Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 92


        జుష్టోవాచో భూయాసం జుష్టోవాచస్పతయే దేవీవాక్ |
        యద్వాచో మధుమత్తస్మిన్నాధాః స్వాహా సరస్వత్యై ||   

                                     అయిదవ ప్రపాఠకము

                                            మొదటి అనువాకము

    1. పూర్ణయగు పూర్ణమాసి దేవత పడమటిని గెలిచినది. యజ్ఞభూమికి తూర్పును, తూర్పు పడమరల మధ్యమును గెలిచినది. ఈ యజ్ఞము నందలి దేవతలు పూర్ణమాసి యందు అధిష్ఠించి ఉన్నారు. వారు ఉత్తమమగు స్వర్గమున మాకు ముదము కలిగింతురుగాక.

    అమావాస్య దేవతా! నీ మహిమ వలన - చక్కని నివాసములు కల దేవతలు వారి వారి హవిర్భాగములను అందుకున్నారు. ఆ కారణమున నీవు మా యజ్ఞమును పూర్తి చేయించుము. నీవు సౌభాగ్యవంతుడవు. మాకు ధనమును, వీరుడగు పుత్రుని ప్రసాదించుము.

    2. పూర్ణమాసి దేవత మాకు మంచి గృహములు సమకూర్చునది. ఆ గృహములందు మణిముక్తాదులను చేర్చునది. కోట్ల ధనములు ప్రసాదించునది. సౌభాగ్యము కలిగి మాకు బలములు కలిగించునది. ఆ దేవత విచ్చేయునుగాత.

    అగ్నిషోములారా! మీరు స్తుతి మంత్రములచే వర్థిల్లువారు. కర్మఫలమును కలిగించువారు. దేవతలందు ప్రథములు. ఈ యజ్ఞమునందు వస్తు, రుద్ర ఆదిత్యులను సంతోషపెట్టండి. పూర్ణమాసి ఉభయదిశలను, మధ్యమును గెలిచినది. ఆ దేవతలకు సంబంధించిన హవిస్సులను స్వీకరించండి. తదుపరి మాకు వీరుడగు పుత్రుని, ధనమును ప్రసాదించండి.

    3. దేవతలు, ఋషులు అగ్నులను ఆధానము చేయదలచినారు. వారిలో ఋషులు సారస్వత హోమము చేయకనే హవిస్సులను నిర్వాపము చేసినారు.

    కాని దేవతలు సారస్వత హోమములను దర్శించినారు. వారు ఆ హోమములను చేసినారు. అందువలన దేవతలు దర్శపూర్ణమాస యాగములను ఋషుల కన్న ముందు ఉపక్రమించినారు. 

    4. దర్శపూర్ణమాస యాగములను ప్రారంభించదలచినవాడు ముందు సారస్వత హోమములను చేయవలెను. అప్పుడు ఎట్టి ఆలస్యము లేకుండ దశపూర్ణమాసయాగములను ప్రారంభించినవాడగును.

    5. దర్శపూర్ణమాస యాగములు తలపెట్టినవాడు కాలపు అనులోమ, ప్రతిలోమములను తెలిసికొని ఆ యాగములను ఆరంభించవలెనని బ్రహ్మవాదులు చెప్పుచున్నారు.

    అమావాస్య తరువాత చంద్రుడు పెరుగుచున్నవాడగును. అది అనులోమము అగును. పూర్ణిమ తరువాత చంద్రుడు తరుగుచున్నవాడు అగును, అది ప్రతిలోమము.

    పూర్ణిమ తరువాత దర్శపూర్ణయాగములను ప్రారంభించినచో ప్రతిలోమకాలమున ప్రారంభించినట్లగును. అందువలన యజమాని ప్రతిలోమచంద్రుని వలె క్షీణించును.

