Previous Page Next Page 
మరణహొమం పేజి 10

 

    ఈ మోటు మనిషిలో కూడా మాటుమణిగి కొంచెం హ్యూమర్ ఉందా!   
    వేడివేడి సూప్ వచ్చింది.   
    "తాగు!" అన్నాడతను. అతను ఏం మాట్లాడినా ఆర్డర్ చేసినట్లే ఉంటుంది.   
    పెద్ద స్పూన్ తో సూప్ తీసుకోవడం మొదలెట్టింది అమూల్య. తర్వాత ఫైవ్ కోర్స్ డిన్నర్ సర్వ్ చేశారు.   
    బేరర్ తెచ్చిన బౌల్ లోని వెచ్చటి నీళ్ళతో చేతిని కడుక్కుని, నేప్ కిన్ తో పెదిమలు తుడుచుకుంటూ ఉండగా జరిగింది అది.   
    ఒక మూల టేబుల్ దగ్గర కూర్చున్న ఒకలావాటి మనిషిమీదకు వేటకుక్కల్లా ఉరికారు ఇద్దరు. ఒకడు ఆయన్ని పెడరెక్కలు విరిచి పట్టుకుంటే రెండోవాడు డిన్నర్ నైఫ్ ఒకటి తీసుకుని ఖస్సుమని ఆయన పొట్టలో పొడిచాడు.  

    హోటలంతా ప్రతిధ్వనించేలా చావుకేక వేశాడా మనిషి!   
    "ఆమ్ మ్ మ్ మ్ మ్ మ్మా!"   
    హోటల్లో కూర్చున్న కస్టమర్స్ లో కలవరం చెలరేగింది.

    "ఎవరూ కదలొద్దు!" అని హెచ్చరించాడు వాళ్ళిద్దరిలో ఒకతను. పొడిచినవాడు కత్తితో ఆ మనిషి పొట్టను చీల్చేశాడు.   
    వెంటనే టేబుల్ కిందపడి విలవిలకొట్టుకుంటున్న ఆ మనిషి దగ్గరకు వెళ్ళడానికి ఎవరూ సాహసించలేదు. చివరికి అతనే అతికష్టంమీద లేచి నిలబడి కడుపులో నుంచి బయటకు వేళ్ళాడుతున్న పేగుల్ని చేతులతో పట్టుకుని తలుపువైపు పరిగెత్తాడు. మెట్టుదిగుతూ తూలి జారిపడి పగిలిపోయిన పుచ్చకాయలా దొర్లుతూ కిందపడ్డాడు.   
    మళ్ళీ లేవలేదతను.   
    హంతకులిద్దరూ పారిపోయారు. బయట తలుపులు తెరిచి స్టార్ట్ చేసి రెడీగా ఉన్న పాతకారు ఒకటి ఉంది. దాన్లో కూర్చున్నారు వాళ్ళిద్దరూ.    

    కారు శరవేగంతో వెళ్ళిపోయింది.   
    సిగరెట్ అంటించి జరుగుతున్నదంతా చూస్తున్నాడు నిఖిల్. అతని కళ్ళలో బాధగానీ, సానుభూతిగానీ కనబడలేదు.   
    ఆ తర్వాత కొద్దిక్షణాల్లోనే హోటలంతా ఖాళీ అయిపోయింది.   
    "కమ్!" అని లేచాడు నిఖిల్. అప్పటిదాకా మరో టేబుల్ దగ్గర కూర్చున్న ఇంకో పెద్దమనిషి వాళ్ళదగ్గరికి వచ్చాడు.        "ఈయన జంషెడ్జీ బిల్డింగ్ వాలా! మన ఏస్ లాయర్" అన్నాడు నిఖిల్. అంతేగానీ అమూల్యని ఆయనకు పరిచయం చెయ్యలేదు. లాయర్ బిల్డింగ్ వాలాకి ఆమె ఎవరో అంతకు ముందే తెలిసినట్లు ఉంది.   
    కిందకువచ్చి కారెక్కారు.   
    కారెక్కే లోపల తనకి స్పృహతప్పి పోతుందేమో అని భయపడింది అమూల్య. ఆమె కాళ్ళు గజగజ వణుకుతున్నాయి. కడుపులో తిప్పుతోంది.
        తన కళ్ళెదుట ఒక మనిషి ప్రాణాలు పోవడం ఎప్పుడూ చూడలేదామె! అంత రాక్షసత్వం అంత రక్తపాతం కూడా ఎప్పుడూ కళ్ళతో చూడలేదు!   
    "ఆ హత్యచేసింది మన కుర్రాళ్ళే!" అన్నాడు నిఖిల్ చాలా మామూలుగా. "ఇవాళ కాకపోతే రేపయినా వాళ్ళమీద హత్యానేరం మోపబడవచ్చు. వాళ్ళు నిరపరాధులని మనం నిరూపించాలి. అందుకు తగిన పాయింట్స్ నోట్ చేసుకోవడం కోసమే బిల్డింగ్ వాలా స్వయంగా హత్యాస్థలానికి వచ్చాడు. అందుకే నిన్నూ తీసుకొచ్చాను. ఒకవేళ మన వాళ్ళమీద కేసువస్తే నువ్వూ, బిల్డింగ్ వాలా కలిసి వాళ్ళని రక్షించాలి! దటీజ్ యువర్ డ్యూటీ! గుర్తుంటుందా!" అని ఆగి ఒక్కొక్క అక్షరమే ఒత్తిపలుకుతూ అన్నాడు నిఖిల్.   
    "ఇదే నీకు అసలయిన ఇన్సియేషన్!"   
    మాటలు మర్చిపోయిన దానిలా చూస్తోంది అమూల్య!
    
