మరో పదినిమిషాలకి ఓ స్టేషనులో బయలుదేరింది ట్రైన్. ప్లాట్ ఫామ్ చివరదాటుతూ వుండగా ట్రైన్ లోంచి దబ్ మంటూ దూకి బ్రీఫ్ కేసుతో సహా పరుగుతీసింది ఆమె.
వాళ్ళు తెలుసుకునేసరికి ట్రైన్ వేగం పుంజుకుని ప్లాట్ ఫామ్ వదిలి స్పీడందుకుంది. అయినా వాళ్ళిద్దరూ మామూలు రౌడీలులాగా లేరు. అన్నింటికీ తెగించివాళ్ళు లాగా వున్నారు. ట్రైన్ లోంచి వాళ్ళూ దూకారు.
ముందుకు పరుగు తీస్తూనే ఆమె వెనుదిరిగి చూసింది. వాళ్ళిద్దరూ వేగంగా దూసుకొస్తున్నారు యిటే. అందుట్లో ఒకడి కాలు కొద్దిగా స్లిప్పయి వుంటుంది. కాలు ఈడుస్తూనే పరిగెత్తుకు వస్తున్నాడు.
నందితాదేవి గేటు దగ్గరవున్న టికెట్ కలెక్టర్ వద్ద ఆగదల్చుకోలేదు. "వెనుక హంతకులు తరుముకు వస్తున్నారు వాళ్ళని ఆపండి." అరిచినట్లే చెప్పి టేసీని తోసుకుంటూ గేటులోంచి బయటికి పరుగుతీసింది. వాళ్ళని కాసేపు ఆపితే తను చాలా దూరం పారిపోవచ్చు అదీ అయిడియా.
టీసీ పడబోయి నిలదొక్కుకున్నాడు. తోసినవాడి వెంట పరిగెత్తటం అసాధ్యం. అసలే లావు దానికితోడు ఫుల్ లోడ్ లో వున్న బానంత పొట్ట. వెనుక పరుగెత్తుకుంటూ వస్తున్న వాళ్ళని ఆపదల్చుకుని గేటుకి చెయ్యి అడ్డంపెట్టి నిలబడ్డాడు.
"బతకాలని లేదురా బే"
"బట్ట కట్టాలని లేదురా బే. దాన్ని వదిలేసి మమ్మల్ని ఆపుతావు!"
ఇరువురూ అని చెరో రెక్కాపట్టి టీ.సీ. ని పక్కకి గుంజిపారేసి బయటికి పరుగుతీశారు.
"బాప్ రే" అనుకుంటూ టి.సి. నోరు తెరుచుకునుండి పోయాడు.
నందితాదేవి వెనుకపడ్డారు వాళ్ళు.
5
ట్రైను బైలుదేరేముందు బిలబిలలాడుతూ ఒక ఇన్ స్పెక్టర్, ఇద్దరు పోలీసులు, మరో ఇద్దరు లేడీ పోలీసులు, కంపార్ట్ మెంటులో జొరపడ్డాడు.
ట్రైన్ బైలుదేరింది.
ఇన్ స్పెక్టర్ రివాల్వర్ తీశాడు. "ఎవరూ ఎదురు తిరిగి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యవద్దు. పారిపోవాలని ప్రయత్నిస్తే ప్రాణం పోతుంది జాగ్రత్త" హెచ్చరించాడు.
రాజుకి, నందనాదేవికి పై ప్రాణాలు పైనే పోయినట్లు అయింది. ఇంత తొందరగా పోలీసులు రంగంలోకి దిగుతారను కోలేదు. ఓ వేళ రంగంలోకి దిగినా, ఉరమని పిడుగులా వూడి పడతారనుకోలేదు.
కూర్చున్న ఇన్ స్పెక్టర్ తనకి తానే పరిచయం చేసుకున్నాడు. తనపేరు. ఎక్కడా పనిచేస్తున్నదీ చెప్పి అడిగాడు "వాట్ హ్యాపెండ్?"
"సెర్చ్ చెయ్యాలి" కొత్తగా వచ్చిన ఇన్ స్పెక్టర్ చెప్పాడు ముక్తసరిగా. వెంటనే ప్రయాణీకులవైపు తిరిగి "ఒక కూనీకోరు విలువైన వస్తువుతో పారిపోతున్నాడు. మేము ఒక్కొక్కరిని ప్రశ్నించటం, సోదా చెయ్యటం చేస్తాము. మీరంతా మాకు సహకరించాలి. మంచివారు ఇది అమర్యాద అనుకోక మాకు సహకరించి మా ప్రయత్నంకి తోడ్పడండి" మర్యాద వుట్టిపడే స్వరంతో గాంభీర్యంగా చెప్పాడు. "