Previous Page Next Page 
అందాల జాబిలి పేజి 8


    "రవీ! తీసుకో! లక్ష్మిలా వచ్చి యిస్తోంది. ఏ చేతిలో ఏ అదృష్టం వుందో ఎవరికి తెలుసు. అదృష్టం అనేది చెప్పకుండా వస్తుంది. వద్దంటే లక్ష్మీ అమ్మవారు వెనక్కి వెళ్ళిపోతుందేమో! పైగా ఈరోజు లక్ష్మిం వారం కూడా!" అంది సుబ్బమ్మ.
    రవి తను యిబ్బందిలో పడ్డుట్టుగా చూశాడు.
    "తీసుకో బావా!" చొరవగా అందించింది.
    అప్రయత్నంగా తీసుకున్నాడు.
    "బావా! నువ్వు ఊరకే తీసుకున్నానని తెగ బాధపడిపోకు. మన మధ్యతరగతి మనుషులకి మిగిలింది యిలాంటి సెంటిమెంట్సే! నేను రోజు కనీసం వంద టికెట్లు అయినా అమ్ముతాను. కమీషను బాగానే వస్తుందిలే! అమ్మకాలు తగ్గిన రోజున మా వదిన రెండోసారి కాఫీ యివ్వదు ----" నవ్వుతోనే అంది.
    "ఎవరింటి అమ్మాయే మీ వదిన?" అడిగింది సుబ్బమ్మ.
    "రుద్రరాజు వాళ్ళు!"
    "వాళ్ళా! వాళ్ళ వంశమే అంత తల్లీ! పిల్లికి బిచ్చంపెట్టి ఎరుగరు! పుణ్యాత్ములు! దప్పిక అయి మంచి నీల్ళు అడిగితే మండు వేసవిలో అయినా బజారు కొళాయికి పొమ్మనేరకం!"
    సవిత నవ్వింది. రవివైపు చూసి "నాకో సాయం చేసి పెడతావా బావా!" అని అడిగింది.
    "ఏమిటీ? ఏం కావాలి?" అంది సుబ్బమ్మగారు.
    "ఈ రోజుల్లో ప్రతిదీ ప్రచారంలో వుంది అత్తయ్యా! నాలుగు మాటలు కమ్మగా చెబితే కొనేస్తారు! మీ చర్మ సౌందర్యానికి వాడండి మా సబ్బు! సుప్రసిద్ధ తార మంచన సౌందర్య చిట్కా ఇదే! అంటే ఆవిడ అభిమానులంతా అవే కొనేస్తారు! అది గజ్జు సబ్బు కంటే అన్యాయంగా వుంటుంది. ఇంకొకరు మానశ్రీ అభిమాని! ఆవిడ ఫలానా హెయిరాయిల్ వాడుతుంది ఆమె వినీలకేశరాశి సౌందర్య రహస్యం ఈ ఆయిలే! ఈ ప్రకటన చూడగానే అంతదాకా తను వాడే ఆయిల్ మానేసి అది కొంటుంది... అంతే గోవిందో! గోవింద జుట్టు రాలిపోతుంది!" పకపక నవ్వింది సవిత.
    రవి కూడా నవ్వేశాడు.
    ఫక్కుమంది సుబ్బమ్మగారు! ఇదిగో పిల్లా! నీ మాటలు వింటూ వుంటే నీళ్ళూ తిండీ అక్కర్లేదే!
    "థాంక్యూ అత్తయ్యా! ఈసారివస్తే నా కబుర్లు విని నువ్వు తినటం మానేసి నాకు పెట్టేయ్!"
    "గడుగ్గాయ్!"
    "కాబట్టి బావా! నాకు కొన్ని మాటలు రాసిపెట్టు! అది విని పల్లెటూరి వాళ్ళు ఎగబడి కొనెయ్యాలి! నా బిజినెస్ అంతా పల్లెల్లోనేలే! రోజుకో ఊరు చుట్టేస్తాను."
    ఇబ్బందిగా ముఖం పెట్టాడు రవి.
    "నువ్వేం దోపిడీ చెయ్యటం లేదులే! మనిషిలోని బలహీనతని కాస్త టికిల్ చేస్తున్నావు అంతే అయినా పాలలో నీళ్ళు కలిపి అమ్మి దాచిన రూపాయీ, మొగుడికి తెలియకుండా అమ్మి దాచిన రూపాయీ, మజ్జిగ కలిపిన పెరుగు అమ్మి దాచిన రూపాయీ పెట్టి కొంటార్లే వాళ్ళు!"
    "నీ ఖాతాదార్లంతా ఆడవాళ్ళేనా!"
    "ముఖ్యంగా ముసలమ్మలు--- విధవలూ!"
    "అదేం?" ఆశ్చర్యంగా అడిగాడు రవి.
