ఈసారి ఎలాంటిదాన్ని తెస్తారో అని అందరూ ఆరాటంగా ఎదురు చూశారు. మూడోరోజున వచ్చిన సాహూ వెంట 'గురువారీ" వచ్చింది. దాన్ని చూడగానే అందరూ నిరుత్సాహ పడ్డారు. గురువారీ బొత్తిగా చిన్న పిల్ల. పట్టుమని పదమూడు నిండాయో లేదో? చామనచాయ రంగులో బక్క పలచగా అమాయకంగా వుంది. కళ్ళు మాత్రం పెద్దవి . ఆ కళ్ళలో క్రొత్త బెదురు, కొండలలో పుట్టి పెరిగిన ఆపిల్ల ఒక్కసారిగా పట్టణ వాతావరణంలో క్రొత్తగా అర్ధం కానట్టు యిమడలేక బితుకు బితుకుమని చూసింది. గురువారీ.... (పోరాజా.... వాళ్ళు అంటే కొండజాతులలో ఒక తెగ వాళ్ళు ఏ వారం పుడితే ఆవారం పేరు పెట్టెస్తారు పిల్లలకి) ని రెండొందలు యిచ్చి కొని తెచ్చాడట సాహు పిల్లల్ని అమ్ముకునే తల్లిదండ్రులు యింకా వున్నారా అని ఆశ్చర్యపడ్డారు అందరూ. "వాళ్ళ కేటి బాబూ, వాళ్ళ కివన్నీ ఏటి తెలుసు, పిల్లలకి కొదవా వాళ్ళకి, డబ్బిస్తే ఎక్కడో అక్కడ పిల్ల తన పొట్ట పోసుకోగలదన్న ధైర్యం వాళ్ళకి మనువు చేసుకోవాలన్న డబ్బిచ్చి పిల్లని కొనుక్కోవాలి. ఎవడు డబ్బిస్తే వాడితో పంపేస్తారు అన్నాడు సాహు.
'అదిసరే , మరీ యింత గుంటని తెచ్చావు యిదెం చేస్తుంది." అన్నారు. నిరుత్సాహంగా కొందరు. "గుంటెం, పధ్నాలుగేళ్ళు ఉంటాయి . మరో ఏడాది పొతే అదే చూడండి ఎలా తయారవుతుందో/ కాస్త చిన్న చేసిందో, అందుకే యిదయితేనే లొంగి పడి వుంటుందని తెచ్చాను" అన్నాడు సాహు.
అప్పుడే విడవబోతున్న మొగ్గలా అమాయకంగా వుండే ఆ పిల్లని చూస్తె ఎవరికీ లోక్కిలా అన్పించేది కాదు. ఆ పిల్ల అంత పెద్ద రుబ్బురోలు ముందు కూర్చుని రుబ్బలేక కష్టపడి రుబ్బుతుంటే, పొయ్యి సేగకి ఎర్రబడిపోయిన మొఖం మీద చెమట తుడుచుకుంటున్నప్పుడు, అందరికి భయభక్తులతో ఫలహారాలు అందిస్తున్నప్పుడు పాపం వయసుకి మించి శ్రమ పడ్తోంది అని జాలి అనిపించేది. "సాహు పాపం చిన్నపిల్ల చేత అంతపని చేయిస్తావేమిటి " అని మందలించేవాళ్ళు. "చిన్నపిల్లేటి , అయినా దీని బాబుకి రెండొందలు యిచ్చి ఊరకే కూర్చో పెట్టటానికి తేచ్చానా" అనేవాడు. సాహు ఆ పిల్లని కసిరినప్పుడు, పని సరిగా చెయ్యలేదని తిట్టినపుడు, తన పెద్ద కళ్ళ నిండా నీరునింపుకుని చాటుగా అటు తిరిగి తుడుచుకునే ఆ పిల్లని చూసి అందరూ జాలి పడేవారు. ఒకసారి గాజుగ్లాసు బద్దలు కొట్టిందని సాహు గురువారీ చెంప మీద కొట్టాడు. ఆ పిల్ల బిక్క చచ్చిపోయి, కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని ఎవరి వంకా చూడలేక తలవంచుకుని లోపలికి వెళ్ళిపోయింది. దెబ్బతిన్న బాధ కంటే నలుగురి ముందు అవమానం ఆ పిల్లకి ఎక్కువ బాధ కల్గిందని అర్ధం అయింది. ఆవేశపరుడైన నిరంజన్ కోపంగా సాహు మీద ఎగిరిపడ్డాడు. గుడ్లెర్ర చేసి, మరోమాట గురువారిని ఏమన్నా అన్నా, చేయి చేసుకున్నా వూరుకోం అని బెదిరించాడు. ఆ పిల్లని యిలా బాధలు పెడితే నీ హోటలు గుమ్మం ఎక్కం అని బెదిరించాడు. గురువారీ మీద వాళ్ళకంత అభిమానం ఏమిటో అర్ధం కాక, ఎదురు చెప్పలేక గోనుక్కుని ఊరుకున్నాడు సాహు. ఆతర్వాత వాళ్ళు లేనప్పుడు గురువారిని ఏమనేవాడు కాదు సాహు. ఆ మాత్రానికే గురువారి కళ్ళ నిండా వాళ్ళ పట్ల భక్తీ, గౌరవం అప్పటి నించి, వాళ్ళని చూచి సిగ్గుగా చిరునవ్వు నవ్వుతుండేది. ఆమె మొహంతో ఆ నవ్వు ఆ అమాయకత చూస్తె అందరికి ,ముచ్చట అన్పించేది - దూరంగా వున్న వాళ్ళ చెల్లెళ్ళు గుర్తు వచ్చేవారు.
