Previous Page Next Page 
చీకటికి అవతల పేజి 9


    అయినా చలపతిరావు వృద్ధుడు. పైపెచ్చు ప్రకాష్ తో ఢీకొనే అంగబలంగానీ, అర్థబలంగానీ లేనివాడు. కానీ చేతకానివాడిలా చలపతిరావు మూల కూర్చునే మనిషి కాడు. ప్రకాష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించాడు.

 

    అదిగో ఆ కార్యంమీదే వాల్  ఘెరాకి వచ్చిన  చలపతిరావు అంత రాత్రిపూట  ఒంటరిగా బండికోసం చూస్తున్నాడు. ప్రశాంతంగా వున్న వాతావరణం ఒక్కసారిగా కదిలినట్టు  రావిచెట్టు శబ్దం  చేస్తోంది.

 

    చలపతిరావు తల పైకెత్తి చూశాడు.ఆకాశంలో నల్లటి మబ్బులు కుస్తీలు పడుతున్నట్టు  ఒకదానిమీద  ఒకటిపడి దొర్లుతున్నాయి. చీకటి ముచ్చటపడి ఒంటికంతా కాటుక రాసుకున్నట్టు మరింత నలుపెక్కింది. గాలి శవంలా చల్లగా తగులుతోంది.

 

    వర్షం వచ్చే సూచనలున్నట్టు అనిపించింది చలపతిరావుకి. ఆయన అనుకుందే తడవుగా చినుకులు రాలడం ప్రారంభమైంది.

 

    స్టేషన్ రేకులమీద వర్షం చప్పుడు దెయ్యాల నృత్యానికి పిశాచాలు వాయిస్తున్న మృదంగంలా వుంది. ఎక్కడో నక్క ఊళ పెడుతోంది.

 

    ఇప్పుడీ వర్షంలో ఎలా వెళ్లడం అన్న ఆందోళన ప్రారంభమైంది చలపతిరావుకి.

 

    రైల్వేస్టేషన్ లోకి వెళ్ళాలనుకున్నాడుగానీ కుష్టురోగి గుర్తుకు రావడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు.

 

    వర్షం నుంచి కాస్తయినా రక్షించుకుందామని చెట్టు మొదట్లో కెళ్ళి నిలబడ్డాడు.

 

    అంతలో చెట్టు అవతల ఏదో కదిలినట్టనిపించి, గుండె చిన్న జర్క్ ఇచ్చి మళ్ళీ కుదుటపడింది.

 

    కళ్ళు సాగదీసి అటువేపు పరికించి చూశాడు. ఏదో ఆకారం తన దగ్గరకే వస్తోంది.

 

    "కౌన్ హై?" ధైర్యాన్ని అరువు తెచ్చుకొని కొంచెం తడబడుతూ ప్రశ్నించాడు.

 

    "మై- మీరాభాయ్" అతను ముందుకొచ్చాడు.

 

    అప్పుడే ఓ మెరుపు మెరిసింది. అతని రూపు క్షణంసేపు కనుగుడ్డులో గుచ్చుకుపోయింది. చింపిరితల, ఏ ఆచ్చాదనాలేని ఛాతీ, కింద లాజుగా వేలాడుతున్న నిక్కర్ తో వున్న మీరాభాయ్ కి కుడిచెయ్యి పూర్తిగా లేదు. ముంజేతి వరకు వేలాడుతున్న ఆ చెయ్యి చర్మపు ఒరలో ఎముక కత్తిని దాచిపెట్టుకున్నట్టనిపించింది చలపతిరావుకి.

 

    "ఎవర్నువ్వు?" అనడిగాడు వచ్చీ రాణి హిందీలో చలపతిరావు.     

 

    అప్పటికింకా భయం తగ్గలేదు ఆయనకి. నాలుక ఎండిపోయి రబ్బర్ ను నోట్లో వుంచుకున్నట్టుంది. శరీరం వణుకుతోంది.

 

    కుష్టువాడ్ని చూసిన భయం ఇంకా మాయం కాక మునుపే ఒంటిచేత్తో మరో మనిషి కనిపించడంతో ఆయన జడుసుకున్నాడు.

