Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 10

    ఉలిక్కిపడ్డాడు కోదండరామయ్య "ఏమయింది?" విసుక్కుంటూ అడిగాడు.

    "ఏకపాదం అడుగో" అన్నది చెయి చాచి ఆ చివరగా చూపిస్తూ.

    పుస్తకాలు అమ్మే అతను గొణుక్కుంటూ అవతలికి వెళ్ళి పోయాడు.

    "చూడండి చూడండి" అన్నది వెంకుమాంబ మళ్ళీ.

    ఈ తఫా కోదండరామయ్య రెప్పలు ఆర్పకుండా కళ్ళు పత్తికాయల్లా చేసి అటే చూస్తూ ఉండిపోయాడు.

    ఫ్లాట్ ఫామ్ చివరగా లావెట్రీలున్నాయి, లేడీస్ లావెట్రీ పక్కగా గోడవేపు ముఖం తిప్పి నక్కినట్లు నుంచొని వున్నాడు ఏకపాదం.

    అక్కడా ఎందుకు నుంచొని వున్నాడు?

    ఏకపాదం ఈ వూరివరకూ వచ్చాడూ అంటే ఈ రైలులో ప్రయాణించినట్లే కదా?

    "అంటే! మరో బోగీలో ఎక్కాడన్న మాట."

    "ఎందుకు మరో బోగీలో ఎక్కాడు?"

    కోదండరామయ్య వెంకుమాంబ అలా చూస్తూ నుంచున్నారు. రెప్పపాటు టైములో ఏకపాదం దృష్టినుంచి జారిపోతాడేమో నన్నట్లు కళ్ళప్పగించి చూస్తున్నారు.

    బయలుదేరటానికి సిద్దంగా ఉన్నాను సుమా అన్నట్లు సర్కార్ ఎక్స్ ప్రెస్ బొయ్యిమంది.

    ఏకపాదం రైలు ఎక్కుతాడా లేదా?

    ఏకపాదం గిరుక్కున వెనుదిరిగాడు. తల పూర్తిగా వంచుకుని రైలు దగ్గరకు దూసుకు రాబోయాడు. సరీగ అప్పుడే కన్నుమూసి తెరిచేలోగా ఇన్ స్పెక్టర్, పోలీసులు స్వాగతం పలికినట్లు ఎదురొచ్చి టక్కున పట్టేశారు ఏకపాదాన్ని. అంతే గాదు- అతను పారిపోవడానికి గింజుకుంటుంటే నాలుగు ఉతికారు.

    ఫ్లాట్ ఫామ్ మీద ఏకపాదంని పోలీసులు ఉతుకుడు కార్యక్రమంలో వుండగానే రైలు మరోసారి కూతవేసి ముందుకు సాగింది.

    'ఏకపాదంని తీసుకుని పోలీసులు రైలుఎక్కుతారా లేదా?' బి.పి. పెరిగిన కోదండరామయ్య భయంతో కూడిన ఆలోచన అది.

    'కొంపదీసి వాళ్ళు వాడిని ఈ పెట్టెలోనే ఎక్కించరు కదా? హృదయ స్పందన వెంకుమాంబ గాభరా ఆలోచన ఇది.

    ఎవరి ఆలోచనతో నిమిత్తం లేకుండా సర్కార్ ఎక్స్ ప్రెస్ ఫ్లాట్ ఫామ్ ను విడిచింది.

    ఏకపాదం, పోలీసులు ఫ్లాట్ ఫామ్ మీదనే వున్నారు.

    ఏకపాదాన్ని తీసుకుని వాళ్ళు ట్రైన్ ఎక్కలేదు అన్న సత్యాన్ని కళ్ళారా చూసి అప్పుడు తృప్తిగా శ్వాసపీల్చి ఇరువురు వచ్చి లోపల కూర్చున్నారు.

    "ఇహపై మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి" కోదండరామయ్య అన్నాడు.

    "మరే. మనకో బరువు పెరిగింది కదా!" అన్నది వెంకుమాంబ.

    ఇరువురి చూపులూ ఎర్ర పెట్టెమీద పడ్డాయి.

    ప్రస్తుతానికి ఏకపాదం చాప్టర్ క్లోజ్.

                                           7

    "ఇప్పుడు ఏమవుతుందంటారు?"

    వెంకుమాంబ అడగంగానే "ఏమీ కాదు-" ధీమాగా సెలవిచ్చాడు కోదండరామయ్య.

    "వాడు మళ్ళీ వస్తే?" అనుమానం వ్యక్తంచేసింది వెంకుమాంబ.

    "రాడు."

    "రాడని బాగానే చెప్పారు. దొంగలకి, పోలీసులకి లాలూచీ వుంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఏకపాదం చూస్తూ చూస్తూ బంగారు నిధిని వదులుకోలేడు కదా! పోలీసులకేదయినా చేతిలో పెట్టి వచ్చేస్తాడేమో?"

    "రావచ్చు-కాని ఈ రైలుని అందుకోలేడు"

    "అంటే?" 

 Previous Page Next Page