Previous Page Next Page 
హత్య పేజి 9


    "నీవు పరిశోధన మాననంటావ్ అంతేనా!" సూర్యారావు కోపం తెచ్చుకుంటూ అడిగాడు.

 

    "ఎందుకు మానాలి? నాకళ్ళారా చూస్తేగాని నేను ఏదీ నమ్మను. అదిగో పులంటే ఇదిగో తోక అనటం నాకు మహాచికాకు. విషయం కానియ్యి ఏం జరుగుతుందో చూద్దాం" కైలాసగణపతి అన్నాడు.

 

    "చచ్చింతరువాత చూడటానికి ఏముంటుంది?" సూర్యారావు కోపంగా అడిగాడు.

 

    "నా శవం వుంటుంది కదరా సూరీడూ!" నవ్వుతూ తేలిగ్గా జవాబిచ్చాడు కైలాసగణపతి.

 

    "నీకు ప్రాణభయం లేదురా కైలాసం?"

 

    "ప్రాణభయం వున్నవాళ్ళకి ప్రాణం పోకుండా వుంటుందా! అలా అని నీవు హామీ యివ్వగలవా!"

 

    "నీ వితండవాదంతో నాకెందుకుగాని పోనీ నే చెప్పేదైనా విను."

 

    "పరిశోధన విరమించుకో, ఆ మాట తప్ప ఇంకేదైనా చెప్పు వింటాను." ముందు జాగ్రత్త వహిస్తూ అన్నాడు కైలాసగణపతి.

 

    "నీవుపరిశోధన విరమించుకోవద్దు......"

 

    "హుర్రే."

 

    "ముందా చిన్నపిల్లాడి చేష్టలు కేకలు మానెయ్యి. నేచెప్పేది సాంతంవిను. నీదోవన నీవు పరిశోధన చేసుకో. కాని ఈ విషయం మనిద్దరి మధ్యనే రహస్యంగా వుండాలి సరేనా!"

 

    "అలాగే ఇది ఏమంత కష్టంకాదు కనుక ఒప్పుకున్నాను."

 

    "తరచు నీవు కొండల దగ్గరికి వెళ్లాలి కాబట్టి నీతో పాటు మధ్య మధ్య నేను వస్తుంటాను."

 

    "సరే."

 

    "నీవు నా స్నేహితుడివి. ఆరోగ్యం సరిగాలేక, మనసు సరిగాలేక, ఈ పల్లెటూరిలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోటానికి గాలి మార్పుకి నా యింటికి వచ్చావని ఊళ్ళో వాళ్ళకి చెపుతాను."

 

    "నేను ఎలాగూ నీ స్నేహితుడినే. మిగతా కల్పితగాధ.... కి అర్థం?"

 

    "నీవు తరచుగా కొండదగ్గరికి వెళ్ళివస్తుంటే ఊళ్ళో వాళ్ళకి అనుమానం రాకుండా వుండటానికి ఈ కధ. షికారుగా నీవలా వెళ్ళిరావచ్చు."


    "బాగుంది అయిడియా, మరి యింట్లోవాళ్ళకి ఏం చెపుతావు?"

 

    "వాళ్ళకి కూడా యిదే అబద్ధం. ముందే చెప్పాకదా నీకూ నాకూ తప్పించి ఎవరికి తెలియకూడదు."

 

    "సరే."

 

    "పరిశోధన అంటే ఎలా చేస్తావు, ఎవరికి అనుమానం రాకుండా చేయవచ్చా! అదేదో నాకు చెపితే ఇరువురం ఎలా చెయ్యాలన్న ప్లానువేద్దాం." అన్నాడు సూర్యారావు.

 

    కైలాస గణపతి చెప్పటం మొదలుపెట్టాడు.

            
                                      7

 

    "ఏమిటి అదేపోతపోయారు?" మాణిక్యాంబ అడిగింది.

 

    "వీడికి వేపకాయంత వెర్రివుంది....." కైలాసగణపతిని చూపిస్తూ అన్నాడు సూర్యారావు.

 

    "నేను అడిగింది ఏమిటి మీరు చెప్పేది ఏమిటి?"

 

    "నీ ప్రశ్నకి యిదే జవాబు. విషయం ఏమిటంటే అలా షికారుకి వెళ్లాంకదా! ప్రకృతి చాలా బాగుంది అలా నడుద్దాం, ఇలా నడుద్దాం అని వూరి చివరిదాకా నడిపించాడు ఈ కైలాసనాధుడు. వీడికి పంట పొలాలు చూస్తుంటే పరవాణ్ణం తాగినంత కమ్మగా వుందిట."

