Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 9

    "వండిపెట్టడం యిష్టం లేకపోతే యిష్టం లేదని చెప్పు. అంతేగాని వూరికే రుసరుసలాడకు" కోపంగా అన్నాడు కోదండరామయ్య తన పాత్రని అవలీలగా పోషిస్తూ.

    పోలీసులు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

    అయిదు నిమిషాల మౌనం తర్వాత__

    "తెలివంటే నీదేనే వెంకూ!" భార్యభుజం తట్టి తగ్గు స్వరంతో అభినందించాడు కోదండరామయ్య.

    వెంకుమాంబ మురిసిపోతూ చెప్పింది. "ఇప్పటికీ గుండె దడదడ లాడుతూనే వుంది."

    "ఎందుకు?"

    "ఎలా ఆడానో తెలియదు. అంతపెద్ద అబద్దం ఆడాను. ఆ నిమిషంలో నాకా ఆలోచన తట్టడం నిజంగా ఆశ్చర్యం వేస్తున్నది."

    "వాడు ఆ పెట్టెగురించి అడగంగానే నా మెదడు పనిచేయటం మానేసింది. మాదే ఆ పెట్టె అనాలో, మాది కాదు అనాలో అర్ధంగాక తికమక పడ్డాను. తెలివిగా, ఎంతో సమయ స్పూర్తితో నువ్వు సిమెంట్ తో కట్టిన గోడ అంత స్ట్రాంగ్ గా, అవలీలగా కధ అల్లి చెప్పావు. ఎలా అయినా ఆడవాళ్ళు తెలివే వేరు" మరోసారి భార్యని అభినందించాడు కోదండరామయ్య.

    "ఇంతకీ ఏకపాదం వస్తాడంటారా?"

    "రాకపోవచ్చు. స్టేషన్ లో తూడీలు తూడీలుగా వున్న పోలీసులని చూసి అప్పుడే అనుకున్నాను-ఘరానా దొంగని పట్టుకోడానికి ఎర్ర టోపీలు కడలి వచ్చాయని"

    "దొంగవెధవని పట్టుకుంటే బాగుండును"

    "మరే" అన్నాడు కోదండరామయ్య.

    "ఇంతకీ పెట్టెలో బంగారు యిటుకలు వున్నాయంటారా?" వెంకుమాంబ ఇంకా స్వరం తగ్గించి అడిగింది.

    "ఇటుకలు కాదు, పిడకలు కాదు బిస్కెట్లు- గోల్డ్ కాయిన్స్ చూస్తేగాని నీకర్ధం కాదులే" లోగొంతుకతో చెప్పాడు కోదండరామయ్య.

    భార్యభర్తలిరువురు గుసగుసలాడుకున్నంత నెమ్మదిగా చెవులు కొరుక్కుంటూ మాట్లాడుకుంటున్నారు.

    "పోలీసుల కళ్ళుగప్పి ఆ త్రాష్టుడు మళ్ళీ వస్తే?" అనుమానం వ్యక్తంచేసింది వెంకుమాంబ.

    "అపశకునం మాటలు మాట్లాడకు" అన్నాడు కోదండరామయ్య.

                      
6

    ట్రైను ఆగింది.

    కోదండరామయ్య తలుపు దగ్గరకెళ్ళి నుంచున్నాడు. కోదండరామయ్య నుంచున్న తీరు ఎలా వుందంటే కొత్తగా ఆ రూట్ లో ప్రయాణం చేస్తుంటే బండి ఆగినప్పుదల్లా కిటికీలోంచి తల బయటికి పెట్టలేక తలుపు దగ్గర నుంచుని కొత్త స్టేషను ని పరిశీలిస్తున్నట్టుగా వుంది. అసలు విషయం అది కాదు. ఏకపాదం కనపడతాడేమోనని-

    "పేపర్ కావాలా సార్"

    కోదండరామయ్య వులిక్కిపడి ఎదురుగా వున్న కుర్రాడిని చూశాడు. వాడి చేతి మడతలో వార, మాస పత్రికలూ దొంతరలుగా ఉన్నాయి.
    కోదండరామయ్య దినపత్రిక కూడా కొనడు. ఇరుగు పొరుగు ఎలాగూ కొంటారు ఎవరయినా సరే పేపరు రోజంతా చదవరు కదా! అందుకని వాళ్ళింటికెళ్ళి చదివిరావడమో లేక అడిగి (అడుక్కుని) తీసుకుని చదివిచ్చేయడమో చేస్తాడు.

    కోదండరామయ్య ఏదో అనబోయాడు. లోపలనుంచి వెంకుమాంబ వచ్చి అప్పుడే ఆయన పక్కన నుంచుంది. ఆమె దృష్టి ప్లాట్ ఫామ్ మీదవుంది.

    "ఏమండోయ్! అటు చూడండి" అరచినంత గట్టిగా అంది ఆమె. 

 Previous Page Next Page