససహితములు అగును. కావున స్రువము చండ్ర కర్రచే చేసినది కావలెను.
2. సోమము ఈ లోకమునుండి ద్యులోకమునకు చేరినది. గాయత్రి ఆ సోమమును గుంజుకొనెను. అప్పుడు దాని ఆకు రాలినది. ఆ తెగిన ఆకు మోదుగు చెట్టు అయినది. ఆకునుంచి పుట్టినందున దానికి 'పర్ణవృక్షము' అణు పేరు కలిగినది. మోదుగుతో చేసిన జుహువుచే హోమము చేయవలెను. అందువలన ఆహుతులు సౌమ్యములగును. యజమాని సమర్పించు ఆహుతులు దేవతలకు ఇష్టమగును.
3. దేవతలు బ్రహ్మజ్ఞానమును గురించి చర్చించినారు. ఆ చర్చను పర్ణవృక్షము - మోదుగుచెట్టు - విన్నది. అందువలన ఆ చెట్టునకు 'సుశ్రువన్' అను పేరు కలిగినది.
పలాశముతో చేసిన జుహువు గల యజమాని నిందా వాక్యములను వినడు.
4. పలాశము బ్రహ్మ. మరుత్తులు వైశ్యరూపులు. అన్నము మారుతము. ఏ యజమాని జుహువు పాలాశము అగునో అతని ఉషభృత్తు అశ్వత్ధసంబంధి కావలెను. అందువలన యజమానికి జుహురూప బ్రహ్మచే విడ్రూపాన్నము లభించును. అంతేకాక బ్రాహ్మణులను వైశ్యులందు చేర్చినట్లగును.
5. పర్ణవృక్షము రాజ్యమగును. రావిచెట్టు విడ్రూప అగును. జుహువు పాలాశము, ఉపభృత్తు అశ్వత్ది అయినచో బ్రహ్మరూప రాష్ట్రమును అశ్వత్ధరూప విట్టునందు స్థాపించినట్లగును.
6. ప్రజాపతి హోమము చేసినాడు. ఆ ఆహుతులు పడినచోట వికంకత - పుల్లవెలగ - చెట్టు పుట్టినది. అతడు ఆ చెట్టునుండియే ప్రజలను సృష్టించినాడు. ఏ యజమాని యొక్క 'ధ్రువము' వికంకత సంబంధి అగునో అతని ఆహుతులు ప్రతిష్ఠితములు అగును. అతనికి నిశ్చయముగా సంతానము కలుగును.
7. ఖాదిత, పలాశ, అశ్వత్ధ, వైకంకత్వమే స్రుక్కుల రూపము. ఏ యజమాని ఈ రూప స్రుక్కులు వాడునో అతనికి సమస్త రూప పశువులు కలుగును. అతనికి విరుద్ధరూప సంతానము కలుగదు.
ఎనిమిదవ అనువాకము
1. దధిగ్రహమా! నిన్ను మట్టిపాత్రచే గ్రహించుచున్నాను. నీవు నైపుణ్యమును పెంచుదానవు. పూర్వము ప్రజాపతిచే ఇవ్వబడిన దానవు. జ్యోతిష్మంతవు. జ్యోతిష్మంతుడగు ప్రజాపతి కొరకు నిన్ను గ్రహించుచున్నాను.
దేవతలందు అగ్నియే జిహ్వగా గలవారున్నారు. ఋతమును కోరువారున్నారు. ఇంద్రుడే అధిపతిగా గలవారు ఉన్నారు. వరుణుడు రాజుగా కలవారలు ఉన్నారు. గాలి మేతరులు ఉన్నారు. పర్జన్యుడే ప్రాణముగా కలవారు ఉన్నారు. వారందరి కొరకు నిన్ను గ్రహించుచున్నాను.
దివి కొరకు నిన్ను గ్రహించుచున్నాను. అంతరిక్షము కొరకు నిన్ను గ్రహించుచున్నాను. భూలోకము కొరకు నిన్ను గ్రహించుచున్నాను.
