ఏకాగ్రతగా నేర్చుకోటం వల్ల కొద్ది కాలంలోనే మంచి పరిశోధకుడిని అయ్యాను. ఈ మాట నాదికాదురా
సూరీడూ! నా పరిశోధన రిజల్ట్ చూసి ఆచారి అన్నమాట యిది.... బైట వ్యాపకాలు సరదాలు అన్నీ చచ్చి పరిశోధకుడిని అయ్యా కదా! అక్కడితో ఆగకుండా కొత్త విషయాలు తెలుసుకోటంలో పడ్డాను.
ఈ సమయంలో ఆచారి నాకోవిషయం చెప్పాడు..... ఏ ఏ ప్రదేశాలలో ఏఏ రకం వాళ్ళు
వున్నది..... వాటి ప్రయోజనాలు వగైరాలన్న మాట.... ఆచారి మాటల్లో ఉరుముకొండ విషయం కూడా వచ్చింది.
"ఏమని!" అంతవరకూ మౌనంగా వింటున్న సూర్యారావు ఆదుర్దాగా అడిగాడు.
"ఉరుముకొండ తాలూకా కొండ రాళ్ళలో కొన్ని కాకీ బంగారం రాళ్ళని బంగారం తయారుచేసే రాళ్ళు కూడా మామూలు రాళ్ళలోకలిసి వున్నాయని.....
"అయితే నా వూహ రైటే......" కైలాస గణపతి చెప్పింది వింటూ సాలోచనగా అన్నాడు సూర్యారావు.
"ఏమిటి రైటు?"
"ముందు నీ కథ పూర్తి చేయి చెపుతాను."
"సరే.... ఎక్కడ ఏ ఏ రాళ్ళు వున్నాయి..... వాటి విలువ ఏమిటి? రాళ్ళతో రతనాలు పండించవచ్చా అని ఆచారి చూసేవాడు - ఎక్కడెక్కడి నుంచో విషయ సేకరణ చేసేవాడు. అప్పుడు ఉరుముకొండ విషయం కూడా తెలిసింది.
ఉరుముకొండ అనంగానే నీవు గుర్తుకొచ్చావు..... నీ విషయం ఆచారితో చెప్పాను. "మనకి తెలిసిన వాళ్ళు కూడా వుంటే మరీ మంచిది నిలవటానికి యింత చోటు దొరుకుతుంది." అటూ ఆచారి సంతోషించాడు...... ఈ వూరు రావటానికి మంచి ముహూర్తం కూడా పెట్టుకున్నాము.
ఓ రోజు ఆచారి రోడ్డుమీద నడుస్తుండగా బస్సు యాక్సిడెంట్ లో ప్రమాదానికి లోనయి అక్కడికక్కడే మరణించాడు. కొద్ది రోజులు మనసు పిచ్చి పట్టినట్లు అయింది. ఎలాగో నిబ్బరించుకున్నాను. బాగా ఆలోచించి యిలా బయలుదేరి వచ్చాను. ప్రస్తుతం పరిశోధన ప్రాణం దానిలో పూర్తిగా లీనమైనాను నేను.... నిన్నుచూసిన సంతోషం ఇక్కడికొచ్చిన ఆనందం తుంచేస్తూ నీవు నాకు అడ్డు తగులుతున్నావు.
విన్నావుగా సూరీడూ! ఇదీ నా కథ..... గాలికి తిరిగే నేను నిలకడగా ఓ పనిచేయబోతుంటే నీవెందుకో అడ్డుతగులుతున్నావు. ఆచారి ఆత్మశాంతికైనా నేను ఉరుముకొండ కొండరాళ్ళలో పరిశోధన చేయకతప్పదు. ఇహ నీవు చెప్పవలసింది నీ భయానికి కారణాలు చెప్పు. కైలాసగణపతి తనకధ చెప్పి అడిగాడు.
"నీకు బతకాలని వుందా లేదా ముందిది చెప్పు!" సూర్యారావు గాంభీర్యంగా అడిగాడు.
"నాకు బతకాలని వుందని చెప్పా కదా!"
"అయితే నీ పరిశోధన విరమించుకో."
"బతకాలని వుందా, పరిశోధన విరమించుకో లాంటి చెత్త వాగుడు మానేసి అసలు విషయం చెప్పు..... ఉరుముకొండలో పెద్దపులులుతిరుగుతున్నాయా! లేక ఆ రాళ్ళలో ఏమీ లేదా! విషయమేమిటో చెప్పు.... అప్పుడు నేను అర్థం చేసుకోటానికి వుంటుంది. అంతేగానీ గోడమీద పిల్లి వాటంగా చెపితే ఏం చేయాలో నాకెలా తెలుస్తుంది?" కైలాసగణపతి అన్నాడు.
"నిజమేలే" అని తల తాటించి "హత్య అంటే నీకు భయమా?" అని అడిగాడు సూర్యారావు.
