"అన్నయ్య... కిరాణాషాపుకి వెళుతున్నాడు" వచ్చి తండ్రితో చెప్పింది శారద.
తను విన్నది నిజమేనా అని సందేహించాడాయన.
తల్లి అందించిన కాఫీ గ్లాసును అందుకొని త్రాగుతూ తండ్రి మంచం దగ్గరకు వచ్చి...
"ఇవాళ, రేపు నేనే వెళతాను. దీన్ని అలుసుగా తీసుకొని రోజూ వెళ్ళమంటే కుదరదు" అన్నాడు శక్తి.
అలాంటి సమయాల్లో ఏం మాట్లాడినా ప్రమాదమే. చాలా కాలముగా కొడుకులో మార్పుకోసం ఎదురు చూస్తున్నారాయన. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నప్పుడు-
బలవంతంగా వాళ్ళచేత పనులు చేయించలేమని ఆయన సిద్ధాంతము...
ఎవరి అనుభవం వారి జీవితాలను నడిపిస్తుంది.
ఒక డెబ్బ తగిలినప్పుడే మరో దెబ్బ తగలకుండా మనిషి జాగ్రత్త పడతాడని జానకీరామయ్య నమ్మకం.
శక్తి బయటకు అడుగువేశాడు.
"జాగ్రత్తరా శక్తీ... గొడవలు పడొద్దు..." వెనక నుంచి తల్లి హెచ్చరించింది.
ఆ మాటలు శక్తికి వినబడలేదు.
ఆ టౌన్ లో అదే చాలా పెద్ద కిరాణా షాపు...
దాని ఓనర్ సూర్యం. సూర్యానికి దాదాపు యాభయ్ ఏళ్ళు ఉంటాయి.
సూర్యం దగ్గర ముగ్గురు పని కుర్రాళ్ళు ఒక అక్కౌంటెంట్ వున్నారు. ఆ అకౌంటెంట్ శక్తి తండ్రి జానకీరామయ్య.
ఏడుగంటలకల్లా దుకాణం తెరచి, అరడజను దేవుళ్ళ ఫోటోల దగ్గర అగరుబత్తిలు వెలిగించి కౌంటర్ ముందు కూర్చోబోతున్న వాడల్లా షాప్ మెట్లు ఎక్కుతున్న శక్తిని అలవోకగా చూసాడు. జానకీరామయ్య కొడుగ్గా శక్తి తెలుసు. ఊళ్ళో రౌడీ గేంగ్ కి శక్తి నాయకుడని కూడా సూర్యానికి తెలుసు- అందుకే ముందు ఆశ్చర్యపోయాడు. ఆపైన అనుమానించాడు.
"ఏం శక్తీ... ఏమిటిలా పొద్దున్నే దయ చేసావు... నాన్నకెలా వుందేమిటి?"
అడిగాడు సూర్యం ధైర్యాన్ని ప్రోది చేసుకుంటూ.
"నాన్నకు బాగానే వుంది... నాన్నే నన్ను పంపించాడు" చుట్టూ చూస్తూ అన్నాడు శక్తి.
"దేనికట? నాకు సోమరిపోతుతనం నేర్పమనా?" ఒకింత వ్యంగ్యంగా అన్నాడు సూర్యం.
దాంతో చిర్రెత్తుకొచ్చింది శక్తికి. అయినా తల్లి గుర్తుకొచ్చి తనని తాను నిగ్రహించుకున్నాడు.
"నెలాఖరు రోజులు కదా! ఎక్కౌంట్లు చూడాల్సినవి ఎక్కువ వుంటాయని" చిరాకును కప్పిపుచ్చుకుంటూ అన్నాడు శక్తి.
"మీ నాన్నంటే అందుకే నాకు ఇష్టమయ్యా... పనెక్కువగానే ఉంది. నువ్వు చెయ్యగలవా? రోడ్డు ముఖం చూడకుండా కుదురుగా కూర్చోగలవా? లేజీనెస్ వేరు... ఎక్కౌంట్స్ వేరు సుమా..."
తనను అతను ఎగతాళి చేస్తున్నాడని తెలుసు.
మరొకప్పుడయితే నాలుగు తన్ని... వెనక్కి తిరిగి వచ్చేవాడే... ప్రస్తుతం తప్పదు... తండ్రి కోసం తప్పదు... ఒక్క రెండు రోజులు కదా...
ఏం జవాబు చెప్పకుండా నిల్చున్నాడు శక్తి.