2. ఇంద్రా 'ద్విషత్' శత్రువు యొక్క మనసును నశింపచేయుము. 'జిజ్యా సత్' శత్రువు మనసును నశింపచేయుము. 'అరాతీయత్' శత్రువు మనసును చంపుము.
(1. ద్రవ్యమును అపహరించువాడు 'ద్విషత్' 2. మరణము కోరువాడు 'జీజ్యాసత్'. దానము చేయనీయనివాడు 'అరాతీయత్'.)
3. దధిగ్రహమా! జ్యోతిష్మన్తమ్ = జ్యోతిష్మంతమైన, త్వా= నిన్ను, ప్రాణాయ= ప్రాణమునకై జుహోమి = హోమము చేయుచున్నాను.
త్వా వ్యానాయ జుహోమి.
త్వా సతే - సత్పురుషుని కొరకు జుహోమి.
అద్భ్యః జుహోమి. ఓషధీభ్యః జుహోమి, విశ్వేభ్యః భూతేభ్య జుహోమి.
ఏ ప్రజాపతి నుండి ప్రజలు దుఃఖరహితులై పుట్టినారో, ఎవడు సంపదలు ప్రసాదించువాడో, ఎవడు జ్యోతిష్మంతుడో అట్టి ప్రజాపతి కొరకు త్వా జుహోమి.
తొమ్మిదవ అనువాకము
1. అధ్వర్యుడును, యజమానియు సోమయాగమునందు ఏ దేవతకు అంతరాయము గలిగింతురో ఆ దేవతకు అపరాధము చేసినవారు అగుదురు. ఆ దోషపరిహారమునకు గాను ప్రజాపతి దేవతాకమగు దధి గ్రహమును గ్రహించవలెను. ప్రజాపతి సర్వదేవతా స్వరూపుడు అగును. అందువలన దేవతలను అందరను సంప్రీతులను చేసినట్లు అగును.
2. గ్రహములందు దధిగ్రహమునకు ప్రాముఖ్యత కలదు. కావున ఏ యజమాని కొరకు ఈ దధిగ్రహము గ్రహించబడుచున్నదో అతనికి ప్రాముఖ్యత కలుగుచున్నది.
3. ప్రజాపతి దేవతాకగ్రహము. సర్వదేవతా స్వరూపము అగును. ఏ యజమాని కొరకు ఈ గ్రహము గ్రహించబడుచున్నదో అతనికి సకల విధ పశువులు కలుగుచున్నవి.
4. 'జ్యోతిష్మన్తమ్' అని చెప్పుట వలన యజమాని సజాతీయులలో కాంతిమంతుడు అగుచున్నాడు.
5. అగ్ని జిహ్వులు మొదలగు దేవతలను గురించి చెప్పబడుట వలన దధిగ్రహమును సకల దేవతల కొరకు అందుకున్నట్లు అగుచున్నది.
6. శత్రువు మనసును చంపుటను గురించి చెప్పుటవలన శత్రువును నిర్మూలించుచున్నాను అన్నట్లు అయినది.
7. "ప్రాణాయత్వా" అని చెప్పుట వలన దధి గ్రహమును యజమాని ప్రాణాదులందు స్థాపించుకున్నట్లు అయినది.
8. ప్రజాపతి సర్వదేవతా స్వరూపుడు. అతని కొరకు దధిగ్రహమును గ్రహించుచున్నాను. అట్లని చెప్పుటవలన సకల దేవతలకు హోమము చేసినట్లయినది.
9. తేజస్సు కోరువాడు ఆజ్యగ్రహమును పట్టుకొనవలెను. ఆజ్యమే తేజస్సు. అందువలన యజమాని తేజస్వంతుడగును.
బ్రహ్మవర్చస్సు కోరువాడు సోమగ్రహమును పట్టుకొనవలెను. సోమమే బ్రహ్మవర్చస్సు. కావున యజమాని బ్రహ్మవర్చస్సు కలవాడు అగుచున్నాడు.
