"అంటే మృత్యుకాండ...." తత్తరపాటుతో అన్నాడు శివస్వామి.
"ఏడుపదుల జీవితాన్ని చవిచూసినవాడ్ని- మృత్యువు గూర్చి ఈ వయసులో తెలియజేయడం వల్ల మీరు మీ నిబంధనను అతిక్రమించిన వారవుతారని నేననుకోను.
ఎందుకంటే, ఆల్ రడీ ఐయామ్ కౌంటింగ్ మై లాస్ట్ డేస్. మృత్యువును సమీపించే వయసు నాది" ఆ మాటలు వినగానే, మరో ఆలోచన లేకుండా మృత్యుకాండను పరిశీలించసాగాడు శివస్వామి.
తాళపత్రాన్ని వరుసగా తిరగేస్తున్న అతని చూపులు ఒకచోట ఆగిపోయాడు. అతని భృకుటి ముడిపడింది. అతని కళ్ళు ఆశ్చర్య గోళాలయ్యాయి. తాళపత్రంలోని వివరాలను ఓ పేపర్ మీద రాసుకుని, వాటిని గుణించి, భాగించి, కూడికలు, తీసివేతలు చేశాక-
కేలండర్ వైపు చూశాడు.
"నేను చెప్పే విషయాన్ని నిబ్బరంతో ఆకళింపు చేసుకొనే గుండె ధైర్యం మీకుందా....?" అడిగాడు శివస్వామి ఒక అభిప్రాయానికొస్తూ.
"ఈ క్షణంలోనే మృత్యువు ఆసన్నమైందని చెప్పినా జంకను.... చెప్పండి" అన్నాడా వ్యక్తి నిబ్బరంగా.
ఆయన మాటలు స్థిరంగా వున్నా ఆయన హృదయంలో ఏదో తెలీని అయోమయం- సృష్టి ప్రారంభంలో జరిగే వింత మార్పుల సంఘటనల్లా...
"ఇప్పుడు మీ వయసెంత?"
"డెబ్భయి నాలుగేళ్ళు"
"కరెక్ట్ గా చెప్పండి"
"డెబ్భయి నాలుగో ఏడు. నేడు డిసెంబర్ 31. ఇంకో పదహారు రోజులకి నాకు డెబ్భయి అయిదో సంవత్సరం వస్తుంది"
"చెపుతున్నాను వినండి. నేడు డిసెంబర్ 31. నేటికి సరిగ్గా పదిహేడోరోజు రాత్రి పన్నెండు గంటల పది ఘడియలకు మీరు మృత్యుజీవులవుతారని నాడీజోస్యం చెపుతోంది" ఆ మాట చెప్పి ప్రతిస్పందన కోసం ఆ వ్యక్తి నేత్రాంచలాల్లోకి చూశాడు శివస్వామి.
మృత్యువార్త వినగానే భయచంచలులై పోయే మానవ సమాజంలో ఏవిధమైన భయస్పందనలు లేకుండా స్థితప్రజ్ఞుడిలా వున్న ఆ వ్యక్తిని చూడగానే శివస్వామికి చెమటలు పట్టేశాయి.
కొన్ని దశాబ్దాలుగా నాడీజోస్యం చెపుతున్నా మృత్యుకాండ గురించి చెప్పడం అదే ప్రధమం శివస్వామికి.
పది నిమిషాలసేపు నిశ్చలమౌనం తర్వాత లేచి నిలబడ్డారాయన.
"మృత్యువును అనుక్షణం ఆహ్వానిస్తున్నా ఇంత దగ్గరగా వుందని నాకు తెలీదు. నేను చేయాల్సిన కర్తవ్యం చాలావుంది. ఈ జన్మలో మృత్యువు గురించి చెప్పి నన్ను అనుగ్రహించారు. అందుకు సర్వదా కృతజ్ఞుడ్ని" అంటూ జేబులోంచి మరో నోట్ల కట్టను తీసి శివస్వామి చేతిలో పెట్టాడాయన.
అంతకు కొన్ని నిముషాల ముందే సూర్యోదయమైందన్న దానికి సంకేతంగా పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. ఆ హాల్లోంచి బయటికొచ్చి వరండామీద గబగబా నడుస్తున్నాడాయన.
వీధుల్లో అప్పటికే జనసంచారం మొదలయింది.
పరుగు పరుగున ముందుకొచ్చాడు శివస్వామి. "ఇంతకీ తమ పేరు...." అని ప్రశ్నిస్తూ, ఏదో శబ్దం వినిపించడంతో చిదంబరం రోడ్ వైపు చూసి నోట మాట రాకుండా స్థాణువులా నిల్చుండిపోయాడు.
వైదీశ్వరన్ కోయిల్ ప్రభాత వాయువుల్ని చీల్చుకుంటూ సర్ సర్ మంటూ భక్కియం లాడ్జిదాటి సరిగ్గా ఆ బిల్డింగ్ ముందు ఆగిందో స్నఫ్ కలర్ మెర్సిడస్ కారు. అ వెనకగా వైట్ అంబాసిడర్ కార్లు రెండు. ఆ కార్ల నిండా స్టెన్ గన్ లు ధరించిన సెక్యూరిటీ స్టాఫ్.
