Previous Page Next Page 
తల్లి మనసు కధలు పేజి 8


    ఇదీ వాళ్ళ కాలేజి! ఇలాంటి కాలేజీలో చేరడానికి మూర్తి ఆంధ్రదేశం నడిగడ్డ మీదనించి అక్కడ సీటు దొరక్క వచ్చాడు. యితరుల కిచ్చే నాలుగు సీట్లలో వకటి సంపాదించుకుని. రాగానే ఆవూరు, వాళ్ళ వాలకం చూసి బెంబేలు పడిపోయాడు వారానికి రెండు రిలీజయ్యే కొత్త సినిమాలు చూసే అలవాటున్న మూర్తి ఆ డొక్కు హాలులో ఎప్పటివో పాత హిందీ సినిమాలు చూడాల్సి వచ్చిన దురదృష్టానికి గాభారాపడిపోయాడు. భాషన్నా తెలియని అవూర్లో మాట్లాడుదామన్నా మనిషి లేడని బెంబేలు పడిపోయాడు. కాలేజి మొత్తానికి పాతిక ముపై మంది తెలుగు విద్యార్ధులు వుండేవారు. వాళ్ళంతా సీనియర్స్, జూనియర్ మూర్తితో మాట్లాడడం వాళ్ళకి నామోషి. మాట్లాడినా ఆప్యాయతా వుండేది కాదు. మిగతా వాళ్ళు వాళ్ళతో వాళ్ళ భాష మాట్లాడాడుకుంటూంటే మూర్తి ఒక్కడూ వెర్రివాడిలా తిరిగేవాడు. నా అన్న వాళ్ళందరికీ దూరమై అమ్మ కమ్మగా వండి పెట్టె భోజనానికి దూరమై, భాషన్నా తెలీని అవూర్లో పరభాష పరదేశపు అలవాటు పడలేక గిలగిలలాడిపోయాడు . ముఖ్యంగా భోజనానికి మొహం వాచిపోయాడు నెలరోజులకే. హాస్టల్ భోజనం - దాన్ని భోజనం అనడానికి వీలులేనంత అద్వాన్నంగా వుండేది. ఆ రుచులకు అలవాటు పడిన వాళ్ళ వాళ్ళే ఆ తిండి తినలేకపోయారు. నీళ్ళ పప్పు అళుతర్కారి - అంటే మసాలా రసంలో తేలే నాలుగు బంగాళాదుంపలు, ఓ 'భజా' అంటే వేపుడు, వేపుడంటే రెండు నిలువునా తరిగిన వంకాయ ముక్కలు, లేక కాయపళంగా వేయించిన రెండు బెండకాయలు - యిదీ . సరే - పెరుగన్నది వాళ్ళకి అలవాటు లేదేమో కావాలన్నా దొరికేది కాదు. ఉప్పు కారం లేని ఆ భోజనం తినడానికి కళ్ళమ్మట నీరు వచ్చేది మూర్తికి. తక్కిన తెలుగు మిత్రులు అప్పటికి కాస్త అలవాటు పడి వున్నారేమో పెట్టిందేదో మింగక తప్పదు అన్నట్టు తినేసేవారు. హోటలు కి వెళ్ళినా నాలుగు రకాలు పెట్టె తెలుగు భోజనానికి అలావాటుపడిన మూర్తి అవస్థ వర్ణనా తీతం , శాఖాహారం కంటే మాంసాహారం కాస్త నయం అని కొందరధి తినేవారు. హాస్టలు లో భోజనం తప్ప టిఫిను యిచ్చేవారు కాదు. అంచేత ఉదయం కాలేజీ ఎదురుగా వుండే పాక హోటళ్ళ లో ఏ సింగడాలో, వడలో, పకోడీ లో తిని టీ త్రాగడం తప్పనిసరి - కొన్నాళ్ళు బ్రెడ్ కొనుక్కుని తిని అది విసిగెత్తితే మళ్ళీ ఆ హోటలు లో తినడం తప్పేది కాదు. సాయంత్రమూ తప్పేది కాదు. ఆ పెట్టె భోజనం రాత్రి పది లోపల పెట్టరేమో , కాలేజి నించి రాగానే టిఫిన్ తినడం తప్పనిసరి. అలాంటి దురవస్థలో ఆ కాలేజి విద్యార్ధులందరూ హాస్టలు కెదురుగా వుండే పాక హోటళ్ళ మీదే ఆధారపడేవారు.
