ప్రస్తుత తరంలో ఆ కుటుంబంలో పెద్దవాడ్ని నేను. నాతోపాటు మా సహోదరులు కూడా నాడీశాస్త్రానికె అంకితమయ్యారు..." అంటూ ఆ వ్యక్తి బొటనవేలుని స్టాంప్ ప్యాడ్ మీద నొక్కి, ఆ ముద్రలను తెల్లకాగితమ్మీద వేయించాడు శివస్వామి.
చిన్న భూతద్దం సహాయంతో ఆ వ్యక్తి కుడి అరచేతిని పరిశీలించాడు కొద్ది క్షణాలు.
ఆ వ్యక్తి ఒక క్షణం అసహనంగా అటూ ఇటూ కదిలాడు. అది గమనించాడు శివస్వామి.
"ఈ నాడీ జ్యోతిష్యం గురించి కొద్దిగానయినా మీరు తెలుసుకోందే విషయంలో కెళ్ళటం అంత సబబుగా వుండదు" అన్నాడు శివస్వామి చిన్నగా.
"చెప్పండి" అన్నాడు ఆ వ్యక్తి తనలో రేగుతున్న అసహనాన్ని కప్పి పుచ్చుకుంటూ.
శివస్వామి గొంతు సవరించుకున్నాడు.
"శ్రీ వి.వి.ఎస్. అరులోసిన అరుముగమ్ గారి పుత్రుడినైన నేను జ్యోతిష్యానికి ఆదిపురుషుడయిన శ్రీ అగస్త్య మహాముని మీద ప్రయాణం చేసి ఈ వివరాలు మీకు తెలియజేసుకుంటున్నాను-
ఒక బొటనవేలిముద్ర సహాయంతో మీ పూర్వజన్మ దగ్గర్నుండి ప్రస్తుత జన్మ అంతం వరకు మీ జీవిత రహస్యాల్ని చెప్పేదే ఈ నాడీ జ్యోతిష్యం. ఈ జోష్యం ఈ తాళపత్ర గ్రంథంలో దైవలిపిలో (ద్రవిడ లిపి) రచించి వుండటం ఒక విశేషం. మీ బొటన వేలిముద్ర సహాయంతో మీకు సంబంధించిన నాడిని వెలికితీసి జీవితచరిత్రను చదవటం జరుగుతుంది.
ఈ నాడిలో ముఖ్యంగా పధ్నాలుగు కాండాలు వుంటాయి.
మొదటి కాండం " మీ పేరు, తల్లిదండ్రుల పేర్లు, భార్య లేక భర్త పేరు- ప్రస్తుత పరిస్థితి- ఉద్యోగ వివరాలు, అన్నదమ్ముల సంఖ్య, అక్కచెల్లెళ్ళ సంఖ్య, మరియు పిల్లల వివరాలు.
రెండవ కాండం : డబ్బు, చదువు, కళ్ళు, కుటుంబం వివరాలు.
మూడవ కాండం : అన్నదమ్ముల సంఖ్య, అక్కచెల్లెళ్ళసంఖ్య, వారి భవిష్యత్, ఐకమత్యము, డబ్బు, సహాయం, ఆస్తి, వ్యాపారం, భవిష్యత్ లో అందరూ కలిసి వుంటారా? లేక విడిపోతారా?
నాల్గవ కాండం : తల్లి వివరాలు, ఇల్లు, వాహనం, స్థలం వివరాలు ఇల్లు కట్టే ప్రాప్తం వుందా? స్థల ప్రాప్తం, పొలం ప్రాప్తం, వాహన ప్రాప్తం వున్నాయా అనేది ఇందులో తెలుస్తుంది. జీవితంలో సంతోషంగా వుంటారా లేదా అనేది తెలుస్తుంది.
ఐదవ కాండం : పిల్లలు - భవిష్యత్ లో పిల్లలు కలగనందుకు కారణాలు, కలగటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల భవిష్యత్, ఎంతమంది పిల్లలు పుడతారు, అసలు పుడతారా లేదా అనే వివరాలుంటాయి.
ఆరవకాండం : జబ్బులు, కోర్టుకేసులు, విరోధాలు వీటిని నిరోధించటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
ఏడవ కాండం : వివాహం, వివాహ సమయం, లగ్న సమయం, పెండ్లి కొడుకు, పెళ్ళికూతురు, భవిష్యత్ లో వివాహానంతరం వారితో కలిసి గడపబోయే జీవితం వంటి వివరాలుంటాయి.
ఎనిమిదవ కాండం : జీవితకాలం, ప్రమాదాలు, మరణించే స్థలం, వయస్సు, సమయం, మరణించు రోజు లగ్న ముహూర్తం...
తొమ్మిదవ కాండం : తండ్రి భవిష్యత్, అదృష్టం, గుడి, గోపురాల దర్శనం, గుడి నిర్మాణప్రాప్తం, గురూజీ ఉపదేశం.
