Previous Page Next Page 
తల్లి మనసు కధలు పేజి 9


    లొక్కిని సాహు ఓసారి "కోరాపుట్టి' సంత కెళ్ళినపుడు తీసుకోచ్చాడుట. దాని తల్లి తండ్రి కొండలో పుట్టి అడవిలో కర్రలు కొట్టుకుని కొండ దిగువకి తీసుకొచ్చి కట్టెలు అమ్ముకుని జీవించే అతి బీదవాళ్ళు . లొక్కి చిన్నప్పటి నుంచి , అంటే పదేళ్ళప్పటినించి తల్లి దండ్రుల వెంట అడవికి వెళ్ళడం, కఱ్ఱలు కొట్టడం, ఆ మోపు నాలుగు మైళ్ళు కొండ దిగువకి మోసుకొచ్చి అమ్మే కష్టజీవితానికి అలవాటు పడినది. ఆ బండ పనిలో మోటు దేరిపోయింది. అలా బ్రతుకుతూనే యిరవై ఏళ్ళదయింది. పదిహేడేళ్ళప్పుడు వాళ్ళ జాతివాడితో మనువయింది. మూడేళ్ళు కాపురం చేశాక వాడు మరొకరిని తగులుకుని దీన్ని వదిలేశాడు. ఆ సమయంలో కోరాపుట్టి సంతకెళ్ళిన సాహు దీన్ని చూసి "నాతో వస్తావా, నాకు హోటలుంది , కఱ్ఱలు కొట్టి కస్టాలు పడాల్సిన భయం లేదు. నీకు కావాల్సినంత తిండి పెడతాను. వెండి కడియాలు, బంగారు కమ్మలు చేయిస్తాను. అని ఆశ పెట్టాడట. కొండలలో పుట్టి పెరిగిన లొక్కి బస్తీ జీవితానికి మోజుపడి వప్పేసుకుని అప్పటికప్పుడు తల్లిదండ్రులకి కూడా చెప్పకుండా వీడితో బస్సెక్కి వచ్చేసింది మూడేళ్ళ నించి సాహు దగ్గిరే వుంటుంది.
    లొక్కి వచ్చిందగ్గిర నుంచి సాహు గాడి పని మూడు పూవులు ఆరు కాయలుగా వుంది. జమజట్టీలా వుంటుందేమో కర్రలు కొట్టిన శరీరానికి హోటలులో పప్పు రుబ్బడం పకోడీలు వేయడం ఏం కష్టం. ఆడుతూ పాడుతూ సునాయాసంగా పనంతా అదొక్కతే చేసేసేది. సాహుగాడూ అన్ని పనులకు తర్ఫీదు యిచ్చాడు. ఇదివరకు లావాడు పొయ్యి దగ్గిరే కూర్చుని మాడనక్కర లేకుండా అన్ని పనులు దాని నెత్తిన పెట్టి గల్లా పెట్టి దగ్గిర కూర్చునే స్థాయికి మారాడు. పగలంతా చచ్చేచాకిరీ చేసేది.....రాత్రి స్వర్గం చూపించేది .... తన అదృష్టానికి పొంగిపోయేవాడు సాహు. అంతే కాక లొక్కి వచ్చిం దగ్గిర నుంచి హోటలుకి గిరాకీ పెరిగింది. ఆ గిరాకి ఎందువల్లో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు సాహు.
    లొక్కి వచ్చిన ఓ ఏడాది వరకు మొద్దులా చాకిరి చెయ్యడం మినహా గడుసుదనం  లేకుండా అమాయంగా వుండేది. తర్వాత తర్వాత చుట్టూ ప్రపంచాన్ని చూసి తెలివి మీరింది. అడవిలో పెరిగిన అమాయకత్వాన్ని వదిలి గడుసు మీరింది. ఆ హోటలుకే అందరూ ఎందుకు వస్తున్నారో, తను ఎంతమందిని ఆకర్షించగలుగుతున్నాదో అర్ధం చేసుకునేటంత తెలివి మీరింది. ఏనార్ధం గడిచే సరికి డానికి చాలా మార్పు వచ్చింది. నీటుగా ముస్తాభవడం , చిరునవ్వులు ఒలకబోయటం, ఓరగా చూస్తూ కళ్ళతో కవ్వించడం. ఎవరన్నా ఏదన్నా హాస్యానికి అంటే "పో బాబూ" అంటూ ముద్దులు గునవడం. వరకూ నేర్చేసుకుంది. సాహుకి ఇదివరకులా భయపడటం. వదిగి వదిగి ఉండడం మానేసి వాడెదన్నా అంటే జవాబు చెప్పడం, కసిరితే నిర్లక్ష్యంగా దులిపెసు కోవడం, యింకా వాడు గట్టిగా అంటే తిరగబడి జవాబు చెప్పేంత రాటు దేరింది.
