Previous Page Next Page 
అగాధాల అంచులలో పేజి 10

    "నా హెల్ప్ ఏదైనా కావాలా? ఇన్ స్పెక్టర్ ని అడిగాడు ఆ కంపార్టుమెంటులో ప్రయాణం చేస్తున్న ఇన్ స్పెక్టర్.

    చిరునవ్వుతో తల అడ్డంగా వూపి "నో -- థాంక్స్" అన్నాడు. తనవాళ్ళవైపు తిరిగి కనుసౌంజ్ఞ చేశాడు!

    ప్రాణాలకి తెగించి తను పారిపోవచ్చు. కాని తనని నమ్మి తనతో వస్తున్నప్రియురాలిని పులిబోనులోకి తరిమి-- నో నో అలా జరగటానికి వీలులేదు" కళ్ళముందు వురితాడు పెళ్ళి పీటలమీద ప్రియురాలు. రాజు తల తిరిగిపోయింది. సీటుకి అతుక్కుపోయి కూర్చుండిపోయాడు.

    "పెదనాన్న మనిషికాడు ఎంత తొందరగా మనుషులని తరిమాడు! తనని వాళ్ళు గుర్తుపడతారా? తనకి హిందీ బాగావచ్చు. యాసగా హిందీ మాట్లాడితే సారి. మెల్లకన్ను పెట్టడం వచ్చు. మెల్లకన్ను పెట్టాలి. చాలాసేపు మెల్లకన్ను పెట్టి వుండగాలవా! అని ఓసారి ఫ్రెండ్స్ పందెం కాశారు. తాను వుండగలనని చెప్పి పదిహేను నిముషాలు మెల్లకన్నుతో వుండి పందెం గెల్చుకుంది. ఆ తర్వాత కన్ను నొప్పిచేసింది. అయితేనేం విజయం
సాధించింది కదా, ఇప్పుడూ అలాగే-తనదే విజ..."

    వందనాదేవి గతుక్కుమంది. ఓ లేడీ పోలీసు భుజం మీద చేయివేసి "మేడమ్! అలా వస్తారా! మాతో సహకరించి మా డ్యూటీకి తోడ్పడండి" మృదువుగా అడిగింది లావెట్రీ వేపు చూపుతూ.

    "అలాగే" అచ్చ తెలుగులో అని పెదవి గంటుపడేలా కొరుక్కుంది వందనాదేవి. "ఆదిలోనే హంసపాదు" పొరపాటుకి చింతిస్తూ లేచింది.
    "ఏం చేయాలి. ఏం చేయాలి?" ఇన్ స్పెక్టర్. చేతిలో వున్న రివాల్వర్ వైపు చూశాడు రాజు.

    ఏ మాత్రం పొరపాటు చేసినా పొగలు కక్కటానికి సిద్ధంగా వుంది రివాల్వర్.

    "తాను బైటపడతాడు... తాను బైటపడతాడు." రాజు గుండె టక్ టక్ అంటున్నది. ఆ ఆలోచనకనుగుణంగా పట్టాలమీద చక్రాలు రాసుకుంటూ ట్రక్ టకా ట్రక్ టకా లయబద్ధంగా వినవస్తున్నది.

    వందనాదేవి, లేడీ పోలీసు లావెట్రీలోకి వెళ్ళారు.

    లావెట్రీ తలుపులు మూసుకున్నాయి.

    రాజు లావెట్రీ తలుపుల వేపు చూస్తూ కూర్చున్నాడు. "ఆమె బైటపడితే తాను బైటపడతాడు. వెంటనే తను ఇన్ స్పెక్టర్ మీదకు దూకి రివాల్వర్ లాక్కోవాలి. చాలా ధైర్యంగా క్విక్ గా..."

    లావెట్రీ తలుపులు నిమ్మదిగా తెరుచుకుంటున్నాయి.

    పిడికిలి బిగించి అవసరమైతే స్ప్రింగ్ లా ఎగిరి ఇన్ స్పెక్టర్ మీదకి దూకటానికి రాజు రెడీగా కూర్చున్నాడు.

    లావెట్రీ తలుపులు తెరుచుకున్నాయి.

    అప్పుడే ఓ విచిత్రం జరిగింది.

    రాజు పక్కనే కూర్చున్న ఇన్ స్పెక్టర్ పేంటు పైకి లాక్కుని కాస్త వంగి కాలు గోక్కుంటూ మేజోడులో దాచిన బుల్లికత్తి లాగాడు. కన్నుమూసి తెరిచేలోగా చాలా క్విక్ గా కత్తిని రివాల్వర్ పట్టుకున్న ఇన్ స్పెక్టర్ చేతి మీదికి విసిరాడు.

    కత్తి వెళ్ళి సూటిగా తగిలింది.

    ఖంగుమని శబ్దంచేస్తూ రివాల్వర్ క్రిందపడింది.

    రాజు ప్రక్కన కూర్చున్న ఇన్ స్పెక్టర్ లేచాడు. జేబులోంచి రివాల్వర్ తీశాడు. "చీమ చిటుక్కుమన్నా, ఎవరు కదిలినా బొందితో కైలాసం తప్పదు... ఇన్ స్పెక్టర్ చాలా తొందరగానే నన్ను వెతుక్కుంటూ వచ్చావ్. గుడ్. ఈ రోజు నీది కాదు. నీ కాళ్ళ దగ్గరవున్న రివాల్వర్ ని నీ కాలితోనే ఇలా నెట్టు. పాపం శ్రమ పెడుతున్నాను. ఊ... కాని..."

    రాజు కర్ధమైపోయింది. రెడీగా వున్నాడేమో ఆలశ్యం చేయదల్చుకోలేదు. బలంగా చెయ్యి విసిరాడు. ఇన్ స్పెక్టర్ వేషంలో వున్నతని చేతిలో రివాల్వర్ ఎగిరి అంత దూరాన పడింది. వెంటనే గట్టిగా అతన్ని పట్టేశాడు.  

 Previous Page Next Page