    అలాగే ఆ హోటళ్ళ వాళ్ళు వీళ్ళ మీదే ఆధారపడేవారు. ఊరికి దూరంగా వుండే ఆ హోటళ్ళ కి యీ విద్యార్ధులు తప్ప యితరులు వచ్చే అవకాశం లేదేమో కేవలం స్టూడెంట్స్ మీదే వాళ్ళ బిజినెస్సు ఆధారపడి వుండేది. అంచేత వాళ్ళు అంటే హోటళ్ళ వాళ్ళకి భయం. భక్తీ వుండేది. వాళ్ళతో తగువు తెచ్చుకుంటే అక్కడింక వాళ్ళు బ్రతకలేరన్నది వాళ్ళకి తెలుసు. అంచేత స్టూడెంట్స్ అరుపులు, పెట్టినా ఓపిగ్గా డబ్బిచ్చే వరకు వుండేవారు.
    హాస్టలు కి ఎదురుగా వున్న నాలుగైదు హోటళ్ళ లో "సాహు' హోటలు కి మంచిగిరాకీ వుండేది  సాహు అసలు పేరు "జుధిరిష్తోసాహు' జుదిరిష్తో అంటే యుధిష్ఠిరుడు! అంటే ధర్మరాజు! ధర్మం వాడి పేరులో తప్ప ,మనిషిలో కనపడదు! వాడి బుద్ది ఎలాంటిదైతేనేం గాని వాడి ఆకారం చూసినవాళ్ళకి మాత్రం ఆ హోటలు లో టిఫిను దిగనంటుంది మొదట్లో! సాహు నల్లగా ఎద్దులా వడ్డు పొడువుగా వున్న నలబై ఏళ్ళ మనిషి. మొఖం అంతా స్పోటకం గంట్లు - పచ్చటి పళ్ళు ఆ నల్లటి మొహంలో వికృతంగా కనిపించేవి. ముందు రెండు పళ్ళు ముందుకు తోసుకు వచ్చి వికృతంగా కనిపించేవి. కారాకిళ్ళీ తో గార పట్టిన అ పళ్ళు చూస్తె చాలు తిన్నది వాంతవుతుంది. కాకులు పీకిన తాటిపండు లాంటి జుట్టు, అసలే ఎర్రటి కళ్ళకి తాగుడు మరింత తోడయి ఎప్పుడూ ఎర్రగా వుంటాయి కళ్ళు. మనిషి మాట్లాడుతుంటే నోటమ్మట కిళ్ళీ రసం కారుతుంటుంది. మనిషి దగ్గరికి వస్తే చాలు కంపు! చమట, సారా, కిళ్ళీ అన్నీ కలిసిన ఆ వాసనని యిలా అవి వర్ణించనలవి కాని కంపు.
    అలాంటివాడి హోటలుకి మిగతా వాళ్ళేవరకీ లేని గిరాకీ ఏమిటా అని ఆశ్చర్యపోతారు ఎవరన్నా. మూర్తికీ అర్ధం గాలేదు మొదట్లో. తెలుగు మిత్రులని ఓరోజు ఆ మాట అడిగాడు. 'అబ్బ యిలాంటి వాడిని చూస్తూ యీ హోటలులోనే ఎందుకు తింటున్నారు . మరో డానికి వెళ్ళకూడదు ' అంటూ అసహ్యాన్ని వ్యక్తం చేశాడు. 'నీకు తెలియదులే' అంటూ మూర్తి అమాయకత్వాన్ని వాళ్ళలో వాళ్ళు నవ్వుకున్నారు తప్ప, సరి అయిన జవాబు చెప్పలేదు. కొత్తగా కాలేజీలో చేరిన వాళ్ళని వట్టి అమాయకులుగా తీసిపారేసి ఏడిపించడం సీనియర్స్ కి అలవాటు. కొన్నాళ్ళు గడిచాక ఎవరూ చెప్పకపోయినా మూర్తికి సంగతి అర్ధమయింది. ఆ హోటలులో అందరిని ఆకర్షించేది సాహు పెట్టె ఫలహారాలు కాదని, సాహు వుంచుకున్న 'లోక్కి' (లక్ష్మి కి వికృతి) అని అర్ధం చేసుకున్నాడు. అది బోధపడ్డాక ఓరోజు వెంకట్రావు ని అడిగితె అతను చెప్పిన సారాంశం యిది.