పశువులను కోరువాడు దధిగ్రహమును చేకొనవలెను. దధి రసస్వరూపము. పశువులు క్షీరాది రసస్వరూపలు. కావున యజమానికి క్షీరాది రసస్వరూపలగు పశువులు కలుగుచున్నవి.
పదవ అనువాకము
1. అతిగ్రాహ్య గ్రహమా! అయిదుపాత్రలందు తీసికున్న రసములన్నియు నీయందు భద్రముగా ఉన్నవి. ఋత్విజులు నీయందు క్రతువును పూర్తి చేయుచున్నారు. నీవు ఈ రుచికరమగు దానిని మరింత రుచికరముగా చేయుము. "మధు మధున్కాభియోధి" మధువును మధువుతో కలుపుము.
మధురసమా! నిన్ను మట్టిపాత్రలోనికి తీసికొనుచున్నాను. ప్రజాపతికి ప్రియమగు నిన్ను మధ్యమ పాత్రయందు ఉంచుచున్నాను. ఇది నీకు స్థానమగును. నిన్ను ప్రజాపతి కొరకు ఇచట స్థాపించుచున్నాను.
2. సోమోన్మాన - సోమమును కొలుచునట్టి - ప్రాణగ్రహములను అందుకొనవలెను. గ్రహములు ఇన్ని మాత్రమే. ఇవి స్తోమములు అగుచున్నవి. ఛందస్సులు అగుచున్నవి. పృష్ఠములు అగుచున్నవి. దిశలు మున్నగునవి కూడ అగుచున్నవి. కావున యజమానికి అవి అన్నియు లభించుచున్నవి.
3. పూర్వము బ్రాహ్మణులు ఈ ప్రాణగ్రహములను దర్శించినారు. అందువలన వారు ప్రముఖులు అయినారు. సకల దిశలను జయించినారు. కావున ఈ ప్రాణగ్రహములను చేపట్టిన యజమాని ప్రముఖుడు అగును. సకల దిశలను జయించును.
4. ఈ ప్రాణగ్రహములను అయిదు మారులు అందుకొనవలెను. పైదిక్కు సహితముగా దిశలు అయిదు కావున యజమాని సకల దిశలందు వర్థిల్లుచున్నాడు.
5. ప్రాణగ్రహములు గ్రహించినపుడు తొమ్మిది సోమాంశువులు గ్రహించినట్లగును. నరునకు నవరంద్రములందు ప్రాణముండును. కావున యజమాని యందు తొమ్మిది ప్రాణములు స్థాపించినట్లగును.
6. ప్రాయణీయాహస్సునందును, ఉదయనీయాహస్సునందును ప్రాణగ్రహములను పరిగ్రహించవలెను. ప్రాణ గ్రహములు ప్రాణరూపములే అగును. అట్లగుటచే సంవత్సర క్రతువును ప్రాణముల చేతనే ప్రారంభించి ప్రాణముల చేతనే పూర్తి చేసినట్లగును.
(సంవత్సర క్రతువున ప్రాణనీయము ప్రథమాహస్సు, ఉదయనీయము చరమాహస్సు అగును.)
7. సంవత్సరక్రతువు పన్నెండురోజులది. అందు పదవరోజున ప్రాణగ్రహములను గ్రహించవలెను. ప్రాణగ్రహములు ప్రాణములు అగును. వానికి వాయు దేవ్యసామము స్థానమగును. ఆ సామలోపము వలన ప్రాణములకు చ్యుతి ఏర్పడుచున్నది. అందువలన ప్రజలు ప్రాణములు కోల్పోవుచున్నారు. కావున పదవరోజున ప్రాణగ్రహములను గ్రహించుట వలన ప్రజలు తమ ప్రాణములను పోగొట్టుకొనరు.
