Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 8

    "సరే తప్పునాది. భార్యతో కాకపోతే ఎవరితో పరాచికాలాడతాను? రంభలాంటి పిల్ల కనబడి 'రావోయ్ తాతా!' అంటుందనుకో-వెళతానా? 'మా ఆవిడ వెంకూకి నేనంటే ప్రాణం-ఛీ పో!' అంటాను. అంతదాకా ఎందుకు? ఊర్వశి ఎదురుపడి 'హే కోదండరామా! కలసి ఆడుదామా పాడుదామా' అందనుకో...."

    "ఛీ.....వూరుకుందురూ!" ముద్దుగా కోప్పడింది వెంకుమాంబ.

    దాంతో భార్యాభర్తలిరువురు రాజీపడిపోయారు. మళ్ళీ కబుర్లలో మునిగిపోయారు.

    స్టేషన్ వచ్చింది.

    సర్కార్ ఎక్స్ ప్రెస్ ఆగి బైలుదేరింది.

    ఏకపాదం కంపార్టుమెంట్ లోకి రాలేదు. అంటే ఏకపాదం క్రితం స్టేషనులో ట్రైన్ దిగి ఎక్కలేదన్నమాట. అలా ఎందుకు చేశాడు?

    ఈ ప్రశ్నకు సమాధానమా అన్నట్లు__

    ఒక యిన్ స్పెక్టర్, యిరువురు పోలీసులు లోపలికి వచ్చేశారు.

    "మీ యిరువురేనా ఇంకెవరైనా ఈ పెట్టెలో ఎక్కారా? మీరు ఎక్కడినుంచి వస్తున్నారు? ఎక్కడా దిగుతారు?" లాంటి ప్రశ్నలవర్షం కురిపించాడు ఇన్ స్పెక్టర్.

    "ఈ పెట్టె మా సొంతమా? ఎందరో ఎక్కుతుంటారు, దిగుతుంటారు" అన్నాడు కోదండరామయ్య.

    "అలాకాదు...సూటిగా జవాబు యివ్వాలి. మూడో మనిషి ఈ పెట్టెలోకి ఎక్కినట్లు మాకు వార్త అందింది."

    "ఎవరయినా తప్పిపోయినారా?"

    "తప్పిపోవటం కాదు, తప్పించుకుపోవటం. వాడో పెద్ద స్మగ్లర్ బంగారు బిస్కెట్లు కొంత ఫారెన్ గూడ్స్ తో అతను ఈ రైలులో ప్రయాణం చేస్తున్నట్లు మాకు వార్త అందింది" అంటూ ఇన్ స్పెక్టర్ విషయం చెప్పాడు. వెంకుమాంబ కళ్ళు మెరిశాయి.

    కోదండరామయ్య సాంతం విని క్విక్ గా ఆలోచించాడు. పోలీసోళ్ళతో వ్యవహారం. తను చాలా తెలివిగా సమాధానం చెప్పాలి అనుకున్నాడు. నాకేం తెలియదని అబద్దం చెపితే మొదటికే మోసం వస్తుంది అవికూడా అనుకున్నాడు.

    "పెద్దవాళ్ళం అయ్యాంకదా. యాత్రలుచేసి తిరుగు ప్రయాణంలో బాగా అలసిపోయాం. నాకు ఒకటే కళ్ళు మూతలు పడటం. నా వైఫ్ కయితే చలిజ్వరం పట్టుకుంది. మూసినా కన్ను తెరవకుండా పడుంది."

    భర్త అలా చెబుతుంటే ఎందుకయినా మంచిదని కప్పుకున్న పమిటని మరింతగా దగ్గరకు లాక్కుని, కాస్త ముడుచుకొని వుండిపోయి "ఉహుహు...." అంది వెంకుమాంబ.

    ".....ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే, మేమీ పరిస్థితులలో వుండికూడా అతన్ని చూశాము. కాకపోతే క్రితం స్టేషనులో అతను దిగిపోయాడు" అంటూ ముగించాడు కోదండరామయ్య.

    "అతను ఎలా వున్నాడు?" ఆయన్ని వదిలేసి అతని గురించి అడిగాడు ఇన్ స్పెక్టర్.

    "పొట్టిగా, లావుగా, ఎర్రనిరంగుతో అచ్చం గుమ్మడిపండు గుర్తొచ్చేలా వున్నాడు. కళ్ళు తేనెరంగులో వున్నాయి. నల్లపేంటు, ఎర్రగీరల షర్టు వేసుకున్నాడు.

    "ఎబ్బే- అతను కాదు" పెదవి విరుస్తూ అన్నాడు యిన్ స్పెక్టర్. అంతటితోపోక ఆలోచిస్తూనుంచున్నాడు.

    ఆ పెట్టెమీద ఇన్ స్పెక్టర్ కళ్ళు పడకూడదు అనుకున్న కోదండరామయ్య "అతను ఎలా వుంటాడంటారు?" అని యధాలాపంగా అడిగినట్లు అడిగాడు.

    యిన్ స్పెక్టర్ ఏ కళనున్నాడో వర్ణించి చెప్పాడు. అలాంటి వ్యక్తి కనబడితే ఏం చేయాలి అన్నది కూడా చెప్పాడు.

    యిన్ స్పెక్టర్, పోలీసులు ఆ పెట్టెలోంచి బయటికి వస్తుండగా ఎందుకో ఎర్రపెట్టె ఓ కానిస్టేబుల్ ని ఆకర్షించింది. వెళ్ళే వాడు వెళ్ళక ఆగి "ఈ పెట్టెలో ఏమున్నాయి?" అన్నాడు.

    కోదండరామయ్యకి ఏం సమాధానం చెప్పాలో తట్టలేదు.

    "దిక్కుమాలిన పెట్టె-దానిని గురించే అడిగానా నాయనా? కాశీ వెళ్లేది, కాశ్మీరు వెళ్లేది ఆయన హోటలు కూడు తినరు. స్వయంగా నేనే వంటచేసి పెట్టాల్సిందే. చిన్న సామానులకి హ్యాండుబాగు, బట్టలకి ఈ తోలుపెట్టె, వంటసామాగ్రికి దిక్కుమాలిన భోషాణమంత ఎర్రపెట్టె. స్టవ్ దగ్గరనుంచీ సత్తుగిన్నె వరకు, వూరగాయనుంచి ఉల్లిపాయ వరకు దానిలో వున్నాయి. ఓపికలేని ఈ వయసులో యాత్రలూ చేయాలి. ఎర్రపెట్టె బరువూ మోయాలి.....ఉహుహు" ఏమాత్రం ఆలస్యం చేయకుండా చెప్పిందేగాక, చలిజ్వరం మాట గుర్తుకు రావటంతో 'ఉహుహు' అని కూడా అంది వెంకుమాంబ.

 Previous Page Next Page