నీరస పడిపోయింది రాజ్యం. తన ముందుకాళ్ళకి బంధం వేసినట్టుగా అయిపోయింది ఆమెకి
"ఇంకేమిటి కబుర్లు చెప్పండి."
తలవంచుకుంది రాజ్యం. ఆమెకి అతన్ని సూటిగా చూస్తే మనస్సు గతి తప్పుతోంది. ఈ మధ్య ఎక్కడో బజార్ లో ఎప్పుడయినా కనిపించినా గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తప్రవాహం ఎక్కువైనట్లుగా చెమట్లు పడతాయి. నెమ్మదిగా అంది "నేను కథ రాశాను! రేడియో వాళ్ళు ఏదైనా కథ పంపమన్నారు. ఇది నా తొలికథ --- మీరు దిద్దిపెట్టండి---" వాలెటీలోంచి కవరు తీసి అందించింది.
ఆమెలాగే అక్షరాలూ కుదురుగా, ముద్దుగా, అందంగా వున్నాయి. కథపేరు చూశాడు "నీతి నవనీతం!" బావుంది అన్నాడు అప్రయత్నంగా. పేరు గొప్పగా పెట్టారు అన్నాడు మళ్ళీ.
"నా ముఖం!" అంది సిగ్గుగా.
"అందుకే బావుందన్నాను!" అప్రయత్నంగా అనేసి చప్పున నాలిక కరుచుకున్నాడు రవి. మించిన చనువు తీసుకున్నట్లుగా బాధపడిపోయాడు.
చప్పున తలెత్తింది రాజ్యం. ఆమె ముఖం మతాబులా వెలిగింది. అది అతన్నుంచి ఆశించని రెస్పాన్స్.
"నాకు కవిత్వం రాయడం నేర్పండి. కథలు రాయటమూ నేర్పండి!"
"తర్వాత నవల రాస్తావా?" అనాలోచితంగా ఏకవచన ప్రయోగం వచ్చేసింది. నాలిక్కరుచుకున్నాడు మళ్ళీ.
"భయంతో మాస్టారి ముందూ, భక్తితో భగవంతుడి ముందూ, ప్రేమతో ప్రేయసి ముందూ మనుషులు తడబడతారోయ్ భగవాన్లూ!" అన్న తెలుగు మాస్టారి మాటలు గుర్తుకు వచ్చాయతనికి. ఒడలంతా పులకరించింది అప్రయత్నంగా.
"మీ దయ సరిగావుంటే---" అనేసింది రాజ్యం.
అతనేం అన్లేదు.
"నేను రెండు రోజులకో పర్యాయం వస్తుంటాను --- నాకు మెళుకువలు చెప్పండి!"
"అబ్బే!" తడబడ్డాడు రవి! "నాకేం తెలుసు?" అన్నాడు గాబరాగ.
"మీ గొప్ప మీకు తెలియదు --- మీరు రాయటం లేదు కానీ రాస్తే యీనాడు కథలు. రాసేవాళ్ళకేం తగ్గిపోరు!" అభిమానంగా అంది రాజ్యం.
రవి మాట్లాడలేదు.
"ఇదిగోండి! ఇది నా గురుదక్షిణ! కాదనక స్వీకరించండి" కవరు అందించబోయింది రాజ్యం.
పాముని చూసినట్టుగా అదిరిపడ్డాడు రవి "నో! నో! థాంక్స్! నన్నిలా డబ్బుతో అవమానించకు! నేనెంత గతిలేని వాడినయినా యిలా డబ్బుని ఊరకే స్వీకరించలేను. ఇది ఛారిటీ! నేను భరించలేను!" అతని ముఖం ఎర్రనైంది పచేమాకాశంలా.
చప్పున చేయి వెనక్కి తీసుకుంది రాజ్యం. భయపడిపోయింది ఆమె. అతనెక్కడ అపార్ధం చేసుకుంటాడో నని "క్షమించండి!" అంది. ఆ మాత్రానికే ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
రవికి ఆమెని చూడగానే అంత ఆవేశం, కోపం చప్పున జ్వరం తగ్గగానే టెంపరేచర్ తగ్గిపోయినట్టుగా తగ్గిపోయాయి.