పదకొండవ అనువాకము
1. ఋత్విగ్యజమానులారా! జాతవేదియగు అగ్నిదేవుని ప్రకాశమును మనసునందు నిలుపు కొనండి. వర్థిల్లచేయండి. అగ్నిదేవుడు మనలను అనుగ్రహించునుగాక. మన హవిస్సులను వహించునుగాక.
2. అగ్ని దేవతలను అభిలషించువాడు. హోమనిష్పాదకుడు. రథము వంటివాడు. యజమానులచే ఎదురేగి ఆహ్వానించబడువాడు. కిరణముల కలవాడు. అట్టి అగ్ని యజ్ఞము కొరకు ఉత్తర వేదికి కొనిపోబడు చున్నాడు.
అగ్ని స్వయముగా యజమాని యొక్క భక్తిని గ్రహించుచున్నాడు.
3. ఉత్తర వేది యొద్దకు కొనిపోబడుచున్న ఈ అగ్ని పుట్టుకతోనే అమృతము సేవించినాడు. అట్లయ్యు మరింత వర్థిల్ల కోరుచున్నాడు. అతడు జీవితములను నిలుపగల సమర్థుడగును. అట్లయ్యు మరింత సమర్థుడు అగుచున్నాడు.
4. ఆహవనీయ స్థానము గోరూపయగు 'ఇడ' పదమువంటిదియు, నాభివంటిదియు అగును. నిన్ను - హవిస్సు వహించుమని - అట్టి ఆహవనీయ స్థానమున స్థాపించుచున్నాము.
5. ఆహవనీయ స్థానము గొంగడివలె మెత్తనిది. పిట్టగూడు వలె భద్రమైనది. ఘృతవంశము. అగ్నీ! దేవతలలో ముఖ్యుడవగు నీవు ఆహవనీయమున నిలువుము. యజమాని కొరకు యజ్ఞమును చక్కగా పరిసమాప్తి చేయించుము.
6. అగ్నీ! నీవు హోమ నిష్పాదకుడవు. అభిజ్ఞుడవు. ఆహవనీయ స్థానమున ఆసీనుడవగుము. యజ్ఞమును పుణ్యకర్మకు యోగ్యమగు స్థానమున స్థాపించుము. దేవతలను అభిలషించు నీవు వారిని హవిస్సులచే యజించుము. యజమానికి మహదాయువును కలిగించుము "బృహద్యజమానే వయో ధాః".
7. అగ్ని హోత. స్థానగ్రాహి. దీప్తిమంతుడు. హవిర్దాత. కుశలుడు. హింసితము కాని కర్మయందు బుద్ధి నిలిపినవాడు. మంచి నివాసము కలిగించువాడు. వేలకొలది హవిస్సులను పోషించువాడు. పవిత్రజిహ్వుడు. అతడు హోమ నిష్పాదకమగు ఉత్తరవేదియందు స్థిరపడినాడు.
8. అగ్నీ! నీవు దేవదూతవు. మమ్ము పాలించువాడవు. కర్మ యోగ్యుడవు. విచ్చేయుము. మా యాగమును ప్రవర్తింప చేయుము. మా సంతానము వర్థిల్లవలసి ఉన్నది. అందుకు ప్రమాదము కలిగించకుము. దేవతలకు హవిస్సులు అర్పించుము. మమ్ము పాలించుటకు అప్రమత్తుడవై ఉండుము.
9. సవితాదేవా! నీవు నివారించదగిన ఆటంకములను నివారించగలవాడవు. నిన్ను చేరుటకు సంకల్పించినాము. అందుకొరకు సర్వదా రక్షకుడగు అగ్నిని ప్రార్థించుచున్నాము.
10. ద్యావాపృథ్వులు మహత్తరములు. అవి ఈ యజ్ఞమును రక్షించునుగాక. మమ్ము పూర్తిగా పోషించునుగాక.
11. అగ్నీ! అథర్వమహర్షి నిన్ను తామరాకు మీద మథించినాడు. అందువలన తామరాకు తలవలె ప్రధానము అయినది. అది సకల జగత్తులను నిర్వహించుచున్నది.
