అతి కష్టంమీద ఒక్క గుటక మింగి చదవడం మొదలెట్టింది అమూల్య.
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మాతాహరి నిజంగా గూఢచారిణికాదు. అనవసరంగా అనుమానించాబడి ప్రాణాలు అర్పించిన ఒక అమాయకురాలు. ఆమె అసలు పేరు కూడా మాతాహరి కాదు. మిసెస్ మార్గెరెతా మోక్లియోడ్. తన తాగుబోతు భర్తను వదిలేసి యూరోప్ కి వచ్చి డాన్సర్ గా మారి మాతాహరీ అని పేరు పెట్టుకుంది. ఆమెకు ఎంతోమంది మిలటరీ లవర్స్ ఉండేవారు.
క్లారా బెండిక్స్ అనే జర్మన్ గూఢచారిణి ఈమే అనుకుని మాతాహరిని బ్రిటిష్వారు అరెస్టు చేశారు. తర్వాత తప్పు గ్రహించి వదిలేశారు. కానీ మళ్ళీ ఆమెను ఫ్రాన్స్ లో అరెస్టు చేశారు. జర్మన్ గూఢచారులతో ఆమె ప్రేమాయణాలు జరిపి ఉండడం ఆమె ప్రాణాల మీదికి వచ్చింది. ఆమె కూడా గూఢచారిణి అని నేరం ఆరోపించి 1917 సంవత్సరంలో షూట్ చేసేశారు.
జరిగిపోయిన పొరబాటుని 1963వ సంవత్సరం దాకా గ్రహించలేక పోయారు ఎవ్వరూ!
బలవంతంగా చంపబడిన ఆ అబల చరిత్ర చదువుతుంటే గుండె నీరయిపోయింది అమూల్యకి.
తను కూడా కోరికోరి అలాంటి పరిస్థితిలోకి వచ్చిందా? గుర్తు తెలియని గూఢచారి తరుణ్ మాటలకి లొంగిపోయి ఈ పద్మవ్యూహంలోకి వచ్చేసిందా? గూండా అయిన నిఖిల్ మీద పోలీసులకు ఇంటరెస్ట్ ఉండాలిగానీ గూఢచారులకు ఎందుకు ఆసక్తి? తరుణ్ తనని ఇక్కడికి పంపడానికి మరేదైనా కారణం ఉందా? తను ఎందుకు వచ్చిందో బయటపడితే నిఖిల్ ఏం చేస్తాడు? చిత్రవధ చేయిస్తాడా? అప్పుడు తరుణ్ వచ్చి తనని రక్షించగలడా? అంత వ్యవధి ఉంటుందా?
పుస్తకంలో అక్షరాలు అలుక్కుపోయినట్లు కనబడుతున్నాయి అమూల్యకి. మెదడు మొద్దుబారి పోయినట్లయింది.
"సో! యూ ఆర్ హియర్!" అని నిఖిల్ గొంతు వినబడినదాకా మళ్ళీ ఈ లోకంలోకి రాలేకపోయింది అమూల్య.
బాస్ పట్ల వినయం ప్రకటిస్తూ రాజు లేచి నిలుచున్నాడు. తనుకూడా లేచి నిలబడింది అమూల్య.
"ఈ అమ్మాయికి ఇవాళ ఇన్సియేషన్ సెరెమొనీ!" అన్నాడు నిఖిల్ రాజుతో.
'ఇన్సియేషన్' అన్న మాట వినగానే వళ్ళు జలదరించింది అమూల్యకి. ఆ పదానికి చెడు అర్ధమేమీ లేకపోయినా ఆ సందర్భాన్ని బట్టి క్లూక్లక్స్ క్లాన్ లాంటి సీక్రెట్ ఆర్గనైజేషన్ కొత్తగా చేరిన వారిచేత చేయించే పనులు గుర్తొచ్చాయి. మద్యం, మాంసం, మగువలతో తాంత్రికులు చేయించే చిత్రమైన పనులు గుర్తొచ్చాయి.
నిఖిల్ నడుపుతున్న ఈ ఆర్గనైజేషన్ మాత్రం వాటికంటే ఏం తక్కువట.
