అయిదు నిముషాల తర్వాత బొటనవేలి ముద్రల ఆధారంగా, నెమ్మదిగా పునర్జన్మ వివరాల్ని చెప్పడం ప్రారంభించాడు శివస్వామి.
వింటున్నాడు ఆ వ్యక్తి అమితమైన జిజ్ఞాసతో.
అరగంటసేపు శివస్వామి ఆ తాళపత్రంలో వున్న సంస్కృత శ్లోకాలను ఒక్కొక్కటి చదివి, వాటి ఉత్పత్తి అర్థాన్ని విశదీకరించాడు.
'నాకు సమగ్రంగా వివరించగలరా?" అని అడిగాడాయన.
చెప్పసాగాడు శివస్వామి.
"పుట్టిన ప్రతి వ్యక్తి పునర్జన్మ పొందడం జరగదు. పునర్జన్మ పొందడం సుకృతభాగ్యం. వరం! యోగుల్లోనూ, సిద్ధుల్లోనూ, మహాత్ముల్లోనూ మానవాత్మ ఏడు జన్మల వరకూ చెక్కు చెదరకుండా స్థిరంగా వుంటుందని, భౌతిక దేహాన్ని మాత్రమే మార్చుకుంటుందని, ఆత్మ నిత్యమై, గత జన్మ సంస్కారంతో వర్థిల్లుతుందని శాస్త్రం చెప్తోంది"
"నాకు పూర్వజన్మ..."
"ఆ పాయింట్ కే వస్తున్నాను. మనిషి ఏడు జన్మలు పొందుతాడు. పూర్వస్పృహ వున్నదే పునర్జన్మ. ఈ జన్మలో మానవాకారంలో వున్న మీరు, గత జన్మలో ఏ ఆకారంలో వున్నదీ... మీ అత్మకే తెలుస్తుంది. మిమ్మల్నెప్పుడయినా మీ పాత జ్ఞాపకాలు అనుసరించాయా....? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని చెప్పండి" అడిగాడు శివస్వామి.
"పాత జ్ఞాపకాలు- అంటే గతజన్మకు సంబంధమైన జ్ఞాపకాలా?" ఒక్కక్షణం ఆగి కళ్ళు మూసుకున్నాడు ఆ వ్యక్తి.
అర్థనిమిళితుడైన ఆ వ్యక్తివైపు తదేకం చూస్తున్నాడు శివస్వామి.
జ్యోతిర్ ప్రభా సముచ్చయం ఆయన దివ్య ముఖంలో ద్యోతకమవుతోంది.
"మనిషిగా పుట్టాను... నిర్దిష్ట లక్ష్యంతో పెరిగాను. బతుకంతా దేహ సుఖాన్ని త్యాగంచేసి కష్టించాను. చివరకు నాకోసం మిగిలింది నేనే... అపూర్వమైన మానవ జన్మను ఏదో కసితో, పేదరికం మీద పగ, ప్రతీకారాలతో అనుక్షణం అనవరతం శ్రమించి కోట్లాది సంపాదనను నా స్వంతం చేసుకొనే ప్రయత్నంలో నా జీవితాన్ని నిరర్ధకం చేసుకున్నాననుకుంటున్నాను. అందుకే నాకు మరో జన్మ కావాలి...
అందుకే- నా మరణం గురించి నాకు తెలియాలి. పునర్జన్మ గురించి తెలుసుకోవాలి. అవును నాకు మరో జన్మ కావాలి. పునర్జన్మ పొందాలి.
మహాశయా.... స్పష్టంగా చెప్పలేను.... బాల్యం నుంచీ నన్నొక కల వెంటాడుతోంది. అస్పష్టమైన కల.... నా జీవితంలోనే ఎప్పుడో జరిగినట్లుగా భ్రమింపజేసే కల... నా నెత్తురును ఉడికింపజేసే కల... నా నరాల్లో పునర్ చైతన్యాన్ని కలిగించే కల... నన్ను ఆలోచనా ముగ్ధుడ్ని... ఆశావాదిని చేసే కల...." ఏదో అతీతమైన శక్తి ఆవరించినట్లుగా చెప్పుకు పోతున్నాడు ఆ వ్యక్తి.
అంతవరకూ ఆ గ్రామంలో పర్చుకొని వున్న నిశ్శబ్దం భగ్నమైంది. దానికి కారణం అంగారక దేవాలయం నుంచి విన్పిస్తున్న ఘంటారావాలు.
"ఆ కలను విశదీకరించగలరా?" నెమ్మదిగా అడిగాడు శివస్వామి.
ఆ ప్రశ్నను వినిపించుకోలేదాయన. మంద్రస్వరంతో చెప్పుకు పోతున్నాడు.
"విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు... జేగజ్జేయ మానంగా నా కళ్ళ ముందు మణిమయరత్న ఖచిత సింహాసనం మీద కూర్చున్నారు. అయనకెదురుగా నేను.... నేనే.... నా ముఖాన్ని నేను పోల్చుకోగలను. అరివీరపరాక్రమ తేజంతో ప్రకాశించే నా ముఖం... అదిగో... కన్పిస్తోంది.... ముప్పయ్యేళ్ళ యువరక్తాన్ని నింపుకున్న నా దృఢతర దేహమది. ఆ మహాచక్రవర్తి చెప్తున్న మాటలు నా చెవులకు విన్పిస్తున్నాయి. ఆయన చెప్పే మాటలను నేను ఉత్తేజితుడ్నవుతున్నాను.
