"డబ్బు వస్తుందన్నావు. ఎంతొస్తుంది నాన్నా?" తండ్రి చెప్పిన సమాధానంలో అతనికి నచ్చిన ఒకే ఒక్క పాయింట్ అదే.
"చాలానే వస్తుందిరా. నువ్వు పెళ్ళి చేసుకునే పిల్ల పేరేమిటనుకున్నావ్? అనూహ్య- ప్రకాష్ చెల్లెలు. వాడు రోజుకి కొన్నివేల రూపాయలు సంపాదిస్తున్నాడు. సిటీలో బాగా డబ్బున్నవాళ్ళు నివసించే లవ్లీహిల్స్ లో వాడు కాపురం వుండేది."
"మంచి సంబంధమండీ అది. ఆ అమ్మాయిని రెండేళ్ళ క్రితం అనుకుంటాను- సుచిత్ర పెళ్ళిలో చూశాను. ఎంతో బావుంటుంది. ఇక అనుకున్నారు కదా ఆలస్యమెందుకు? రేపో మర్నాడు బయల్దేరండి. ఓ మాట ఖరారైపోతే నాకు నిశ్చింత" మహాలక్ష్మమ్మ భర్తను తొందర చేసింది.
చలపతిరావు మరునాడే సిటీకి బయల్దేరాడు కొడుకుని పిలుచుకుని.
సిటీలో దిగగానే ఆయన ప్రకాష్ ఇంటికి వెళ్ళలేదు. ఓ హోటల్ లో దిగి ఫోన్ చేశాడు.
"ఇంటికి రాకూడదని కాదు. నేనొచ్చిన పని వేరు. నాతోపాటు శ్రీహరి కూడా వచ్చాడు. మీ చెల్లెలు అనూహ్యను నా కొడుక్కి అడగడానికి వచ్చాను. గతికితే అతకదు గనుక హోటల్ లో దిగాను. ఏమీ అనుకోకు. పెళ్ళి చూపులు ఆరెంజ్ చెయ్."
ఆ సమయంలో ప్రకాష్ ఆఫీసులో వున్నాడు. సిటీలోని లారీలన్ని ఒంటిచేత్తో నడిపే అతను ఆ మాటల్ని వినగానే టెన్షన్ లో పడిపోయాడు.
అనూహ్యను పెళ్ళి చూపులకి కూర్చోబెట్టడం అంత సులభమైన విషయమేం కాదు.
"అయిదు నిముషాల్లో ఎదురుగ్గా కూర్చున్న వ్యక్తిని గురించి ఏం తెలుస్తుంది? పెళ్ళికి కావలసింది పైపై మెరుగులు కాదు. పెళ్ళంటే రెండు శరీరాలు కలుసుకునేందుకు సంఘం ఇచ్చే లైసెన్స్ కాదు. పెళ్ళంటే రెండు మనసుల కలయిక.
పెళ్ళి చేసుకోబోయే వ్యక్తిని గురించి ముందు బాగా తెలియాలి. ఆ వ్యక్తి గుణగణాలు నచ్చాలి. అంత చక్కటి వ్యక్తి మనతో ఎప్పుడూ ఉంటే ఎంత బావుండు అనిపించాలి. ఆ కోరిక రోజు రోజుకీ ఎక్కువవ్వాలి. ఇక ఆ వ్యక్తి లేకపోతే బతకడం కష్టం అనిపించినప్పుడు మనలాంటి స్థితిలోనే వుండాలి. అప్పుడు పెళ్ళితో ఇద్దరూ ఒక్కటవ్వాలి."
ప్రకాష్ మొదట పెళ్ళి సంబంధం తెచ్చినప్పుడు అనూహ్య నిర్మొహమాటంగా, నిర్భయంగా చెప్పిన మాటలివి. చెల్లెలి విషయం తెలిసిందే గనుక ప్రకాష్ ఆమె చెప్పింది విని ఏమీ ఆశ్చర్యపోలేదు. ఆమెకి అనుభవం కంటే అనుభూతి ముఖ్యం.
మంచి పొయిట్రీ చదువుతూ భావోద్వేగం తట్టుకోలేక ఏడ్చే పిల్ల ఆమె. తన ఫీలింగ్స్ ని ఎప్పుడూ దాచుకోదు. తనకు కరెక్టు అనిపించిన దాన్ని ఎందర్ని ఎదిరించైనా ఆచరిస్తుంది. తనకు నచ్చని దాన్ని ఎవరెంత బలవంతం చేసినా చేసే రకం కాదు.
"అయితే నీ ఇష్టమమ్మా. నేను ఇక ఎప్పుడూ పెళ్ళిసంబంధాలు తీసుకురాను. నువ్వు ఎవర్ని ఎంపిక చేసుకున్నా దగ్గరుండి పెళ్ళి జరిపించే పూచీ నాది" అని ప్రకాష్ లెంపలు వేసుకున్నాడు.