మెర్సిడెస్ కారులోంచి దిగిన ఒక వ్యక్తి మెట్లుదిగుతున్న ఆజానుబాహుడి కెదురుగా వచ్చి సెల్యూట్ చేసి నుంచున్నాడు.
ఆ వ్యక్తి తన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ముఖంలోకి ఒకసారి చూసి వెనుక అయోమయంగా ఈ తతంగాన్ని బెంబేలుపడిపోతూ చూస్తున్న శివస్వామి వైపు చూసి కళ్ళతోనే వీడ్కోలు చెప్పాడు.
డ్రైవర్ కారు డోర్ తీసి నమస్కరించాడు. ఆ ఆజానుబాహుడు మౌనంగా బ్యాక్ సీట్లో కూర్చున్నాడు. సెక్యూరిటీ స్టాఫ్ అంబాసిడర్ కారువైపు పరుగెత్తారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మెర్సిడెస్ కారు ముందు సీట్లో కూర్చోగానే కారు అక్కడ నుంచి దూసుకుపోయింది ముందుకు.
ఆ వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో అర్థరాత్రి ఒంటరిగా రావడం, ఇప్పుడు ఆయనకోసం కార్లు, సెక్యూరిటీ స్టాఫ్, ఆ హడావుడి అంతా భ్రాంతిలా వుంది శివస్వామికి. మెయిన్ రోడ్ మీద దుమ్ము రేపుకుంటూ దూసుకెళ్ళిపోతున్న ఆ కార్లవైపు తదేకంగా చూస్తూ-
'ఎవరీ వ్యక్తి? ఎవరీ ఆజానుబాహుడు? ఆయన జిజ్ఞాస వెనుక మర్మం ఏమిటి?'
అని తనను తానే ప్రశ్నించుకున్నాడు శివస్వామి.
అవును...ఆ ఆజానుబాహుని మృత్యుజిజ్ఞాస వెనుక వున్న మర్మం ఏమిటి? ఎంతకీ ఆయనకి సమాధానం తట్టలేదు. ఏదో గొణుక్కుంటూ తన ఆఫీసులో కెళ్ళిపోయాడు శివస్వామి.
* * * *
తూర్పుకనుమల్లో ఒక ప్రాంతమైన అరకులోయ. అంత ఎత్తు కొండలు, వాటిపక్కన లోయలు, లోయల మధ్యన సన్నగా ప్రవహిస్తున్న సెలయేళ్ళ గలగలలు, నిండుపున్నమి, నీరవ నిశ్శబ్దం.
రోడ్డుకి పదిమైళ్ళ దూరంలో ఎత్తయిన గుట్టల మధ్య నుంచి వడివడిగా నడుస్తున్నాడు ఆజానుబాహుడు. రెండు మూడు గంటల నుంచి తదేక దీక్షతో నడుస్తున్న ఆయన ధవళ శరీరం చెమటతో తడిసిపోయింది. వృద్ధాప్యపు ఆయాసాన్ని కూడా లెక్క చేయకుండా సంధించిన బాణంలా గుట్టల మీది నుంచి క్రిందకు దిగి సెలయేటి పక్కనుంచి నడుస్తున్నాడాయన. మరో నలభై నిమిషాలు గడిచాయి.
కొండలమీద అక్కడక్కడ విసిరేసినట్టుగా కనిపిస్తున్నాయి గిరిజన తండాలు. నిండు పున్నమి కావడంవల్ల సంప్రదాయ నృత్యాలకు తయారవుతున్న గిరిజన యువతల కోలాహలం అస్పష్టంగా వినిపిస్తోంది. దానికి తోడు కొమ్ముబూరల నినాదాలు కొండల గుండెల్లో మార్మోగుతున్నాయి.
శృతి చేసుకొంటున్న మృదంగాల లయ స్వయం, దట్టమైన వృక్షాల మొదళ్ళలో చిరు కదలికల్ని సృష్టిస్తోంది. చంద్రుడికి దట్టమైన మేఘాలు అడ్డురావడంతో అంతకంతకూ అలుముకుంటున్న చీకటి. అలాంటి ఎన్నో చీకట్లను చూసినవాడిలా ముందుకు నడుస్తున్నాడతను.
గాలి సన్నగా, మెల్లగా వీస్తోంది....
మరో ఇరవై నిముషాలు గడిచాయి...
ఒక గిరిజన తండాలోకి అడుగుపెట్టాడు ఆయన.
అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఆగంతకుని చూచి గిరిజన బృందం భయంతో దూరంగా కదిలిపోయింది.
ఏభై ఏళ్ళ గిరిజన నాయకుని వద్దకు సమీపించాడు ఆజానుబాహుడు. "పిట్టలకోన ఇదేనా?" ధీర గంభీరమైన గొంతులో నుంచి వచ్చిందా ప్రశ్న.
"అవును దొర. ఇంత మారుమూల గిరిజన గ్రామానికి ఎక్కడ నుండి వస్తున్నారు? అదీ ఈవేళ? సేదదీరుతారా?" ఆయన ఆకారాన్ని చూసి వినయంగా అడిగాడు గిరిజన నాయకుడు.
"నాక్కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా?"