ఏ యేం భ్రష్టాచారాలు ఉన్నాయో ఇక్కడ! ఇవన్నీ తనెందుకు పాటించాలి! పారిపోవడానికి ఇదే సరైన సమయమేమో!
"కమ్! లెటజ్ గో" అన్నాడు అతను.
వణుకుతున్న చేతులని అదుపులోకి తెచ్చుకోడానికిగాను తనకు తెలియకుండానే పిడికిళ్ళు గట్టిగా బిగించింది అమూల్య.
ఇద్దరూ కిందికి వచ్చారు.
నల్లటి ఫోర్డు కారు ఉంది అక్కడ.
అతను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. ఆమెకోసం తలుపు తెరిచి పట్టుకోవడం లాంటి మర్యాదలేం పాటించలేదు. ఆమె తనకింద పనిచేస్తున్న మనిషే అయినా ఆడపిల్లలపట్ల చూపించవలసిన కర్టెసీ ఉంటుందని అతనికి తెలిసినట్టులేదు.
వెనకసీట్లో కూర్చుంది అమూల్య. చాలాసేపు వేగంగా పోయింది కారు. దాని గమ్యస్థానం ఏదో తెలియకపోయినా అమూల్య మనసు మాత్రం మనోవేగంతో ముందే అక్కడికి చేరుకుంది.
ఒక కొండా, కొండమీద పాడుబడిన ఒక బంగళా మనోనేత్రం ముందు కనబడ్డాయి. నరరూప రాక్షసుల్లాంటి మనుషులు కొందరు తన పెడరెక్కలు విరిచికట్టి లోపలికి లాక్కెళ్ళారు. బంగళాకి కప్పులేదు. నేలమీదంతా పిచ్చిమొక్కలు పెరిగి వున్నాయి. పచ్చివాసన.
ఒక బండమీద కూర్చున్న నిఖిల్ భావగర్భితంగా కర్చిఫ్ ను కిందికి వదిలేశాడు.
అది సిగ్నల్ గా తీసుకుని ఆ రాక్షసులు తన....
కారు ఒక్క కుదుపుతో ఆగింది. దానితోపాటు ఆలోచనలకు బ్రేకు పడింది.
నుదుటిమీద నుంచి నొసటిమీదగా కళ్ళలోకి కారుతున్న స్వేదాన్ని తుడుచుకుంటూ దృష్టి కేంద్రీకరించి చూసింది అమూల్య.
అది ఊరిబయట ఎక్కడో ఉన్న బంగళా కాదు. నగరం నడిబొడ్డున ఉన్న ఒక హోటలు.
"రా!" అన్నాడు నిఖిల్ తను లోపలికి వెళ్ళిపోతూ.
భయంగా వెనక నడిచింది అమూల్య.
టేబుల్ ముందు కూర్చున్నారు. అతనికి సున్నితమైన టేబుల్ మేనర్స్ లేవని వెంటనే గ్రహించింది అమూల్య. మేనర్స్ నిజంగానే లేదో కావాలనే అతను వాటిని పాటించ దలుచుకోలేదో మాత్రం అర్ధంకాలేదు.
స్టివార్డ్ వచ్చాడు మెనూతో. అతను ఆమెనేమీ అడక్కుండానే అన్నీ తనే ఆర్డరిచ్చి "ఓకే?" అన్నాడు ప్రశ్నార్ధకంగా.
మాట్లాడకుండా తల ఊపింది అమూల్య.
అతను నిర్లక్ష్యంగా వెనక్కి జారగిలబడి కూర్చున్నాడు. మొదటిసారిగా అతని మొహంలో చిరునవ్వు కనబడింది.
"ఇదే నీకు ఇన్సియేషన్!" అన్నాడతను.
"ఇకనుంచి నువ్వు మాలో ఒకదానివి. వెల్ కమ్ టూ ద గ్యాంగ్"
తేలిగ్గా నిట్టూర్పు వదిలింది అమూల్య. ఇతనితో కలిసి లంచ్ తీసుకోవడమేనా ఇన్సియేషన్ అంటే!
ఇంకేమిటో అనుకుని భయపడింది తను! తనని కాసేపు బెదరగొట్టడానికి ప్రాక్టికల్ జోక్ వేశాడన్నమాట ఇతను.