"బావా, ఓ చిన్న సలహా."
"ఇంకేమిటి?" విస్మయంగా అడిగాడు
"నువ్వు కథలు రాయటం మొదలెట్టరాదూ."
"అదేం?" ఆశ్చర్యంగా అడిగాడు.
"నీలో క్రియేటివిటీ వుంది. బాగా కధలు రాయగలవు. ప్రయత్నిస్తే. ఈ రోజుల్లో అదో ప్రొఫెషన్ గా చేసుకుని బ్రతికెయ్యొచ్చు. అలవాటుపడితే ఆలోచనలు అలవాటు పడతాయి-నామాట విను. నువ్వు కథ రాయి."
నవ్వేశాడు రవి.
"అదంత సులభమా? అనచ్చు. కానీ కవితలు యింత బాగా రాయగలిగిన నీకు కథలు రాయటం కష్టం కాదు."
"చూద్దాం."
"ఊహూఁ చూద్దాం అంటే కుదర్దు. నేను మళ్ళీ వచ్చేసరికి నువ్వు కథరాసిపెట్టి వుండాలి! వారానికి ఓ కథరాయి చాలు, తర్వాత్తర్వాత వారానికి రెండు రాసేస్తావు నువ్వే."
అతనేం అనలేదు.
"వస్తానత్తయ్యా, వస్తా బావా" అంటూ చకచకా వెళ్ళిపోయింది సవిత.
"గడుసుపిల్ల" అంది సుబ్బమ్మగారు.
రవి మాత్రం ఫైన్ గర్ల్ అనుకున్నాడు.
7
ఆరోజు ఆదివారం. ఆ కాలనీలో ఆ చివరవున్న లెక్చరర్ గారి ఇంటికి వెళ్ళి పేపరు తెచ్చుకుని చూస్తున్నాడు రవి. సుబ్బమ్మగారు రోజూ కూరగాయలు అమ్మేసో, ఊరగాయలు పెట్టి కూరా నారా సంపాదించి పూట గడిపేస్తోంది.
ఎక్కడచూసినా నిరుద్యోగ రక్కసి ఎదురవుతోంది రవికి. తన బి.ఏ. డిగ్రీ ఎందుకూ కొరకావటం లేదనిపిస్తోంది. కాలేజీ మానేసి సంవత్సరమయింది. అప్పుడే బ్రతుకులో నిస్పృహ పుట్టుకొస్తోంది.
ఉద్యోగంలేని విశ్రాంతి, శ్రమపడని సుఖం రెండూ కూడా భరించలేనివే జీవితాన్ని బోర్ కొట్టిస్తాయి.
పేపరులో ఎక్కడచూసినా వార్తలే. వాంటెడ్ కాలమ్స్ కనిపించటం లేదు. ఉద్యోగులు పుట్టుకొచ్చినట్టుగా ఉద్యోగాలు పుట్టుకరావు.
దేశంలో అన్నిటికీ లెక్కలుననాయి. ఏటా ఎందరు డిగ్రీ పుచ్చుకుంటున్నదీ లెక్క దాఖలాయే. అందులో ఉద్యోగాల వేటలో ఎందురున్నదీ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ చేంజ్ ద్వారా తెలుస్తూనే వుంటుంది. మరి ఇంత మందికి ఉద్యోగం చూపించటం ప్రభుత్వం బాధ్యతకాదా? కనీసం ధర్మంకాదా!
ఎక్కడున్నాయి ఉద్యోగాలు?
అలా అంటే ఎలాగా? ఎమ్మెల్యేగా రెండుసార్లు ఓడిపోయినా తన కొడుక్కి స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం తెచ్చుకున్న రావుగారిని అడగాలా? బ్యాంక్ మేనేజరుగా రిటైర్ అయ్యేనాటికి తన ముగ్గురు తనయుల్ని బ్యాంకింగ్ సర్వీసుల్లో యిరికించిన రెడ్డిగారిని అడగాలా?
ఉద్యోగాలున్నట్టే లెక్క ఆ మేరకి!
కానయితే దాన్ని వేటాడే మార్గం కనుక్కోవాలి అంతే!
దేశంలో వరుళ్ళున్నారు. వధువులూ వున్నారు. ఎవరికెవరో రాసిపెట్టి వుంటుంది... మన సిద్ధాంతం ప్రకారం! కానయితే ఆ ఇద్దరికీ ముడిపెట్టటానికి అతగాడితో మూడు ముళ్ళు వేయించటానికి ఎంత శ్రమపడాలి? ఎన్ని సంబంధాలు చూడాలి? తిరిగేందుకు ఎన్ని జతల చెప్పులు అరిగిపోవాలి? ఎంత కట్నం ధారపోయాలి?
