విమలకూడా కైలాసగణపతిని "మామయ్యగానే" పిలిచింది. ఆ విధంగా సంబోధిస్తూ.
"కూర్చో విమలమ్మ తల్లీ!" అన్నాడు గణపతి.
కొద్దిసేపు ఆగి "మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది మామయ్యగారూ!" అంది విమల.
పక్కలో బాంబు పడినట్లు ఉలిక్కిపడ్డాడు కైలాస గణపతి. ఆయన ఉలిక్కిపడటం ముగ్గురూ గమనించారు. కాపోతే విమల ఆ మాట అంటే ఎందుకు ఉలిక్కిపడ్డాడో అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు.
"నన్ను...... నన్ను...... ఇదివరకు చూశావా కమలా!" కంగారు అణుచుకుంటూ అడిగాడు కైలాసగణపతి.
"నా పేరు కమల కాదండీ మామయ్యగారూ! విమల మిమ్మల్ని చూశానని చెప్పడం లేదండీ. ఈ వేషంలో మీలాంటి వ్యక్తిని చూసినట్లు వుంది అన్నాను. ఉండండి కాస్త ఆలోచించి చెపుతాను" అంటూ విమల కళ్ళు మూసుకుని దీర్ఘాన్వేషణలో పడ్డదానిలా వుండిపోయింది.
విమల తపోభంగం చేయటం ఇష్టంలేనట్లు ఎవరికివారు మౌనంగా వుండిపోయారు.
కైలాసగణపతి కళ్ళార్పకుండా విమలనే చూస్తూ వుండిపోయాడు.
"ఇప్పుడంటే యింతసేపు ఆలోచిస్తున్నదిగానీ మా విమల ఓసారి చూసిన వ్యక్తిని మర్చిపోదురా కైలాసం. వేషబాషల్లో కూడా చాలా మార్పు వచ్చింది."
సూర్యారావు అంటుంటే "ఇష్" అన్నాడు కైలాసగణపతి. ఇష్ కి అర్థం మాట్లాడవద్దని.
విమల నెమ్మదిగా కళ్ళు తెరిచింది.
విమల చెప్పబోయేదాన్ని గురించి చెవులురిక్కించి కళ్ళు పత్తికాయల్లా చేసుకొని కూర్చున్నాడు కైలాసగణపతి.
"గుర్తువచ్చింది" అంది విమల.
"నాలాంటివాడు ఎవరు, ఎక్కడ వున్నాడు? ఆతృతగా అడిగాడు కైలాసగణపతి."
"లేడు."
"మరి లేనప్పుడు గుర్తుకొచ్చింది ఏమిటి?" హరి నవ్వుతూ అడిగాడు.
"మామయ్యగారిలాంటి మనిషి." విమల చెప్పింది.
"ఓ పక్క లేడు అంటున్నావు. మరోపక్క వున్నాడు అంటున్నావు. ఇంతకీ వున్నట్లా లేనట్లా?"
"వుండీ లేనట్లు."
"విమ్మూ! తమాషాలు తర్వాత. చూస్తే చూశానని చెప్పు లేదంటే లేదని చెప్పు" హరి కోప్పడినట్లు అన్నాడు.
"నేను చూడలా ఓ రచయిత్రి చూసింది."
"ఆ రచయిత్రి పేరు?"
ఆ రచయిత్రి పేరు చెప్పింది విమల.
"ఆమెని నీవెప్పుడూ చూడలేదుకదా మరి ఎప్పుడు నీతోచెప్పింది? కలలోనా!
"ఉహూ. చెప్పింది."
"ఎప్పుడు ఎక్కడ?"
"ఒక క్రైమ్ నవలలో చెప్పింది."
"అదీ అలా చెప్పు."
"ఇప్పుడు చెప్పింది అలాగే కదా!"
అన్నా చెల్లెళ్ళ ఫార్స్ చూస్తుంటే కైలాసగణపతికి వళ్లు మండింది. అయితే అనువుగాని చోట వళ్ళు మండినా కళ్ళు మండినా లాభం లేదని గ్రహించినవాడు కాబట్టి నోరు మూసుకున్నాడు.
"ఇంక చాలుగానీ అసలు విషయం చెప్పు." సూర్యారావు మందలింపుగా అన్నాడు.