 

    "చాల్లెండి" నవ్వుతూ అంది మాణిక్యాంబ.

 

    "పిల్లలు వచ్చారా!" సూర్యారావు అడిగాడు.

 

    "మీరు అటు వెళ్ళగానే ఇటు వచ్చారు. కాళ్లు కడుక్కుని రండి." అని చెప్పి మాణిక్యాంబ లోపలికి వెళ్ళింది.

 

    కైలాసగణపతి, సూర్యారావు వాకిట్లో గాబులో వున్న నీళ్ళతో కాళ్లు కడుక్కుని వచ్చారు. తుండుగుడ్డతో చేతులూ కాళ్లూ అద్దుకుని వరండాలో వున్న పడక్కుర్చీలో కైలాసగణపతి మంచంమీద సూర్యారావు కూర్చున్నారు.

 

    "పల్లెటూరి పద్ధతులు నీకు కొత్తగా వున్నాయా?" సూర్యారావు అడిగాడు.

 

    "అలవాటులేని పద్ధతులు కొత్తగానే వుంటాయి. విచిత్రంగా మాత్రం లేదు. ఈ యింటికి నేను కొత్తగా వచ్చాను. నీ దగ్గర మాత్రం కొత్తలేదు. సూరీడు ఎప్పటి సూరీడే. సరేలే పిల్లలు ఏరి ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది?" కైలాసగణపతి లోపలికి తొంగిచూస్తూ అడిగాడు.

 

    "పిలుస్తాను" సూర్యారావు అన్నాడోలేదో పక్కగదిలోంచి సూర్యారావు పెద్దకొడుకు హరి వచ్చాడు.

 

    "వీడు కైలాసగణపతి అని నా చిన్ననాటి ఫ్రెండు. ఉత్త మొండికొయ్య. ఈవూరు రారా నాయనా అని ఎన్నిసార్లు బొట్టు కాటుక పెట్టి పిల్చినా రాలేదు. ఈ రోజు వీడి అవసరానికి వచ్చాడు." కొడుక్కి కైలాసగణపతిని పరిచయం చేస్తూ చెప్పాడు సూర్యారావు.

 

    "ఒరేయ్ సూరీడూ! ఇది అన్యాయంరా. నేను ఆడదాన్ని కానురా" అన్నాడు కైలాసగణపతి.

 

    "బొట్టు కాటుక పెట్టి పిలిస్తే ఎలావస్తారు నాన్నగారూ ఎవరైనా!" నవ్వుతూ అన్నాడు హరి.

 

    "బాగా అన్నావు హరినారాయణ, వాడికలా గడ్డి పెడితేగాని బుద్ధిరాదు" అన్నాడు కైలాసగణపతి.

 

    "నాపేరు హరిప్రసాద్ మామయ్యగారూ!" వినయంగా చెప్పాడు హరి.

 

    "నాతోపాటు ఇప్పుడు నీవూ మెయ్యరా గడ్డి." గడ్డి అనే పదాన్ని నొక్కి పలుకుతూ అన్నాడు సూర్యారావు.

 

    ముగ్గురూ నవ్వుకున్నారు.

 

    ఆ తర్వాత ముగ్గురూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మాటల్లో కైలాసగణపతి పేరుకి రకరకాల తోకలు తగిలించాడు చూడు హరిబాబూ! అదికాదయ్యా హరిశ్చంద్ర ప్రసాదూ! అంటూ.

 

    హరిని చూడంగానే పెద్దమనిషి తరహాతో వినయ విధేతలు కలవాడని, బుద్ధిమంతుడిని, నిదానంగా వ్యవహరించే రకం అని తెలిసిపోతుంది. మనిషి నిదానం, మాట నిదానం. తనకి కాని విషయాలలో తల దూర్చని రకం.

 

    ముగ్గురూ మాటాడుకుంటూవుండగానే విమల లోపలి నుంచి వచ్చింది.

 

    పరస్పర పరిచయం చేశాడు సూర్యారావు.

 

    విమల నిదానంగా వుంది కానీ చూపులు చురుగ్గా తెలివిగల దానిలా వుంది. శరీర ఆకృతి మొఖము రెండూ బొద్దుగా ముద్దుగా ఆకర్షనీయంగా, ఆరోగ్యంగా వున్నాయి.    

 Previous Page Next Page