    6. ఆరంభణీయేష్టికి ముందు సారస్వత హోమములు చేయవలెను. అమావాస్యయే సరస్వతి. కావున అనులోమకాలమునందే దర్శపూర్ణ యాగములను ప్రారంభించినట్లగును. అప్పుడు యజమాని అమావాస్య తరువాత ఎదుగుచున్న చంద్రుని వలె వర్ధిల్లును.

    7. దర్శపూర్ణమాస యాగములు ప్రారంభించుటకు ముందు అగ్నావిష్ణు దేవతాకమగు ఏకాదశ కపాల పురోడాశమున సరస్వతీ దేవతకు నిర్వాపము చేయవలెను. సరస్వద్దేవతకు ద్వాదశ కపాల పురోడాశమును నిర్వాపము చేయవలెను.

    8. అగ్నియే యజ్ఞ ముఖము. కావున పురోడాశము అగ్నిదేవతాకము కావలెను. అందువలన యజ్ఞముఖముననే హవిస్సు సమర్పించినట్లగును. అది సమృద్ధి కారకము అగును.

    విష్ణువే యజ్ఞమగును. కావున పురోడాశము విష్ణు దేవతాకము కావలెను. అప్పుడు ఆ హవిస్సు చేతనే యజ్ఞము ప్రారంభించినట్లగును. అది యజ్ఞ వ్యాప్తి అగును.

    9. సరస్వతికి చరు నిర్వాపము చేయవలెను. సరస్వద్దేవునకు ద్వాదశకపాల పురోడాశము నిర్వాపము చేయవలెను.

    అమావాస్య సరస్వతీ దేవియు, పూర్ణిమ సరస్వద్దేవుడును అగుచున్నారు. కావున వారే వ్యవధానము లేకుండ యాగమును ప్రారంభించినవారు అగుచున్నారు. అందువలన యజమానికి సమృద్ధి కలుగును.

    10. సరస్వద్దేవునకు ద్వాదశ కపాల పురోడాశము వలన యజమానికి మిథునత్వము, సంతానము కలుగుచున్నవి.

    11. అన్వారంభణేష్టి యందు మిథున గోవులను దక్షిణగా విధించ బడినది. అందువలన సమృద్ధి కలుగుచున్నది.

                                          రెండవ అనువాకము

    1. వసిష్ఠుడు మున్నగు ఋషులు మంత్ర విశేషములను తెలిసికొనదలచినారు. వారు ఇంద్రుని వద్దకు వెళ్లినారు. అక్కడ వారికి ఇంద్రుడు కనిపించలేదు. వసిష్ఠుడు మాత్రము తన దివ్య దృష్టి వలన ఇంద్రుని చూడ కలిగినాడు.

    అప్పుడు ఇంద్రుడు వసిష్ఠునితో ఇట్లు అన్నాడు :

    "మహర్షీ నిన్ను పురోహితుని చేసికొనగల ప్రజలు జన్మింతురు. నీకు మంత్రము చెప్పుచున్నాను. నీవు ఇతరులకు చెప్పరాదు"

    అట్లని ఇంద్రుడు వసిష్ఠునకు 'స్తోమ భాగ, నామక మంత్రములను చెప్పినాడు. అప్పుడు వసిష్ఠుని ప్రజలు పురోహితుని చేసికున్నారు.

    2. ఆ కారణముననే వసిష్ఠ గోత్రపు వారు సోమ యాగమున బ్రహ్మగా కార్యము నిర్వహించుచున్నారు. ప్రజకు వారే పురోహితులు అగుచున్నారు.

    3. ఆదిత్య దేవా! నీవు కిరణయుక్తుడవు. దేవతలను సంప్రీతులను చేయుటకు నిన్ను స్మరించుచున్నాను. అట్లని మంత్రము చెప్పినది.

    క్షయ శబ్దమునకు దేవతలు అని అర్థము. కావున హోత యజ్ఞమునందు దేవతలనే ఆహ్వానించినవాడు అగుచున్నాడు.

    4. ధర్మదేవతా! నీవు ప్రాణులకు ఉపకారము చేయువాడవు. ధర్మము కొరకు నిన్ను స్మరించుచున్నాను. ధర్మమును సంతోష పరచుము.