    "అదంతే! వాళ్ళకే ఆశ ఎక్కువ! దాచిపెట్టి పోవాలని తాపత్రయ పడతారు!"
    "రేపటికి రాసిస్తే సరిపోతుందా?"
    "ఇదిగో బావా! నేను ఉండేది టౌన్ కి ఆ చివర్లో --- నువ్వుండేది ఈ ద్వీపంలో--- రోజూ వెళ్ళివస్తున్నారో ఈ జనం --- సిటీ బస్సు వేయమని అడక్కూడదూ?"
    నవ్వాడు రవి ఏమీ అనలేక.
    "రిక్షా వాడిని అడిగితే మూడు రూపాయలు అడిగేడు --- వెధవా రేపు హర్యానా లాటరీ డ్రా వుందిరా! ఈ టికెట్టు తీసుకో --- మూడు రూపాయలేం ఖర్మ --- అదృష్టం వుంటే వేలకి వేలు వస్తాయి! అన్నాను. టక్కున తీసుకుని యింత ఎక్కుడూ చెమట్లు కక్కుకుంటూ ఆ మిట్ట మీదికి తెచ్చి విడిచాడు. ఆశ బావా ఆశయ"
    "అది దోపిడీ కాదూ!"
    "అది దోపిడీనా?" తెల్లబోయింది సవిత, "నేనేం వాడి జేబు కొట్టేనా? రిక్షాలో సీటుక్రింద దాచుకున్న డబ్బు ఎత్తుకొచ్చానా? అది నా బిజినెస్. బిజినెస్ అంటే సర్వకాల సర్వావస్థల్లో ఎలర్టుగా వుండాలి. వీలయినప్పుడల్లా వ్యాపారం చేయాలి. అంతే; ఇదిగో బావా ఈ రిక్షావాళ్ళకి తను బతుకులమీద తమకే ఏవగింపు. దాన్నుంచి బయటపడాలనే రోజూ బ్రాకెట్ ఆడతారు, లాటరీ టికెట్లు కొంటారు. అంతే! నేను కాకపోతే యింకొకరు అమ్ముకునేవారు వాడికి."
    "సరే యిప్పుడే రాసివ్వాలా"
    "ఆహాఁ నీకేం కంప్యూటర్ లాంటి వాడివి. పెన్ తెరిస్తే పదాలు ప్రవాహంలాగా వస్తాయిటకదూ. నీలో కుదురుగా కూర్చుని రాయని లోపం తప్ప కవితలో లోపం వుండదని కదూ. అన్నీ అత్తయ్య చెప్పిందిలే."
    తల్లివేపు చూశాడు రవి.
    ఆమె నవ్వుతోంది.
    "ఇదిగో బావా. యింత స్లో అయితే లాభంలేదు. ఈ రోజుల్లో ప్రతిదీ ప్రొఫెషన్ అయిపోయింది. నీ కవిత్వంకూడా వృత్తే. విజృంభించి విశృంఖలంగా కవితలు రాసి పత్రికలకి పంపరాదూ."
    నవ్వేశాడు రవి.
    "సరి! సరి! యిలాగే మాటాడుతూ వుంటాను నేను. నువ్వు రాసివ్వు నేను వెళ్ళిపోవాలి."
    ఇబ్బందిగా చూశాడు రవి.
    "మనం లోపలికి వెళదాం పదత్తా. పెరట్లో మొక్కలకి నీళ్ళు తోడిపెడతాను. నాకు పెరటితోట అంటే చాలా యిష్టం. తాజా కూరగాయలు తినాలీ ఆశ. అయితేనేం మేం యిన్ని ఊళ్ళు మారేం. ఎక్కడ చూసినా యిరుకు కొంపలే, అగ్గిపెట్టల్లాటి గదులు, మునిసిపాలిటీవారిది అంగుళం స్థలం దొరికినా ఆక్రమించుకునే మనుషులు."
    ఇద్దరూ లోపలికి వెళ్ళేరు.
    "ఇహ తప్పదు. ఈ అమ్మాయి తనలో కవిత్వం పిండేస్తుంది. మరికొద్దిసేపు ఆగితే, ఈ వాగ్ధోరిణికే టికెట్లు కొనేస్తూ వుంటారు" అనుకున్నాడు.
    పేపరు, పెన్ను తీసుకుని తన మంచంపై కూర్చున్నాడు.
    అరగంట తర్వాత వచ్చింది రవి వద్దకి. సవిత ముఖం నిండా స్వేదబిందువులు నిండు ఆరోగ్యం వున్న మనిషి కుళ్ళూ, కల్మషం బొత్తిగా ఎరుగని వ్యక్తిత్వం అనిపించింది అతనికి.
    పేపర్ అందించాడు.
    చకచకా చదివేసింది. "అద్భుతం" అంది పొగడుతోన్నట్టుగా చూసింది.
    "థాంక్స్."

 Previous Page Next Page