ఆపదలో వున్న మిమ్మల్ని ఎవరోవచ్చి రక్షిస్తారనుకోటం తెలివి తక్కువకదా!
అంటుకున్నది మీ కొంపయినప్పుడు ఎవరో వచ్చి ఆర్పుతారనుకోటం అవివేకం కదా!
అదృశ్య హస్తం వచ్చి అపాయంలో వున్న మిమ్మల్ని ఆదుకుంటుందన్న తెలివి తక్కువ ఆలోచన చేసేముందు మీ చేతులున్నాయన్న సంగతి ఎందుకు గుర్తుంచుకోరు?
విధిని ఇతరులను నమ్మి చేతులు ముడుచుకు కూర్చుంటారెందుకు? అవి ఉత్త చేతులు కావు. చేతల్లో ఉక్కు పిడికళ్ళు. చేయి విసిరి చెట్టుని (మహావృక్షాన్ని) కూల్చలేరా!
ఆలోచించండి! ఆలోచించండి!
అలోచించి మీ అడుగు ముందుకు వేయండి.
పాంప్లెట్ లో అంతే రాసి వుంది. రాసిన వారి పేరు లేదు. ఎవరి గురించి రాసిందీ తెలిసే క్లూ లేదు.
అది చదవగానే పృధ్వీరాజ్ కి రాడికల్స్ గుర్తుకొచ్చారు. వాళ్ళ స్లోగన్స్ తమాషాగా వుంటాయి. దీక్ష ఆ బాపతు కాదుకదా అనుకున్నాడు. అలా అయితే స్త్రీ పురుషులిరువురికీ వాళ్ళ కార్యక్రమాలు చెప్పాలి కదా! ఆడవాళ్ళకి మాత్రమే పాంప్లెట్ ఇవ్వటానికి వచ్చిందికదా! అపాయం ఏమిటి! కొంపలు అంటుకోవటం ఏమిటి! చేతులు కాలటం ఏమిటి!
ఎంత ఆలోచించినా ఏమీ అర్ధంకాలేదు పృధ్వీరాజ్ కి. కోమలాదేవి యింట్లోంచి దీక్ష బైటికి రాగానే పిలిచి అడగాలనుకున్నాడు. వరండాలో నుంచున్నాడు.
అడగటం వల్ల వచ్చే అనర్ధం గురించి ఆ నిమిషాన పృధ్వీరాజ్ ఆలోచించలేదు.
కోమలాదేవి ఇంట్లోంచి దీక్ష బైటికి రాలేదు.
పృధ్వీరాజ్ వరండాలోనే నిలబడిపోయాడు.
- 5 -
అరగంట తర్వాత---
దీక్ష ఆ యింట్లోంచి కళకళలాడే మోముతో బైటికి వచ్చింది. అటునుంచే అటే పోక తలతిప్పి చూసింది. పృధ్వీరాజ్ కనబడ్డాడు. టాటా- అన్నట్లు చేయి వూపింది. తనుకూడా చేయి వూపుదామని చేయి ఎత్తిన పృధ్వీరాజ్ కి తనక్కడ ఎందుకు నుంచుంది గుర్తుకువచ్చి ఆగండి అన్నట్లు చేయి వూపాడు.
దీక్ష అక్కడే ఆగింది.
పృధ్వీరాజ్ పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ దీక్ష దగ్గరకు వచ్చాడు.