Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 93


    (జననవ్యాపారము మైథునము, రతి అగును. సంరోహము శుక్ర శోణిత సంశ్లేషము. నిరోహము అవయవ అభివ్యక్తి.)

    17. ఉత్పన్న ప్రజాభిమానదేవతా! నీవు పుట్టిన వారిని నిలిపి ఉంచువాడవు. పోషణమునకు సరిపడు సిరి కలవాడవు. ఇందువలన ప్రజలు స్థిరపడినవారు అగుచున్నారు.

                                            మూడవ అనువాకము

    1. అగ్నిదేవుని చేతను, గాయత్రి, త్రివృత్ ఛందస్సుల చేతను, రథంతర సామము చేతను, వషట్కార వజ్రము చేతను పరకీయ సేనను జయించుచున్నాను. పూర్వజులగు శత్రువులను అణచివేయుచున్నాను. గొలుసులతో కట్టి వేయుచున్నాను. నశింపచేయుచున్నాను.

    నేను విష్ణుస్వరూపుడనగు యజమానిని. మమ్ము ద్వేషించువారిని, మేము ద్వేషించువారలను అందరిని నా కాళ్లక్రింద నలిపి వేయుచున్నాను.

    2. ఇంద్రుని చేతను, త్రైష్టుభ, త్రిష్టుప్ ఛందస్సులచేతను, పంచదశస్తోమము చేతను, బృహత్ సామము చేతను, వషట్కార వజ్రముచేతను, పరకీయ సేనను జయించుచున్నాను. సహజాత శత్రువులను అణచి వేయుచున్నాను. శృంఖలలచే బంధించుచున్నాను. నశింపచేయుచున్నాను.

    3. విశ్వేదేవతల చేతను, జగతీ ఛందస్సు చేతను, సప్తదశస్తోమము చేతను, వామదేవ్యసామము చేతను, వషట్కార వజ్రముచేతను పరకీయ సేనను జయించుచున్నాను. అపరజ శత్రువులను అణచివేయుచున్నాను. శృంఖలలచే బంధించుచున్నాను. నశింపచేయుచున్నాను.

    (శత్రువులు మూడు విధములవారు. 1. పూర్వజులు - వీరు తండ్రి తాతల సంబంధులు. 2. సహజాతులు - వీరు తోబుట్టుల సంబంధులు. 3. అపరజలు - వీరు పరులు - వెంటనే కార్యములు చెడగొట్టువారు.)

    4. ఇంద్రా! నీ అనుగ్రహమున మా శత్రువులు మాకు ప్రతికూలురు కానట్లుగా వధించుచున్నాము. పరసేనలను ఎదిరించి నిలుచు శక్తి గలవారమైనాము.

    అగ్నిదేవా! నీ తేజస్సున నేను తేజస్వివి అగుదునుగాక. నీ బలము వలన నేను బలవంతుడను అగుదునుగాక. నీ కాంతివలన నేను కాంతివంతుడను అగుదునుగాక.

                                        నాలుగవ అనువాకము

    1. భూమి మీద యజ్ఞహననము చేయు దేవతలున్నారు. అగ్నిదేవుడు మమ్ము వారినుండి రక్షించునుగాత. మేము యజ్ఞమును సంపూర్ణముగ అనుష్ఠింతుముగాత. యజ్ఞఫలమును పొందుదుముగాత.

    భూమి మీద యజ్ఞమును అపహరించు దేవతలు ఉన్నారు. అగ్నిర్మాతేభ్యోరక్షతు గచ్చేమ సుకృతో వయం.

    2. మిత్రావరుణులారా! మీరు శ్రేష్ఠులు. రాత్రులందు మీకు యజ్ఞభాగము సమర్పించినాము. అందువలన మాకు దివమునకు పైన వెలుగొందుచున్నదియు, యజ్ఞసంబంధియు, లోకములందు మూడవది అగు స్వర్గము లభించినది.

    3. యే దేవా యజ్ఞహనో యజ్ఞముప్కోన్తరిక్షే అధ్యాసతే వాయుర్మా తేభ్యో రక్షతు గచ్చేమసుకృతోవయం.

    ఒకటవ మంత్రమున భూమికి బదులు అంతరిక్షము, అగ్నికి బదులు వాయువు చేరినవి.

    4. సవితృదేవా! ద్యావాపృథ్వుల మధ్య నీకు సంబంధించిన రాత్రులు ఉన్నవి. అవిమాకు దేవతలను అందించునట్టివి. మేము ఆ రాత్రులందు కర్మలు చేయుచున్నాము. అందువలన గృహమున ఉన్న భృత్య, పుత్ర సహితులమై స్వర్గ సుఖములు అనుభవింతుముగాక.

    5. యే దేవా యజ్ఞహనో యజ్ఞముషో దివ్య ధ్యాసతే సూర్యో మాతేభ్యో రక్షతు గచ్చేమ సుకృతినో వయం.

    సూర్యుడు, దివి తప్ప మంత్రము 3 వంటిదే.