మరిప్పుడు చలపతిరావు ఫోన్ చేసి విషయం చెప్పగానే ఏం చేయాలో చప్పున తోచలేదు ప్రకాష్ కి. పెళ్ళిచూపుల వూసెత్తకుండా ఏమీ తెలియనట్టు మేనేజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఇంటికెళ్ళగానే "మా మావయ్య- అదే చలపతిరావు- ఆయన కొడుకు సాయంకాలం ఆరుగంటలకి మనింటికి వస్తున్నారు" అని భార్య మాయాదేవితో చెప్పాడు.
ఆ సమయంలో అనూహ్య అక్కడే వుంది.
ఆ మాట మాత్రం చెప్పి తిరిగి ఆఫీసుకి వచ్చేశాడు.
సాయంకాలం అయిదుగంటలకల్లా ఆఫీసు పనులు తన అసిస్టెంట్లకు అప్పజెప్పి ఇంటికి వచ్చేశాడు.
బంధువులొస్తున్నారు గనుక మాయాదేవి రెండు రకాల స్వీట్సు, ఓ రకం కారం చేసింది.
సరిగ్గా ఆరుగంటలకు చలపతిరావు, ఆయన కొడుకు శ్రీహరి ఇంటికొచ్చారు. విశాలమైన ఆవరణలో కేకుముక్కలా వున్న ఆ ఇల్లుని చూడగానే శ్రీహరి ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.
"పెళ్ళివల్ల చాలానే వస్తాయి" అన్న తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. అనూహ్యను చూడగానే అలా స్టిల్ చిత్రంలా నిలబడిపోయాడు అతను.
కనుపాపల్లో విజ్ఞానాన్ని కూరుకున్నట్టు మెరుస్తున్న విశాలమైన కళ్ళు, అందం దగ్గర నుండి ఆ వంపుని తీర్చిదిద్దినట్టు మన్మధుని బాణంలా వున్న ముక్కు, లాలిత్యమంతా పెదవులైపోయినట్టు చూడడానికే సుతిమెత్తగా అనిపించే పెదవులు, సాక్షాత్తూ బ్రహ్మదేవుడే కాసేపు కుమ్మరైపోయి నునుపు చేసినట్టు నున్నటి కంఠం, రతీదేవి సూచనల మేరకు తయారైనట్టున్న ఎత్తయిన ఎద, పూలన్నిటినీ ఓ దగ్గర చేర్చి, పొడిచేసి పూసినట్టున్న ఆమె ఒంటిరంగును చూస్తుంటే అతనికి తల తిరిగింది.
ఇద్దరితోనూ కాసేపు మాట్లాడి అనూహ్య బయట లాన్ లోకి వచ్చి కూర్చుంది. ఆమెకు హిపోక్రసీ అంటే నచ్చదు. మనసులో ఏం లేకుండా ఎదుటివాళ్ళ ముఖస్తుతి కోసం మాట్లాడదు.
అందుకే పలకరింపులయ్యాక తను ఒంటరిగా వచ్చి కూర్చుని అంతక్రితం సగంలో ఆగిపోయిన నవలను చదువుకుంటోంది.
ఇది గ్రహించిన చలపతిరావు కొడుకుతో-
"కోడలుపిల్ల బయట కూర్చున్నట్టుంది. వెళ్ళి ఏమన్నా మాట్లాడి రారా" అన్నాడు.
శ్రీహరి ఇక ఏమీ మాట్లాడకుండా తండ్రి మాట ప్రకారం లాన్ లోకి వచ్చాడు.
అనూహ్య దగ్గిరికి వెళ్ళి నిలుచున్నాడు.
ఆమె తల ఎత్తి అతన్ని చూసి కూర్చోమన్నట్టు ఎదురుగా వున్న ఫేము కుర్చీ చూపించింది.
అతను కూర్చుని ఆమె చేతిలో వున్న పుస్తకం చూసి "ఏమిటది?" అని అడిగాడు.
"నవల- ది టేల్ ఆఫ్ టు సిటీస్"
"అంటే పుస్తకమా? ఎవర్రాశారు?"
"ఛార్లెస్ డికెన్స్"
"అది చదివితే ఏం వస్తుంది?"
ఆమెకి ఆ ప్రశ్న అర్థం కాలేదు.
సాల్వడార్ డాలే ఏం వస్తుందని సర్రియలిస్టిక్ చిత్రాలు గీశాడు? ప్లాబోనెరుడా ఏం వస్తుందని పొయిట్రీ రాశాడు? ఛార్లెస్ డికెన్స్ ఏం వస్తుందని పుస్తకాలు రాశాడు? సార్త్ర్ ఏం వస్తుందని కొత్త ఫిలాసఫీని ఈ ప్రపంచానికి ఇచ్చాడు? బుద్ధుడు ఏం వస్తుందని బోధివృక్షం కింద కూర్చున్నాడు.
తను ఏం వస్తుందని ఈ నవల చదువుతోంది?
"అంటే? అర్థం కాక మరోసారి అడిగింది.
"ఇలా పుస్తకాలు చదవడంవల్ల ఏం లాభం?" ఈసారి మరింత విడమరిచి చెప్పాడు అతను.
"లాభమంటే- ప్రపంచాన్ని గురించి తెలుస్తుంది"
"ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటే ఏం వస్తుంది?"
అతనికి ఏం చెప్పాలో తెలియక ఓ క్షణంపాటు ఆమె తల పట్టుక్కూర్చుంది.