పదవకాండం : ఉద్యోగం, వ్యాపార భవిష్యత్, స్థలమార్పిడి, ఉద్యోగంలో, వ్యాపారంలో మంచీ చెడులు.
పదకొండవ కాండం : ధనలాభం, రెండో వివాహం.
పన్నెండవ కాండం : డబ్బు ఖర్చు, విదేశీపర్యటన, మరోజన్మ, నిద్రాభాగ్యం, మోక్షం వున్నదీ లేనిదీ.
పై పన్నెండు కాండాలు జీవితానికి సంబంధించినవి. వీటిని సామాన్య కాండాలంటారు.
వీటిలో ఏ కాండం గురించైనా అడగొచ్చు. లేదా మొత్తం అడగొచ్చు.
ఇవి కాకుండా అతి ముఖ్యమైన కాండాలు మరో నాలుగున్నాయి.
ఒకటి : శాంతి కాండం
రెండు : దీక్ష కాండం
మూడు : ఔషధ కాండం
నాలుగు : దిశభుక్తి కాండం...
అనర్గళంగా అప్పటివరకు చెప్పిన శివస్వామి కొద్ది క్షణాలు ఆగి ఊపిరి తీసుకున్నాడు.
ఆ వ్యక్తి ఎనిమిదవ కాండం, పన్నెండవ కాండం గురించే ఆలోచిస్తున్నాడు.
"అయినా మీకేం కావాలో, ఏ విషయాలు తెలుసుకోవడానికి ఎంత దూరం నుంచి వచ్చారో ఇప్పటివరకూ చెప్పనేలేదు..." అన్నాడు శివస్వామి.
"నాకిప్పుడు డెబ్భయి నాలుగేళ్ళు. జీవిత చరమాంకంలో వున్న వాడ్ని. నేను ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెల్సుకోవాలనుకోవడంలో అర్థం లేదు" తాళపత్ర గ్రంధంవైపు ఓసారి చూశాడాయన.
మరి ఈ పెద్దమనిషి ఇంత అర్థరాత్రి ఇక్కడికెందుకొచ్చినట్లు...? అర్థం కావడం లేదు శివస్వామికి.
అర్ధనిమిలితుడై ఏదో ఆలోచిస్తున్న ఆ వ్యక్తివైపు శివస్వామి మౌనంగా చూస్తూ-
"ఇంతకీ తమకు ఏం కావాలి?" అడిగాడు.
పెదవి విప్పాడాయన.
"చావు గురించి తెలియజేసే మృత్యుకాండ... వచ్చే జన్మ గురించి తెలియజేసే పునర్జన్మ కాండ... వివరాలు తెలియజేయగలరా?" అడిగాడా వ్యక్తి ఎక్కడో ట్రాన్స్ లో వున్నట్లుగా.
అది వింటూనే షాక్ తిన్నాడు శివస్వామి. అయినా క్షణాల్లోనే తేరుకున్నాడాయన.
"నేనదే మీతో మనవి చేయాలనుకుంటున్నాను. ఎంత గొప్ప వ్యక్తి వచ్చి అడిగినా, మేం చెప్పలేని, చెప్పకూడని కాండాలు ఆ రెండే! ఎందుకంటే మా పూర్వీకులు విధించిన నిబంధన అది.
ఆ నిబంధనకు మేం కట్టుబడి వున్నాం. ఒకవేళ చెప్పినా పూర్తి వివరాలు చెప్పకూడదు.
"నేను ఎక్కడ నుంచో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మరుజన్మ గురించి వివరాల కోసమే..."
ఆ హాల్లో ఇద్దరి మధ్యా మౌనం. భారంగా కదులుతున్న వూపిరి కదలికలు.
"మరుజన్మ గురించి వివరాలు అంటే- పునర్జన్మ కాండం కోసమా?" శివస్వామి నేత్రాలు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి.
"అవును!"
"జనరల్ గా మీరు పునర్జన్మ గురించి తెలుసుకోవాలను కుంటున్నారా? లేక ప్రత్యేకంగా మీ పునర్జన్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?" ఆసక్తిగా ప్రశ్నించాడు శివస్వామి.
"నా పునర్జన్మ గురించే..." శాసిస్తున్నట్లు గంభీరంగా అన్నాడా వ్యక్తి.
ఆ మాటకు శివస్వామి ఆ వ్యక్తివైపు విస్మయంగా చూశాడు.
"మీరెవరో నాకు తెలీదు. అంత శ్రమపడి ఇంతదూరం నా దగ్గరికి ఎలా వచ్చారో తెలియదు. మీ వార్ధక్యాన్ని గౌరవిస్తూ, నిబంధనను పక్కకి పెట్టేసి, మొట్టమొదటసారి మృత్యుకాండ, పునర్జన్మ కాండల గురించి మీకు తెలియ చేస్తాను" తాళపత్ర గ్రంథంలో తనకు కావలసిన ఒక తాళపత్రం కోసం వెతుకుతూ అన్నాడు శివస్వామి.