    లోక్కికి యిరవై కి పాతిక కి ,మధ్య వుంటుంది వయసు. లోక్కిని చూస్తె అందగత్తె అని ఎవరూ అనరు. కాని దాన్ని చూశాక ఎవరైనా సరే మరోమాటు దాన్ని వాళ్ళకి తెలియకుండానే కళ్ళెత్తి చూస్తారు. ఏదో చెప్పలేని ఆకర్షణ - ఆ ఆకర్షణ ఎక్కడుందో కూడ తట్టదు. దాని వంటి రంగు నలుపు. ఆ నలుపులోనే ఏదో ఆకర్షణ. అందం - జమజట్టీలా వడ్డు పొడుగున్న ఇనుప కడ్డీలాంటి శరీరం - జాకట్టు తొడుక్కొని దాని సౌష్టవం , దాని పొంకం అవే దానికి ముఖ్య ఆకర్షణలు. చక్రాల్లాంటి కళ్ళలో అదో మెరుపు వుంది. చిన్న ముక్కు, డానికి వంటి గాజు రాయి ముక్కు పుడక - ఆ పెదవులు బండగా, నల్లగా వున్నా దాని అందం పెదాలలోనే ఎక్కువ వుందేమో అనిపిస్తుంది. ఆ పెదవి ఎరుపులో ఏదో కవ్వింపు కళ్ళతో నవ్వేది కొంటెగా! మాట్లాడకుండానే పెదవి విరుపుతో కవ్వించేది - ఎవరయినా ఒక్కసారి చూస్తె మళ్ళీ మళ్ళీ కనీసం కళ్ళతోనైనా చూడాలని కోరతాడు - నీటుగా నున్నగా, తలదువ్వి పక్కకి కొప్పు పెట్టేది. తప్పకుండా ఏ కాలంలో ఆ కాలం పువ్వులు పెట్టేది. మొహానికి ఏదో పౌడరు రాసి యింత బొట్టు పెట్టి ఎప్పుడూ నీటుగా వుండేది. చేతికి వెండి గాజుల మధ్య గాజు గాజులు మామూలు కొండ వాళ్లాలా కాకుండా లోపల పరికిణి కట్టి మరీ చీర కట్టేది. మొత్తం మీద ఎప్పుడూ నలగని మాయని మనిషిలా వుండేది.
    అడపురుగులు కనిపించని ఆ కాలేజిలో ఆ "లొక్కి' ఏ వాళ్ళకి ఆముదం వృక్షం! తెలిసీ తెలియని నూతన యవ్వన 16,17 సంవత్సరాల వయసు నించి ఆ అమాయకత్వాన్నించి దాటి గడుసు దేరిన , ఉరకలు వేసే వయసు వాళ్ళది. అలాంటి వయసులో, అడదన్నది కన్పించని ఆ వాతావరణంలో లొక్కి వాళ్ళననుగ్రహించి దేముడు పంపిన దేవతలా అనిపించింది. డానికి తోడు దాని చూపులు, కవ్వింపు కనీసం దాన్ని కళ్ళతో జూసి ఆనందించే అవకాశానికి ఉదయం సాయంత్రం తప్పనిసరిగా సాహు హోటలు కి వెళ్ళేవారు అందరూ. తాగేది కప్పు టీ అయినా సరే ఓ అరగంట అక్కడ బైఠాయించి తనివితీరా చూస్తూ, డానికి అర్ధం కాకుండా యింగ్లీషులో మాట్లాడుకుంటూ , అది వాళ్ళన్ని చూసి కొంటెగా నవ్వినప్పుడల్లా ఐసు అయిపోతూ , అది కావాలని ఏ చెయ్యో తాకిస్తే కరిగిపోతూ రోజూ రెండు గంటలు దాని సందర్శన భాగ్యంలో సంతృప్తి పడేవాళ్ళు. ప్రతీవాడు తనమీదే  లొక్కి ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తున్నట్టు గర్వపడి , సంతోషపడేట్టు అందరిని చాకచక్యంగా ఆకర్షించి ఆకట్టుకునేది.
    "అమ్మ ముండా , చూడరా , చూడరా దాని కులుకు."లంజముండ ఏదో వుందిరా దీన్లో." దీని సిగ తరగ యిదే ఏ సినిమా తారో అయితే రాజ్యం ఏలేదిరా" యీ సాహూగాడు, వెధవ మొహం వాడూనూ ఏం ఛాన్సు కొట్టాడురా" అంటూ దాన్ని గురించి మాట్లాడుకుంటూ సాహూ అదృష్టానికి అసూయ పడేవాళ్ళు. 

 Previous Page Next Page