Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 95


        యస్య నిఃశ్వసితం వేదాః యోవేదేభ్య్కోఖిలం జగత్ |
        నిర్మమే తమహం వన్దే విద్యాతీర్థ మహేశ్వరమ్ ||

                                               నాలుగవ కాండము
                                              మొదటి ప్రపాఠకము
                                          మొదటి అనువాకము

    1. సవిత తొలుత మనస్సును అగ్నిచయన విషయమున లగ్నము చేసినాడు. ఇష్టకల విషయ జ్ఞానమును విస్తరింపచేసినాడు. చీయమాన అగ్నిని ఫలసహిత కర్మలను వెల్లడించు దానిగా నిశ్చయించినాడు. అట్లు నిశ్చయించి అగ్నిని భూమి మీదకు తెచ్చినాడు.

    2. ఇంద్రియములు చపలములు. అవి స్వర్గప్రాప్తికై ఉద్యమించినవి. సవిత ఇంద్రియములను ఇతర విషయములందు ప్రవర్తించకుండ నియంత్రించినాడు. వానికి ప్రేరణ కలిగించుచున్నాడు. కావున ఇంద్రియములు చయన కర్మయందు చీయమాన అగ్నిని ప్రకాశింప చేయుటకు సిద్ధమైనవి.

    3. సవితాదేవత మా మనసులను నియంత్రించుచు, ప్రేరణ కలిగించుచుండగా స్వర్గమునందు కీర్తించ బడుచున్న అగ్నిని సాధించు శక్తి కలవారము అగుదుముగాక.

    4. అగ్ని చయన కర్తకు సంబంధించిన ఋత్విజులు ముందు తమ మనసులను విషయముల నుండి మళ్లించుచున్నారు. మనసును సావధానము చేసి కొనుచున్నారు. ఇష్టకాది విషయజ్ఞానమును ఆర్జించుచున్నారు.

    ఋత్విగ్యజమానుల మనసును ఎరిగినవాడు ఒక్కడే - అతడు సవితా దేవత, వేదములందు సవితా దేవతయే గొప్పగా స్తుతించబడినాడు కదా!

    5. యజమాని దంపతులారా! అగ్నిచయనమను కర్మను పూర్వ మహర్షులు అనుష్ఠించినారు. దానిని మీ కొరకు చేయుచున్నాను. అది జరిగినంత ఆకసమున సూర్యకిరణములవలె యజమాని యశస్సు భూమిమీద వ్యాపించును. దేవతలు తమవి అగు దివ్యస్థలములందు ఉన్నారు కదా! వారు సహితము యజమాని కీర్తిని వినుచుందురు.

    6. అన్యదేవతలు సవిత మహిమలను అర్చించుచున్నారు. అతనిని అనుసరించుచున్నారు. సవిత భూమి యందలి పరమాణువులను లెక్కించి నిశ్చయించినాడు. అట్టి సవిత తన మహిమచే వ్యాపించినాడు.

    7. సవితృదేవా! మాకు సౌభాగ్యము కలుగునట్లు ఈ యజ్ఞమునకును, యజ్ఞపతికి ప్రేరణ కలిగించుము. గంధర్వులు మా మనస్సులను పావనము చేయుదురుగాక. బృహస్పతి మా వాక్కును మృదువుగా చేయునుగాక. మనసును నిలుపునుగాక.

    8. సవితృదేవా! మేము చేయుచున్న ఈ యజ్ఞము దేవయుక్తము. యజమానిని గ్రహించునది. సత్రమును గెలుచునది. ధనమును గెలుచునది. స్వర్గమును కలిగించునది. ఈ అగ్నిచయన యజ్ఞమును జరిపించుము.

    9. అగ్నీ! ఋక్కుచేత సోమమును వర్థిల్లచేయుము. గాయత్రిచే రథంతర, బృహత్ సామములను వర్థిల్లచేయుము.

    10. అభ్రీ! నాకు సవితృదేవత ప్రేరణ కలిగించుచుండగా అశ్వినుల బాహువులతోను పూషహస్తములతోను, గాయత్రి ఛందస్సుచే కూడిన వాడను అగుచు అంగిరస ఋషులవలె నిన్ను పట్టుచున్నాను. నీవు త్రవ్వుకోలవు. శత్రువులు లేని దానవు. అంగిరసుల వలె భూమి నుండి మట్టిని అగ్ని కొరకు త్రవ్వుము.