12. అథర్వపుత్రుడు దధ్యంగుడు నిన్ను ప్రజ్వలింపచేసినాడు. నీవు శత్రుహంతవు. అసురుల త్రిపురములను దహించినావు.
13. అగ్నీ! నీవు తస్కర సంహారకుడవు. యుద్ధములందు ధనమును జయించువాడవు. నిన్ను శ్రేష్ఠుడగు సాథ్య మహర్షి చక్కగా ప్రజ్వలింపచేసినాడు.
14. శత్రుహంతకుడును, సర్వయుద్ధములందు ధనంజయుడును అగు అగ్ని ఆవిర్భవించినాడు. ఈ విషయము ప్రాణులన్నియు ముచ్చటించునుగాక.
15. హవిస్సులను ఆరగించు అగ్ని - పసిపాపను చేతులందువలె - పాత్రయందు పట్టుచున్నారు. అదిగో హింసకుడగు అగ్నిని మనముందే దర్శించుచున్నాము.
16. ఋత్విజులారా! దేవతలకు హవిస్సు చేర్చువాడును, ధనజ్ఞాతయు, దీప్తిమంతుడును అగు అగ్నిని వర్థిల్లచేయండి. అగ్ని విచ్చేసి తన స్థానమును అలంకరించవలెను.
17. ఋత్విజులారా! ఇప్పుడు పుట్టిన అగ్ని గృహపాలకుడు. ఇష్టుడు. సుఖస్వరూపుడు. అతనిని పూర్వపు అగ్నియందు శయనింపచేయండి.
18. అగ్ని విద్వాంసుడు. గృహపతి. నిత్య తరుణుడు. హవ్య వాహకుడు. జుహ్వాస్యుడు. అతడు పూర్వపు అగ్నితో కలిసినాడు. మరింత మండుచున్నాడు.
19. నవాగ్నీ! నీవు విప్రుడవు. వినాశరహితుడవు. మిత్రుడవు. విప్రుడు, అవినాశ్యుడు, మిత్రుడగు పూర్వాగ్నితో కలసి ఎంతో ప్రజ్వలించుచున్నావు.
20. అగ్ని సుక్రతువు. యుద్ధనేత. యజమానుల గృహములందు అన్నము కలిగించువాడు. ఋత్విజులారా! అట్టి అగ్నిని శోధించండి.
21. యజమానులు దేవత్వమును కోరుచున్నారు. వారు నూతనాగ్నిని, పూర్వపు అగ్నిని పూజించినారు.
తానిధర్మాణి పథమాన్యాసన్ |
తేన నాకం మహిమానః సచన్తే యాత్ర పూర్వే సాధ్యాః సన్తి దేవాః ||
ఉభయ అగ్నులు కలసిన కర్మలు ప్రధానములు అయినవి. స్వర్గమునందు పూర్వయజమానులు సాధ్యఫలోపేత దేవతలై ఉంటున్నారు. అట్లే మహిమాన్వితులగు యజమానులు స్వర్గమును అనుభవించుచున్నారు.
దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును, విద్యాన్ వేంకటాచార్య వేంకటాంబల పుత్రుండును,ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య అనుజుండును, కమలానామ్ని ధర్మపత్నీ సమేతుండును, శ్రీ మద్రామాయణ, సీతాచరిత, శ్రీ మహాభారత, శ్రీ మద్భాగవత రచయితయు, "చిల్లరదేవుళ్లు" "మోదుగుపూలు" "మాయ జలతారు" "జనపదం" "రానున్నది ఏది నిజం?" "శరతల్పం" మానవత" "పావని" ఇత్యాది నవలా కారుండునయిన దాశరథి రంగాచార్య విరచిత శ్రీ మదాంధ్ర వచన కృష్ణయజుర్వేదీయ తైత్తరీయ సంహిత యందలి మూడవ కాండము సమాప్తము.
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః