Previous Page Next Page 
అగాధాల అంచులలో పేజి 8

    ఆమె కొద్దిసేపటిలో సర్దుకుంది. మాసపత్రికలో మినీకధలు చదువుతూ నవ్వుకొంటూ తాపీగా కూర్చుంది.

    ట్రైన్ స్టేషనులో ఆగి బయలుదేరింది. పాతవాళ్ళు కొందరు దిగారు. కంపార్ట్ మెంట్ లో ఇద్దరు ఎక్కారు.

    జోక్ చదివి నవ్వుకుంటూ తల ఎత్తిన నందితాదేవి కంగారుపడి సీరియస్ గా ముఖం పెట్టింది. ఎదుటి సీట్లో కూర్చున్న మగాళ్ళిద్దరు ఇటే చూస్తూ గుసగుసలాడు కుంటున్నారు.

    వాళ్ళిద్దరిలో ఒకడు పొట్టిగా, లావుగా వున్నాడు. చట్టిముక్కు బండ పెదిమలు దొప్ప చెవులు ఓసారి చూస్తే జన్మంతా మరచిపోరు. తలంతా పెను కొరుకుడో లేక సగం ఊడి సగం జుట్టు వుండి అలా ఉందోగాని జుట్టు కూడా విచిత్రంగా వుంది. రెండో వాడు సన్నగా, పొడుగ్గా గడకర్రలా వున్నాడు. గారపట్టిన పళ్ళతో కారా కిళ్ళీ నములుతున్నాడు. మంచి గుర్తు ఏమిటంటే అటూ ఇటూ కోరల్లా రెండు పళ్ళు పైకి పొడుచుకు వచ్చాయి. పేరేమిటోగాని వళ్ళంతా విపరీతంగా రోమలున్నాయి.

    వాళ్ళని నఖశిఖ పర్యంతం చూసిన నందితాదేవి ఆ క్షణానే వాళ్ళకి పేర్లు పెట్టింది. దొప్ప చెవుల వాడికి దొప్పారావ్, రెండోవాడికి బొచ్చుపోలయ్య అని.

    "నే ఊహించింది కరెక్టే కదూ?" దొప్పారావ్ పైకే అన్నాడు.

    "ఎస్. ఆకె. డకే. ఓకె" అన్నాడు బొచ్చు పుల్లయ్య.

    వాళ్ళు తన గురించే మాట్లాడుకుంటున్నారని నందితదేవికి అర్ధమై పోయింది. ఇద్దరే అంట్ల వెధవలు, రౌడీ ముఖాలు. తనని నలుగురిలో అల్లరిచేయరు కదా! వాళ్ళ చూపులు అలాగే వున్నాయి. తను ధైర్యంగా ప్రవర్తించాలి.

    నిర్లక్ష్యంగా మీరంటే నాకేం లేక్కలేదోయ్ అన్నట్లు ఫోజు పెట్టి కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంది. వాళ్ళలో ఒకడు వెకిలిగా నవ్వాడు. ఆ దెబ్బతో సన్నగా కాళ్ళల్లో వణుకు బయలుదేరింది. కాలుమీద కాలు వేసుకుని పేపర్ ముఖానికి అడ్డు పెట్టుకుని కూర్చుంది.

    "నాకు రావటం లేదురా"

    "మగాళ్ళకి రాదురా"

    వాళ్ళమాటలు విని ఆమె పేపరు పేజీ తిప్పే నెపంమీద పేపరు ముఖానికి తప్పించి చూసింది.

    తనలాగా కాలుమీద కాలు వేసుకుని కూర్చోటానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా సర్కసు ఫీట్ నేర్చుకుంటున్నట్లు వుంది. ఓసారి తలఎత్తి చూడటం, వెంటనే కాలుమీద కాలు దగ్గరగా వేసుకోటానికి ప్రయత్నించటం చేసిందే చేస్తున్నారు.

    నందితాదేవికి అర్ధమైపోయింది. ఆడవాళ్ళు కాలు మీద కాలు వేసుకున్నట్లు మగవాళ్ళు వేసుకోలేరు. ఈ రౌడీ వెధవలెవరో అఘండులు తన జోలికి రాకుండానే చేష్టలతో తెలియజేస్తున్నారు. ఇది గమనించంగానే కాళ్ళల్లో సన్నగా వణుకు ముచ్చెమటలు దిగకారటం మొదలుపెట్టింది. జేబులోంచి కర్చీఫ్ తీసుకుని ముఖం తుడుచుకుంది. మెడ నిడ సుతారంగా అద్దుకుంది.

    దొప్పరావు దాకలాగా నోరు తెరుచుకుని కళ్ళప్పగించి ఆమెనే చూస్తూ కూర్చున్నాడు.

    "నే చెప్పలేదురా ఆకె, డకె అని" బొచ్చు పోలయ్య తమాషాగా నవ్వుతూ అన్నాడు.

    కంగారు అణుచుకోటానికి తను నిర్భయంగా వున్నానని తెలియజేయటానికా అన్నట్లు నందితాదేవి లేచి నిర్లక్ష్యంగా ఫోజు పెట్టి లావెట్రీలోకి నడిచింది.
    లావెట్రీ బోల్టు వేసుకుని వెనుదిరిగి ఆమె నిర్ఘాంతపోయి నిలువుగుడ్లతో కొద్దిసేపు వుండిపోయింది.

    లావెట్రిలో వున్న అద్దంలో అందాల బాలుడిలా వున్న ఆమె రూపం ముద్దువస్తూవుంది. కాని... కాని... ఆ మీసం సగం ఊడిపోయివుంది. అంతకు క్రితం ముఖం తుడుచుకున్నప్పుడు మీసం ఊడివుంటుంది. అందుకే బొప్పారావు దాకలాగా నోరు తెరిచింది.

    "తన గుట్టు బయటపడింది. కంపార్టుమెంట్ లో ఉన్న ఎవరికీ తన విషయం పట్టలేదు. యీ రౌడీ వెధవలు పట్టేశారు. చూడబోతే వీళ్ళు తనని మామూలుగా వదిలేతట్లు లేరు. తన అమీ తుమీ తేల్చుకునేట్లు వున్నారు. ణా పెళ్ళాం మారువేషంలో పారిపోతోంది అంటే తనేం చేయగలదు. తెలివిగా వాళ్ళ కళ్ళుకప్పి తను పారిపోవాలి" కనక నిర్ణయానికొచ్చిన ఆమె ఊడిన మీసాన్ని సరీగా అతికించుకుంది, అన్నింటికి తెగించిన దానిలా లావెట్రీలోంచి మహా ధైర్యంగా బయటికి వచ్చింది. 

 Previous Page Next Page