నా నరనరం, నా కణకణం, నా ప్రతి రక్తపు బిందువునిండా నిండిన ప్రజ్వలన శత్రుకసి, నా కరవాలం రక్తదాహార్తితో ఎదురుచూస్తోంది.... అయన మాటలు విన్న నేను వెనుతిరిగాను..." చెప్పడం ఆపాడాయన. అంత చలిలోనూ ఆ వ్యక్తి ముఖమ్మీద చెమట బిందువులు చోటు చేసుకున్నాయి.
ఆయనవైపు గగుర్పాటుతో చూస్తున్నాడు శివస్వామి. ఆయన ముఖములో ఏదో ఫీలింగ్.... రక్తసిక్తమైన గాయాలకులోనై, కొన ఊపిరితో, మరణయాతనతో గురవుతున్న యోధుడి ఫీలింగ్... ఆయన ముఖంలోని, నరాల్లోని రక్తం ఒక్కసారిగా పైకుబడడం వల్ల దావానలం ముందు కూర్చున్నవాడి ముఖంలా వుంది ఆ ముఖం.
ఆ ముఖాన్ని చూసిన శివస్వామి భయకంపితుడై పోయాడు. దాంతోపాటు ఆయన గొంతు కూడా మారిపోయింది. ఉచ్చైశ్వరంతో అయన గొంతులోంచి మాటలు వెలువడ్డాయి.
"వీరుడికి మరణంలేదు- వీరాత్మకు మరణం లేదు- అగ్నికి మరణం లేదు- రుధిరాగ్నికి మరణం లేదు- మహామహుడినై మళ్ళీ జన్మిస్తా- విశ్వనేత్రుడినై- త్రినేత్రుడినై మళ్ళీ జన్మిస్తా" మాటలు ఆగిపోయాయి.
పూర్వజన్మ స్మృతో, కలో, భ్రాంతో ఏమీ అర్థంకావడం లేదు. కళ్ళు తెరిచాడాయన. అలసిపోయినట్లుగా వున్నాడాయన.
"యాభై ఏళ్ళుగా నేను వేదనకు గురవుతున్న స్వప్నం- ఇది నన్ను వెంటాడుతున్న కల ఇది. కల నిజమైతే, గతజన్మ వాస్తవమైతే.... పదహారవ శతాబ్దంలో జీవించిన ఆ యోధుడ్ని నేనే"
"అంటే, మీ గతజన్మ శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిదా? అప్పటి మీ పేరు...జ్ఞాపకం వుం....దా?" బెదురుగా అడిగాడు శివస్వామి.
"లేదు... చాలాకాలం ఆ కలను నేను పట్టించుకోలేదు. నా లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం, నా కసిని తీర్చుకోవటం కోసం, నా జీవితాన్ని, నా సుఖాన్ని హారతి కర్పూరం చేసినవాడ్ని నేనే. అందుకే ఆ కలను అప్పుడు పట్టించుకోలేదు"
తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి సామాన్యుడు కాదనే విషయం స్పష్టంగా అర్థమైపోవడంతో శివస్వామి నోటమాట రాలేదు.
మరో పదిహేను నిముషాలు గడిచాయి.
తాళపత్రాన్ని, బొటనవేలి ముద్రల్ని పరిపరివిధాలుగా పరిశీలిస్తున్నాడు శివస్వామి.
సంస్కృత అక్షరాలమీద గోళీకాయల్లా పరిగెడుతున్న శివస్వామి కళ్ళవైపు నిర్నిమేషంగా చూస్తున్నాడాయన.
"దొరికింది..." సంభ్రమంగా అన్నాడు శివస్వామి.
ఎదురుగావున్న వ్యక్తి కళ్ళల్లో మెరుపు ప్రత్యక్షమైంది ఆ మాటలు వింటూనే.
"కానీ స్పష్టత లేదు...." అని నెమ్మదిగా అన్నాడు శివస్వామి తిరిగి.
"మరోసారి మీ తీవ్రతను పెంచి చూడండి" అన్నాడా వ్యక్తి ముందుకు వంగుతూ.
"అనుశృతంగా జ్ఞాపకాల వలయం. మీ దేహాన్ని అలుముకొని వుంది. ఒక వలయం, ఆ వలయాన్ని పెనవేసుకున్న మరికొన్ని వలయాలు మీ మస్తిష్కంలో కదలాడుతుంటాయి కదూ... ఆ వలయాలే పునర్జన్మ స్మృతులు... పునర్జన్మ గతులు... మీకు పునర్జన్మ అవకాశం వుంది. కానీ... ఆ వివరాలు ఇందులో లేవు..." పెదవి విరుస్తూ చెప్పాడు శివస్వామి.
ఆ వ్యక్తిలో అప్పటివరకు ప్రోది చేసుకొని ఉన్న ఉత్సాహం, చైతన్య స్థానంలో ఒకింత నిస్పృహ చోటు చేసుకుంది.
"పోనీ ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలరా....?" నెమ్మదిగా అడిగాడాయన.
"అడగండి..."
"నేనెప్పుడు మరణిస్తానో చెప్పగలరా?"