Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 10


    సంయుక్త మూర్తీభవించిన సౌందర్య జ్యోతివలె చకచక ముందునకు సాగిపోవుచుండెను. జ్యోతి సమీపించినంతనే రాజకుమారుల ముఖములు కళకళలాడెను. జ్యోతి సాగిపోయినంతనే వెలవెలబోయెను.
    సంయుక్త యింకను ముందునకు సాగిపోయినది. "అయ్యో! ఇదేమి? ఇంకను నా బిడ్డ ఎవరిని వరింపలేదే!" అని జయచంద్రుడు వ్యాకులపడుచుండెను.
    రాజకుమారి ద్వారముకడకు వచ్చినది. అచ్చట ద్వారపాలక స్థానములో నిలబడియున్న యొకరాతి విగ్రహము మెడలో స్వయంవరమాల యలంకరించినది. తత్ క్షణమే యొక వీరాగ్రేసరుడు హయారూఢుఁడై వచ్చి రాజకుమారికిఁజేయూతనిచ్చి గర్రముపై నెక్కించుకొని యదృశ్యుఁడైనాఁడు. ఒకక్షణకాలములో నిదియంతయు నింద్రజాలమువలె జరిగిపోయినది. తళుక్కుమని మెఱపు మెఱసినట్లినది.
    "మోసము! మోసము! పృథ్వీరాజు రాజకుమారి నపహరించుకొని పారిపోవుచున్నాఁడు, పట్టుకొనుఁడు" అను కేకలు సభాంతరాళమున మార్మోగెను. జయచంద్రుడు చండప్రచండమార్తాండునివలె మండిపడి సింహాసనము నుండి క్రిందకు దుమికెను.
    ప్రశాంతసాగరమున పెనుతుపాను రేగినది. స్వయంవర సభయంతయు హాహాకారములతో నల్లకల్లోలమైనది.


                             3


    ఆ రాత్రి జయచంద్రునకు నిద్రపట్టలేదు. అతని నేత్రములు చింత నిప్పులవలె నెఱ్ఱవారియుండెను. అతని మానసము పరాభవాగ్నిలోఁ దుకతుక నుడికిపోవుచుండెను. అతఁడు మంత్రాలోచనమందిరమునఁ బిచ్చిపట్టిన వానివలె, మద్యపాన మొనర్చినవానివలెఁ, దేలుకుట్టినవానివలె, నిప్పులు ద్రొక్కిన వానివలె నటునిటు దిరుగుచుండెను. మధ్య మధ్య "ప్రతీకారము ప్రతీకార"మని పటపట పండ్లు గొఱుకుచుండెను. అతని హృదయ మాలోచనలోఁ దేలిపోవుచుండెను.
    సంయుక్తయెంత సాహసము చేసినది! పృథ్వీరాజెంత మోసముచేసినాఁడు! అమాయికుఁడైన యనంగపాలుని మాయచేసి యానాఁడు ఢిల్లీ సామ్రాజ్యమునంతయు నపహరించి సింహాసన మెక్కినాఁడు. కపట వేషము ధరించి యీనాఁడు కన్యాకుబ్జభాగ్యలక్ష్మి యగు సంయుక్త నపహరించి గుఱ్ఱమెక్కినాఁడు. వానికెంత కండకావరము. పట్టపగలు నాపట్టి నెత్తుకొని పారిపోవునా? మదీయ ప్రతాప ప్రభాపుంజముచే వాని దుర్మదాంధకారము పటాపంచలు గావింతును. వానిని బట్టుకొని బంధించుటకై చేసిన ప్రయత్నమెల్ల బూడిదలో పోసిన పన్నీరైనది. ఆహా! నిండు సభలో నా గౌరవము గంగలో కలిసిపోయినది. ఢిల్లీశ్వరునిపైఁ బగదీర్చుకొనవలెను. వానిని సర్వనాశనముచేసి తీరవలెను. అప్పటికి గాని నా హృదయమునకు శాంతి లభింపదు. ఈ పరాభవాగ్ని చల్లారదు."
    జయచంద్రుఁడీవిధముగా నాలోచించుకొనుచుండెను. ఇంతలో నలుగురు మంత్రులు వచ్చి నమస్కరించిరి. వారందరూ చాలాసేపు మంత్రాలోచన జరిపిరి. చిట్టచివరకు మహమ్మదుగోరీని మరల భారతదేశముపై దండెత్తిరమ్మని యాహ్వానించుటకే నిర్ణయము జరిగినది. దురాలోచనము పూర్తియైనది. జయచంద్రుని కడుపుమంట కొంతవఱకుఁ జల్లారినది.


