Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 9
ఉదార భారతము
1
"గోరీ! నిన్ను మేము క్షమించితిమి."
ఈ మాటలకు ఢిల్లీ దర్బారంతయు నిస్తబ్ధమయ్యెను. పృథ్వీరాజు నోటినుండి యీ పలుకులు వెలువడునని యెవ్వరు నూహింపలేదు. చక్రవర్తి యీ పర్యాయముగూడ గోరీ నిట్లు క్షమించి విడిచిపుచ్చునని యెవ్వరును భావింపలేదు.
చక్రవర్తి చరణములముందు సగముచచ్చి శరణాగతుఁడై పడియున్న షహబుద్దీన్ మహమ్మదుగోరీ కాపలుకులు విన్నంతనే పోయిన ప్రాణములు లేచివచ్చెను. ఆతఁడాశ్చర్యముతో శిరమెత్తి ఢిల్లీశ్వరు నవలోకించి "నిజమేనా మహారాజా!" అనెను.
"అవును, మేము నిన్నీ మాటుసైతము క్షమించితిమి. నీవు సుఖముగా నీ పట్టణమునకుఁ బోవచ్చును.
సభయంతయు సార్వభౌముని వదనబింబము వైపు చూచెను. ఆ ముఖము ప్రసన్నగంభీరమై యలరారుచుండెను. ఆ చూపులలో దయాదాక్షిణ్యములు తాండవించుచుండెను. ఆ మాటలలో నౌదార్యము వెల్లివిరియుచుండెను.
"ప్రభూ! చంపఁదగిన శత్రువు చేఁజిక్కినప్పుడు క్షమించుట ప్రమాదకరము" అని మహామంత్రి పలికెను.
"మహారాజా! ఈతఁడు మన దేశముపై దండెత్తి వచ్చుట కిది ఏడవసారి. ఈతని దురాక్రమణబుద్ధికిఁ దగిన శిక్ష విధింపవలెను" అని సేనానాయకుఁడనెను.
"గోరీకి భారతదేశములోనే గోరీ కట్టవలెను" అని సభలో కేకలు బయలుదేరెను.
"చక్రవర్తీ! కాలసర్పమును కరుణించి విడిచినచో కాటువేయకమానదు" అని చాంద్ మహాకవి వచించెను.
గోరీ ఈ తడవ తనచావు తథ్యమని తలంచెను. అతఁడు దీనదృక్కులతో సార్వభౌముని వదనము వంకఁ జూచెను. చక్రవర్తి ముఖము మరింత గంభీరమయ్యెను.
"భయములేదు గోరీ! శరణాగతులను క్షమించుట భారతీయుల పవిత్ర ధర్మము. మా సేనానాయకుఁడు చాముండరాయఁడు నిన్ను సురక్షితముగా భారతదేశపరిసరమును దాటించి వచ్చును. పొమ్ము! ఇకనైనా నీ బుద్ధి మార్చుకొనుము. పరదేశములపై దురాక్రమణలు జరుపకుము. భారతదేశముతో మైత్రి పాటింపుము."
అని పలుకుచున్న పృథ్వీరాజు వాక్యములకు "చిత్త"మని యతివినయము నభినయించుచు గోరీ సేనానాయకుల వెంట సభాభవనమును వీడి వెడలిపోయెను.
ఈ విషయమున సభలో గుసగుసలు బయలుదేరెను. సార్వభౌముని యౌదార్యము సముచితముగాదని కొందఱు వ్యాఖ్యానించిరి. "ఎంత నక్కవినయములు చూపి తప్పించుకొని పోవుచున్నాఁడురా" యని కొందఱు కొరకొరలాడిరి. "అతి వినయము ధూర్తలక్షణ"మని కొందఱు పలికిరి. "పగబట్టిన పచ్చి బాలెంతపులివలె వీఁడెప్పుడో పంజావిప్పి భారతభూమిపైఁబడక మానఁ"డని కొందఱు భావించిరి.
అనంతరము మహారాజు యుద్ధరంగమున వీరవిహారము సలిపి విజయలక్ష్మిని సాధించిన శూరశిరోమణులకు పారితోషికములను పంచి పెట్టెను. పెక్కువిధముల సాయపడిన సామంతమండలేశ్వరుల నభినందించెను.