    6. అగ్నీ! ఉత్తమ హవిస్సును నీవు ఇంద్రునకు అందించినావు. ఆ హవిస్సుతోనే ఈ యజమానిని వర్థిల్లచేయుము. ఇతనికి తనవారిలో ఆధిక్యత కలిగించుము.

    7. మూడు లోకములందును యజ్ఞమును నాశనము చేయువారును, యజ్ఞమును అపహరించువారును అగు దేవతలు ఉంటున్నారు. అట్లే యజమాని యజ్ఞములందు ఇచ్చిన దక్షిణలను అపహరించువారు, అతని గ్రహ చమసాదులకు భంగము కలిగించువారు ఉన్నారు.

    8. "యే దేవా యజ్ఞహనః పృథివ్యా మధ్యాసతే యే అన్తరిక్షే యే దివీత్యా మహే" అను మంత్రము వలన యజమాని ఈ లోకములను దాటిపోవుచున్నాడు. గృహపశుసమేతుడై స్వర్గమునకు చేరును.

    9. సోమయాగము చేసిన యజమాని నుండి దేవతలును, యజ్ఞమును తొలగిపోవును. అందువలన యజమాని అగ్ని దేవతాకమగు పంచకపాల పురోడాశయుత ఉదవసానీయమను కర్మను నిర్వాపము చేయవలెను. అగ్ని సర్వదేవతా స్వరూపము. యజ్ఞము పంచ సంఖ్య కలది. అందువలన యజమానికి దేవతలును, యజ్ఞమును లభించుచున్నవి.

    10. అగ్ని గాయత్రీ ఛందస్సంబంధి. గాయత్రీ ఛందస్సుకల యజమాని ఉదవసానీయ కర్మను పంచకపాల పురోడాశముగా నిర్వాపము చేసినచో అగ్నిని గాయత్రీ ఛందస్సు నుండి విడదీసినవాడు అగును.

    గాయత్రీ ఛందస్సు ఎనిమిది అక్షరములది. అట్లగుటచే అష్టాకపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను. అందువలన యజమాని అగ్నితో గాయత్రీ ఛందస్సును కూర్చినవాడగును. అందువలన అతనికి సమృద్ధి కలుగును.

    11. ఉదవసానీయము నందలి హవిస్సునకు సంబంధించిన యాజ్యాను వాక్యలు పంచసంఖ్య కలవి అగుచున్నవి. యజ్ఞము 1. ధానాః 2. కరమ్భః 3. పరివాపః 4. పురోడాశః 5. పయస్యా అను పంచసంఖ్య గలది. కావున యజమాని నుండి యజ్ఞము తొలగిపోవుటలేదు.

    (సోమయాగము వలన తొలగి పోయిన దేవతలు, అగ్ని మరల చేరుటను 10, 11 మంత్రములందు వివరించినాడు.)

                                             అయిదవ అనువాకము

    1. సూర్యదేవుడు యజ్ఞవిఘాతకులగు దేవతల నుండి మమ్ము రక్షించును గాత. వాయుదేవత అంతరిక్షమున ఉన్న యజ్ఞవిఘాత దేవతల నుండి మమ్ము రక్షించును గాత. అగ్ని దేవత విరోధులగు దేవతల నుండి మమ్ము రక్షించునుగాత. సోమదేవా! సక్షః, శూషః, సవితః, విశ్వచర్షణే అను నామములచే నిన్ను సేవింతుము. సూర్య, వాయు, అగ్ని నామములతో కూడ నిన్ను సేవింతుము.

    2. యజమానినగు నేను పరభాగమునందు పాత్రను ఉంచుచున్నాను. అపరభాగమునందు పాత్రను ఉంచుచున్నాను. ఈ ఆదిత్య గ్రహపు తేజస్సుచే చీకట్లను పోగొట్టినాను. అంతరిక్షము నన్ను తండ్రి వలె పాలించునుగాత. నేను సూర్యుని ఉభయతః దర్శించినాను. నేను నా వారియందు అధికుడను అగుదునుగాక.

    3. ఆదిత్యగ్రహము సముద్రమంతటిది. ప్రజాపతి ఆదిత్యుని సాగరపర్యంతము వ్యాపింప చేయునుగాత. అంతరిక్షమందంతటను వ్యాపింపచేయునుగాత. ఇంద్రుడు ఈ గ్రహమును పొదుగువలె నిండుది చేయునుగాత. మరుత్తులు వర్షము కలిగించునుగాత.

    4. ఆదిత్యదేవా! ఈ నేలను బాగుగా తడుపుము. దివ్యమగు మేఘమును భిన్నము చేయుము. దివియందున్న జల సమృద్ధిని మాకు అందించుము. నీవు సమర్ధుడవు. మేఘము నీటి తిత్తివలె ఉన్నది. దానిని విప్పుము.