గురువారీ వచ్చిన నెలరోజులకి ఆ రాత్రి సంఘటన జరిగింది. ఇంట్లో చాకిరీకి రాత్రి పక్కలోకి పనికి వస్తుందని తెచ్చాడు సాహు. ఆ రాత్రి స్టూడెంట్లు కల్పించుకోక పొతే ఏడ్చి గోలపెట్టి ఆఖరికి వాడి బలం ముందు చాలలేక వాడి కోరికకు అంత పసిపిల్ల బలి అయిపోయేది. చేసేదేం లేక ఆ బండ వెధవతో జీఇతానికి అలవాటు పడి వుండేది. చెడె జరిగిందో కాని, ఆ గొడవ వల్ల వాళ్ళకి తెలియకుండానే గురువారీ బాధ్యత వాళ్ళ నెత్తిన వేసుకున్నట్లయింది.
* * * *
సదానంద్ దగ్గిర ఓ రెండు నెలలుంది గురువారీ. ఆ తర్వాత ఒక రోజు హాస్టల్ గేటు దగ్గిర అందరూ సాయంత్రం షికారు వెళ్ళే సమయానికి తచ్చాడుతూ కనిపించింది. నిరంజన్ కాస్త ఆశ్చర్యంగా ఏం కావాలంటూ అడిగాడు. అడగడమే తడవు అన్నట్టు గురువారీ ఏడుస్తూ తను సదానంద్ దగ్గిర వుండలేనని, తనచేత రోజంతా చచ్చే చాకిరీ చేయించుకుని తిండన్నా సరిగ్గా పెట్టడం లేదని , అతని భార్య గురువారీని అతి హీనంగా చూస్తూ తిడుతుందని, ఈ తద్దినం నా నెత్తి కేక్కించావు అని భర్తని కేకలేస్తుందని చెప్పి నేనింక అక్కడ వుండలేనని ఏడుస్తూ అంది. యింత తిండి పడేస్తే ,మీ దగ్గిరే ఏదన్నా పనిచేసుకు బ్రతుకుతాను. మీ గదులూడుస్తాను, బట్టలుతూకుతాను, ఏ పని చెప్పినా చేస్తాను . యింక అక్కడ వుండ లేనంటూ గోల పెట్టింది.
అందరూ మొహాలు చూచుకున్నారు. యిదియేక్కడి బాదరా బాబూ!
దాని బ్రతుక్కి మనం జవాబుదారీ అన్నట్టు మాట్లాడుతుందేమిటి, నేరక పోయి ఈ గొడవ తగిలించుకున్నాం అన్పించింది అందరికి. తాము కల్పించుకోక పొతే ఏడ్చో మొత్తుకోనో ఆ సాహూ గాడితోనే వుండేది. కోరికూర్చుని ఈ గోడవ నెత్తిన వేసుకున్నాం అనుకున్నారందరూ.
"మా దగ్గిరేం పని చేస్తావు. మా హాస్టలు కి నిన్ను రానియరు' అంటూ తప్పించుకోబోయారు. గురువారీ కాల్లు పట్టేసుకుంది. ఏడ్చింది . దాని ఏడుపు చూచి జాలనిపించినా , ఏం చెయ్యాలో ఎవరికి అర్ధం కాలేదు. తలో రూపాయి యిచ్చి ఏదో పని చేయించుకోవచ్చు గాని ఆడపిల్ల గదుల్లోకి రావడానికి వార్డెను వప్పుకుంటాడా? తర్వాత అలోచించి ఏదో చెప్తామని అప్పటికి వదుల్చుకున్నారు. వార్డెన్ తో మాట్లాడారు. 'అదెలా కుదురుతుంది ఆడపిల్ల" అన్నాడు వార్డెను. "చిన్నపిల్ల దానికేమిటి" అన్నారందరూ. "చాలు ఆవయస్సు' అన్నాడు వార్డెను నవ్వి కొంటెగా అందరూ నవ్వుకున్నారు.
గురువారీ గొడవ ఆఖరికి అందరికి తలనొప్పిగా తయారయింది. దాని కంట బడకుండా తప్పించుకున్నారు. కొన్నాళ్ళు "మాకేం తెలీదు ఫో" అని కసిరారు. రోజూ హాస్టలు గేటు దగ్గిర కాపుకాసి నాగతి ఏమిటి బాబు అని అడిగే గురువారీని చూస్తె ఓ పక్క జాలినిపించినా ఏం చెయ్యాలో యెవరికి అర్ధం కాలేదు.