చక్రవర్తి కొలువు చాలించుచుండఁగా నొక సేవకుఁడరుదెంచి "ప్రభూ! కన్యాకుబ్జమునుండి యొక వార్తాహరుఁడు. వచ్చియున్నాఁ"డని విన్నవించెను.
వార్తాహరుడు లోనికిఁ బ్రవేశించి మహారాజునకు నమస్కరించి యొక లేఖను సమర్పించెను. తమ గర్భశత్రువగు జయచంద్రుని యొద్దనుండి లేఖ యేమైయుండునాయని సందేహముతోనే పృథ్వీరాజు వేవేగ దానిని విప్పి లోలోపల నిట్లు చదువుకొనెను:
భారత చక్రవర్తీ! ప్రణామములు.
నేఁటికి మూఁడవనాఁడు నాకు స్వయంవర మేర్పాటు చేసినారు. అందఱు రాజుల కాహ్వానములు పంపినారు. మీకుమాత్ర మాహ్వాన మంపియుండలేదని తెలియచున్నది; పై పెచ్చు మీకు మాఱుగనొక శిలావిగ్రహమును జెక్కించి స్వయంవర మంటపమున ద్వారము వెలుపల నుంతురఁట. నా జీవితము మీయధీనము. నా హృదయము మీ కర్పితము. నా కేమియును దోఁచుట లేదు. అంతయు మీరే యాలోచించి నన్నీ మహావిపత్తునుండి రక్షింపుఁడు. నా సాహసమును ప్రేమపురస్సరముగ మన్నింపుఁడు.
మీ చరణదాసి,
"సంయుక్త".
"జయచంద్రుఁడు స్వయంవరమునకు రమ్మని యాహ్వానించుచున్నాఁడా?" యని మహామాత్యుఁడనెను.
పృథ్వీరాజు మందహాసము చేయుచు "జయచంద్రుడు కాదు; సంయుక్తయే యాహ్వానించినది" అని పల్కెను.
2
అది స్వయంవర మహామండపము. ఆ మహోత్సవమున కాహూతులై వచ్చిన రాకుమారులందఱు తమతమ యాసనములపై బారులు దీర్చి కూర్చుండియుండిరి. హార కిరీటకేయూరాది మణిమయభూషణముల ధగద్ధగలతో సభా మండపమంతయు వింత కాంతు లీనుచుండెను.
అందొకప్రక్క నవరత్నఖచిత సింహాసనముపై జయచంద్రుఁ డుప విష్ణుఁడై యుండెను. ఆయన దక్షిణపార్శ్వమున రాజకుమారి సంయుక్త సఖీయుక్తయై లజ్జావనతవదనముతో నిలఁబడియుండెను. నవయౌవన శోభాభాసమానయగు నామె అప్పుడే వికసించుచున్న గులాబివలె నుండెను.
మహోత్సవారంభమున మంగళఘంటిక మ్రోగెను. సంయుక్త శృంగారరసాధి దేవతవలె పుష్పమాలతో ముందునకు సాగెను. రాకుమారుల హృదయాంతరములలో గాలివాన రేగెను. కాంక్షలు ర్రూతలూగెను. వారి యాశాపూరిత వీక్షణము లామె మోము దామర చుట్టు మూగెను.
ఎవరికివారు రాజకుమారి తన్నే వరించు ననుకొనుచుండిరి. సంయుక్త సమీపమునకు వచ్చుకొలఁది రాజకుమారులలో నానావిధములైన భావప్రకటనలు ప్రారంభమయ్యెను. ఒక భూపాలుఁడు తలపైనున్న సువర్ణ కిరీటమును చక్కదిద్దుకొనెను. ఇంకొక నరనాథుఁడు మెడలోనున్న ముత్యాలహారములను సవరించుకొనెను. మరియొక మహీవల్లభుడు రత్నఖచితములైన భుజకీర్తులను గదలించెను. వేరొక నరేంద్రుడు తన వజ్రపుటుంగరములను వెలువరచెను. ఒకడు దగ్గెను. ఒకడు సకిలించెను. ఒకడు భాగ్యము పండినట్లు ముందునకు మెడచాచెను. ఒకడు రొమ్ము విరుచుకొని భీష్మించుకొని కూర్చుండెను. ఒకడు కొంటెగా జూచెను. ఒకడు కోరమీసము మెలివేచెను. కాని రాజపుత్రి ఈ కలియుగ మన్మథులను కన్నెత్తియైన చూడలేదు.
Previous Page
Next Page