 

    "నేను బండివాడ్ని" మీరాభాయ్ తప్పుల్లేని హిందీలో చెప్పాడు.

 

    ఆ మాటలు విన్నాక చలపతిరావు కుదుటపడ్డాడు. గుండెల్నిండా ఊపిరి పీల్చుకొని వదిలి-

 

    "వాల్ ఘెరా వస్తావా?" అనడిగాడు.

 

    "వస్తాయన్ సాబ్- ఇరవయ్ రూపాయలిప్పించండి"

 

    మామూలుగా అయితే చలపతిరావు గీచిగీచి బేరం చేసేవాడేగానీ కుష్టువాడికి కనిపించకుండా వెంటనే పారిపోవాలన్న తొందరకొద్దీ ఇరవై రూపాయలకు ఒప్పుకున్నట్టు తలూపాడు.

 

    మీరాభాయ్ చెట్టు వెనక్కి వెళ్ళి ఐదు నిమిషాలకి బండి కట్టుకు వచ్చాడు.

 

    అంది ఒంటెద్దు గూడుబండి. అందులో ఎక్కి కూర్చున్నాడు చలపతిరావు.

 

    బండి కదిలింది.

 

    కొత్త ప్రదేశం- అందులోనూ రాత్రి- చలపతిరావుకి గుబులు- గుబులుగా వుంది.

 

    ఆకాశంలోని చంద్రవంక ఎవరో మంత్రంవేస్తే తనతోపాటు వస్తున్నట్లు వుంది.

 

    దారికి అటూ ఇటూ వున్న తుప్పలు దెయ్యాల కోసం పద్మాసనం వేసుకొని తపస్సు చేస్తున్నట్టున్నాయి. బండి వెనుక నుంచి లేస్తున్న దుమ్ము అగ్నిగుండం నుంచి వస్తున్న పొగలా కళ్ళల్లో దూరి మంట పుట్టిస్తోంది. మనసుని ఎంత డైవర్ట్ చేసుకుంటున్నా అది మాత్రం ప్రకాష్ మీదున్న పగతో పుక్కళింతలవుతోంది.   

 

    చలపతిరావు నేచురే అంత. ఆయన ఏదయినా అనుకుంటే అది పూర్తయ్యేవరకు నిద్రపోడు. ఆ ఆలోచన తప్ప మరో ఆలోచనకు తావు ఇవ్వడు.

 

    ప్రకాష్ తో ఆయనకి ఎందుకు వైరం వచ్చిందో వివరంగా తెలుసుకోవాలంటే మనం ఓ నెలరోజులు వెనక్కి వెళ్ళాలి.

 

    చలపతిరావుకి తనలాగే ఒక్కగానొక్క కొడుకు. పట్నంలో చదివిస్తే చెడిపోతాడని వున్న వూర్లోనే చదివించాడు. మొక్కగా వున్నప్పుడే వంచాలి అన్న సూత్రంతో కొడుకును తనకు అనుగుణంగా పెంచాడు. చిన్నప్పటి నుంచీ డబ్బుకున్న విలువ ఏమిటో నేర్ఫాడు. దాంతో చలపతిరావు కొడుకు శ్రీహరి డబ్బు ధ్యాస తప్ప మరో ఆలోచన లేకుండా పెరిగాడు. డబ్బు సంపాదనకు చదువు అక్కరలేదని కూడా తెలుసుకున్నాడు. అందుకే పదవతరగతి పాసయ్యాక పుస్తకాలను ఎత్తి అటకమీద పారేశాడు.

 

    "చదువుకుంటే ఏం వస్తున్నది?" అన్న కొడుకును చూసి చలపతిరావు ఓ క్షణంపాటు షాక్ తిన్నా తన కొడుకు సరయిన దారిలోనే పడ్డాడని గ్రహించాడు.

