Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 9

    దీక్ష అతను చెప్పిన తీరుకి ముచ్చటగా నవ్వింది.

    ఓ ఆడపిల్ల ముచ్చటగా నవ్వింది కాబట్టి తనూ నవ్వటం న్యాయం అనుకున్న పృధ్వీరాజ్ నవ్వాడు.

    పరాయి మగాడితో అధిక ప్రసంగం చేసినట్లు అప్పుడు గ్రహించుకుంది దీక్ష. 'నాకేదో మాయరోగం వచ్చింది.' అని తనని తానే ముద్దుగా తిట్టుకుంది. ఇంకా ఇక్కడే పాతుకుపోయి నుంచోటం మంచిది కాదనుకుని సంచిలో చేయిపెట్టి పాంప్లెట్ తీసి పృధ్వీరాజ్ కి యిస్తూ "ఇది మీ యింట్లో ఆడవాళ్ళకు యివ్వండి." అంది దీక్ష.

    పాంప్లెట్ అందుకుంటూ "అమ్మయ్య హడిలిచచ్చాను" అన్నాడు పృధ్వీరాజ్.

    "ఎందుకు?" అంది దీక్ష వెళ్ళటానికి వెను తిరిగింది కాస్తా మళ్ళీ ఇటు తిరిగి.

    "ఈ మధ్య పేపరులో .... వద్దులేండి. నేను నిజం చెప్పినా మీరు అపార్ధం చేసుకునే ప్రమాదం వుంది."

    "నేను అపార్ధం చేసుకోనని హామీ యిస్తున్నాను. చెప్పండి."

    "ఈ మధ్య ఒకతను ఒంటరిగా రూమ్ లో వున్న వేళ మీలాంటి అందమైన ఓ అమ్మాయివచ్చి చేతి సంచిలోంచి రివాల్వర్ తీసి చంపుతానని బెదిరించి వాచీ వుంగరం మనీపర్స్ వగైరా తీసుకుని మాయం అయిందిట. అలా మీరు కూడా...."

    "ఏమిటీ! ఆ అమ్మాయికి మంత్ర శక్తులు వచ్చా!" బోలెడు ఆశ్చర్యపోతూ అడిగింది దీక్ష.

    "అలా అని నేను చెప్పలేదు కదండీ!" అమాయకంగా ఫోజుపెట్టి చెప్పాడు పృధ్వీరాజ్.

    "మరి మాయం అయిందన్నారు?"

    "అదా!"

    "ఆ... అదే."

    "మాయం కావటం అంటే మాయం కావటం కాదండీ, స్కూటర్ వేసుకుని దొంగతనానికి వచ్చింది. స్కూటర్ మీ శరవేగంతో పారిపోయింది. అతనికిగాని పోలీసులకిగాని మళ్ళీ కనపడలేదు. ఈ వార్త పేపరులో పడింది. అదన్న మాట విషయం. మీరు సంచిలోకి చేయి పోనిచ్చే సరికి ఆ సంఘటన గుర్తుకు వచ్చింది."

    "నేను నడిచే వచ్చాను." దీక్ష చెప్పింది.

    "నాకు తెలియదు కదండీ!"

    "మీకు రివాల్వర్ అంటే భయమా!"

    "రివాల్వర్ అంటే భయం లేకుండా ఎలా వుంటుంది? మారణాయుధానికి ఆడైనా మగైనా ఒకటే కదండీ!"

    పృధ్వీరాజ్ చెప్పే తీరుకి దీక్షకి నవ్వు వచ్చింది. 'పులి మీసాలు తగిలించుకోగానే సరా! పెద్ద మగాడు ఆకారానికే గాని కాస్త బెదిరిస్తే కళ్ళనీళ్ళు పెట్టుకునేటట్లు వున్నాడు.' అనుకుంది. "మీ యింట్లో వాళ్ళకి పాంప్లెట్ యివ్వండి." అని చెప్పి బయలుదేరింది.

    "ఏమండోయ్ మాట...!" పృధ్వీరాజ్ పిలిచాడు.

    "ఏమిటండీ?" అక్కడనుంచే అడిగింది దీక్ష.

    "మా యింటి ఆవిడ పేరు మందారవర్దని. మీరిచ్చిన ఈ కాగితం ఆమెకిచ్చినప్పుడు, ఆమె ఈ కాగితం ముక్క ఎవరిచ్చారు నాయినా! అని అడిగే ప్రమాదం వుంది. ఎర్రగా బుర్రగా ఎర్ర తేలులావున్న అమ్మాయి ఇచ్చిందంటే ఏం బాగుంటుంది చెప్పండి. మీ పేరు చెపితే ఫలానా పేరుగల అమ్మాయి యిచ్చింది అని చెప్పాననుకోండి. చిక్కు వుండదు. కనుక మీ పేరు చెపితే... అలా కోపంగా చూడకండి. పేరు చెప్పటం ప్రమాదం కాదు కదండీ. నా పేరు పృధ్వీరాజ్. అలాగే మీ పేరు ఏదో చెపితే...."

    "దీక్ష! అయినా నా పేరు ఆమెకి తెలియదులేండి. మళ్ళీ వచ్చినప్పుడు కల్సుకుంటాను." అని చెప్పి దీక్ష ఆ యింటి మెట్లు దిగింది.

    'పృధ్వీరాజ్! మీసాలు పెంచుకున్నదే చాలక శౌర్య పరాక్రమాలు వున్నట్లు ఈ పేరుకూడా తగిలించుకున్నాడు. సంచిలో చేయిపెడితే రివాల్వర్ తీస్తానేమోనని భయపడ్డ మహానుభావుడు. 'వుత్తపిరికి' అనుకుంటూ దీక్ష వెనుతిరిగి చూసింది.

    పృధ్వీరాజ్ అమాయకంగా నోరుతెరిచి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి తననే చూస్తుండేసరికి వళ్ళు మండింది దీక్షకి. నొసలు చిట్లించి ముఖం తిప్పుకుని రచయిత్రి కోమలాదేవి యింట్లోకి వెళ్ళింది.

    'దీక్ష! ఎంత పదునైన పేరు! పిల్లలాగానే పేరుకూడా చాకులా వుంది.' అనుకున్న పృధ్వీరాజ్ మూతీ ముక్కూ విరిచి పక్కింట్లోకి వెళ్ళిన దీక్షని చూసి గతుక్కుమన్నాడు. 'మరీ లేకిగా ప్రవర్తించానా!' అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే 'లేదులే' అనుకున్నాడు. ఆ తర్వాత దీక్ష యిచ్చిన పాంప్లెట్ ని అటూ యిటూ తిప్పి చదవటం మొదలుపెట్టాడు.

 Previous Page Next Page