Previous Page Next Page 
అనుభవాల అలలలో పేజి 9

    ఆ వీధిలోకి ఎప్పుడూ చిన్నకారు వచ్చిన పాపాన పోలేదు. పైగా అతిసామాన్యుడైన రమాకాంతంగారి యింటిముందు ఏనాడూ స్కూటర్ కూడా ఆగి ఎరుగదు. అలాంటిది ఎండలో తళ తళా మెరిసిపోతూ రాజవాహనం లాంటి ఫారెన్ కారు ఆగటంతో పిల్లలు ఎండను కూడా లెక్కచేయక దానిచుట్టూ మూగారు. ఆ కారు ఓనర్ తనే అయినట్లు డ్రైవర్ ఫోజు కొట్టి పిల్లలడిగిన ప్రశ్నలకి సమాధానం కొంటెగా యిస్తున్నాడు.
   
    రమాకాంతంగారి భార్య మరో యిరువురు ముత్తయిదువులు లలితాదేవికి ఎదురువచ్చి పలకరించారు.
   
    పల్లెటూరి ఆచారం ఎలాంటివారు ప్రయాణం అయి వచ్చినా ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు యిస్తారు తర్వాత మజ్జిగో__చల్లని మంచితీర్ధమో యిచ్చి కుశల ప్రశ్నలు వేస్తారు.
   
    అతని కాళ్ళకి నల్లగా నిగనిగ లాడుతున్న బూట్లు వున్నాయి. ఆమె కాళ్ళకీ మెత్తని స్లిప్పర్స్ వున్నాయి. వాటిమీద రవ్వంత ధూళికూడా లేదు. కాళ్ళు కడుక్కోమని నీళ్ళు యిస్తే అతను బూట్లు విప్పుతాడో చిరాకు పడతాడో. "కాళ్ళు కడుక్కోండి" అనటానికి శారదాంబ తికమక పడుతుండగానే అతను బూట్లు విప్పాడు.
   
    "చెంబుతో నీళ్ళు యివ్వు" అనగానే శారదాంబ ముందుకువచ్చి నీళ్ళు అందించింది. "ముందుగా చల్లని మంచినీళ్ళు యివ్వు" రమాకాంతంగారే తిరిగి హెచ్చరించటంతో ఆమె కంగారు కాస్త తగ్గింది.
   
    కిటికీలోంచి కర్టెన్ చాటునుంచి తొంగిచూసిన స్నేహితురాళ్ళు కోమలాదేవి గదిలో దూరారు.
   
    "ఏయ్ కోమల్! కాబోయే నీ శ్రీవారు రంభలా వున్నారు" ఓ స్నేహితురాలంది.
   
    "మొగవాళ్ళని రంభ-మేనకలతో పోల్చరే కొంబు చెంబు మొహమా! మన్మధుడిలా వున్నాడు అనాలి" స్నేహితురాలిని గదమాయించిన ఎత్తుపళ్ళ పార్వతి ఇటు తిరిగి "కోమల్! నువ్వు చాలా అదృష్టవంతురాలివే...అతనెంత బాగున్నాడో తెలుసా! చెయ్యెత్తు మనిషి నిండుగా గంభీర్యంగా కోటేరులాంటి ముక్కు, విశాలమయిన నుదురు వత్తైన నొక్కుల క్రాపు, సన్నటి మీసం, దొంగనవ్వు నవ్వే బిగించిన పెదాలు..."
   
    "బాబోయ్ ఆపవే! నీ వర్ణన వింటుంటే నాకు మతిపోతున్నది. అతగాడు మన కోమల్ కి కాబోయే మొగుడు. మన వర్ణనకి మెచ్చుకుని మురిసిపోవాల్సిందిపోయి అది చూడు ఎలా కోపంగా చూస్తుందో!"
   
    కోమలా దేవి చిరుకోపంతో స్నేహితురాలి నెత్తిన మొట్టింది.
   
    "అతను కోమల్ కి భర్త. వాళ్ళ అత్తగారు వప్పుకుంటే నేను వాళ్ళ అత్తగారిని పెళ్ళాడతాను...ఆమె వంటి మీద జరీబూటాలున్న పట్టుచీర, వళ్ళంతా రాళ్ళనగలు ధగ్ ధగ్ అంటూ మెరిసిపోతున్నాయి" స్నేహితురాలి కళ్ళు తళ తళ లాడటం చూసి "ఏం సోద్యమే తల్లీ! ఎవరైనా కాబోయే భర్తను చూసుకుంటారు. అత్తగారి నగలూ, చీరలు చూసి ఆమెనే పెళ్ళాడతానన్నారు. కొంపదీసి నగలున్న ఆడదాన్ని పెళ్ళాడవు కదా" పళ్లెత్తు పార్వతి అంది.
   
    స్నేహితురాళ్ళ మాటలు వింటూ నవ్వుకుంది కోమలాదేవి.
   
    మగపెళ్ళివారితో మాట్లాడుతున్న రమాకాంతంగారు ఇదికలా వైష్ణవమాయో అన్న భ్రమలోంచి ఇంకా తేరుకోలేదు. శారదాంబ పరిస్థితి అందుకు భిన్నంగా లేదు.
   
    రమాకాంతంగారిది పల్లెటూరు. అయినా చాదస్తుడు కాదు. వరుసగా ఆరుగురు ఆడసంతానం కలిగారు. మగేమిటి ఆడేమిటి అన్నట్లు పిల్లలని చక్కగా పెంచారు వుండటానికి లంకంత పెంకుటికొంప, నాలుగెకరాల భూమి వున్నాయి. పెద్దమ్మాయిల పెళ్ళి చేయటంతో ఒక ఎకరం భూమి తరిగింది పెళ్ళి చేయగలిగింది ఇద్దరమ్మాయిలకి. కోమల్ తో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు. వీళ్ళ పెళ్ళిళ్ళకి వున్న భూమి, వుండే ఇల్లుపోతే పెద్దవాళ్ళు కట్టుగుడ్డలతో మిగలాల్సిందే. రోజురోజుకీ పెరుగుతున్న కట్నాల పిశాచం భయపెట్టడం తప్ప మార్గం కనిపించలేదు.

 Previous Page Next Page