Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 8


    హెలీనా సంతోషాశ్చర్యములతో ఱెప్పవేయక యిది యంతయుఁజూచి తన్మయురాలగుచుండెను.


                                                    5


    అలెగ్జాండరు మగధను జయింపవలెనని కాంక్షించెను. కాని సైనికుల స్వదేశగమనవాంఛ నరికట్టుట యాతని కసాధ్యమైపోయెను. ఆ కారణమున స్వాధీనరాజ్యములందెల్ల తన ప్రతినిధుల నియమించి గ్రీసుదేశమునకు పయనమైపోయెను. కాని మార్గమధ్యముననే అలెగ్జాండ రకాలమరణ మందెను. అతని యనంతరము సెల్యూకసు గ్రీసుసార్వభౌముఁడయ్యెను.
    చంద్రగుప్తుని సైన్యసమీకరణము పూర్తియైనది. ఆ వీరాగ్రణి యుక్కుతునుకల వంటి ఆటవికుల నెల్లర సంఘటితపఱచి వారికి గ్రీసుయుద్ధ పద్ధతులు నేర్పి సమరవీరులుగా సలిపెను. అపార సేనావాహిని తయారయినది.
    ఇంతలో చాణక్యుఁడు మగధలోఁ దన యత్నము లన్నియు సఫలములైన వనియు, బయలుదేరి సంగరసన్నాహములతో పురోగమింపు మనియు చంద్రగుప్తునకు వార్తనంపెను. బలిష్ఠములగు కొండజాతి సైన్యములు వెంబడింప చంద్రగుప్తుఁడు మగధపై దండెత్తెను.
    అట చాణక్యుఁడు పర్వతరాజునకు మగధపైఁ గన్ను గలదని గ్రహించి యతని కర్ధ రాజ్యము కట్టఁబెట్టెదనని యాశపెట్టెను. తత్ఫలితముగా పర్వతేశ్వరుఁడు శకబాహ్లిక పారశీకాది మిత్రసైన్యములు తన్ననుసరింప నసంఖ్యాకములైన స్వసైన్యములతో పాటలీపుత్రముపై జైత్రయాత్ర చేసెను.
    ఇట్లు చతురంగబలసమేతుఁడై పర్వతరా జొక ప్రక్కనుండియు, చంద్రగుప్తుఁడు వేరొక ప్రక్కనుండియు పాటలీపుత్రముపైఁ బడిరి. రాక్షసమహామాత్యుఁడపారసేనావాహినితో నందరాజ్యమును సంరక్షింపనెంచి చంద్రగుప్తుని దాకెను. ఉభయసైన్యములకును పోరు ఘోరమయ్యెను.
    భీకరకరవాలము కరమున ధరించి గిరగిర త్రిప్పుచు శత్రుశిరములఁ గుప్పతిప్పలుగా నఱికివైచుచు సమరరంగమున చంద్రగుప్తుఁడు వీరవిహారము సేయుచుండెను. ఆ యసమాన తేజోనిధి నడ్డుకొను వీరుఁడెవ్వఁడు? ఆ యఖండ తేజోమూర్తి నాఁటిభండనమున ప్రచండమార్తాండుఁడై ప్రకాశించెను.
    చాణక్యుని రాజనీతిప్రభావముచే భద్రభటభాగురాయణాది మగధసేనాధిపతులు చంద్రగుప్తుని పక్షమవలంబించిరి.
    చంద్రగుప్తుని విజయలక్ష్మి సగౌరవముగా వరించినది. నందుని మృత్యుదేవత కౌగిలించినది. రాక్షసమహామాత్యుఁడు పరాజితుఁడై పలాయితుఁడైనాఁడు.
    నందవంశ నిర్మూలనమయినది. అద్వితీయస్వామి భక్తుఁడగు రాక్షసామత్యుఁడు తన ప్రభువుపైఁగల యభిమానముచే చంద్రగుప్తుని సంహరించుట'కై పలు ప్రయత్నములు చేసెను. కాని చాణక్యుని నీతిప్రభావమున నవియన్నియు నీరసములై నిష్ఫలము లయ్యెను.
    రాక్షసుఁడు పరప్రాణాపహారిణి యగు విషకన్యను చంద్రగుప్తుని బహుమానముగ పంపినాఁడు. కాని దానిని చాణక్యుఁడు తన బుద్ధిచాతుర్యముచే పర్వతేశ్వరునిపైఁ బ్రయోగించెను. విషయములోలుఁడగు పర్వతరాజా విషకన్యను కామాతురుఁడై స్పృశించి తత్ క్షణమే యసువులు వాసెను. ఈ విధముగా చంద్రగుప్త సంహారమునకై పంపఁబడిన విషకన్య మగధ రాజ్యమున భాగస్వామి యగు పర్వతేశ్వరుని పరిమార్చెను.
    చాణక్యుని ప్రతిజ్ఞ నెరవేరినది.
    సమర్థుఁడును స్వామిభక్తుఁడు నగు రాక్షసుని చాణక్యుఁడు తన ప్రజ్ఞావైభవముచే వశముచేసికొని చంద్రగుప్తున కమాత్యుఁడగుట కంగీకరింపఁజేసెను.
    మగధ రాజ్యమునకు చంద్రగుప్తుఁడు చక్రవర్తి మయ్యెను. రాక్షసుఁడమాత్యపీఠము నలంకరించెను. చాణక్యుఁడు ప్రజాహితముగ రాజ్యముచేయు మని ప్రియశిష్యుని ఆశీర్వదించెను. చంద్రగుప్తుఁడు వినమ్రుఁడయ్యెను. చాణక్యుఁడు ప్రసన్నఁ డయ్యెను.