                                                          * * *
    
    ఏదో ఒక విషయాన్ని గురించి రొటీన్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు, అనుకోకుండా మరేదో విషయం తాలూకు సమాచారం బయటపడిపోతూ ఉండడం మామూలు. అది తరుణ్ కి చాలా అనుభవం కూడా.   
    ఇప్పుడూ సరిగ్గా అలాగే జరిగింది.   
    తమిళనాడులో జరిగిన ఒక సంఘటన పేపర్లలో న్యూస్ ఐటమ్ గా వచ్చింది.   
    ఆంద్రప్రదేశ్ నుంచి వెళ్ళిన కొంతమంది ప్రయాణీకులు, తాము కొన్న రైలు టిక్కెట్లు మీద ఒకే నెంబరు రిపీట్ కావడం గమనించాడు. ఆ విషయం రైల్వే అధికారుల దృష్టికి తీసుకొచ్చినా వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు.  

    నకిలీ రైల్వే టిక్కెట్ల వ్యాపారం అక్కడ కొన్నిచోట్ల జోరుగా జరుగుతున్నట్లు అనుమానంగా ఉంది.   
    అది చదివి, పేపరు మడిచి పక్కన పెట్టాడు మిశ్రా. ఆయన తరుణ్ కి బాస్.   
    "గాడ్డామిట్! టామిల్ నాడు ఎగెయిన్! ఇదివరకు దొంగనోట్లు వ్యాపారం ఉధృతంగా జరిగింది అక్కడే కదూ! యా! కోయంబత్తూరులో..... అప్పుడు చాలా పెద్ద పెద్ద మనుషులు అందులో ఇన్ వాల్వు అయినట్లు నాకు గుర్తు. మైడియర్ చాప్! క్యాజువల్ గా ఒక కన్నేసి ఉంచు!" అన్నాడు తరుణ్ తో.   
    ఇబ్బందిగా కదిలాడు తరుణ్.   
    "సర్! ఇది మన పరిధిలోకి రాదనుకుంటాను. మనం అనవసరంగా జోక్యం చేసుకుంటే....."   
    "థౌజండ్ థండరింగ్ టైఫూన్స్!" అని ఊతపదం ఒకటి జోడించి విసుక్కున్నాడు మిశ్రా. "ఎవడేమన్నా అనుకోని! వీ షుడ్ బీ ఇన్ ద నో! అన్నీ తెలుసుకోవాలి మనం! వెళ్ళిరా ఒకసారి."   
    సన్నగా, నాజూగ్గా కనబడే ఈ తెల్లజుట్టు పెద్దాయన ఒకసారి మాటంటే మాటే అని తెలుసు తరుణ్ కి. దానికింక తిరుగుండదు. ఉడుంపట్టు ఆయనది.   
    అందుకని ఆరోజే అతను బయలుదేరాడు. తమిళనాడు చేరుకున్నాడు. అక్కడికెళితే పరాయిదేశం వెళ్ళినట్టే అనిపిస్తుంది అతనికి. తమిళం తప్ప వేరే భాష వినబడదక్కడ. వినబడనివ్వరు.

 Previous Page Next Page