    స్టూడెంట్స్ హోటలుకు రాగానే ఏపని చేస్తున్నా వదిలేసి వచ్చేది.
    'ఏం కావాలి బాబూ. ఏం తింటారు?"
    అంటూ కుర్చీలు బల్లలు శుభ్రంగా దులిపి ఏటన్ షన్  చూపేది. సాహు దాని కులుకులు కోపంగా చూస్తూ "నీవెళ్ళి పప్పురుబ్బు , అళ్ళ కేం కావాలో నే చూస్టాలే" అనేవాడు. అది పట్టించుకోకుండా "రుబ్బుతాలే, యింతసేపు రుబ్బి రుబ్బి చేతులు పడిపోయాయి." అని నిర్లక్ష్యంగా వాళ్ళ కేం కావాలో అమర్చేది. వాళ్ళకి చాలా సంతోషంగా వుండేది, ఆఖరాఖరికి అందరూ సాహు ఫలహారం పెడితే తినమని మొరాయించారు.
    'అబ్బ ! నీ హోటలు లో ఫలహారాలు యింత రుచిగా ఉంటాయి. వాటి రుచి నీ వెదురుగా కనిపిస్తే పోతుంది. మమ్మల్ని కాస్త హాయిగా తిననీయి."
    అంటూ హాస్యంగా అంటున్నట్టే అని వాడి రూపుని వెక్కిరిస్తూ వాడిని గల్లా పెట్టి దగ్గిరికి పంపేవారు. వాళ్ళ కెదురు చెప్పలేక చెపితే రారేమోననే భయంతో మొహం మాడ్చుకుని గల్లాపెట్టి దగ్గిర కూర్చునేవాడు. అయినా ఓ కన్ను లొక్కి మీద, ఓ కన్ను స్టూడెంట్లు మీద వేసే వుంచేవాడు. అయినా ఏదో సందులో లొక్కి వాళ్ళని కళ్ళతో కవ్విస్తూ ముద్దులు గునుస్తూ మాట్లాడుతూ, చేయి తాకించాలని తాకిస్తూ వాళ్ళందరికీ పెద్ద ఆకర్షణ అయి కూర్చుంది.
    సాహు ఏ బజారుకో వెళ్ళాడంటే డానికి వాళ్ళకి యిద్దరికీ పండుగే. వాళ్ళతో నవ్వుతూ గలగలా మాట్లాడేది. వాళ్ళు హస్యాలాడితే ముసిముసి నవ్వులు నవ్వేది. "బాబూ యీ పౌడరేమిటి? ఎక్కడ దొరుకుతుంది? అనేది. "కావాలా రాసుకుంటావా" అనేవాడు ఒకడు. "నాక్కాదు  బాబూ! ఆ సచ్చినోడి కింత పాముదామని ఉత్తి కంపు బాబూ! ఎదవ" అంటూ మొహం అసహ్యంగా పెట్టేది.
    "అబ్బ! మీ దగ్గిరెంత మంచి వాసన , బాబూ ఏటి రాసుకుంటారు? అమ్మో! యీ నూనె ఎంత చక్కాగా వుందో వాసన" అంటూ వాళ్ళ తల నూనెనూ  సెంటు వాసనో చూడడాని కన్నట్టూ దగ్గిరిగా వచ్చి తాకుతూ చూసేది. వాళ్ళకు మతులు పోయేవి. "ఆ దొంగ సచ్చినోడు యీ యన్న రాసుకున్నా బాగుండు చస్తున్నా" అనేది కొంటెగా. దాంతో వాళ్ళు దాన్ని కవ్వించడానికి సానుభూతి చూపిస్తూన్నట్టు 'అబ్బబ్బ , ఆ సాహుగాడిని ఎలా భరిస్తున్నావు, నీ వింత చక్కగా వుంటావు వాడో ఎద్దు. గాడిద ....ఛా ------- నీవు కాబట్టి వుంటున్నావు ' అని కిర్రెక్కించేవాళ్ళు.
    "ఏం చెయ్యను బాబూ.....అడవిలో పడుండే దాన్ని.... అప్పుడేం తెలీక వెంటబడి వచ్చాను. యిప్పుడేక్కడికి పోను" అనేది జాలిగా.