                                                4


    ఢిల్లీపట్టణమందలి ప్రమదోద్యానము. ఆ యుద్యానములో రాజదంపతులు విహరించుచుండిరి.
    "సార్వభౌమా! నాఁడు మీరు సమయమునకు రాకపోయినచో నేనేమైపోయెడిదాననో?"
    "దేవీ! నీ జనకుఁడు జయచంద్రుఁడు సమస్త భూపాలుర సమక్షమున నాకుఁ జేసిన యవమానమునకుఁ జక్కని ప్రతిక్రియ సలిపితివి. ఆ మహాసభలో నా గౌరవము గాపాడితివి. నీ సాహసము శ్లాఘనీయము. నీ యచంచలప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదములు."
    "మహారాజా! యిందు నన్ను శ్లాఘింపవలసినదేమున్నది? నా విధ్యుక్తధర్మమును నేను నెరవేర్చితిని.    
    "సంయుక్తా! జననీజనకులను వదలి పరపురుషుని వెంట బయలుదేరి వచ్చుటయేనా నేను నీ ధర్మము?"
    "పరిహాసములు చాలులెండు? మీరు నాకు పరపురుషులెట్లగుదురు? బాల్యముననే మిమ్ముఁజూచితిని. మీ ధైర్యసాహసములు వింటిని. నన్ను మీ కర్పించుకొంటిని. నా హృదయేశ్వరునిగా వరించి స్వయంవరములో మీకంఠమునఁ బుష్పమాలిక వైచితిని. మీ కర్ధాంగినైతిని. ఇందధర్మమేమున్నది?"
    "పాపము? మీ తండ్రి జయచంద్రుఁడెంత బాధపడుచున్నాఁడో? నన్నెంత నిందించుచున్నాఁడో!"
    "స్వయంకృతాపరాధమున కెవరేమి చేయఁగలరు? మా తండ్రి స్వార్థపరుఁడు కుటిలస్వభావుఁడు. భారతదేశమును ఖండఖండములుగా ఖండింపఁ బ్రయత్నించు చున్నాఁడు. భారత సార్వభౌములైన మీపైఁగత్తికట్టి ఎన్నియో పర్యాయములు యుద్ధములు చేసినాఁడు. రాజులలో రాజులకు విరోధములు పెంచుచున్నాఁడు. స్వయంవర మహోత్సవమునకు భారత చక్రవర్తులగు మిమ్మాహ్వానింపక మహాపరాధము చేసినాఁడు. సార్వభౌముఁడు లేనిదే స్వయంవర మెవరికోసమో!"
    "రాజకుమారీ! మనలను బంధించుటకై పెద్ద సైన్యమును బంపినాఁడు. కాని మనసేనలు వారిని తరిమికొట్టినవి. ఇంతకు సంయుక్తాదేశి పవిత్ర ప్రేమయే ఈ మహావిజయమున కంతటికిఁ గారణము."
    సంయుక్త యధరపల్లవముపై నొక మధుర మందహాస ముదయించినది. ఇంతలో నొక చారుఁడరుదెంచి "ప్రభువుల వారికి జయము జయము! జయచంద్రుడు మిమ్ము జయించుటకై చతురంగబలములతో రమ్మని మహమ్మదుగోరీకి దూతలను బంపినాఁడు" అని పల్కెను.
    సంయుక్త సంభ్రమముతో "ఏమీ? మా తండ్రియా! గోరీని దండెత్తి రమ్మనినారా! ఎంత ద్రోహము" అని పలికినది. సార్వభౌముడు "దేవీ! భయపడవలసిన పనిలేదు. ఆ గోరీ యిప్పటికేడుమారులు భారతదేశముపై దండెత్తి వచ్చి నాచేఁ బరాజితుఁడై ప్రాణములు దక్కించుకొని పలాయనము చిత్తగించినాఁడు. మొన్ననేకదా మన్నించి విడిచిపుచ్చితిని!" అని పలికెను. సంయుక్త "ప్రభూ! ఇప్పుడు కర్తవ్యమేమి?" అనెను. "దేవీ! విదేశరాజులు మనపై దండెత్తివచ్చుటకు స్వదేశీయుల స్వార్థపరత్వమే కారణము. ఎవరు వచ్చినను సుస్థిరమగు ఢిల్లీ సామ్రాజ్యమును సుంతయైనను జలింపఁజేయలేరు. నేను రాజసభకుఁబోయి మహామాత్యులతో నాలోచించి వచ్చెదను. నీ వంతః పురమునకేగుము" అని పలికి పృథ్వీరాజు వెడలిపోయెను. సంయుక్త తన జనకుఁడైన జయచంద్రుని ద్రోహబుద్ధికి మిక్కిలి చింతించి ఆయన మనస్సు మరల్చుటకై యొక లేఖ వ్రాయసంకల్పించెను.

 Previous Page Next Page