 

    'ఏం వస్తుంది' అంటే అర్థం డబ్బు ఏం వస్తుందని శ్రీహరి ఉద్దేశ్యము. కొడుకు మనసుని గ్రహించిన చలపతిరావు 'ఏం రాదు' అని చెప్పాడు తప్ప మరి మాట్లాడలేదు. అలా శ్రీహరి పదవ తరగతిలోనే చదువుకి పుల్ స్టాప్ పెట్టేసి తండ్రికి చేదోడు వాదోడుగా వుండిపోయాడు.

 

    తనతోటి స్నేహితులు తల్లిదండ్రులతో ఎప్పుడయినా పేచీకి దిగితే శ్రీహరి ఆశ్చర్యపోయేవాడు.

 

    తల్లిదండ్రులతో ఘర్షణపడడం అంటే అది ఆ పిల్లలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటున్న ప్రయత్నం అని శ్రీహరికి అర్థంకాలేదు.

 

    "ఎందుకు మీరంతా పెద్దలతో ఎప్పుడూ ఘర్షణపడతారు? అలా ప్రవర్తిస్తే ఏం వస్తుంది?" అని తన సహజధోరణిలో అడిగేవాడు.

 

    అలాంటి శ్రీహరికి పాతికేళ్ళు వచ్చాయి.

 

    చలపతిరావు కొడుక్కి పెళ్ళి చేయాలని ఓ శుభముహూర్తంలో నిశ్చయించాడు.

 

    ఆ రోజు భోజనాలు చేస్తుండగా ఈ టాపిక్ ను మొదట చలపతిరావు భార్య తెచ్చింది.

 

    "మనవాడికి పాతికేళ్ళొచ్చాయి. వాడి ఈడు వాళ్ళందరికి పెళ్ళిళ్ళు అయిపోయి బిడ్డల తండ్రులు కూడా అయిపోయారు. మరి మనవాడిచేత ఆ మూడు ముళ్ళు ఎప్పుడు వేయిస్తారు?" అనడిగింది.

 

    "వేయిస్తాలేవే- తొందరెందుకు?" అన్నాడు చలపతిరావు పక్కనే కూర్చుని భోజనం చేస్తున్న శ్రీహరి తలమీద ఆప్యాయంగా చేయివేసి.

 

    "పెళ్ళా! నాకా!! అయినా పెళ్ళి చేసుకుంటే ఏం వస్తుంది?" అన్నాడు శ్రీహరి భోజనం ఆపి.

 

    ఆ ప్రశ్నకు మహాలక్ష్మమ్మ తల గిర్రున తిరిగింది. తన కొడుకు అమాయకంగా ఆ ప్రశ్న అడిగాడని ఆమె నమ్మలేకపోయింది.

 

    బయట టౌన్ ముఖం ఎరక్కుండా తోటిపిల్లల్తో కలవనీయకుండా పెంచడంవల్లే వాడు ఎందుకూ పనికిరాకుండా పోయాడని ఆమె అనుకుంది. అందులోనూ చిన్నప్పట్నుంచీ వాడి ముందు డబ్బు ఎంత విలువైందో, దాన్ని ఎలా కాపాడుకోవాలో, చెప్పడమే ఓపనిగా పెట్టుకున్నాడాయె తండ్రి.

 

    అయితే చలపతిరావు కొడుకు ప్రశ్నకు తెల్లబోలేదు. పైపెచ్చు తన పెంపకంలో పెరిగి, అలా తయారయిన కొడుకుని చూసి గర్వపడ్డాడు కూడా.

 

    "చాలా వస్తాయి నాన్నా. బోలెడంత డబ్బొస్తుంది. నిన్ను కనిపెట్టుకుని వుండటానికి ఓ మనిషి వస్తుంది. దానికి కాస్తంత తిండి పడేస్తే చాలు- అది నువ్వు వదిలేసిన అండర్ వేరును కూడా శుభ్రంగా ఉతికి పెడుతుంది. నువ్వు కోపం చేసుకుని నాలుగు తగలేస్తే కుక్కిన పేనులాగా నీ కాళ్ళ దగ్గర పడుంటుంది. నీకు బిడ్డల్ని కని నీ వంశం నిలబెడుతుంది"

 Previous Page Next Page