    మనుష్యులే ధర్మ శబ్ద వాచ్యులు. కావున యజ్ఞము మానవుని కొరకే చెప్పబడినది.

    5. ద్యులోకదేవతా! నీవు దేవతలకు అనుకూలుడవు. నిన్ను ద్యులోకము కొరకు స్మరించుచున్నాను. ద్యులోకమును సంతోషపరచుము. ఈ పృథివ్యంతరిక్షముల కొరకే యజ్ఞము చెప్పబడినది.

    6. వర్షదేవతా! నీవు జలము గల వాడవు వర్షము కొరకు నిన్ను స్మరించుచున్నాను. వర్షమును సంతోషపరచుము. అందువలన వర్షము కలుగుచున్నది.

    7. పగటి దేవతా! నీవు జనులను పనులందు ప్రవర్తింపచేయుచున్నావు. రాత్రి దేవతా! నీవు జనులకు నిద్ర కలిగించుచున్నావు. మీరు ఉభయులు మిథునత్వమునకు అగుచున్నారు.

    8. వసుగణపాలకా! నీవు కోరికల స్వరూపము అగుచున్నావు. నిన్ను వసువుల కొరకు స్మరించుచున్నాను. వసువులను సంప్రీతులను చేయుము.

    వసువులు ఎనిమిది మంది, రుద్రులు పదకొండు మంది. ఆదిత్యులు పన్నెండు మంది "ఏ తావన్తోవైదేవాః" దేవతలు ఇంతమందే. యజ్ఞము వారి కొరకే చెప్పబడినది.

    9. పితృపాలకదేవా! నీవు బలస్వరూపుడవు అగుచున్నావు. నిన్ను పితృదేవతల కొరకు స్మరించుచున్నాను. పితృదేవతలను సంతోష పరచుము. అందువలన దేవతలను అనుసరించి పితృదేవతలు కూడ సంతృప్తులు అగుచున్నారు.

    10. సంతానదేవతా! నీవు పుత్రపౌత్రాదులను కలిగించువాడవు అగుచున్నావు. సంతానమును సంప్రీతులను చేయుటకు నిన్ను స్మరించుచున్నాను. అందువలన పితృదేవతలను అనుసరించి సంతానము సంతృప్తమగును.

    11. పశుపాలకా! పశువులను అపహరించి వారిని ధ్వంసము చేయువాడవు. నిన్ను పశువుల కని స్మరించుచున్నాను. పశువులను సంప్రీతలను చేయుము. అందువలన ప్రజలననుసరించి పశువులు సంతృప్తలగుచున్నవి.

    12. ఓషధి పాలకదేవా! నీవు ధనవంతుడవు. నిన్ను ఓషధుల కొరకు స్మరించుచున్నాను. ఓషధులను సంతృప్తపరచుము. అందువలన ఓషధులందే పశువులను ప్రతిష్ఠించినట్లగును.

    13. వజ్రమా! నీవు అభిజిత్తువు. దృఢమగు దానవు. నిన్ను ఇంద్రుని కొరకు స్మరించుచున్నాను. ఇంద్రుని సంప్రీతుని చేయుము. ఇది సర్వత్ర జయమునకు అగుచున్నది.

    14. ప్రాణదేవతా! నీవు ప్రాణములకు అధిపతివి. ప్రాణము కొరకు నిన్ను స్మరించుచున్నాను. ప్రాణములను సంప్రీతులను చేయుము. అందువలన ప్రజల యందు ప్రాణములను స్థాపించినట్లగును.

    15. మిథునీభావమా! నీవు త్రిగుణ ప్రవర్తకుడవు. నీ వలన మిథునత్వము సిద్ధించుచున్నది.

    16. జననవ్యాపారమా! నీవు సంరోహ, నిరోహములు అగుచున్నావు. ఇందువల ప్రజోత్పత్తి జరుగును.

 Previous Page Next Page