Previous Page Next Page 
అనుభవాల అలలలో పేజి 8

    "దేవీ! యీ...యీ...యీ...!" ఆమె పరిసరాలు దద్దరిల్లేటట్లు అరిచి విరుచుకు పడిపోయింది.
   
    అతను కన్ను మూసి తెరిచేలోగా ఆమెను క్రింద పడకుండా పట్టుకున్నాడు. వెంటనే మోకాలు నేలకాన్చి వడిలోకి తీసుకున్నాడామెను.
   
    అక్కడున్న అందరూ వీళ్ళ చుట్టూ మూగారు.
   
    ఎవరో పరుగున పోయి గ్లాసుతో నీళ్ళు తెచ్చి అతనికిచ్చారు.
   
    అతనికి అర్ధమయినట్లే అయింది. మనసు చిక్కపట్టుకున్నాడు. కంపిస్తున్న పెదవిపై పై పన్ను నొక్కిపెట్టాడు. బరువెక్కిన హృదయంతో కన్నీటి పొరలలోంచి మసకగా కానవస్తుంటే చేతిలోకి నీటిని తీసుకుని ఆమె ముఖం మీదకి చిలకరించాడు.
   
    అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.
   
    ఆమెలో చలనం వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది.
   
                                                3
   
    సాయంత్రం నాలుగు గంటలయింది...
   
    మండు టెండకాలం కావటంవలన బయట ఎండతీక్షణత తగ్గలేదు.
   
    లైట్ గ్రీన్ కలర్ పడవంత చిన్నకారు వచ్చి రమాకాంతంగారి పెంకుటింటి ముందు ఆగింది.
   
    బొయ్యిమని హారను మ్రోగించాడు డ్రయివర్.
   
    అంతక్రితం వరకూ ఆదుర్దాగా వాకిట్లోకీ, ఇంట్లోకీ తిరుగుతున్న రమాకాంతంగారు పెళ్ళివారు వస్తారో రారో అనినిరాశగా ఈజీచైర్ లో కూలబడ్డారు. హారన్ శబ్దం సంగీతంలా వినిపించి ఒక్క పరుగున లేచి వాకిట్లోకి పరుగున వచ్చారు. ఆయనకసలే గాభరా ఎక్కువ. నానా కంగారు పడుతూ "రండి రండి...ప్రయాణం కులాసాగా జరిగిందా? ఎండ నిప్పుకన్నా వేడిగా వుంది. వర్జం ఉండబట్టి అయిదు లోపల పెళ్ళిచూపులు ఏర్పాటు చేయడం జరిగింది. మూడు దాటంగానే వస్తానన్నారని అప్పటినుంచీ..." మాట్లాడుతూనే ఉన్నాడు.
   
    ముందుగా డ్రయివర్ దిగి డోర్ తెరిచాడు.
   
    క్రీమ్ కలర్ సూటులో అందంగా, హుందాగా వున్న అజయ్ చందర్ ముందుగా దిగాడు. నుదుటి మీద పడ్డ కర్లింగ్ హెయిర్ పాయని ఎడం చేతితో సుతారంగా పైకి నెట్టి సరిచేసుకున్నాడు. ఆ చేతి వేలికున్న రవ్వల ఉంగరం మీద ఎండపడి కాంతులు విరజిమ్మింది.
   
    రాజ్యం పోయినా రాజఠీవీ తగ్గనట్లు, జమీందారీ రోజులు పోయాయి. రాజ భరణాలు రద్దయ్యాయి. అయినా గత కాలవైభవ చిహ్నంగా వున్న లలితాదేవి కారులోంచి కాలు మృదువుగా నేలకాన్చింది.
   
    అరవయ్యో పడిలో వున్న లలితాదేవి గతంలో రూపసి అని చూడంగానే తెలుస్తున్నది. పసిమిఛాయతో వజ్రాల చెవికమ్మలు తళుక్కుమంటుంటే శరీరఛాయతో పోటీ పడుతున్న ఆభరణాలు నిండుగా, గంభీరంగా ఉంది. పట్టుచీర కొంగుని తలమీద సగం మేలిముసుగుతో కప్పిముందుకు లాక్కుంది. ఊలుతో అల్లిన షాల్ చేతిమీద ఉంది. చెదరని చిరునవ్వు ఆమెని అంటిపెట్టుకొని ఉంది. ఇన్నీ వున్న లలితాదేవి కళ్ళకింద నీలినీడలు సింధూరానికి దూరమైన నుదురు ఎంతటి వారాలకైనా రాత తప్పదు అన్నట్లు వుంది.
   
    లలితాదేవి అజయ్ చందర్ రమాకాంతంగారి వెనుకనే నడిచి ఇంట్లో అడుగుపెట్టారు.
   
    రెండురకాల స్వీట్స్ ప్యాకెట్స్, పళ్ళు, పూలుచిన్న బుట్టతో సహా వారి వెనుకనే మోసుకువచ్చిన డ్రైవర్ నడవాలో వుంచి బయటికెళ్ళాడు.

 Previous Page Next Page