Previous Page Next Page 
అనుభవాల అలలలో పేజి 10

    పక్క వూరికి పిల్లలతో నడిచివెళ్ళి ఎస్. ఎల్. సీ దాకా చదివింది కోమలాదేవి ఫస్టుక్లాసులో పాస్ అయింది. బుగ్గలు చిదిపి దీపం పెట్టే అందం తన కూతురుదయినా ఘనంగా కట్నం లేంది పెళ్ళాడుతామని ఎవరూ ముందుకు రాలేదు. అయిదు పది ఇరవైలవేల కట్నాలరేటు నిలిచింది. అతి సామాన్యుడు కిందే లెక్కయినా రమాకాంతంగారు ఇరవైవేలు కట్నం పోయలేరు. పెళ్ళి చేయలేని పరిస్థితి ఇంకా చదువుతానన్న కోమల్ పట్టుదలతో పట్నంలో హాస్టల్లో వుంచి బి.ఏ. చదివించారు. బి. ఏ కూడా ఫస్టున పాస్ అయింది. ఇంక ముందు కార్యక్రమం ఏమిటి అనుకుంటూ వుండగా చల్లనికబురు అందింది...ఫలానా వాళ్ళకి మీ పిల్ల అందచందాలు నచ్చాయి పెళ్ళి చూపుల కొస్తారు. అని.
   
    కోమల్ కి సంబంధాలు చూస్తున్న రమాకాంతంగారు మధ్యవర్తి కబురువిని పెళ్ళివారిని ఆహ్వానించటానికి వాళ్ళింటికి ఆయనతో వెళ్ళారు.
   
    రాజకోటలాంటి పెద్ద మేడ, నౌకర్లు, దాసీలు అణువణువునా సిరిసంపదలు వుట్టిపడుతూ గతకాలపు వైభోగం గొప్పగా కళ్ళు తిరిగిపోయింది. రమాకాంతంగారు గుమ్మంలోనే వెనుతిరిగారు. "వీళ్ళతో మనమేం తాగగలం..." అంటూ... "చాల్ చాల్లేవయ్యా! వీళ్ళు డబ్బు మనుషులు కాదు. కారులో ఎక్కడికో వెళుతూ వీళ్ళు మనమ్మాయిని చూశారు అమ్మాయి అందానికి మోజు పడ్డారు. మన స్థితిగతులు మనం ముందే చెబుదాం ఆపై వాళ్ళిష్టం. ఎవరదృష్టం ఎలా రాశిపెట్టివుందో!" అంటూ లోపలికి లాక్కువెళ్ళాడు మధ్యవర్తి.
   
    రమాకాంతంగారికి ఆ యింట్లో మర్యాద జరిగింది. పెళ్ళి కూతురిని చూడడానికి ఫలానా రోజున వస్తామని వాళ్ళే చెప్పారు. చెప్పిన విధంగా అక్షరాలా అన్న టైముకి వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు ఇప్పటి దాకా రమాకాంతంగారిలో కంగారు మాత్రం తగ్గలేదు.
   
    కాఫీ ఫలహారాలయింతరువాత కోమలాదేవిని తీసుకువచ్చి కూర్చో బెట్టారు.
   
    పెళ్ళికూతురిని చూస్తూనే లలితాదేవికళ్ళు తృప్తితో తళ తళలాడాయి. "ఇలాంటిపిల్లే తన కోడలుకావాలి కాదు కాదు ఈ పిల్లే తన కోడలు" అనుకుంది.
   
    అజయ్ చందర్ ముఖం గంభీరంగా మారింది.
   
    కోమలాదేవి స్నేహితురాళ్ళకి యిదేం నచ్చలేదు. ఆ అబ్బాయి అలా ముఖం గంటుపెట్టుకు కూర్చున్నాడేమిటి? కోమల్ ని చూసి తబ్బిబ్బు కానక్కరలేదా....! అనుకున్నారు.
   
    లలితాదేవి తన ఆమోదం తెలిపింది.
   
    రమాకాంత్ గారికి ఇది కలో వైష్ణవ మాయయో అర్ధంకాలేదు. అదే పనిగా చేతులు నులుముకుంటూ "నా స్తితి గతులు..." అంటూ ఏదో చెప్పబోయారు.
   
    "అన్నయ్యగారూ....మీరేం చెప్పొద్దు. మాయింటికి రావల్సింది మహాలక్ష్మీ. మీ అమ్మాయి మహా లక్ష్మిలా వుంది. కానుకలు కట్నము కోరటంలేదు. కన్యాదానం చేయండి చాలు" అంది లలితాదేవి.
   
    "అబ్బాయిగారి అభిప్రాయం..." చెప్పలేదన్నట్లు ముఖం పెట్టి నసిగారు మా కాంతంగారు.
   
    "నా అభిప్రాయం మా అమ్మగారి అభిప్రాయం ఒకటే కాకపోతే చిన్న..." అర్ధోక్తిగా ఆగిపోయాడు అజయ్.
   
    "చెప్పండి" ఏ చిన్నకారో అడగడుకదా అన్న అనుమానం గుండెలో పీచుపీచు మంటుంటే నెమ్మదిగా అడిగారు రమాకాంతం.

 Previous Page Next Page