ఆఖరికి నిరంజన్ అలోచించి "పోనీ దాన్నే ఓ హోటలు పెట్టమందాం" అన్నాడు . అందరూ ఆ ఆలోచన ఆమోదించారు. మనిషికి రూపాయి చొప్పున హాస్టలంతా తిరిగి నాలుగొందలు వసూలు చేశారు. ఓ పాక తయారుచేయించి హోటలుకి కావాల్సిన సరంజామా కొనిచ్చారు. గురువారీ కృతజ్ఞత తో వాళ్ళా కాళ్ళు పట్టేసుకుంది. పన్నెండేళ్ళ కుర్రాడిని సాయం పెట్టుకుని హోటలు మేనేజ్ చేయడానికి తయారయింది. సాహు, సదానంద్ యిచ్చిన తర్ఫీద్ ఉండనే వుంది నిరంజన్ గ్రూపు ముప్పై మంది డానికి రెగ్యులర్ కాతాలు ! ఒక నెల రోజులకే గురువారీ పనిలో నిలదొక్కుకుని రోటీనులో పడింది. దాని గొడవ వదిలిందని అంతా సంతోషించారు.
* * * *
చూస్తుండగానే రోజులు దొర్లిపోయాయి. కాలంతో పాటు గురువారీ కదిలింది. గురువారీ ఇప్పుడు విడవబోయే పసిమొగ్గ కాదు. అప్పుడే విడిచిన వికసిత కుసుమం. యవ్వనం యెలాంటి మనిషికైనా అందాన్ని స్తుందన్నది ఎంత నిజమో గురువారీని చూస్తె తెలుస్తుంది. యవ్వనం కురూపి అడడానికైనా వరం గురువారీ కురూపి కాదు. ఓ చాయ తక్కువన్న మాటే గాని అందమైనదే మరింక ఆకర్షణకి ఏం లోటు? గురువారీ ముఖంలో అమాయకత స్థానే చిలిపితనం కొంటెతనం చోటు చేసుకుంది. ఆ కళ్ళలో పూర్వపు పిరికి తనం పోయి గడుసుతనం వచ్చాయి. అందరి యెడ ఆమెకి వున్న భక్తీ, కృతజ్ఞత తో పాటు ఆరాధన చోటు చేసుకుంది. మగాణ్ణి పిచ్చేత్తించే విధంగా తయారైంది . గురువారీ వేషంలో, భాషలో అన్నిటా నాజూకు నేర్చింది. యిదివరకు లొక్కికి మించి కవ్విస్తూ తయారైంది. గురువారీ వయసే పాఠాలు నేర్పుతుంది. కాబోలు ఆ కులుకులు, ఆ తళుకులు చూస్తూ "అమ్మముండ ఎలా తయారైందిరా" అనుకుంటూ దాని హొయలని చూస్తూ ఆనందిస్తున్నారు. అందరూ - యిప్పుడు వాళ్ళెవరికి దాన్ని చూస్తె వాళ్ళ చెల్లెల్లు గుర్తుకు రావడం లేదు.
ఒకరోజు రాత్రి మొదటి అట సినిమా చూచి తిరిగి వస్తున్నారు కొందరు. గురువారీ గుడిసె దగ్గిరికి వచ్చేసరికి వాళ్ళ కాల్లు ఆగిపోయాయి. ఈసారి గురువారీ ఏడుపు కాదు - నవ్వు వినిపిస్తుంది - వాళ్ళ గోలలో కూడా కిలకిల నవ్వే గురువారీ నవ్వు విని అందరూ ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడి పోయారు. ఆవెంటనే వినవచ్చిన మగ గొంతు విని ఆశ్చర్యపోయారు వాళ్ళ కాళ్ళు వాళ్ళకి తెలియకుండానే ముందుకు వెళ్ళబోయి అంతలోనే ఆగిపోయాయి ఏడ్చే వాళ్ళకి సహాయం, సానుభూతి అవసరం గాని నవ్వేవాళ్ళ కి కాదన్నా సంగతి ఎవరూ మాట్లాడుకోక పోయినా ప్రతి వాళ్ళకి తట్టింది.
ఆ గొంతు నిరంజన్ పాత్రోది. ఒక్క నిరంజన్ దే కాదు - తరరువాట శరత్ మిశ్రా . సంతోష్ నందా. గోకుల్ సాహు, చటర్జీ వెంకట్రావు వగైరా చాలా గొంతులు వినిపించసాగాయి. ఆ గుడిసెలో. ఒకరోజు మూర్తీదీ వినిపించవచ్చు - ఫరవాలేదు. ప్రక్కనే మెడికల్ కాలేజీ హాస్పిటల్ వుందన్న నిబ్బరం వుంది వాళ్ళకి.
* * * *
మనిషి పెద్దపులికి ఎంత భయపడతాడో, పెద్ద పులీ మనిషికి అంతే భయపడ్తుంది. కాని ఒకసారి మనిషి రుచి మరిగిన పెద్ద పులి తరువాత "మాన్ ఈటర్ ' గా మారుతుంది.
***