    11. అభ్రీ! నీవు త్రవ్వుగోలవు. శత్రురహితవు. నేను త్రిష్టుప్ ఛందస్సు కలవాడను అయినాను. నిన్ను అంగిరసఋషుల వలె గ్రహించుచున్నాను.

    12. అభ్రీ! నీవు త్రవ్వుగోలవు. శత్రురహితవు. నిన్ను పట్టి అగ్నికి తగిన మట్టిని త్రవ్వగలవారము అగుచున్నాము. నేను జగతీ ఛందస్సు కలవాడను అయినాను. అంగిరస ఋషులవలె నిన్ను గ్రహించుచున్నాను.

    13. సవితాదేవత బంగారు అభ్రిని చేతపట్టి పోషించినాడు. అందువలన నిత్యము ప్రకాశించు చుండుము. అగ్నికొరకు గాను మట్టి త్రవ్వి తీయుము. నేను అనుష్టుప్ ఛందస్సు కలవాడను అయినాను. 'ఆదద్కేఅంగిరస్వత్'

                                        రెండవ అనువాకము

    1. పూర్వ మహర్షులు జ్యోతిష్టోమాది యజ్ఞములు చేసినారు. అందుకు అశ్వమును తెచ్చుటకు పగ్గమును పట్టివారు. ఆ పగ్గమే యజ్ఞసమాప్తి కొరకు ఋత్విగ్యజమానులకు తోడ్పడుచున్నది. ఈ పగ్గమునే దేవతలు సోమయాగమునందు వాడినారు.

    2. అశ్వమా! నీ జన్మ ద్యులోకమున, దేహము అంతరిక్షమున, నివాసము భూమిపైన అగుచున్నవి. త్రవ్వదగిన భూమికి త్వరగా చేరుము.

    3. యజమాని దంపతులారా! మీరు యజ్ఞనిమిత్తము ధనము గలవారు. ఇది గాడిద. మిమ్ము తనకు యజమానిగా గుర్తించినది. అగ్ని కొరకు మట్టిని మోయునది. దానిని కట్టి వేయండి.

    4. మేము ఋత్విగ్యజమానులము. మిత్రులము. అశ్వము యజ్ఞమునకు తప్పనిసరి. అది బలప్రదము. మమ్ము రక్షించుమని, అన్నము కలిగించమని అశ్వమును ఆహ్వానించుచున్నాము.

    5. అశ్వమా! శత్రువులను హింసించుము. శత్రువులు కలిగించిన అపకీర్తిని తొలగించుము. రుద్రుడు పశుపతి అగును. అతని వలన మాకు సుఖములు కలిగించుము. గో సమూహములకు క్షేమము కలిగించుము. అడవి మృగముల వలన భయము లేకుండచేయుము. విశాల అంతరిక్షమును అనుసరించి సాగుము.

    6. అశ్వమా! అగ్ని కొరకని మట్టిని నేలనుండి త్రవ్వవలసి ఉన్నది. అందుకు గాను సహాయకుడగు పూషదేవతతో కూడ అంగిరసుల వలె సాగుము.

    7. అగ్నిహేతువు అగు మట్టిని తెచ్చుటకు మేము అంగిరసుల వలె సాగుచున్నాము.

    8. అగ్నిహేతువగు మట్టిని అంగిరసుల వలె సాధించగలము.

    9. అగ్నిహేతువగు మట్టిని అంగిరసుల వలె సాధించినాము.

    10. ఈ అగ్ని ఉషః కాలపు అగ్రమును క్రమక్రమముగ ప్రకాశింపచేసినది. జాతవేద అగ్ని ముఖ్యుడుగా అహస్సులను ప్రకాశింపచేసినాడు. సూర్యుని బహుళకాంతులను ప్రకాశింపచేసినాడు. ద్యావా భూములను ప్రకాశింపచేసినాడు.

    11. ఈ అశ్వము దారినపడి వచ్చినది. ప్రయాణపు అలసటను బాపుకున్నది. విస్తీర్ణమగు ఖనన ప్రదేశమును చూచినది. అగ్ని కొరకని మట్టిని తేదలచినది.

 Previous Page Next Page