                                6


    "అమ్మా! హెలీనా! ఏల చింతించుచున్నావు? నీవు వెనుకటి హెలీనావు కావు. ఇప్పుడు గ్రీసుసార్వభౌముని పుత్రివి. నిరంతరమును సంతోషతరంగములలోఁ దేలియాడవలసిన నీ కీ విచార మేల తల్లీ?"యని సెల్యూకసు తన ముద్దుకుమార్తెను ప్రశ్నించెను.
    "మన జీవితమంతయు యుద్ధములేనా? మరల మగధ దేశముపై దండయాత్రయేమి?" అని హెలీనా పలికెను.
    "అవునమ్మా! అలెగ్జాండరు సాధింపలేని మహాకార్య మీ సెల్యూకసు సాధింప సమకట్టినాఁడు!"
    తన జనకుని దురాక్రమణబుద్ధి హెలీనా కేమాత్రమును నచ్చలేదు. ఆమె చింతాక్రాంతయై యాతని చెంతఁగూర్చుండి యుండెను. నాఁటి సమరవృత్తాంత మామెస్వాంతమును కలవరపెట్టినది. నేఁడు తన జనకుడు చంద్రగుప్తునితో సమర మొనర్పఁబోవుచున్నాఁడు! ఆమె యాపాదమస్తకము చలించిపోయినది. ఆమె హృదయము రెపరెప కొట్టుకొనినది.
    "నాయనా? దారుణరణాంగణములే మీకు విహార వనములు. రక్తపానముపై మీ కనురక్తి. ప్రాణదాతయగు భారతసమ్రాట్టుపై సమరమా? బాబా! యింత సాహసమా! ఇంత కృతఘ్నతయా?" అనినది.
    "హెలీనా! నీకు రాజనీతి రహస్యములు తెలియవు. గ్రీకుపతాక పాటలీపుత్రము కోటకొమ్ముపై నెగురవేయవలెను. యవనమార్తాండుని దివ్యదీప్తికి భారతశౌర్యాంధకారము పటాపంచలు కావలెను. తెలిసినదా?" అని సేల్యూకసు లేచిపోయినాఁడు. రాకుమారి హెలీనా ఆలోచనలో మునిగిపోయినది.
    చంద్రగుప్తుఁడు చతురంగ బలములతో గ్రీకుసైన్యములను బ్రతిఘటించెను. బ్రహ్మాండమువలెనున్న భారత వాహిని విరోధి సైన్యములపై విరుచుకొనిపడినది. ఈ మహాయుద్ధమున చంద్రగుప్తచక్రవర్తి స్వయముగా సర్వసైన్యాధిపత్యము స్వీకరించినాఁడు. మాతృదేశ స్వాతంత్ర్యసంరక్షణార్థమై భారతవీరులు ప్రాణములు లెక్కచేయక ప్రళయకాలరుద్రులవలె పగతురపైఁబడి చించి చెండాడుచుండిరి.
    సెల్యూకసు తన సైన్యమును సమధికోత్సాహముతో సమరమునకుఁ బురికొల్పుచుండెను.
    చిట్టచివరకు "విజయశ్రీ" భారతసమ్రాట్టునే వరించినది. సెల్యూకసు భారతసార్వభౌముని ముందు బందీకృతుఁడైనాఁడు. హెలీనా బాష్పపూరిత నేత్రములతో జనకుని ప్రక్క నిలఁబడియున్నది. చంద్రగుప్తుని హృదయము సంచలించినది.
    మగధచక్రవర్తి తనముందు నిలబడియున్న సెల్యూకసు నవలోకించి "యవనచక్రవర్తీ! మీరు విముక్తులు. స్వేచ్చగా మీ దేశమునకుఁ బోవచ్చును" అని పలికినాఁడు.
    చంద్రగుప్తుని యౌదార్యమునకు సెల్యూకసు విస్మితుఁడైనాఁడు. తాను జయించిన గాంధారము పాంచాలము మొదలగు రాజ్యములు చంద్రగుప్తుని కిచ్చి సంధి చేసికొనినాఁడు.
    "కయ్యము నెయ్యముగా మారినది. ఇఁక నెయ్యము వియ్యముగా మారినచో గ్రీకులకు భారతీయులకు పరస్పర మైత్రి చిరస్థాయికాఁగల"దని చాణక్యుఁడనెను. చంద్రగుప్తుఁడు చిరునవ్వు నవ్వెను. హెలీనా మానస ముప్పొంగెను.
    సెల్యూకసు చాణక్యుని వాక్యములు గౌరవించినాఁడు. గ్రీకుచక్రవర్తి భారత చక్రవర్తికి మామయైనాఁడు. యవన రాజకుమారి మగధ సామ్రాజ్యమునకు పట్టపురాణి యైనది. హెలీనా చంద్రగుప్తుల కల్యాణము మహా వైభవముగా సకలజన సంతోషప్రదముగా జరిగినది.
    ఆ కల్యాణముచే భారతము "కల్యాణభారత"మైనది.


                                                  * * * *

 Previous Page Next Page