    5. ఆదిత్యుడు పశువులకు కారణమగు దేవత. అగ్ని క్రూరుడు. కావున ఓషధులను అగ్నియందుంచి ఆదిత్య గ్రహమును హోమము చేయవలెను. అందువలన క్రూరమగు అగ్నివద్దనుండి పశువులను అంతర్ధానము చేసినట్లు అగును. అంతేకాక ఓషధులందు పశువులను స్థాపించినట్లగును.

    6. ఆదిత్యగ్రహము యజ్ఞము తెలిసినది. ఎంతో ప్రకాశించుచున్నది. ద్యులోకపు పై భాగము నందలి స్వర్గమార్గమును విస్తరింపచేయునది.

    అగ్నీ! నీవు స్వర్గఫలమును ఇచ్చువాడవు. దేవదూతవు. హవ్యవాహనుడవు. హవిస్సులందుకొని ఆ స్వర్గ మార్గముననే పోవుచున్నావు.

    7. అగ్నీ! నీకు సంబంధించిన సమస్త సమిధలు జ్వలించుచున్నవి. ఆ జ్వాలలే భూలోకమందును, యజ్ఞభూమియందును, సూర్యుని యందును వెలుగులు కలిగించుచున్నవి. ఆ వెలుగులన్నియు ఘృతాహుతులందు చేరునుగాత. యజమాని దేవతలను కోరుచున్నాడు. వారు అతనికి సుఖములు ప్రసాదింతురుగాక.

    8. యూపస్తంభమా! బృహస్పతి నిన్ను ధనము కొరకు యజమానికి వప్పగించినాడు. నీవు యజమానినగు నాకొరకు అనుభవయోగ్యమును, అశ్వములతో కూడినదియు నగు ధనపుష్టిని కోరుచుండుము.

                                          ఆరవ అనువాకము

    1. యాజమానపత్నీ! నిన్ను క్షీరము, ఆజ్యము నిమిత్తము త్రాటితో కట్టుచున్నాను. ఓషధుల కొరకు, జలము కొరకు బంధించుచున్నాను. సంతానము నిమిత్తము ఈ కర్మయందు బంధించుచున్నాను. మాకు అన్నము ప్రసాదించుటకు యాజమానపత్ని దీక్ష వహించునుగాక.

    2. యాజమానపత్ని పత్నీశాలనుండి వెడలవలెను. యజ్ఞవేది యందు అధివసించవలెను.

    3. నేను యాజమానపత్నిని. యజమాని ఆనుకూల్యమును కోరుచున్నాను. నా స్థానమున కూర్చొనుచున్నాను.

    4. నేను సంతానవతిని. ధర్మపత్నిని. ఎవరిచేతను తిరస్కరించబడని దానను. అగ్నీ! నీవు శత్రునాశకుడవు. నిన్ను ఎవరును తిరస్కరింపజాలరు. నీ దగ్గర కూర్చొనుచున్నాను.

    5. మంచి జ్ఞానము గల సవితారూపమగు వరుణపాశము నన్ను బంధించినది. నేను దానిని విప్పివేయుచున్నాను. అందువలన పుణ్యఫలమగు పరమేశ్వరుని స్థానమునందు భర్తతో కూడి సుఖములు సంపాదించుచున్నాను.

    6. యాజమాన పత్నీ! శాలముఖీయ స్థానము నుండి 'వన్నేజనీ' జలము తెచ్చుటకు వెడలుము. యజ్ఞప్రేరకుడగు అగ్ని నిన్ను అనుమతించినాడు ప్రోత్సహించినాడు. భూమి నీకు దారిని ఇచ్చునుగాత. ఉపద్రవకారియగు దేవత నిన్ను విడిచినాడు. అందువలన 'యువతి' అను సార్థకనామము కలదానవు అయినావు. నేష్ఠనగు నన్ను బాధించకుము.

    7. వన్నేజని జలములారా! వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వేదేవతల కొరకు మిమ్ము అందుకొనుచున్నాము. యజ్ఞము కొరకును నిన్ను అందుకొనుచున్నాను.

    8. వన్నేజని జలములారా! వసువులు, రుద్రులు, ఆదిత్యులు, విశ్వేదేవతలు, యజ్ఞము కొరకు మిమ్ము ఉంచుచున్నాను.

    9. అగ్నీ! నీవు విశ్వాత్మకుడవు. విశ్వవంతుడవు. బలవంతుడవు. నీ అనుగ్రహమున యజ్ఞమును నిర్వహించుచున్నట్టి నేను అనేక వీర్యములను నా పత్నియందు స్థాపించుచున్నాను.

    10. ఈ యజ్ఞము దేవతలను చేరునుగాక. ప్రకాశించునట్టి జలములు ఈ యజ్ఞమును దేవతలకు స్పష్టముగా వివరించినది. యజమాని సోమాభిషవము చేసినాడు. ఆహుతులు అర్పించినాడు. వాని వలన యజమానికి సముద్రమంతటి స్వర్గఫలము లభించునుగాక.

    వాయుదేవుని ప్రేరణ వలన ఫలప్రదములగు స్తోత్రములను ఋత్విజులు ఉచ్చరించినారు.

 Previous Page Next Page