    అంతకంటే యింకేదన్నా అంటే తమతో లేచి వచ్చేస్తా నంటుందేమో నని భయం అందరికి.
    సాహు నెలకోసారి సరుకులు చవగ్గా దొరుకుతాయని రాయగడా సంతకి వెళ్ళేవాడు. ఆరెండు రోజులు దానికి ఆటవిడుపు. అసదవకాశాన్ని స్టూడెంట్ల లో కొందరు సాహసవంతులు, రసికులు వినియోగించ కొనేవారు. పాపం స్నోలు పౌడర్లు గాజులు యిలాంటి చిన్న బహుమతులంటే ఆశపడేది కాదు లొక్కి.
    లొక్కి వ్యవహారం ముందులో కనిపెట్టలేకపోయినా తరువాత పసికట్టాడు . సాహు పిచ్చి వేషాలేస్తే మక్కి లిరగ తంతాను అని బెదిరించాడు. అది లక్ష్య పెట్టలేదు. ఆఖరాఖరికి స్టూడెంట్లని ఏమనే దైర్యం లేక ఆ కోపం అంతా లొక్కి మీద చూపించి రోజూ తన్నడం ఆరంభించాడు. అది నోరిప్పి వాళ్ళతో ఏం మాట్లాడినా కసిరేవాడు. వాళ్ళతో పూర్వంలా కాకుండా ముభావంగా మొహం గంటు పెట్టుకుని మాట్లాడేవాడు. వాడి హోటలు దివాళ తీస్తుందన్న భయం లేకపోతే దాన్ని వాళ్ళని కలిపి పాతెసేవాడేమో తనే వూరున్నా వెడితే లొక్కికి ఓ ముసలిదాన్ని కాపలా పెట్టేవాడు. ఆ ముసలిదాని కళ్ళు కప్పి యధాప్రకారం ఆటలు ఆడేది లొక్కి. సాహు రాగానే ముసలిది కంప్లైంటు చేయగానే కుళ్ళ బొడిచేవాడు సాహు. ఆఖరాఖరికి సంతలకి తను వెళ్ళడం మాని మరెవరినో పంపి దాని అట అన్ని వైపులా నుంచి కట్టేయించాడు. రోజురోజుకి వాడు పెట్టె బాధలు వాడిచేత తన్నులు తినలేక రాజుని చూసిన కళ్ళకి సామెతలా లొక్కికి సాహు గాడి సహచర్యం భరించడం దుర్లభమయింది. అప్పుడప్పుడు అవకాశం దొరికితే రహస్యంగా తన బాధలు వాళ్ళతో చెప్పుకుని కళ్ళనీళ్ళు పెట్టుకునేది. దాని అందాన్ని పొగడడం తెలుసుకాని దాని కన్నీళ్ళ ని తుడిచే శక్తి వాళ్లకేది.
    ఆఖరికి ఓ రోజు తెల్లెరేసరికి లొక్కి మాయమయిపోయింది. కొన్నాళ్ళ తరువాత తెల్సింది. ఏమంటే ఎవడో లారీ డ్రైవర్ తో లేచిపోయిందని ప్రక్క ఊరిలోనే వుందని ...." ఆ లారీ డ్రైవరు పేంటు, షర్టు చేతికి వాచీ వాడి ఉంగరాల జుత్తు అన్ని చూసి మోజుపడింది ముండ, నాలుగు రోజు లుంచుకుని తన్నేస్తాడు. రోగం కుదురుతుంది ముండకి" అని తిట్టుకున్నాడు సాహు కసిగా....అంతకంటే ఏం చేయలేక.
    లొక్కి వెళ్ళిపోయాక స్టూడెంట్లదరికి కొన్నాళ్ళు మతిపోయినట్లయింది కాలక్షేపం లేక కొట్టుకు పోయారు. వాళ్ళ ఉత్సాహాన్నంతా లొక్కి లాక్కుపోయినట్లనిపించింది. సాహు హోటలుకి అడుగు పెట్టాలంటే చిరాకనిపించేది. లాభాలు తగ్గిపోవడం అందరూ మరో హోటలుకు వెళ్ళటం చూసి తన వ్యాపారం దెబ్బ తింటుందని ఓరోజు ....."లంజముండ పొతే పోయింది దీని బాబులాంటిదాన్ని మరోత్తిని తెస్తాను .' అంటూ వెళ్ళాడు.

 Previous Page Next Page