కైలాసగణపతి ఉలిక్కిపడ్డాడు..... ముఖం అంతా పాలిపోతుండగా "హత్యా?" అన్నాడు భయంతో.
"చూశావా హత్య అనంగానే నీవెంత భయపడ్డావో! నా భయంనాది.... అందుకే పరిశోధన విరమించుకో అంటున్నాను."
"నీ తీరు ఎలా వుందంటే సూరీడూ! పరిశోధన మానకపోతే నేనే నిన్ను హత్యచేస్తాను సుమా! అని హెచ్చరిస్తున్నట్లు వుంది."
"ఛా...... అదేం మాటరా కైలాసం!" నొచ్చుకుంటూ అన్నాడు సూర్యారావు.
"మరి విషయం వివరంగా అఘోరించు."
"ఇంతకు క్రితం ఉరుముకొండలో రాళ్ళని పరిశోధించటానికి నీలాగానే కొందరు వచ్చారు. వారం తిరిగేసరికి ఇద్దరూ మాయం అయ్యారు. ఒకటి అవయవాలు అయితే పెద్దరాయికింద పడి చితర చితర అయ్యాయి. మరొకడు నీళ్ళలో తేలాడు. వేరొకడి గుడ్డలు పీలికలయి వళ్ళంతా ఏ జంతువో పీక్కు తిన్నట్లు అయ్యాడు. ఇలా వీళ్ళంతా తలోరకంగా చంపబడ్డారు. అనగా హత్య చేయబడ్డారు. ఇప్పుడు చెప్పు నీకు బతకాలని వుందా! పరిశోధన చేయాలని వుందా!"
"బతకాలని వుంది పరిశోధన చేయాలని వుంది. ముందీ విషయం చెప్పు. ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా చచ్చారు. మరి హత్య అంటావు ఏమిటి?" కైలాస గణపతి నవ్వుతూ అడిగాడు.
"తర్వాత పోలీసులు వచ్చి పరిశోధన చేశారు. చివరికి చచ్చిన వాడిది హత్య అని తేల్చారు."
"మరి మొదట స్వర్గస్తులైన వాళ్ళ సంగతి ఏమిటట?"
"అప్పటికింకా రంగప్రవేశం చేయలేదు పోలీసులు."
"ఎందుకని?"
"చచ్చినవాళ్ళంతా తలో రకం యాక్సిడెంటులో చచ్చారనుకొని పోలీసుల దాకా వ్యవహారం పోకపోవటమే."
"మొదటి వాళ్ళంతా హత్య కాబడలేదేమో!"
"కాదు వాళ్ళు హత్య కాబడ్డారు."
"అలా అని ఎలా చెప్పగలవ్ రా సూరీడూ!"
డిటెక్టివ్ లాగా దిక్కుమాలిన ప్రశ్నలు వేయకు ఉరుముకొండలో పరిశోధన చేయటానికి యిప్పటికి పదిమంది దాకా వచ్చారు.
తలోరకంగా నెలలోపల రెండు నెలలలోపల చచ్చారు. కాదు హత్య కాబడ్డారు. ఈ విషయం ఊరు ఊరుతెలుసు. పరిశోధనకి ఈ వూళ్లో ఏ శాల్తీ అన్నా దిగబడిందంటే వాడు హత్య చేయబడతాడని మేమంతా గాఢంగా నమ్ముతున్నాము. అక్కడ రాళ్ళని పరిశోధించడం ఎవరికీ యిష్టంలేదు. అందుకే హంతకులు చాటుగా మాచేసి వచ్చినవాడిని హత్య చేస్తున్నారు. ఎందుకో ఏమిటో మాకనవసరం. హత్య కాబడతాడని నమ్ముతున్నాము సరేనా!"
"మీరు నమ్మే మాట వరకూ సరేలే. పోలీసులు కొండనంతా గాలించకపోయారా?"
"గాలించారు."
"ఆధారాలు ఏమన్నా దొరికాయా?"
"ఆ..... చెత్తాచెదారం కొండరాళ్ళు." సూర్యారావు చెప్పాడు.
ఆ మాటవిని కైసాలగణపతి పెద్దపెట్టున నవ్వాడు.వీడికేమైనా మతి చలించిందా అన్నట్లు చూశాడు సూర్యారావు.
"కనుక సూరీడూ! నీ మాటలనిబట్టి చూస్తే అంతా ట్రాష్ అనిపిస్తున్నది. పోలీసులు కొండ మొత్తం గాలిస్తే బండరాళ్ళు తప్ప ఏమీ దొరకలేదు. హత్య చేయబడింది ఒకడు. మిగతావాళ్ళు కాలం కర్మం మూడినవాళ్ళు. మీ వూరివాళ్ళు అర్ధంలేని భయంతో ఓ కధ అల్లినవాళ్ళు. మైండిట్!"