నిఖిల్ దగ్గర ఉద్యోగంలో చేరడం ఖాయమయ్యాక, ఇంక ఆ రాత్రి కలవరపాటుతో ఒక్కక్షణం కూడా నిద్రపట్టలేదు అమూల్యకి. తెలిసి తెలిసి సింహం నోట్లో తల పెడుతుందా తను? తన శక్తికి మించిన పని తలపెడుతోందా? ఇది చిలికి చిలికి గాలివానై తన భవిష్యత్తుతో బాటు ప్రాణాలకు భద్రత కూడా లోపిస్తుందా?
కానీ ఇంతదూరం వచ్చాక భయపడి వెనకడుగేస్తే ఏం బాగుంటుంది.
తన మనసే తనని చూసి నవ్వదూ?
అసలయినా ఉద్యోగం కావాలని తనంతట తాను అడిగి నిఖిల్ ను వప్పించిన తరువాత వచ్చి చేరకపోతే అతను ఊరుకుంటాడా? ఇన్సల్ట్ ఫీలయి తనకి మరిన్ని అడ్డంకులు కలిగించవచ్చు. బతుకుని బాధాకరం చేసెయ్యొచ్చు.
ముందు నుయ్యి వెనక గొయ్యి అయినప్పుడు ముందుకు వెళ్ళిపోవడమే మంచిదేమో?
ఆలోచనలతో తెల్లవారిపోయింది.
అనాసక్తిగా లేచి అయిష్టంగా తయారవడం మొదలెట్టింది అమూల్య. "ఇవాళ డెంటిస్ట్ దగ్గరకెళ్ళాలి" అని తెలిస్తే చిన్న పిల్లలు ఎలా ఫీలవుతారో అలా ఫీలవుతుంది తను. అందంగా అలంకరించుకునే మూడ్ లేక ఒకదానికొకటి అంతగా మాచ్ అవ్వని చీరె, జాకెట్ వేసుకుంది.
కాలింగ్ బెల్ మోగింది.
తలుపుతీసింది అమూల్య. బాగా ఎత్తుగా, నల్లగా, గొరిల్లాలాగా ఉన్న మనిషి కళ్ళు నొప్పిపుట్టేటంత తెల్లటి యూనిఫాం వేసుకుని నిలబడి వున్నాడు.
ఏదో భీకరమైన పోట్లాటలో పచ్చడయి పోయినట్లు ఉందతని ముక్కు ఆకారం లేకుండా.
వెనక్కి ఒక్క అడుగు వేసింది అమూల్య.
'రాజు సాబ్ కారు పంపారమ్మా!" అన్నాడు అతను.
"రాజా? ఏ రాజు?" అంది అయోమయంగా.
"నిఖిల్ గారి అసిస్టెంటమ్మా! నారాయణరాజు!"
"అలాగా! వచ్చేస్తున్నాను." అని గబగబా లోపలికి వెళ్ళింది అమూల్య. హాల్లో ఉన్న వెంకటేశ్వరస్వామి ఫోటోకి నమస్కారం చేసుకుని వచ్చేసింది.
కింద నిస్సాన్ కారు నిలబడి ఉంది. ఆమెకోసం కారుడోర్ తెరిచి ఆమె కూర్చున్న తర్వాత డోర్ క్లోజ్ చేశాడు డ్రైవర్. రక్తపిపాసిలా కనబడుతున్న ఆ మనిషి తనకు ఇంత గౌరవం ఇస్తున్నాడంటే కారణం తను నిఖిల్ క్రయిం సామ్రాజ్యంలో కొలువుకి కుదరడమే అని అర్ధమయింది అమూల్యకి.
కొద్ది నిమిషాల తర్వాత ఆఫీసు చేరారు. నిన్న తనని అసలు లక్ష్యపెట్టని రిసెప్షనిస్టు సీట్లోనుంచి లేచి "గుడ్ మార్నింగ్ మిస్ అమూల్య" అని చిరునవ్వుతో విష్ చేసి రాజు రూమ్ లోకి తీసుకెళ్ళింది.
అప్పటికే అక్కడ అమూల్య కోసం ఒక టేబులూ, రివాల్వింగ్ ఛెయిరూ అరేంజ్ చేసి ఉన్నాయి.
అమూల్యను చూడగానే రాజు లేచి వచ్చాడు. రిసెప్షనిస్టు తలుపు క్లోజ్ చేసి వెళ్ళిపోయింది.