"చూద్దాం ఏం చేస్తావో... ఎలా చేస్తావో..." సీట్లోంచి లేచి విశాలమయిన కొట్టుకి కుడి మూలగానున్న ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు శక్తిని.
అక్కడ పాతబడిన ఒక టేబుల్ మీద ఎకౌంట్స్ పుస్తకాలు వున్నాయి.
"రోజువారీ ఎకౌంట్స్ బుక్స్ ఇవి... బిల్స్ అవి... నెలవారీ మెయిన్ ఎకౌంట్ బుక్స్ ఇవి. మెయిన్ ఎకౌంట్స్ బుక్స్ రెండుంటాయి. ఒకటి మనకోసం రెండోది ఇన్ కమ్ టాక్స్ వాళ్ళ కోసం... ముందు మనది తయారు చెయ్యి. డౌట్ వస్తే నన్ను అడుగు..." ఇంకా ఏదో చెప్పటానికి సూర్యం ప్రయత్నిస్తుండగానే-
"కామర్సు చదువుకున్నాను.... నాకు తెలుసు..." అన్నాడు చిరాగ్గా శక్తి.
చూసావా... నీ కప్పుడే చిరాకు వచ్చేసింది... అలా చిరాకు రాకూడదయ్యా..." అనుకుంటూ కౌంటర్ వైపు వెళ్ళిపోయాడు సూర్యం.
శక్తి ఎకౌంట్స్ పుస్తకాలను ముందుకు లాక్కున్నాడు.
అప్పుడప్పుడు పనివాళ్ళు లోపలకు వచ్చి శక్తివైపు విచిత్రంగా చూస్తూ వెళుతున్నారు. ఎప్పుడూ హోటల్ పిట్టగోడ మీద, సినిమాహాలు జంక్షన్ దగ్గర, బస్టాండ్ కిళ్ళీబడ్డీ దగ్గర గ్యాంగ్ తో యువరాజులా కనపడే శక్తి సడెన్ గా అలా మారిపోవటం వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉంది. శక్తి అలా కుదురుగా కూర్చుంటాడని సూర్యం కూడా ఊహించలేదు. సిగరెట్ కని ఒకసారి, కాఫీకని ఒకసారి బయటకు వెళతాడని- చెప్పాల్సిన లెస్సన్ అప్పుడు చెబుదామని ఓరకంట కనిపెడుతూ కూర్చున్నాడు సూర్యం.
బ్యాలెన్స్ లెక్కలు ఒక్కరోజులో పూర్తి చేసేస్తే, మరుసటిరోజు షాప్ కి రానక్కర్లేదనే, శక్తి కుదురుగా కూర్చున్నాడని సూర్యానికేం తెలుసు. గంటకొకసారి సీట్లోంచి లేచి, అటు పక్కకెళ్ళి చూసొస్తున్నాడు అనుమానం తీరక.
సరిగ్గా ఒంటిగంటైంది.
పనివాళ్ళందరూ భోజనానికి వెళ్ళారు- సూర్యం శక్తి దగ్గరకు వెళ్ళాడు.
"ఏం శక్తీ... భోజనానికి వెళ్ళవా..."
"ఇపుడంత దూరం ఏం వెళతాను. ఏకంగా సాయంత్రం వెళతాను" ఆ జవాబుకు మరేం మాట్లాడలేదు సూర్యం.
కొత్త ఉత్సాహం వల్ల కొందరు అలాగే పనిచేస్తారు.
మధ్యాహ్నం నాలుగు అయ్యింది.
సాయంత్రం ఆరు అయ్యింది.
రాత్రి తొమ్మిది దాటుతోంది సమయం.
"కదలకుండా అలా కూర్చున్నావ్... బాగా అలిసిపోయినట్లున్నావు... వెళ్ళిపోతావా?" శక్తి అన్ని గంటలసేపు అలా కూర్చోవటం విచిత్రంగా వుంది సూర్యానికి.
"రోజూ ఎన్ని గంటలకు షాపు మూసేస్తారు"
"పదిగంటలకు..."
"ఇంకో గంటే కదా... వుంటాన్లేండి."
సూర్యం మరో మాట మాట్లాడలేదు- దెయ్యం పట్టిన వాడిలా అయిపోయాడు. తొమ్మిదీ నలభయ్ అయిదు నిమిషాలకి పనివాళ్ళొక్కక్కరూ వెళ్ళటం మొదలు పెట్టారు. ఆఖరకు, సూర్యం శక్తి ఇద్దరే మిగిలారు.