లేచింది రాజ్యం వెళ్లొస్తానన్నట్టుగా.
తలూపాడు రవి.
"కథకోసం ఎప్పుడు రమ్మంటారు?" కారువద్దకు రాగానే అంది.
"ఎందుకు? నేనే రెండు మూడు రోజుల్లో వస్తాను!" అన్నాడు చప్పున.
ఆమె సంతోషంగా థాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది.
కారు చుట్టూ మూగిన పిల్లలు ఆమెని కొందరు జయలక్ష్మీ అంటే కాదు జయసుధ అనుకుంటున్నారు.
"సినిమా స్టారు కాకపోతే కార్లో వస్తుందా?" అనుకుంటున్నా వాళ్ళమాటలు విని నవ్వుకుని, అలాగే చెట్టు క్రిందికి నడిచాడు రవి.
అతని చేతిలో ఆమె రాసిన కథ వుంది.
8
"ఏదయినా చిన్న ఉద్యోగానికయినా ప్రయత్నం చెయ్ రవీ!"
జూలై నెల బళ్ళు తెరిచారు. వర్షాలింకా పడలేదు. వేసవి పగళ్ళూ రాత్రిళ్ళూ అనే భేదం లేకుండా ఎండల్ని, వడగాలుల్ని దంచేస్తుంది. పెరటిలో కూరగాయల చెట్లు ఎండిపోయాయి. మళ్ళీ పాదులు చేసి నాటాలి. అంతో యింతో కూరో నారో యిస్తే వచ్చే డబ్బులు కూడా రావటం లేదు.
ఓసారి రాజ్యలక్ష్మి వచ్చినపుడు యింటి ప్రస్తావన వచ్చింది. "ఇల్లు చాలా పాతబడి పోయింది! రిపెయిర్స్ చేయించకూడదా?"
నవ్వేడు రవి. "మజ్జిగకి గతిలేనమ్మ పెరుక్కి చీటి రాసిందట!"
"పోనీ ఈ యింటిలో కొంత భాగం అద్దె కివ్వరాదూ!"
"రాజ్యం! ఈ హాలూ, ఈ గది, ఆ వంటగదీ --- యీ యింట్లో ఏ భాగం అద్దెకివ్వాలి? అయినా ఎవరొస్తారు. ఈ పాత యింటికి. ఇల్లంతా చవుడు రాలుతుంది. వర్షాకాలంలో అక్కడక్కడా కురుస్తుంది! మట్టి మిద్దె అనగానే అతనికి ఆముక్త మాల్యదలోని పద్యపాదం గుర్తుకి వచ్చింది.
"ఇళ్ళకి ఎంత కరువు వుందో తెలియదా ఈ హాలూ. ముందు బదులుతో ఎవరయినా సర్దుకుంటారు. లోపలి గదులు, వంటిల్లు మీకు చాలదా?"
"మధ్యన తలుపులయినా లేవే!"
"వాళ్ళే వేయించుకుంటారు. రిపేరు చేయించుకుంటారు. అద్దెలో మినహాయించుకుంటారు. తర్వాత మీరు వీటికి మారితే వెనుక భాగమూ అలాగే తయారైపోతుంది!" అంది సలహాయిస్తూ.
నవ్వేశాడు రవి.
"పోనీ ఈ యిల్లు అమ్మెయ్యండి! మరో చోట స్థలం చవగ్గా కొని కొత్త యిల్లు రెండు రూములతో వేయించండి!"
అదెంత కష్టమో తెలియని రాజ్యం యిచ్చిన సులువైన సలహాకి నవ్వేశాడు రవి. రాజ్యం ఈమధ్య తరచుగా వస్తోంది. రోజుకో కధరాసి, గేయంరాసి పట్టుకొస్తోంది. రవికి ఒక విధమైన కాలక్షేపంలా తయారైంది.