ఇదీ అంతే.
వెతకాలి! వలవేసి పట్టాలి దట్సాల్!
"నమస్తే! పేపరు చదువుతున్నారా? ఆలోచిస్తున్నారా?"
ఉలికిపడ్డాడు రవి.
ఎదురుగా రాజ్యలక్ష్మి---రాజ్యం!
తడబడ్డాడు అతను, "కూర్చోండి."
ఆమె అగ్రిమెంట్ చూపింది. ఆమె కవిత! స్వీయకవితా గానం. రేపు రేడియోలో బ్రాడ్ కాస్ట్ కాబోతోంది.
"కంగ్రాట్స్" అన్నాడు రవి. అయితే అది అరమనస్సుతోనే బయటికి వచ్చింది. తను రాసిన కవిత, ఆమె కంఠంలో వినిపించబోతోంది. తను రాశాడా? ఊహూఁ ఆమె కవితని సరిచేశాడు. నిజానికి తను సరిచేశాకే ఆ వాక్యాలకి కవితారూపం, తూకం వచ్చేసింది. అంతకు ముందు అవి ఒట్టి వాక్యాలు. తర్వాతే కవితా రేఖలు! ముందు విత్తనాలు. చినికాకే సజీవలతికలు! అదెంత గొప్పకాదు. నిజానికి అదే గొప్పేమో!
"థాంక్స్! ఈ విషయంలో గొప్పదనం అంతా మీదే! మీరే వాటిని సరిచేయకపోతే అవి ఒట్టి వాక్యాలు! తర్వాతే అవి రసాత్మకాలు అయ్యాయి" ఆమె కంఠంలో సిన్సియారిటీ ధ్వనించింది.
కృతజ్ఞతగా చూశాడు రవి! అతనికి ఆమె సిన్సియారిటీ నచ్చింది. నిజానికి ఈ రోజుల్లో ఈ మాత్రం నిజాన్ని ఒప్పుకునే వాళ్ళెందరు? ఏరుదాటాక తెప్ప తగలేసే రకం అంతా!
"బ్యాంక్ నుంచి చెక్ కూడా కేష్ అయివచ్చింది. మొదట ఎగ్రిమెంట్ వచ్చిన రోజునే నేను మీ వద్దకి వచ్చాను. అమ్మగారు చెప్పలేదా?" అడిగింది రాజ్యం.
"చెప్పారు! జామూన్ కూడా చెప్పాడు" అన్నాడు రవి.
"కొంత భయంవేసింది రికార్డింగు సమయంలో. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గారు, నాన్నగారు ధైర్యం చెప్పినా గొంతు కాస్త వణికింది. అక్కడక్కడ తడబడ్డాను. రెండు మూడు తప్పులు కూడా చదివాను. మళ్ళీ రికార్డు చేయించారు. నా గొంతు బావుందని. ఎడిషన్ కి పిలుస్తామనీ లలితగేయాలు అవీ తయారుచేసుకోమనీ ఆయన చెప్పారు!"
"మీకంఠం తరుచుగా రేడియోలో వినిపిస్తుందన్న మాట!"
"అంతా మీ ఆశీర్వాదం!" ఆరాధనగా అంది రాజ్యం. ఆమె కళ్ళు అతన్ని చూసినప్పుడల్లా మిలమిల మెరుస్తాయి--- ఎక్కడలేని ఆరాధనా భావం గుండెల్లోంచి తన్నుకొస్తూంది. అలాగే అతన్ని చూస్తూ వుండిపోవాలనిపిస్తూంది.
"నాదేముంది? మీ మాటలు -- మీ భావాలు---"
"అదేకదా గొప్పదనం---వంకరపోతున్న పొట్లకాయ రాయి వేలాడదీస్తే సరి అవుతుంది--అంతే ఏదయినా మార్గంలో పెట్టడంలోనే గొప్పదనం వుంది."
ఇంకేం అనలేదు రవి.
"మీరు అపార్ధం చేసుకోనంటే ఓ మాట చెబుతాను"
"అపార్ధం చేసుకొనేదేనా?" నవ్వాడు రవి.
"అది మీరు అర్ధం చేసుకోవటంలో వుంది."
"అయితే చెప్పకండి. ఎదురెదురుగా వున్న మనుషులకి ఒకరికి కుడి అయింది. మరొకరికి ఎడమ అవుతుంది. దృక్పధాల్లో మార్పు వస్తే అర్ధాలు మారిపోతాయి అంతే!"