ఆడవాళ్లలో ఏ ఒక్కరికో వుండే మంచి హైటు. వత్తైన తల కట్టుకు తోడు బుల్లి బుల్లి రంగులు. విల్లంబులా వంగిన కనుబొమ్మలు, నక్షత్రం చేపలాంటి చురుకైన కళ్ళు, ముక్కు చివర పట్టుకుని గిల్లాలన్న చిలిపి ఆలోచన కలుగజేసే ముక్కు, దానిమ్మ గింజలు లాంటి పలు వరసని అంటి పెట్టుకున్న గులాబీ రేకుల్లాంటి పెదవులు, సింపుల్ గా అలంకరణ చూడగానే ఈ అమ్మాయి మహా గట్టిది, గడుగ్గాయి అనిపించేటట్లు వుంది. అణువణువ స్త్రీత్వం వుట్టిపడే అవయవాలు తీర్చిదిద్దినట్లున్నాయి. అయినా స్త్రీ తాలూకూ సున్నితత్వం కన్నా చేపకర్రలాంటి గట్టితనం చేతులు, కాళ్ళు చూస్తుంటే తెలుస్తున్నది.
ఆమెని చూసి అలా అనుకున్నాడు పృధ్వీరాజ్.
చాలా విషయాలలో పురుషుడికన్నా స్త్రీయే తొందరగా మేలుకుంటుంది. అలాగే ముందు దీక్ష తెలివి తెచ్చుకుంది.
"ఈ వేళ లేచిన వేళ ఎక్కడికెళ్ళినా పురుష పుంగవులే ఎదురవుతున్నారు." అని ఓ నిట్టూర్పు విడిచి అమాయకంగా తననే చూస్తున్న అతగాడిని మేల్కొలిపే ఉద్దేశ్యంతో "ఉహ్హూ" అంటూ ఓ పొడి దగ్గులాంటి దగ్గు తన ఉనికిని గుర్తుచేస్తూ దగ్గింది దీక్ష.
రవంత తత్తరపాటుతో తెలివి తెచ్చుకున్నాడు పృధ్వీరాజ్. "సారీ!" అన్నాడు కంగారు కప్పిపుచ్చుకుంటూ.
దీక్షకి నవ్వు వచ్చింది. అయినా నవ్వకుండా "ఎందుకు సారీ!" అంది.
"మీరొచ్చింది కోమలాదేవిగారి కోసమేనా! ఈ యిల్లు కాదు. మా పక్కిల్లే ఆమెది. అదిగో అది" చేయిపెట్టి చూపిస్తూ చెప్పాడు.
"కోమలాదేవిగారు...."
"నాకెలా తెలుసా అని ఆశర్యపోతున్నారా! ఆమె పెద్ద రచయిత్రి కదా, మీలాగా ఎంతో మంది అమ్మాయిలు ఆమెకోసం వస్తారు. అదేమిటో మా యింట్లోకి వచ్చి కోమలాదేవి వున్నారా అని అడుగుతారు. మీరు వచ్చింది ఆమె కోసమే."
"ఎలా కనిపెట్టారు?"
"మీ సంచిలో ఏవో కాగితాలు కనబడుతుంటేను.....!"
దీక్ష నవ్వీ నవ్వనట్లు నవ్వింది.
"మీరు కథలు రాస్తుంటారా!" పృధ్వీరాజ్ ఆతృతగా అడిగాడు.
"రాయను." మృదువుగా చెప్పింది దీక్ష.
"ఎందుకు రాయరు?" అని నాలుక కొరుక్కున్నాడు పృధ్వీరాజ్.
"ఎందుకు రాయనో నాకూ తెలియదు. బహుశా కథలు రాయటం అనే ఆర్ట్ నాకు రాక అనుకుంటాను!" దీక్ష కొంటెగా చెప్పింది. ఎందుకో ఈ పులి మీసాల అమాయకపు అబ్బాయిని ఓ ఆట ఆడించాలనిపించే చిలిపి ఆలోచన వచ్చింది.
"అంతే! అంతే అయివుంటుంది" తడబడ్డాడు పృధ్వీరాజ్.
"మీ యింట్లో ఆడవాళ్ళు మీ అమ్మగారు మీ సోదరి మీ..." దీక్ష అక్కడితో ఆగిపోయింది.
"నా కింకా పెళ్ళి కాలేదు." అని పృధ్వీరాజ్ గబుక్కున చెప్పేశాడు.
"నే అడిగానా!" దీక్ష కోపంగా ముఖం పెట్టి అడిగింది.
"మీ అమ్మగారు మీ సోదరి తర్వాత మీ... అని ఆగారు కదా!"
"ఆగాను."
"మీ భార్య అని అడగబోయి అగారేమో అనుకుని... నాకింకా పెళ్ళి కాలేదని చెప్పాను." ఇందులో నా పొరపాటు ఏదీ లేదన్నట్లు ముఖం పెట్టి చెప్పాడు పృధ్వీరాజ్.
దీక్ష నవ్వింది.
"ఎందుకు నవ్వారు?"
"ఇంకా మీకు పెళ్ళి కానందుకు."
"ఏమిటి మీ ఉద్దేశ్యం! నాకేమన్నా అరవై ఏళ్ళనుకుంటున్నారా! ఇరవై ఆరు. ఒక్క నెల అగారంటే ఇరవై ఏడు వస్తుంది."
"నేనెందుకు ఆగటం!"
"అప్పుడు అడిగితే ఇంకో ఏడు కలిపి చెప్పేవాడిని."
"చెప్పి ప్రయోజనం ఏమిటి?"
"బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా దొండకాయ పండినా అన్న పాట వయసుకి సరిపోతుంది కాబట్టి."