"ఆ రచయిత్రి గొప్ప సస్పెన్స్ క్రైమ్ నవల వ్రాసింది. ఆ నవలలోని పాత్ర అచ్చం మామయ్యగారిలాగా ఉంటుంది. ఆమె ఆ పాత్రని ఎంత బాగా వర్ణించింది అంటే నేను ఈ రోజుకి కూడా గుర్తుంచుకునేటంతగానన్నమాట. మామయ్యగారు వేసుకున్న కోటు దగ్గరనుంచి కాలిబూటు వరకూ ఇదే వర్ణన" విమల వివరించింది.
కైలాసగణపతి తేలికగా ఊపిరి పీల్చుకుంటూ "ఆ నవలలో ఆ పాత్ర ఏమి చేస్తుంది?" అన్నాడు.
విమల కాస్త ఆలోచించి చెప్పింది.
"కధలో అతను డిటెక్టివ్. మూడొంతుల కధ అతను మారువేషంలో వుంటాడు! అతనే దొంగ
అనుకుంటాము. కానీ డిటెక్టివ్ అన్న మాట చివరికి తెలుస్తుంది, అతను వేసిన మారువేషం అచ్చం ఇప్పుడు మామయ్యగారు వున్నట్లు" వుంటుంది.
"ఒరేయ్ కైలాసం నీకెంత యోగం పట్టిందిరా! మారువేషంలో వచ్చిన డిటెక్టివ్ వి అయిపోయావు. ఎలాగూ వచ్చావు. బాబ్బాబు ఈమధ్య మా యింట్లో మిల్లిగరిటపోయింది. కాస్త పరిశోధన చేసి అదెక్కడుందో ఎవరు తీసికెళ్ళారో చెప్పరా నాయనా! ఫీజు నిమిత్తం మీ చెల్లెమ్మ చేత కోవా కజ్జికాయలు చేయించి నీ పీకదాకా తినిపిస్తాను. సరేనా! కేసు ఒప్పుకుంటావా?" సూర్యారావు నవ్వుతూ అడిగాడు.
"ఫీజు అక్కరలేదుగానీ సూరీడూ! మిల్లి గరిటమీద ఆశ వదులుకో. దానిని దొంగిలించింది మనిషికాదు, కాకి. గరిటకున్న నేతినితిని దానిని ఎక్కడో వదిలేసింది. దట్సాల్" ఓ ఫోజుపెట్టి మరీ చెప్పాడు కైలాసగణపతి.
అందరూ హాయిగా నవ్వుకున్నారు.
ఆ తరువాత నలుగురూ మాటల్లో పడ్డారు.
"మీ చిన్నవాడు ఏడిరా?" కైలాసగణపతి అడిగాడు.
"పది యిళ్ళ పాపయ్యవాడు. అందరితో మాట్లాడి అంతా చక్కబెట్టుకుని భోజనం టైమ్ కి కరెక్టుగా యిల్లు చేరుతాడు. వాడుత్త కబుర్లపోగు చూస్తావు కదా" అన్నాడు సూర్యారావు.
"అయితే నాకు మంచి కాలక్షేపం అన్నమాట!"
"కాలక్షేపం మాటకొస్తే నేను లేనా? నీ తోకలాగా నేను తిరక్కతప్పదు కదా!"
"తిరగటం ఏమిటి నాన్నగారూ" హరి కల్పించుకుని అడిగాడు.
"వీడికీ మధ్య ఆరోగ్యం చెడిపోయింది. ఆ తరువాత నేను గుర్తుకు వచ్చాను. కొత్త వాతావరణంలోకి వెళ్ళి కొండగాలి పైరుగాలి కొన్నాళ్ళు మేయి దాంతో నీకు ఆరోగ్యం వస్తుంది. ఇంతకు మించినమందు నీ జబ్బుకి లేదని పెద్ద డాక్టరు చెపితే కొండలు, చేలు ఎక్కడ వుంటాయని ఈ కైలాసం ఆలోచించాడు. అప్పుడు గుర్తుకొచ్చింది ఉరుముకొండ. ఆ తరువాతే నేను గుర్తుకొచ్చాను" నవ్వుతూ చెప్పాడు సూర్యారావు.
"సరేలేరా నీ అబద్ధాలు నీవూను. రోజూ సూర్యుడిని చూస్తున్నప్పుడు సూరీడు గుర్తు రాకుండా ఎలా వుంటాడు."