"వెల్! వెల్! వెల్!" అన్నాడతను నవ్వుతూ. "నిన్న నిఖిల్ తో ఇంటర్ వ్యూ కూడా దొరకని అమ్మాయి ఇవాళ ఇంటిమనిషిలా అయిపోయిందన్నమాట!"
"కూర్చో!" అని "నేను నిన్ను నువ్వు అని పిలుస్తాను. అందరినే అలానే పిలుస్తాను నేను. అభ్యంతరం లేదుకదా!" అన్నాడు.
"పిలు!" అందమనుకుని "పిలవండి" అంది పైకి.
"ఇవాళంతా ఆఫీస్ వర్క్ అబ్జర్వ్ చెయ్యి. రేపటినుంచి పని మొదలెడుదువుగానీ. సరేనా?"
"సరే!"
ఆ తర్వాత అతను పనిలో మునిగిపోయాడు. అతని టేబుల్ మీద ఉన్న కొన్ని ఫైళ్ళు తను తెచ్చుకుని చదవడం మొదలుపెట్టింది అమూల్య. ఒక గంట గడిచాక కాఫీ తీసుకొచ్చాడు ఒకబాయ్. కాఫీ తాగి చదివిన ఫైళ్ళు అతని బల్లమీద పెట్టెయ్యబోతుంటే అతని బల్లమీద ఉన్న ఒక పుస్తకం కనబడింది. అది తీసుకుని వచ్చి సీట్లో కూర్చుని తిరగెయ్యడం మొదలెట్టింది అమూల్య.
చిత్రమైన యథార్దాలెన్నో ఒకచోట క్రోడీకరించి ఉన్న పుస్తకం అది.
పేజీలు తిరగేస్తుంటే ఒకచోట ఆమె చూపులు ఆగిపోయాయి. గూఢచారులని గురించి వివరాలు ఉన్న అధ్యాయం అది. ఒక్కొక్క దేశంలో ఉన్న గూఢచారి సంస్థలూ, వాటిపేర్లూ, వివరాలు రాసివున్నాయి. అమెరికాలో సి.ఐ.ఏ (సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజన్సీ), బ్రిటన్ లో యం.ఐ.6 (మిలిటరీ ఇంటలిజెన్స్ 6), యం.ఐ.5, సోవియట్ యూనియన్ లో కె.జి.జి., జి.ఆర్.యు, ఫ్రాన్స్ లో ఎస్.డి.ఇ.సి.ఇ (సర్వీస్ డీ డాక్యుమెంటేషన్ ఎక్స్ టీరియర్ ఎట్ డి కౌంటర్ ఎస్పియనేజ్), ఇజ్రేల్ లో మొస్సాద్ (హెబ్రూ భాషలో 'ఇన్ స్టిట్యూషన్ ఫర్ ఇంటలిజెన్స్ అండ్ స్పెషల్ అసైన్ మెంట్స్' అని అర్ధం) ఎట్ సెటెరా ఎట్ సెటెరా.....
గూఢచారులకు సంబంధించిన కొన్ని యథార్ధ సంఘటనలు వివరించి ఉన్నాయి. 1950 ప్రాంతంలో రష్యన్ మిలిటరీ ఇంటలిజెన్స్ సంస్థ జి.ఆర్.యులో పని చేస్తూ ఉండిన కలోనెల్ పీటర్ పాపోవ్, పాశ్చాత్య దేశాలకు డబుల్ ఏజంట్ గా పనిచేస్తున్నట్లు తేలింది. అతనికి విధించబడిన శిక్షను రష్యన్స్ తర్వాత కావాలనే 'లీక్' చేశారు, వెస్టర్న్ గూఢచారులకు హెచ్చరికగా ఉండాలని.
ఆ శిక్ష ఏమిటో చదువుతుంటే అమూల్య మెడమీద ఉన్న సన్నటి రోమాలు లేచి నిలబడ్డాయి.
పాపోవ్ ని అతని సహోద్యోగుల సమక్షంలో భగభగ మండుతున్న ఫర్నేస్ లో పడేశారు! బ్రతికుండగానే!
అక్కడే ఉన్న మరొక ఫోటోమీద అమూల్య దృష్టి పడింది. ఒక అందమైన స్త్రీ. పేరు మాతాహరి. ఫ్రెంచ్ ఫైరింగ్ స్క్వాడ్ ఆమెని కాల్చి చంపేసింది.